చంద్రబాబుకు ముందు నుయ్యి, వెనక గొయ్యి

చంద్రబాబుకు భలే చిక్కొచ్చిపడింది. ఏపీ టీడీపీ అధ్యక్ష పదవి ఆయనకు ఇప్పుడు ఎక్స్ ట్రా తలనొప్పులు తీసుకొచ్చింది. ఈ రేసులో అందరి కంటే ముందు వరుసలో  అచ్చెన్నాయుడు ఉన్నారనే విషయం అందరికీ తెలిసిందే. దాదాపు ఆయన పేరును ప్రకటించే వరకు వచ్చింది పరిస్థితి. అయితే ఆఖరి నిమిషంలో ప్రకటన ఆపేశారు. దీని వెనక చాలా మేథోమథనం, బాబులో అంతర్మథనం జరిగిందని టాక్.

అచ్చెన్నాయుడుకు ఏపీ టీడీపీ అధ్యక్ష పదవి ఇస్తే మొదటికే మోసం వస్తుందేమో అనే అనుమానంలో ఉన్నారట చంద్రబాబు. ప్రస్తుతం పార్టీలో అంతోఇంతో హుషారుగా ఉన్న వ్యక్తుల్లో అచ్చెన్నాయుడు కూడా ఒకరు. అలాంటి వ్యక్తికి పగ్గాలప్పగిస్తే పార్టీలో కూడా హుషారు వస్తుంది. కానీ ఇక్కడ బాబు ఆలోచనలు మరోలా సాగుతున్నాయి. 

రాజకీయాల్లో ఆరితేరిన అచ్చెన్నాయుడుకు ఏపీ టీడీపీ అధ్యక్ష పదవి ఇస్తే ఎక్కడ తనకు వెన్నుపోటు పొడుస్తాడో అనే భయం చంద్రబాబులో పట్టుకుంది. ఒక్కసారి అచ్చెన్న అధ్యక్షుడయ్యాడంటే ఏపీలో చక్రం తిప్పడం ఖాయం. ఇంతకుముందున్న అధ్యక్షుడు కళా వెంకట్రావులా రబ్బరు స్టాంప్ అనిపించుకోరు. తన మార్క్ చూపిస్తారు. ఈ క్రమంలో టీడీపీలో చంద్రబాబు తర్వాత అచ్చెన్నాయుడు మాత్రమే కనిపిస్తే, అది లోకేష్ కు పెద్ద దెబ్బ.

ఇప్పటికే తండ్రిచాటు బిడ్డగా మారిన "అపరమేధావి" లోకేష్... అచ్చెన్నాయుడు జూలు విదిల్చితే తట్టుకోలేరు. పార్టీలో ఉన్న ప్రాధాన్యాన్ని కూడా కోల్పోతారు. అందుకే ఆఖరి నిమిషంలో అచ్చెన్నాయుడు పేరు ప్రకటన ఆగిందని అంటున్నారు.

ముఖ్యమంత్రి హోదాలో చంద్రబాబు ఉండి, టీడీపీ నేతలంతా కలిసినా కూడా మొన్నటి ఎన్నికల్లో లోకేష్ ను గెలిపించుకోలేకపోయారు. చినబాబు టాలెంట్ అలాంటిది మరి. మంగళగిరి అని కూడా పలకలేక చతికిలపడ్డారు మన మేధావి. అలా చంద్రబాబు కొడుకై ఉండి కూడా ఓడిపోవడంతో బయట, పార్టీలో చులకనయ్యారు. అచ్చెన్నాయుడు కనుక సీన్ లోకి వస్తే, ఇప్పుడున్న వాల్యూ కూడా లోకేష్ కు ఉండదు.

అలా అని అధ్యక్షుడిగా మరో రబ్బర్ స్టాంప్ ను తెచ్చిపెట్టలేరు చంద్రబాబు. అలా చేస్తే పార్టీని తన చేతులతో తానే భూస్థాపితం చేసినవాడవుతాడు. ఇలా చంద్రబాబు ఓ రేంజ్ లో నలిగిపోతున్నారు. అసలు ఇలాంటి టైమ్ లో ఈ తేనెతుట్టెను చంద్రబాబు కదిలించకుండా ఉండాల్సిందని చాలామంది అభిప్రాయపడుతున్నారు. 

వైఎస్‌ఆర్‌ జలకళ 

Show comments