కేంద్రం సై.. ట్రిబ్యునల్ నై.. ఇరకాటంలో సీమ ప్రాజెక్ట్

రాయలసీమను సస్యశ్యామలం చేసేందుకు సీఎం జగన్ తలపెట్టిన రాయలసీమ ఎత్తిపోతల పథకానికి నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ అడ్డంపడింది. తెలుగు గంగ, శ్రీశైలం కుడి కాల్వ, గాలేరు-నగరి ప్రాజెక్టులకు వేర్వేరు సమయాల్లో పర్యావరణ అనుమతులు వచ్చాయి. 

రాయలసీమ ఎత్తిపోతల పథకం వీటికి నీరు అందించేందుకు చేపట్టినదే కాబట్టి.. దీనికి ప్రత్యేకంగా పర్యావరణ అనుమతి అవసరం లేదనేది ఏపీ వాదన.

అయితే కచ్చితంగా పర్యావరణ అనుమతులు అవసరమేనని, ఏపీ నిబంధనలు ఉల్లంఘించిందంటూ తెలంగాణకు చెందిన గవినోళ్ల శ్రీనివాస్ గతంలో ఎన్జీటీని ఆశ్రయించారు. ఆ తర్వాత తెలంగాణ ప్రభుత్వం కూడా రాయలసీమ ప్రాజెక్ట్ పై అభ్యంతరాలు తెలిపింది. 

ఇటీవల ఇరు రాష్ట్రాల అధినేతలతో కేంద్ర జలవనరుల శాఖ మంత్రి జరిపిన సమీక్షలో కూడా ఈ ప్రాజెక్ట్ పై తెలంగాణ తీవ్ర అభ్యంతరాలు వ్యక్తం చేసింది.

అయితే ఎన్జీటీ విచారణ సందర్భంగా ఆగస్ట్ లో కేంద్రం దాఖలు చేసిన అఫిడవిట్ ఏపీకి అనుకూలంగా ఉండటం ఒక్కటే ఊరటనిచ్చే అంశం. ఎలాగూ కేంద్ర జలవనరుల శాఖ ఏపీకి అనుకూలంగా అఫిడవిట్ దాఖలు చేసింది కాబట్టి.. రాయలసీమ ఎత్తిపోతల పథకం పర్యావరణ అనుమతులు లేకుండానే పట్టాలెక్కుతుందని సీమవాసులు ఆశపడ్డారు.

అప్పటికే టెండర్ల ప్రక్రియ కూడా మొదలు పెట్టిన వైసీపీ ప్రభుత్వం.. వీలైనంత త్వరగా ప్రాజెక్ట్ పూర్తి చేసి సీమను సస్యశ్యామలం చేయాలని భావించింది. ఇప్పుడు ఎన్జీటీ వెలువరించిన తీర్పు ఏపీ ప్రభుత్వానికి శరాఘాతంగా మారింది.

రాయలసీమ ఎత్తిపోతలకు పర్యావరణ అనుమతి తప్పనిసరి చేస్తూ ఎన్జీటీ ఉత్తర్వులిచ్చింది. ఈ మేరకు పర్యావరణ అనుమతులు రాకుండా ముందుకెళ్లొద్దని ఏపీ ప్రభుత్వాన్ని ఆదేశించింది. ప్రాజెక్ట్ డీపీఆర్ సమర్పించి పర్యావరణ అనుమతులు తీసుకోవాలని పేర్కొంది. తాగునీటితో పాటు సాగునీటి అవసరాలు ఉన్నాయని ట్రిబ్యునల్ అభిప్రాయ పడుతూ తీర్పునిచ్చింది.

పర్యావరణ అనుమతులు తీసుకోవడం, ప్రత్యామ్నాయంగా అడవులకు భారీ ఎత్తున స్థలం చూపించడం ప్రభుత్వానికి తలకు మించిన భారం అవుతుందని తెలుస్తోంది. ఈ నేపథ్యంలో సీమ ఎత్తిపోతలపై రాష్ట్ర ప్రభుత్వం ఎలా ముందుకెళ్తుందో చూడాలి. 

ఎన్టీఆర్ ఆజ్ఞాతవాసం ఈ టోపీతోనే

Show comments