వైద్యారోగ్యశాఖ అధికారికి అవినీతి జ‌బ్బు!

ఏపీలో వైద్య ఆరోగ్య శాఖ‌లోని నియామ‌కాలు, బ‌దిలీలు, ప్ర‌మోష‌న్ల‌లో ఒక ముఖ్యాధికారి అవినీతి ప‌రాకాష్ట‌కు చేరింద‌నే విమ‌ర్శ‌లు వ‌స్తున్నాయి. ఈ విష‌యంలో ఒక ముఖ్య అధికారి చ‌క్రం తిప్పి కోట్ల రూపాయ‌ల‌ను కూడ‌బెట్టాడ‌నే ఆరోప‌ణ‌లు వెల్లువెత్తున్నాయి. ఇప్పుడు ఈ అంశం వైద్యారోగ్య శాఖ‌లో హాట్ టాపిక్ గా మారి, ఆ శాఖ మంత్రి ఈ అంశం మీద దృష్టి సారించిన‌ట్టుగా స‌మాచారం. 

ఈ వ్య‌వ‌హారంపై ముఖ్య‌మంత్రికి కూడా ఫిర్యాదులు అంద‌గా.. విజిలెన్స్ విభాగానికి ఈ వ్య‌వ‌హారాన్ని అప్ప‌గించి క‌ఠిన చ‌ర్య‌ల‌కు ఆదేశించిన‌ట్టుగా తెలుస్తోంది. చ‌ర్య‌ల సిఫార్సుల‌ను కూడా విజిలెన్స్ విభాగానికే అప్ప‌గించిన‌ట్టుగా స‌మాచారం అందుతోంది.

వైద్యారోగ్య శాఖ‌లో డీఎంఈ హోదాలో ఉన్న అధికారి చేతివాటం, వ్యవహారశైలి పై ఆగ్రహావేశాలు వ్యక్తమవుతున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా ఎంతో మంది బాధిత వైద్యులు తమకు జరిగిన అన్యాయాన్ని విజిలెన్స్ విచారణ అధికారులకు విన్నవించుకుంటున్న‌ట్టుగా స‌మాచారం. ఇటీవల భారీ ఎత్తున జరిగిన నియామకాల్లో, బ‌దిలీల్లో, ప‌దోన్న‌తుల్లో డీఎంఈ కోట్లు పోగేసుకున్నట్లు విచారణలో బయట పడుతున్నట్లు తెలుస్తోంది.

డీఎంఈ ఆఫీస్ లో చిన్న ఫైల్ కదలాలన్నా చెయ్యి తడపాల్సిందేనని స‌మాచారం, బ్రోకర్లను ఏర్పాటు చేసుకొని మరీ రాష్ట్రవ్యాప్తంగా కలెక్షన్లు చేసుకోవడం చూసి స‌హ‌చర అధికారులు ఆశ్చ‌ర్య‌పోయి, ఇందుకు సంబంధించి ఫిర్యాదులు చేసిన‌ట్టుగా స‌మాచ‌రాం.ఆ అధికారి అవినీతి , అక్రమాలు , తలబిరుసుతనం, నిర్లక్ష్య వైఖరి చివరకు విజిలెన్స్ విచారణకు కార‌ణ‌మైన‌ట్టుగా తెలుస్తోంది. 

విజిలెన్స్ విభాగం విచార‌ణ నేప‌థ్యంలో.. ఆ అధికారి లీల‌ల‌పై మ‌రిన్ని ఫిర్యాదులు వెల్లువెత్తుతున్నట్టుగా తెలుస్తోంది.

Show comments