భాజపా కాళ్లలో జనసేన కర్ర

జిహెచ్ఎంసి ఎన్నికల్లో పోటీ చేయడానికి జనసేన ఉవ్విళ్లూరుతోంది.  ఈ మేరకు జనసేన తెలంగాణ వింగ్ తరపున చకచకా ప్రకటనలు వస్తున్నాయి.

కానీ ఏ ఒక్క ప్రకటనలో కూడా భాజపా ప్రస్తావన కనిపించడం లేదు. పైగా ఇదే సమయంలో జనసేన అధిపతి పవన్ కళ్యాణ్ అమరావతికి పయనమై వెళ్లిపోయారు. ఆయన అక్కడ కొన్ని రోజలు వుంటారని తెలుస్తోంది. 

ఈ నెలాఖరులో వకీల్ సాబ్ షూటింగ్ వుంది. అంటే ఈ నెల 18 నుంచి 30 వరకు ఎన్నికల సమయంలో కొన్ని రోజులు అమరావతిలో, మరి కొన్ని రోజులు వకీల్ సాబ్ షూటింగ్ లో వుండబోతున్నారు.

మరి మధ్యలో ఎన్ని రోజులు ఎన్నికల ప్రచారానికి పవన్ వస్తారు? అన్నది సందేహం. అసలు వస్తారా?  అన్నది మరీ పెద్ద సందేహం. వీటన్నింటిని మించిన సందేహం అసలు భాజపాతో పొత్తు వుంటుందా? వుంటే ఎన్నిసీట్లు అడుగుతారు.

కీలకమైన మల్కాజ్ గిరి, కూకట్ పల్లి, లాంటి ఆంధ్ర ప్రాంతాలను ఎంచుకుంటే భాజపా సై అంటుందా?  అసలు ఎన్ని సీట్లు భాజపా ఇవ్వగలదు. ఇవన్నీ ప్రశ్నలే. అసలు ఈ ప్రశ్నలన్నీ పక్కన పెట్టి, తెరాసను, కేసిఆర్ పాలనను విమర్శించగల ధైర్యం పవన్ చేస్తారా? అలా విమర్శించకుండా జనాల నుంచి ఓట్లను రాబట్టగలరా? 

భాజపాకు దూరంగా వుండి పోటీ చేస్తే జనసేన చిత్త శుద్దిని శంకించాల్సి వుంటుంది. భాజపాకు దూరంగా వుండి విడిగా పోటీ చేయడం ద్వారా జనసేన సాధించేది ఏమీ వుండదు. కేవలం నెగిటివ్ ఓటు బ్యాంకును చీల్చడం తప్ప. తెలుగుదేశం కూడా ఇదే ఎత్తుగడతో ముందుకు వెళ్తోందని వార్తలు అందుతున్నాయి. 

ఎందుకంటే ఇన్నాళ్లు తెలంగాణ విషయంలో మౌనంగా వుండి, దుబ్బాక ఎన్నికలకు దూరంగా వున్న జనసేన, తెదేపా ఇప్పుడు అర్జెంట్ గా జిహెచ్ఎంసి విషయంలో సీరియస్ గా బరిలోకి దిగుతాయి అంటే నమ్మశక్యం కాదు. తెరవెనుక ఏదో డ్రామా వుండనే వుంటుందని జనాలు అనుమానపడడం ఖాయం.

ముఖ్యంగా ఈ విషయంలో భాజపాకు ఏమాత్రం అనుమానం వచ్చినా, ఆంధ్రలో పొత్తు వ్యవహారం బెడిసి కొట్టేప్రమాదం కూడా వుంటుంది. జనసేన, తేదేపాలది నిజమైన పోటీనో, తెరవెనుక వేరే వ్యవహారాలు వున్నాయనో జనం పసిగడితే అది కూడా కాస్త ఇబ్బందికరంగా మారుతుంది.

ఏది ఏమైనా జనసేన, తేదేపాల పస ఈ వారంలో తేలిపోతుంది.

విజన్ 2020 అంటే అర్థం చేసుకోలేకపోయాం

Show comments