క్రికెట్ దిగ్గ‌జానికి గుండెపోటు

క్రికెట్ దిగ్గ‌జం క‌పిల్‌దేవ్ గుండెపోటుకు గుర‌య్యారు. కుటుంబ స‌భ్యులు వెంట‌నే ఆయ‌న్ను ఢిల్లీలోని ఓ ప్రైవేట్ ఆస్ప‌త్రికి త‌ర‌లించారు. వైద్యులు వెంట‌నే స్పందించి ఆయ‌న‌కు గుండె ఆప‌రేష‌న్ చేశారు. క‌పిల్‌దేవ్ అంటే క్రికెట్ అభిమానుల‌కు ఓ రోల్ మోడ‌ల్‌.

హ‌ర్యానా హ‌రికేన్‌గా ప్ర‌సిద్ధి చెందిన క‌పిల్‌దేవ్ సార‌థ్యంలో మొట్ట‌మొద‌ట 1983లో వ‌న్డే ప్ర‌పంచ క‌ప్‌ను భార‌త‌జ‌ట్టు సొంతం చేసుకుంది. ఇంగ్లండ్‌లోని లార్డ్స్ స్టేడియం వేదిక‌గా జ‌రిగిన‌ ఫైన‌ల్‌లో ప్ర‌పంచ మేటి జ‌ట్టుగా పేరుగాంచిన వెస్టిండీస్ జ‌ట్టును క‌పిల్ సార‌థ్యంలోని భార‌త్ జ‌ట్టు మ‌ట్టిక‌రిపించి చిర‌స్మ‌ర‌ణీయ‌మైన విజ‌యాన్ని సాధించి భార‌త క్రికెట్ చ‌రిత్ర‌లో రాశారు.

క‌పిల్‌దేవ్ కుడిచేతి ఫాస్ట్ బౌల‌ర్‌గా ప్ర‌పంచ అత్యుత్త‌మ బౌల‌ర్ల‌లో ఒక‌రిగా గుర్తింపు పొందారు. కేవ‌లం బౌల‌ర్‌గానే కాకుండా అవ‌స‌ర‌మైన స‌మ‌యాల్లో బ్యాట‌ర్‌గా కూడా జ‌ట్టును ఆదుకున్న ఘ‌న చ‌రిత్ర క‌పిల్ సొంతం చేసుకున్నారు. వ‌న్డేల్లో ఆయ‌న అత్య‌ధిక వ్య‌క్తిగ‌త స్కోర్ 175.

జింబాబ్వేపై కీల‌క స‌మ‌యంలో వీరోచిత బ్యాటింగ్‌తో 175 ప‌రుగుల‌తో నాటౌట్‌గా నిలిచారు. క‌పిల్‌దేవ్ త‌న కెరీర్‌లో 131 టెస్ట్ మ్యాచ్‌లు, 225 వ‌న్డే మ్యాచ్‌లు ఆడారు. టెస్ట్‌ల్లో 434 వికెట్లు, వ‌న్డేల్లో 253 వికెట్లు తీసి రికార్డు నెల‌కొల్పారు.  క‌పిల్‌దేవ్ త్వ‌ర‌గా కోలుకోవాల‌ని ప‌లువురు  సినీ, రాజ‌కీయ‌, క్రీడా ప్రముఖులు ఆకాంక్షిస్తూ ట్వీట్లు చేస్తున్నారు. 

Show comments