గాయ‌కుడు మ‌నో క‌న్నీరుమున్నీరు

స్టేజ్‌పై గాయ‌కుడు మ‌నో ఉన్నారంటే స‌ర‌దాకు ఏ మాత్రం త‌క్కువ ఉండ‌దు. ఎప్పుడూ న‌వ్వుతూ చ‌లాకీగా క‌నిపిస్తుంటారు. పాట‌కు త‌గ్గ‌ట్టు అభిన‌యిస్తూ ప్రేక్ష‌కుల‌ను ఉర్రూత‌లూగించ‌డం గాయ‌కుడు మ‌నో ప్ర‌త్యేక‌త‌. 

ఎస్పీ బాలు స్టేజీసైన ఉన్నారంటే ఇక మ‌నో గురించి చెప్పాలా?  చిన్న‌పిల్లాడిలా చిలిపి చేష్ట‌ల‌తో ఆక‌ట్టుకోవ‌డం చూశాం. అలాంటి గాయ‌కుడు మ‌నో పాట పాడుతూ పాడుతూ ....చిన్న పిల్లాడిలా వెక్కివెక్కి ఏడ్చారు. 

అత‌న్ని ఓదార్చ‌డం ఎవ‌రి వ‌ల్లా కాలేదు. విజ‌య‌ద‌శ‌మి వేడుక‌ల్లో భాగంగా ఓ ప్ర‌ముఖ చాన‌ల్ ప్ర‌త్యేక  కార్య‌క్ర‌మానికి సంబంధించి ప్రోమోల‌ను విడుద‌ల చేసింది. ఇందులో భాగంగా గాయ‌కుడు మ‌నో క‌న్నీటిప‌ర్యంత‌మైన వీడియో సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అవుతోంది.

ఇటీవల అనారోగ్యంతో లోకాన్ని వీడిన గాన‌గంధ‌ర్వుడు ఎస్పీ బాలుకి నివాళులర్పిస్తూ మనో, ఉష ‘సూర్యుడే సెలవని’ పాటను ఆలపించారు. ఈ పాట పాడుతున్న సమయంలో మనో ఒక్క‌సారిగా తీవ్ర భావోద్వేగానికి గుర‌య్యారు. 

స్టేజ్‌పైనే కన్నీటిప‌ర్యంత మ‌య్యారు. దీంతో ఒక్క‌సారిగా అక్క‌డ గంభీర వాతావ‌ర‌ణం నెల‌కొంది. ఈవెంట్‌లో పాల్గొన్న పలువురు సెలబ్రిటీలు, ఇతర బృంద స‌భ్యులు మ‌నోను ఓదార్చే ప్రయత్నం చేశారు. చిన్న‌పిల్లాడిలా మ‌నో ఏడ్వ‌డం చూసిన ప్ర‌తి ఒక్క‌రి హృద‌యాలు బ‌రువెక్కాయి. 

అనంతరం బాలు గురించి మ‌నో మాట్లాడుతూ బాలసుబ్రహ్మణ్యం గారిని చూస్తూ పెరిగానన్నారు. అందర్నీ సమానంగా చూసే గొప్ప వ్యక్తి బాలు అని కొనియాడారు. అలాంటి మ‌హ‌నీయుడు  మన మధ్య లేరంటే నిజంగా తట్టుకోలేకపోతున్న‌ట్టు గ‌ద్గ‌ద స్వ‌రంతో చెప్పుకొచ్చారు. 

అవి.. ఎవ‌రి ఆశ‌ల పునాదులో చెప్ప‌వేం ఈనాడూ! 

Show comments