ఎమ్బీయస్ : కరోనా ఓ చువ్వలగోళం – దాని వాక్సిన్ గందరగోళం

నాకు తెలిసి కరోనా వాక్సిన్‌పై జరిగినంత చర్చ మరి దేనిమీదా యిటీవలి కాలంలో ఏ పరిశోధన మీద జరగలేదు. చివరకు యిది ఎగిరే పళ్లాల (యుఎఫ్‌ఓ) మీద జరిగే చర్చలా ముగుస్తుందేమో ననిపిస్తోంది. అవీ అంతే, ఉన్నాయంటారు, కొంతమంది చూశామంటారు, కానీ కచ్చితంగా చెప్పడానికి ఆధారాలు చాలలేదంటారు.

అదిగో పులి అంటే యిదిగో తోక అనేస్తూంటారు. దీని గురించి అదిగో వచ్చేస్తోంది, యిదిగో వచ్చేస్తోంది, రెడీగా వుండండి, క్యూలో నిలబడి టోకెన్లు తీసుకోండి అంటున్నారు. టోకెను తీసుకుంటాం సరే, అసలు ఫ్యాక్టరీలో సరుకే తయారు కావటం లేదే! క్లినికల్ ట్రయిల్స్‌లోనే కొట్టుమిట్టులాడుతున్నారు.

వాక్సిన్ అనేది రోగనిరోధం కోసం వేసుకునేది. దాని మాట సరే, మామూలుగా రోగచికిత్స చేసే ఔషధం చేతిలో పెట్టుకునే అప్పుడు వాక్సిన్ కోసం ప్రయత్నిస్తారు. ఏడు నెలలుగా మందే రెడీ కాలేదు. ప్రస్తుతానికి యిలా చేసి చూద్దాం అనుకుని డాక్టర్లు కొన్ని మందుల కోర్సుకి ఫిక్సయిపోయారు కానీ ఖచ్చితంగా నయం చేసి తీరతాం అని ఢంకా బజాయించి చెప్పటం లేదు. 

కోవిడ్ వలన మెదడు ఎఫెక్టవుతోందని, కొత్త రోగాలు వస్తున్నాయని, శీతాకాలంలో మళ్లీ తిరగబెడుతుందని రోజుకో వార్త వచ్చి హడలగొడుతోంది. ఎందుకంటే మన శాస్త్రజ్ఞులకు రోగస్వరూపమే యిప్పటిదాకా అంతు పట్టలేదు.

ఇలాటి పరిస్థితుల్లో వాక్సిన్ గురించి జరుగుతున్న గందరగోళం అంతాయింతా కాదు. మొదట్లో ఏమన్నారు? ‘రోగాన్ని సృష్టించిన చైనావాడే వాక్సిన్ కూడా కనుక్కుని గూట్లో పెట్టుకున్నాడు. అది వేసుకోవడం వలననే జిన్‌పింగ్ మాస్కు కూడా కట్టుకోకుండా ఊహాన్ వెళ్లి రోగులను పరామర్శించి వచ్చాడు.

ప్రపంచంలో అందరూ రోగంతో అల్లాడుతూంటే అప్పుడు చైనావాడు మెజీషియన్ టోపీలోంచి కుందేల్ని తీసినట్లు వాక్సిన్ తీసి చూపించి, ఊరించి కళ్లు తిరిగేంత ధర తీసుకుని, దోచేస్తాడని అన్నారు. కానీ అది జరగలేదు. మేమూ ఓ వాక్సిన్ తయారుచేస్తూ...న్నాం అన్నారు కానీ రెడీగా ఏమీ చూపించలేదు.

చైనా వాడి మీద అప్పుడెంత పుకార్లు వచ్చాయంటే, వాడు తను టీకాలు వేసేసుకోవడమే కాదు, తన ఫ్రెండ్సయిన రష్యాకు, ఉత్తర కొరియాకు కూడా యిచ్చేశాడు. అందుకే అక్కడ కోవిడ్ లేదు చూడండి అన్నారు. తీరా చూస్తే రష్యాలో కాస్త ఆలస్యంగానైనా కరోనా తన తడాఖా చూపించింది. వాళ్లూ వాక్సిన్ తయారుచేయడం మొదలుపెట్టారు. 

తమ వద్ద యిప్పటికే వుంటే, కొత్తగా చేసే పని ఎందుకు పెట్టుకుంటారు? పైగా వాళ్ల వాక్సిన్ 3వ దశ క్లినికల్ ట్రయిల్స్‌లో రష్యాలోనే చాలామందికి దుష్పరిణామాలు వస్తున్నాయంటున్నారు. అంటే దీని అర్థమేమిటన్నమాట? ప్రపంచంలో ఎవ్వరి దగ్గరా వాక్సిన్ లేదు. ఉన్నదేమిటంటే ఎప్పటికో అప్పటికి చేస్తామనే ఆశాభావం.

అయితే ఈ ‘ఎప్పటికో అప్పటికి’ అనే మాట సైంటిస్టు అనగలడు కానీ దేశపాలకులు అనలేరు. అందువలన వాళ్లు ఎప్పటికప్పుడు ప్రజలకు ఏవేవో వార్తలు చెప్పి మభ్యపెడుతున్నారు. మరక కూడా మంచిదే అనే యాడ్‌లా మభ్యపెట్టడం కూడా మంచిదే అని మన పాఠకులు కొందరు వాదిస్తూంటారు. ‘కోవిడ్ లాక్‌డౌన్‌ కారణంగా యిళ్లల్లో వుండిపోవడం వలన జనాభాలో చాలామంది డిప్రెషన్‌లోకి వెళ్లిపోయారు. 

ఉద్యోగాలు, ఉపాధి పోయి తక్కినవాళ్లు వెళ్లిపోయారు. అందువలన అబద్ధమో, సబద్ధమో ఏదో ఒకటి చెప్పి ఊరడిస్తే తప్పేముంది? అప్పటిదాకా ఉత్సాహంగా వుంటారు కదా’ అని వారి వాదన. పరిస్థితి క్లిష్టతను క్లియర్‌గా చెప్పేస్తే పేచీ లేదు కానీ యిలా ఆశ పెట్టి నిరాశలో ముంచితే మరింత నష్టం కదా అని నా భావం. ‘స్విస్ బాంకుల నుంచి నల్లధనం తెచ్చి ప్రతీ వారి ఖాతాలో రూ.15 లక్షలు వేస్తాం అని చెప్పి కొంతకాలమైనా ఆనందపరిచాం కదా. తర్వాత ఉత్తుత్తినే, జుమ్లా బాత్ అంటే ఎవరైనా వచ్చి నిలదీశారా?’ అంటారు వాళ్లు.

వ్యక్తిగతంగా చెప్పాలంటే అలా ఆశపడేవాళ్లలో నేను లేను. ఎందుకంటే యీ వాక్సిన్ ఎప్పటికి తయారవుతుందో యిప్పటిదాకా స్పష్టత రాలేదు. వచ్చినా తయారు కాబోయే వాక్సిన్‌లలో దాదాపు ముప్పావు వంతు అమెరికా, యూరోప్ దేశాలే డబ్బులిచ్చి బుక్ చేసేసుకున్నాయని చెప్తున్నారు. 

ఇక మన లాటి దేశాల వంతు ఎప్పుడు వస్తుంది? మన దాకా వచ్చినా 138 కోట్ల మందిలో ఎవరికి యిస్తారు? ఎంతమందికి యిస్తారు? దానికో ప్రాధాన్యతా క్రమం అంటూ ఏర్పరుస్తారు కదా! వైద్య సిబ్బందికి, పోలీసులకు, పారిశుధ్య పనివారికి, సైనికులకు... యిలా ముఖ్యమైన కొన్ని వర్గాలకు యిచ్చాక కదా, తక్కినవారి గురించి ఆలోచించాలి!

మన దేశంలో ఏదీ సవ్యంగా జరగదు. క్రికెట్ మ్యాచ్ టిక్కెట్లు, సినిమా టిక్కెట్ల నుంచి, రైల్వే ఎమర్జన్సీ కోటా దాకా ప్రతీదానిలోనూ అడ్డదారిలో దూరదామని చూసేవాళ్లు కోకొల్లలు. ఆరోగ్యశ్రీ కార్డులు యిస్తున్నారట, ఇళ్ల స్థలాల ఎలాట్‌మెంట్ చేస్తున్నారట.. అంటే చాలు దొంగ సర్టిఫికెట్లు చేత పట్టుకుని అందరి కంటె ముందు వరుసలో నిలబడతారు. 

సైనికులకే యిస్తారట అంటే మిలటరీ కాంటీన్‌కు అగ్గిపెట్టెలు సప్లయి చేసేవాడు కూడా తను సైనికుణ్ననే దొంగ సర్టిఫికెట్టు సంపాదించేందుకు చూస్తాడు. పైకి యీ లిస్టులో వున్నారని చెప్పకపోయినా జడ్జిలు, ప్రజాప్రతినిథులు, ఉన్నతాధికారులు.. మేం లేకపోతే దేశం ఏమై పోతుంది అంటూ వాళ్లే ముందు వేయించేసుకుంటారు.

ఆ తర్వాత నాలాటి, మీలాటి సామాన్యులకు చేరుతుందనుకోవాలి. 65 ఏళ్లు దాటినవారికి ప్రస్తుతం యివ్వడం అనవసరం, అందరికీ యిచ్చాక అడుగూబొడుగూ మిగిలితే అప్పుడు చూద్దాం అంటున్నారు కాబట్టి నాకు రాదు. నా సంగతి అని కాదు కానీ దానిలో లాజిక్ వుంది. ఇటలీలో వెంటిలేటర్ల కొరత వచ్చినప్పుడు మరీ వృద్ధులుగా వున్నవారికి ‘సారీ’ అనేశారు.

ఏదైనా ప్రమాదం జరిగినప్పుడు ముందుగా స్త్రీలు, పిల్లలు, వృద్ధులను బయటకు దాటిస్తారు. వయసులో వున్నవారు తమను తాము రక్షించుకోగలరని ఓ అంచనా. అలాగే మందు లేదా వాక్సిన్ తక్కువగా వున్నపుడు సమాజానికి ఎక్కువకాలం ఉపయోగపడేవారికి ప్రాధాన్యత యివ్వాలి.

దానాదీనా నా దాకా వాక్సిన్ వచ్చేసరికి 2022 సంవత్సరం ముగియబోతూ వుంటుంది. అప్పటిదాకా నేను లేదా కరోనా వుండకపోవచ్చు. ఇద్దరమూ ఉన్నా కరోనా కూడా అప్పటి నాలాగే నీరసించి, డోలో 650తో తగ్గే స్థాయికి వచ్చేయవచ్చు. లేదా ఆ పాటికే నాకు కరోనా సోకి, యాంటీబాడీలు తయారైపోయి, హెర్డ్ యిమ్యూనిటీ వచ్చేసి వుండవచ్చు. మరో కొత్త వ్యాధి ప్రబలి నా మాటేమిటి అనవచ్చు. 

అందువలన వాక్సిన్ వేయించుకునే ఉత్సాహం నాకుంటుందో లేదో డౌటు. ఒకవేళ వేయించుకోవలసిన అవసరం పడితే మాత్రం ఒక లాభం వుంది. ఎందుకంటే ఆ పాటికి వాక్సిన్ పనితీరు గురించి శాస్త్రజ్ఞులకు పూర్తి అవగాహన ఏర్పడి వుంటుంది. వాళ్లు కూడా ఎంత డోసు యివ్వాలో, అలాటివి ఎన్ని డోసులు యివ్వాలో, బూస్టరు డోసు యివ్వాలో వద్దో ఏమీ తెలియకుండా చీకటిలో తడుముకుంటున్నారు. 

ఈ అమెరికా, యూరోప్ అమాంబాపతు జనాల మీద ప్రయోగాలు చేసేసి, మన దగ్గరకు వచ్చేసరికి కచ్చితమైన, నిరూపితమైన పరిజ్ఞానంతో వస్తారు. పైగా ఆ పాటికి అనేక వాక్సిన్‌లు మార్కెట్లో పోటీపడి, ధర తగ్గవచ్చు కూడా!

ఇది వాస్తవదృక్పథం. తక్కినవాళ్ల మాట ఎలా వున్నా, నన్ను నేను ఊరికే ఆశ పెట్టుకుని, ఆశకురుపులు తెచ్చుకోదలచుకోలేదు. నాకైతే ఎవర్నీ ఓట్లు అడిగే పని లేదు కాబట్టి, నేను నిక్కచ్చిగా చెప్పేయగలను కానీ ఓట్లు అడగవలసినవాళ్లు అలా చెప్పలేరు కదా! వరదలొచ్చి పూరిగుడిసెలు కొట్టుకుపోగానే టీవీ వాళ్లు అక్కడకు చేరతారు. 

గుడిసె కొట్టుకుపోయినతను మైకు ముందు ఆవేశంగా ‘వరదలొస్తూంటే మేం ఓట్లేసిన నాయకులు ఏం చేస్తున్నారు?’ అని అడుగుతూంటారు. ‘పైన వర్షాలు పడి, యిక్కడ వరదలు వస్తే నన్నేం చేయమంటావయ్యా? వర్షాన్ని ఆపగలనా? వరదను అడ్డుకోగలనా?’ అని మంత్రి అతనికి సమాధాన మివ్వగలడా? లేడు. అందుకని ఓ ప్రకటన విడుదల చేస్తాడు. ‘వరదలు రాకుండా కట్టడి చేయమని మంత్రి అధికారులను ఆదేశించారు’ అని. దాని అర్థమేమిటో ఆ ప్రకటన యిచ్చినవారికే తెలియాలి.

ఇలా పాలకుడన్నాక ఏదో ఒకటి చేస్తున్నట్లు కనబడాలి. ‘ఈ వేసవిలో నీటికొరత లేకుండా చేయమని ముఖ్యమంత్రి అధికారులను ఆదేశించారు’. ‘ఈ శీతాకాలంలో దోమలు కుట్టకుండా తగు జాగ్రత్తలు తీసుకోమని మంత్రి సంబంధిత అధికారులను ఆదేశించారు’ వంటి ప్రకటనలు ఎన్నేళ్లగా చూస్తూ వచ్చాం మనం? ‘కరోనా యిలా విజృంభిస్తూ వుంటే పాలకులేం చేస్తున్నారు?’ అని ప్రజలడుగుతూంటే గద్దె కెక్కినవారు ఏదో ఒకటి చెప్పాలి కదా పాపం. 

అందుకే వాళ్లు చెప్తున్నారు. రంగులరాట్నం చూడండి, తిరుగుతూనే వుంటూ, ఏదో యాక్టివిటీ జరుగుతున్నట్లు అనిపిస్తుంది. కానీ అది ఎక్కడికీ వెళ్లదు, అక్కడే వుంటుంది.

అందుకే ట్రంప్ నవంబరులో టీకాలు యిప్పించేస్తానంటున్నాడు, యివ్వడానికి అక్కడ ఏమీ లేదని తెలిసినా! అలాగే పుతిన్. మా అమ్మాయి వేలాది రష్యన్ల పెట్టు. తన మీద ప్రయోగం చేస్తే 30 వేల మంది మీద చేసినట్లే అంటూ వాక్సిన్‌కు అచ్చోసి బజార్లో వదిలేశాడు. తీసుకుని, ఇబ్బందిపడేవాళ్లు పడుతున్నారు కానీ, ప్రపంచంలో మొదటి వాక్సిన్ అందించాను అని పుతిన్ ఘనంగా చెప్పుకుంటున్నాడు కదా. 

ఇక బ్రిటన్‌లో ఆక్స్‌ఫర్డ్‌ వాళ్లు గట్టిగా ఏమీ చెప్పటం లేదు కానీ అక్కడి పేపర్లలో లీకులు వచ్చేస్తున్నాయి, ఏడాది చివరికల్లా వచ్చేస్తుంది అంటూ. ఇవన్నీ ప్రజల్ని ఊరడించడానికి ప్రభుత్వాలు చేస్తున్న ప్రయత్నాలే అనుకోవాలి.

మన దగ్గర ఊరడించే ప్రయత్నం ఐసిఎమ్‌ఆర్ ద్వారా జరిగింది. కానీ దాని పరువు పూర్తిగా పోయింది. కరోనా విషయంలో ప్రపంచ ఆరోగ్య సంస్థకు ఎంత పరువు మిగిలిందో, ఐసిఎమ్‌ఆర్‌కు అంతే మిగిలింది. దాంతో వ్యక్తిగతంగా పరువుప్రతిష్ఠలున్న కేంద్ర ఆరోగ్యమంత్రి డా. హర్షవర్ధన్‌ను రంగంలోకి దించారు. 

ఆయన చేత వచ్చే ఏడాది మొదట్లో అంటే ఫస్ట్ క్వార్టర్ చివరకు వాక్సిన్ వస్తుంది అనిపించారు. ఆయనే మే నెలాఖరులో ‘2021 జూన్ నాటికి వాక్సిన్ వస్తుందని ఒక డాక్టరుగా నా అంచనా’ అని చెప్పారు. దాన్ని యిప్పుడు మూడు నెలలు ముందుకు జరిపారు. నిజానికి ఈ వాక్సిన్ యింత చికాకు పెడుతుందని మే నెలలో డాక్టర్లు, సైంటిస్టులు అనుకోలేదు. గోదాలోకి దిగాకనే రోగక్రిమి ఎంత మారువేషాల కిల్లాడో తెలిసివస్తోంది. అందువలన అప్పటికంటె యిప్పడు తక్కువ ధాటీగా చెప్పాలి కానీ అవసరం అలాటిది.

అందుకని చేయి చాచితే అందేటంత దూరంలో వాక్సిన్ వున్నట్లు జులై నాటికి 20 శాతం మంది ఇండియన్స్‌కి వాక్సినేషన్ అయిపోతుందని హర్షవర్ధన్ అక్టోబరు 4న ప్రకటించారు. అంకెల్లో దాన్ని దాదాపు 25 కోట్లమందికి అని అనువదించారు. మన జనాభా 125 కోట్లు ఎప్పుడో దాటేసిందనుకోండి, కానీ మరీ అంత రంధ్రాన్వేషణ చేయనక్కరలేదు. 

25 కోట్లు అని గుర్తుపెట్టుకుని జులై నాటికి ఎంతమందికి అయిందో చూసుకుంటే యీ అంచనా కూడా బజెట్ అంచనా లాటిదేనా లేక పక్కాదా అనే విషయం తేలిపోతుంది. కానీ కేంద్రం మాత్రం దీన్ని చాలా సీరియస్‌గా తీసుకుని, ముందు వరుసలో నిలబడి వాక్సిన్ తీసుకోవలసిన ఆ 25 కోట్లు ఎవరు అనే విషయం తేల్చే బాధ్యతను రాష్ట్రాలకు అప్పగించింది. అక్టోబరు నెలాఖరు కల్లా ఏయే వర్గాల వారికి యివ్వాలో ప్లాను తయారు చేసి పంపమని ఆదేశించింది.

ఇలా ముందుగానే ప్రణాళిక వేసుకుని పెట్టుకోవడం మంచిదే. వచ్చాక, నాకంటే నాకని కౌరవసోదరులు జేబురుమాళ్ల కోసం కొట్టుకున్నట్లు (సినిమాలోనే లెండి) కొట్టుకోకుండా ముందుగానే కుర్చీల్లో రుమాలు పరిచి వుంచడం సరైన పద్ధతి. ఎందుకంటే వాక్సిన్ తయారు చేయగానే సరిపోదు, దాన్ని నింపే గాజు వయల్స్, పాకింగ్ మెటీరియల్, స్టోరింగ్ ఫెసిలిటీలు, సరఫరా చేయడానికి కోల్డ్ చెయిన్లు యిలా బోల్డు లాజిస్టిక్స్ చూసుకోవాలి. 

పాపం బిల్ గేట్స్ ‘గావి’తో కలిసి దీని మీద చాలా కసరత్తే చేస్తున్నాడు. మామూలుగా అయితే ప్రతి వాక్సిన్‌కు యింత డిమాండ్ వుండదు. అందుకని యీ స్థాయి పంపిణీ సమస్య రాదు. కానీ ఇప్పటి పరిస్థితి ప్రకారం చూస్తే ప్రపంచంలో ప్రతి వ్యక్తి దీని గురించి అడుగుతున్నట్లు వుంది. అందుకని డిమాండుని తట్టుకునేటంత సప్లయి వుండేలా చూస్తున్నారు.

ఇప్పుడు మన హర్షవర్ధన్ ఏమంటున్నారు? 40-50 కోట్ల డోసులు వస్తాయని, వాటిని దాదాపు 20-25 కోట్ల మందికి సర్దుతామని అంటున్నారు. అంటే ప్రతి మనిషి రెండు డోసులు వేసుకోవాలా? ఈ విషయం యిప్పటిదాకా నిర్ధారణగా ఎవరూ చెప్పలేదే! అసలు చిన్నపిల్లలకు ఎంత మోతాదు యివ్వాలి? పెద్దవాళ్లకు ఎంత యివ్వాలి? ఉత్పాదన అయిన మొత్తాన్ని యిద్దరికీ సర్దితే ఎన్నేసి డోసులు తయారవుతాయి? ఇలాటివి ఏవీ తెలియలేదు. 

అత్యంత క్లిష్టమైన మూడో దశ ప్రయోగాలు విజయవంతమయ్యాయని యిప్పటిదాకా ఏ సంస్థా ప్రకటించలేదు. ఆ పరీక్షలు పూర్తయి, వాటి ఫలితాలను నిపుణులు అధ్యయనం చేశాకనే యిలాటివి తేలతాయి. అసలింతకీ వాక్సిన్ ఎంత దూరంలో వుంది?

మోడెర్నా ముందంజలో వుంది కానీ వాళ్లూ తాజాగా చెప్పినదేమిటంటే మేము రెండో దశ ఫలితాలను యీ నెలలో పబ్లిక్‌కు విడుదల చేసి, ఆ డేటా ఆధారంగా మాకు ఎమర్జన్సీ యూజ్ అథరైజేషన్ (ఇయుఏ) యిమ్మనమని యుఎస్‌ఎఫ్‌డిఏ (ఆమెరికాలో డ్రగ్స్, వాక్సిన్స్ అనుమతించే సంస్థ)ను నవంబరు 25న కోరతాం, అది అనుమతి యిచ్చేస్తే ఏడాది చివరికల్లా మార్కెట్లో విడుదల చేసేస్తాం అంటున్నారు.  

దాని సిఇఓ యీ విషయం చెప్తూనే అనుమతులు వచ్చేటప్పటికి మార్చి నెలాఖరో, ఏప్రిలో అవుతుంది అన్నాడు. ఎందుకంటే యీ తరహా వాక్సిన్‌ను యిప్పటిదాకా జంతువుల మీదే ప్రయోగించారు తప్ప మనుషుల మీద చేయడం యిదే ప్రథమం. సహజంగా ఎఫ్‌డిఏ జాగ్రత్తగా వ్యవహరిస్తుంది. లేకపోతే దాన్ని కోర్టుకి యీడ్చి భారీ పరిహారం అడగగల ఘనులు అమెరికన్లు. ఈ లోగా 30 వేల మంది మీద చేస్తున్న మూడో దశ ఫలితాలు కూడా అందుబాటులోకి వస్తాయి కాబట్టి ఎఫ్‌డిఏ నిర్ణయం తీసుకోవడానికి ఆ సమాచారం కూడా ఉపయోగపడుతుంది.

ఇక ఫైజర్ వాళ్ల వాక్సిన్ కూడా యిదే దశలో వుంది. బయోఎన్‌టెక్ ఎస్‌ఇ అనే జర్మన్ సంస్థతో కలిసి మాడిఫైడ్ ఆర్‌ఎన్‌ఏ వాక్సిన్ డెవలప్ చేసి, రెండో దశ పరీక్షలు పూర్తి చేసుకుని ఎఫ్‌డిఏను ఎమర్జన్సీ యూజ్ పర్మిషన్ అడగబోతోంది. వాళ్లదీ మూడో దశ పూర్తి కాలేదు. 

ఇక ఆక్స్‌ఫర్డ్-ఆస్ట్రాజెనెకా వాళ్లదైతే ‘‘టైమ్స్‌’’లో తాజాగా వచ్చిన రిపోర్టు ప్రకారం (కంపెనీ యిచ్చిన వార్త కాదు) క్రిస్‌మస్ నాటికి వాక్సిన్ కాండిడేటు తయారవుతుందని, దానికి అనుమతి వచ్చాక (అదెప్పుడో తెలియదు) సాధారణ ప్రజలకు చేరడానికి మరో ఆర్నెల్లు పడుతుందని అనుకుంటున్నారు. అంటే దాని అర్థం ఏ 2021 సెప్టెంబరో అనుకోవాలి.

వాక్సిన్ తయారీలో వున్న మరో పెద్ద కంపెనీ జాన్సన్ అండ్ జాన్సన్. వాళ్లు 60 వేల మంది మీద మూడో దశ ప్రయోగాలు చేస్తున్నారు. వాటి ఫలితాలను 2021 నాటికి యిచ్చి అనుమతి కోరతారట. అనుమతి వచ్చాక 2021లో 100 కోట్ల డోసులు తయారు చేయాలని ప్లాను. ఇదైతే ఒక్క డోసే చాలని వాళ్లంటున్నారు. ఇంకా ఏమీ స్పష్టంగా తెలియదు. 

రష్యాలో ఉన్నది చాలనట్లు, అక్టోబరు 15న మరో వాక్సిన్‌ను కూడా అనుమతిస్తారట. దాని ఉత్పాదన నవంబరులో మొదలెట్టి, 10 వేల డోసులు తయారు చేస్తారట. వాక్సిన్ దిగ్గజాల నదగిన సనోఫీ, జిఎస్‌కె రెండూ కలిసి సంయుక్తంగా చేస్తున్న వాక్సిన్ అమెరికాలో 440 మంది మీద మొదటి, రెండవ దశ ప్రయోగాలను ప్రారంభించారు. డిసెంబరులో ఫలితాలు వస్తాయట. ఆ నెలాఖరుకి మూడో దశ ప్రయోగాలు మొదలుపెట్టాలి. అవి ఎప్పటికి పూర్తవుతాయో యిప్పుడే చెప్పలేం.

ప్రపంచవ్యాప్తంగా వున్న పరిస్థితి యిది కాగా మన దేశంలో 2021 జులై నాటికల్లా 25 కోట్ల మందికి వాక్సిన్ భాగ్యం అబ్బుతుందని ఎలా అనుకోగలం? మోడెర్నా, ఫైజర్ లాటివే ఆ పాటికి అమెరికాలో యిస్తారో లేదో తెలియక అయోమయంలో ఉన్నారే! - అది కూడా ఎమర్జన్సీ యూసేజ్ అనుమతులతో! మన ప్రభుత్వసంస్థలు అనుమతి పత్రాలు పట్టుకుని ఫార్మా కంపెనీల గేట్ల దగ్గర నిలబడినా, లోపల అసలు పదార్థం తయారవాలి కదా! మన దేశంలో వాక్సిన్ ఆశ పెడుతున్నవి నాలుగు కంపెనీలు. 

ఒకటి రష్యా వాక్సిన్‌ స్పుత్నిక్ ‘వి’ని వారితో ఒప్పందంతో యిక్కడ తయారు చేస్తానంటున్న రెడ్డీ లాబ్స్. ఇక్కడ మూడో దశ ప్రయోగాలు చేస్తే చాలన్న డిసిజిఐ, రష్యా వాక్సిన్ మూడో దశ ఫలితాలు అధ్వాన్నంగా వస్తూండడంతో రెండో దశ ప్రయోగాలు కూడా చేయాలని పట్టుబడుతోంది. అది యిప్పుడు రెండో దశ మొదలుపెట్టిందంటే, మూడో దశకు రావడం, దాని ఫలితాలు అధ్యయనం చేయడం ఎంతకాలం పడుతుందో చెప్పలేం.

రెండో కంపెనీ పూనాలోని సీరమ్ ఇన్‌స్టిట్యూట్. వాళ్లు ఆక్స్‌ఫర్డ్‌-ఆస్ట్రాజెనెకాతో ఒప్పందం కుదుర్చుకుని అదే వాక్సిన్‌ను కోవిషీల్డ్ పేరుతో తయారు చేస్తున్నారు. వాళ్ల వాక్సిన్ ఎప్పుడు మార్కెట్లోకి వస్తే (2021 మూడో క్వార్టర్ అని పైన లెక్క వేశాం) అప్పుడే వీళ్లదీ రావాలి, మనవాళ్లు తొందరపడి అనుమతి యిచ్చేస్తే తప్ప! అలా యిస్తే అంతర్జాతీయంగా మన పరువు పోతుంది, మన ప్రభుత్వం ప్రజల ప్రాణాలను లెక్క చేయదు అంటారు. 

అనుమతి వచ్చి సీరమ్ వాళ్లు ఉత్పాదన మొదలెట్టినా వాళ్లు 20 కోట్ల డోసులు తయారు చేస్తామని, దాన్ని ఇండియాకు, యితర అభివృద్ధి చెందిన దేశాలకు పంచుతామంటున్నారు. మన వాటా ఎంతో స్పష్టంగా తెలియకపోయినా మనకు కావలసిన 40-50 కోట్లలో సగం కంటె తక్కువ మాత్రమే సీరమ్ నుంచి వస్తాయన్నమాట.

ఇక జైడస్-కాడిలా, భారత్ బయోటెక్ వారి వాక్సిన్లు. అవి యింకా రెండో దశ ప్రయోగాల్లోనే వున్నాయి. అవి పూర్తయి మంచి ఫలితాలు వచ్చాక, మూడో దశకు చేరాలి. అవీ అయి, ఫలితాలు బాగుంటేనే అనుమతులు, ఆ పై ఉత్పత్తి ప్రారంభాలు గట్రా. మూడో దశ పరీక్షలు జరుగుతున్న మోడెర్నా, ఫైజర్, ఆక్స్‌ఫర్డ్, జాన్సన్‌లవే 2021 జులై తర్వాత వస్తాయో లేదో తెలియకుండా వుంటే రెండో దశలోనే వున్న కాడిలా, భారత్‌లు వాక్సిన్ ఎలా అందించగలవు? దీనికి తోడు భారత్ విషయంలో కొత్త మెలిక ఒకటి వచ్చినట్లు తోస్తోంది.

జైడస్-కాడిలా విషయంలో గుజరాతీ మీడియా హడావుడి చేస్తోందో లేదో తెలియదు కానీ భారత్ విషయంలో మాత్రం తెలుగు మీడియా సందడి ఒక రేంజిలో నడుస్తోంది. ఎప్పటికి అందిస్తారో దాని చైర్మన్ స్వయంగా చెప్పటం లేదు కానీ మీడియా మాత్రం తేదీలు గుప్పించేస్తోంది. ఆశలు కల్పిస్తోంది. అదేం ముచ్చటో! భారత్ వారి కోవాగ్జిన్ రెండో దశ ప్రయోగాల స్టేజిలో వుందని అందరికీ తెలుసు. 

ఇవి నడుస్తూండగా మొన్న దాని చైర్మన్ డా. ఎల్లా కృష్ణ తమ వాక్సిన్‌కు ఎడ్జువెంట్‌ను కలిపి మరింత పటిష్టంగా చేస్తున్నామని ప్రకటించారు. అమెరికాలోని కాన్సాస్‌లో వున్న వైరోవాక్స్ ఎల్‌ఎల్‌సితో సెప్టెంబరు నెలాఖరులో ఒప్పందం కుదుర్చుకుని అల్‌హైడ్రాక్సిక్విమ్-2 అనే ఎడ్జువెంట్‌ను కలుపుతున్నారట.

సాధారణంగా వాక్సిన్‌లలో ఎడ్జువెంట్‌ను కలుపుతారు. దానివలన టీకా తీసుకున్నవారిలో ఇమ్యూన్ రెస్పాన్స్ మెరుగై, టీకా మరింత ప్రతిభావంతంగా పనిచేసేందుకు దోహదపడుతుంది. మామూలుగా అందరూ అల్యూమినియం హైడ్రాక్సయిడ్ అనే ఎడ్జువెంట్‌ను కలుపుతారని, దాని వలన టిఎచ్1 బేస్డ్ రెస్పాన్స్ మాత్రమే వస్తుందని, అందుచేత శ్వాసకోశ సమస్యలు వచ్చే అవకాశం వుందని, తాము వాడే దానివలన టిఎచ్2 బేస్డ్ రెస్పాన్స్ వచ్చి అలాటి యిబ్బంది రాదని డా. కృష్ణ చెప్పారు.

ఇవన్నీ సాంకేతిక విషయాలు. ఏది మంచిదో, ఏది కాదో మనకు అర్థం కావు. కానీ ఒక సామాన్య పౌరుడిగా నాకు వచ్చిన అనుమానం ఏమిటంటే, యిప్పటిదాకా ఈ వాక్సిన్‌లో ఎడ్జువెంట్ కలపకుండానే మొదటి దశ దాటి, రెండవ దశ ప్రయోగాలు నిర్వహించేస్తున్నారా? ఇప్పుడు అదేదో కలిపితే మరి కొత్త వాక్సిన్ కాండిడేటు అవదా? ప్రయోగాలు మళ్లీ మొదటి నుంచి చేయాలా? .

చేయమని ప్రభుత్వం పట్టుబడుతుందా? లేకపోతే ఏదో ఒకటి కానీయ్ అంటుందా? రెడ్డొచ్చే మొదలాడు అన్నట్లు రెడ్డి లాబ్స్ వాళ్లను రష్యన్ వాక్సిన్ పరీక్షలు మళ్లీ చేయమన్నట్లు, వీళ్లనీ చేయమంటుందా? ఎందుకంటే ఏదైనా మందులోనే కాదు, ఆహారపదార్థంలో కూడా ఏది ఎంతెంత వేశారో డబ్బా మీద క్లియర్‌గా రాస్తారు. దాని కంపోజిషన్ మార్చేస్తే వ్యవహారం మళ్లీ మొదటికి వచ్చి, ఫ్రెష్‌గా అనుమతి తీసుకోవాలి.

బజార్లో అమ్మే ఊరగాయలు నిలవ వుండడానికి వినెగర్ వాడినట్లు వాక్సిన్‌లు అమ్ముడు పోయేదాకా నిలవ వుండడానికి థియోమెర్సాల్ అనే పదార్థాన్ని కలుపుతారు. దానివలన కొంతమంది చిన్నపిల్లల్లో ఎదుగుదల సమస్యలు వస్తాయని తేలింది. కానీ అది వాడకుండా మానలేరు. 

అందువలన అనేక విషయాలు పరిగణనలోకి తీసుకుని చివరకు ఓ మోతాదులో దాన్ని వాడవచ్చని అనుమతించారు. అలాగే యీ ఎడ్జువెంట్ ఏ మోతాదులో కలపాలన్న దానిపై కూడా క్లినికల్ ట్రయల్స్‌లో తేల్చాలని డిసిజిఐ అందంటే కోవాగ్జిన్ రావడం యింకా ఆలస్యం కావచ్చు.  అబ్బే ఫర్వాలేదు లాగించేయ్ అంటే మనకు డౌట్లు వచ్చేసి, వేయించుకోవడం మానేస్తే అప్పుడు మార్కెట్లో వచ్చీ ప్రయోజనం లేదు.

ఇలా ఎలా చూసినా ప్రభుత్వం చెప్పిన తేదీకి మనకు వాక్సిన్ వచ్చే సూచనలు కనబడటం లేదు. ఒకవేళ ఏదో ఒకటి వచ్చేస్తే, దాని నాణ్యతపై మనకు అనుమానం వదలదు. ఇలాటి పరిస్థితిలో వాక్సిన్ వేయించుకునే, వేయించుకోగలిగే వారెందరు వుంటారో తెలియకుండా పోయింది. 

‘‘దిల్లీ కా లడ్డూ జో ఖాయా వో భీ పఛ్‌తాయా, జో నహీ ఖాయా వో భీ పఛ్‌తాయా’’ అనే సామెత వుంది. దిల్లీ లడ్డూకి వున్న ప్రఖ్యాతి వలన అది తిననివాడు అయ్యో తినలేదే అని పశ్చాత్తాప పడతాడట. తిన్నవాడు ఓస్, యింతేనా, అనవసరంగా తిన్నానని పశ్చాత్తాప పడతాట్ట. కోవిడ్ వాక్సిన్ విషయంలో కూడా ఆ సామెత వర్తిస్తుందనిపిస్తోంది.

– ఎమ్బీయస్ ప్రసాద్ (అక్టోబరు 2020)
mbsprasad@gmail.com

Show comments