సాక్షి ఎందుకిలా చేస్తోంది.. లోపం ఎక్కడుంది?

ఏపీ, తెలంగాణ రెండు రాష్ట్రాల్లో వర్షాలు బీభత్సం సృష్టించాయి. హైదరాబాద్ లో జనం తీవ్ర ఇబ్బందులు పడ్డారు. ఇక్కడ ఏపీలో పంటలు నీట మునిగి రైతులు తీవ్రంగా నష్టపోయారు. భారీ వర్షాలకు రెండు ప్రాంతాల్లో రోడ్లు దారుణంగా దెబ్బతిన్నాయి. అయితే మీడియా వ్యవహారంలోనే తేడా స్పష్టంగా కనిపించింది.

అక్కడా, ఇక్కడా ప్రతిపక్షాల చేతిలో ఉన్న మీడియా... ప్రభుత్వ నిర్లక్ష్యం, వైఫల్యం అంటూ దుమ్మెత్తిపోసింది. మరి ప్రభుత్వానికి అనుకూలంగా ఉన్న మీడియా ఏం చేయాలి. సహాయక చర్యలను హైలెట్ చేస్తూ, మంత్రులు-అధికారుల పరామర్శలకు ప్రాధాన్యతనిస్తూ ప్రజల కష్టాలు ఎప్పటికప్పుడు తెలుసుకుని, ప్రభుత్వానికి చేరవేస్తూ, వారి కష్టాలను తీర్చడంలో సహాయ పడాలి.

ఏపీ, తెలంగాణ రెండు ప్రాంతాల్లో మంత్రులు పర్యటిస్తున్నారు, సమస్యలు పరిష్కరిస్తున్నారు. తెలంగాణలో అనుకూల మీడియా ప్రభుత్వ సహాయక చర్యలను బాగా హైలెట్ చేస్తోంది, ప్రతిపక్షాలను చీల్చి చెండాడుతోంది. 

ఏపీలో మాత్రం సాక్షి పూర్తిగా చప్పపడిపోయింది. వైసీపీ అధికారంలోకి రాకముందు, వచ్చిన తర్వాత సాక్షి పద్ధతి చూస్తే తేడా స్ఫష్టంగా కనిపిస్తోంది. తాజా వరదల విషయంలో కూడా ప్రభుత్వ సహాయక చర్యలను హైలెట్ చేయడంలో సాక్షి వెనకపడిపోయింది.

మరోవైపు ఈనాడు, ఏబీఎన్.. లోకేష్ ని ఏపీ సీఎంలాగా ప్రొజెక్ట్ చేస్తూ.. ధ్వంసమైన రోడ్ల వీడియోలని పదే పదే చూపిస్తూ రాష్ట్రం అల్లకల్లోలం అయిపోతున్నట్టు బిల్డప్ ఇస్తున్నాయి. భారీ వర్షాలకు రోడ్లు దెబ్బతినడం అత్యంత సహజ పరిణామం. 

అప్పటికప్పుడు వర్షాల్లో రిపేర్లు చేసినా ఉపశమనం ఉండదు. వర్షాల ప్రభావం తగ్గాక శాశ్వత ప్రాతిపదికన రిపేర్లు చేస్తేనే ఫలితం ఉంటుంది. ఆ విషయం తెలిసి కూడా ప్రతిపక్షాలు, ప్రతిపక్షాలకు వత్తాసు పలికే మీడియా ప్రభుత్వ వైఫల్యం అంటూ రెచ్చిపోతుంది. దాన్ని తిప్పికొట్టాల్సిన సాక్షి మీడియా సైలెంట్ గా ఉండిపోవడమే ఇక్కడ బాధాకరం.

బాబు హయాంలో వర్షాలు, వరదలు వచ్చినప్పుడు అధికారులు, మంత్రులు ఏం చేశారు? ఇప్పుడు ఏం చేస్తున్నారు? అప్పుడు వర్షాల ధాటికి రోడ్లు ఎలా తయారయ్యాయి, ఇప్పుడెలా ఉన్నాయి. రోడ్ల నిర్వహణ, మరమ్మతులకు ఆ ప్రభుత్వం ఏం చేసింది, ఈ ప్రభుత్వం ఎంత తొందరగా స్పందించింది.. ఇలాంటివన్నీ కంపేర్ చేసి ఇస్తే ప్రజలకు కూడా ఓ అవగాహన వస్తోంది. అప్పుడలా చేసిన టీడీపీ, ఇప్పుడెందుకు రెచ్చిపోతోందో అర్థమవుతుంది.

వాస్తవానికి వరదల కంటే ముందే.. రాష్ట్ర రహదారులపై సీఎం జగన్ కీలక నిర్ణయం తీసుకున్నారు. డిసెంబరుకల్లా ఏపీలో గుంతలు లేని రహదారులు ఉండాలని అధికారులకు ఆదేశాలిచ్చారు. 5వేల కోట్ల రూపాయలతో రోడ్ల విస్తరణ, నిర్వహణ పనులు చేపట్టాలన్నారు. 2,168 కోట్ల రూపాయలతో 7116 కిలోమీటర్ల మేర రోడ్లు, వంతెనలు మరమ్మతులు చేయడానికి సిద్ధమయ్యారు అధికారులు.

వరదల వల్ల కాస్త ఆలస్యం అవుతోంది కానీ.. వెంటనే కార్యాచరణ మొదలు కావాల్సి ఉంది. ఈ విషయాలన్నీ హైలెట్ చేయాల్సిన సాక్షి, అలా కవర్ చేసి ఇలా లైట్ తీసుకుంది. పార్టీ అధికారంలో ఉన్నంత మాత్రాన ప్రచారం అవసరం లేదు అనుకోవటం సమంజసం కాదు.

ప్రతిపక్షాల నోరు మూయించాలన్నా, దుష్ప్రచారాలను తిప్పి కొట్టాలన్నా.. అసలు విషయాలను జనం ముందుకు తీసుకెళ్లాలి. ఆ పని సాక్షి సమర్థంగా చేయగలిగితే.. పచ్చపాత మీడియా గురించి పెద్దగా విచారించాల్సిన అవసరం ఉండదు.

లోకేష్ ను రంగంలో దించే ధైర్యం చేయలేక

అచ్చెన్నాయుడు మాకు సలహాలివ్వడమా?

Show comments