చంద్రబాబుపై ఉండవల్లి విమర్శలు

ఎపి మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధికారంలో ఉన్నప్పుడు పోలవరం విషయంలో రాజీ పడడంతోనే తీవ్ర నష్టం జరిగిందని రాజమండ్రి ఎమ్.పి ఉండవల్లి అరుణకుమార్ వ్యాఖ్యానించారు.

పోలవరం అంశం చట్టంలో ఉన్నా, చంద్రబాబు కాంప్రమైజ్ అయ్యారని, స్పెషల్ ప్యాకేజి పేరుతో సరిపెట్టుకున్నారని ఆయన చెప్పారు. పునరాసం తో సహా మొత్తం ప్రాజెక్టును కేంద్రం నిర్మించాలని, ఈ మేరకు చట్టంలో కూడా ఉందని ఆయన చెప్పారు. 

పార్లమెంటులో చేసిన చట్టం గొప్పదా, మోదీ- చంద్రబాబు చేసుకున్న ఒప్పందం గొప్పదా అని ప్రశ్నించారు. పోలవరానికి ఇవ్వాల్సిన ఖర్చు వందకు వందశాతం భరిస్తామని కేంద్రం చట్టంలోనే తెలిపిందన్నారు.

‘‘అప్పట్లో ఇచ్చిన హామీలను కూడా ఇప్పుడు కేంద్రం ఎందుకు అమలు చేయడంలేదు. పోలవరం కూడా పక్కన పెట్టే ప్రయత్నంచేస్తున్నారు. పోలవరం ప్రాజక్టు అథారిటీ ఆధ్వర్యంలోనే ప్రాజెక్టు నిర్మాణం జరగాల్సి ఉంది. పార్లమెంట్‌లో చేసిన చట్టాన్ని బైపాస్ చేయలేరు. 2017లో కేవీపీ రామచంద్ర రావు కేసు వేశారు. రాష్ట్ర ప్రభుత్వం తరపున అఫిడవిట్ ఫైల్ చేయమని చెప్పాం. లోక్ సభలో చర్చకు నోటీసివ్వమని చంద్రబాబుకు గతంలో గంటన్నర పాటు చెప్పాను. అయినా పట్టించుకోలేదు. పార్లమెంట్లో వెంకయ్యనాయుడు అడిగిన పదివేల కోట్లు కూడా కేంద్రం ఇప్పటి వరకూ రాష్ట్రానికి ఇవ్వలేదు. రాయలసీమను, ఆంధ్రా ప్రాంతాన్ని డెవలెప్ చేస్తామని కేంద్రం ఆనాడు చెప్పింది. పట్టిసీమ మీద పెట్టిన ఖర్చు పోలవరంపై ఖర్చు పెడితే ఈ పాటికి పోలవరం ఆనకట్ట పూర్తయ్యేది. గ్రావిటీ మీద నీరు పంపించే అవకాశం ఉండేది’’ అని ఉండవల్లి వ్యాఖ్యానించారు.

Show comments