రాబోయే రోజుల్లో సింగిల్ స్క్రీన్స్ చూడలేమా?

థియేటర్లు తెరుచుకునేందుకు లైన్ క్లియర్ అవుతోంది. పశ్చిమ బెంగాల్ లో ఆల్రెడీ పర్మిషన్ వచ్చేసింది. 1వ తేదీ నుంచి అక్కడ థియేటర్లు తెరుచుకుంటాయి. ఇక దేశవ్యాప్తంగా కూడా అన్ లాక్ 5.Oలో భాగంగా అక్టోబర్ లో థియేటర్లు తెరుచుకునే అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయి. అయితే ఇక్కడ క్వశ్చన్ ఇది కాదు.. రాబోయే రోజుల్లో ఎన్ని థియేటర్లు మనుగడలో ఉంటాయనేది ప్రధానమైన ప్రశ్న

అవును.. ఇప్పటికే సింగిల్ స్క్రీన్స్ కౌంట్ తగ్గిపోయింది. హౌజ్ ఫుల్ లేక, టిక్కెట్లు తెగక, కరెంట్ బిల్లులు, మెయింటెనెన్స్ లు ఎక్కువై చాలా సింగిల్ స్క్రీన్స్ మాయమయ్యాయి. తెలుగు రాష్ట్రాల్లోని చాలా చోట్ల సింగిల్ స్క్రీన్ థియేటర్లు గొడౌన్లుగా మారిపోతాయి. మరికొన్నింటిని కూల్చేసి, అపార్ట్ మెంట్లు, షాపులు కట్టేశారు.

ఇలాంటి క్లిష్ట పరిస్థితుల్లో పుండు మీద కారంలా కరోనా వచ్చింది. ఆ వెంటనే లాక్ డౌన్ పడింది. దీంతో సింగిల్ స్క్రీన్ థియేటర్లకు మరింత కష్టం వచ్చి పడింది. ఇప్పటికే థియేటర్ సంబంధిత సిబ్బంది మొత్తం ఖాళీ అయిపోయారు. చాలామంది ప్రత్యామ్నాయం కూడా చూసుకున్నారు. ఈ నేపథ్యంలో థియేటర్లు తెరిచినా సింగిల్ స్క్రీన్స్ తేరుకునే పరిస్థితి కనిపించడం లేదు.

థియేటర్లు తెరుచుకునేందుకు అనుమతినిచ్చినా నిబంధనలు కఠినంగా ఉండబోతున్నాయి. కెపాసిటీని దాదాపు సగానికి కుదించే అవకాశాలున్నాయని స్వయంగా కేంద్ర పెద్దలే ఇండికేషన్స్ ఇస్తున్నారు. దీనికితోడు శానిటైజర్ల ఏర్పాటు చేయాలి, తినుబండారాల అమ్మకం క్లోజ్ చేయాలి లాంటి అదనపు నిబంధనలు ఉండనే ఉన్నాయి. ఇవి సింగిల్ స్క్రీన్స్ కు పెద్ద దెబ్బగా మారబోతున్నాయి.

ప్రస్తుతం అన్ లాక్ లో భాగంగా దేశవ్యాప్తంగా జనాలు కాస్త ధైర్యంగానే తిరుగుతున్నారు. అయితే అంత థైర్యం థియేటర్లకు రావడానికి ఉంటుందా అనేది అందరి ప్రశ్న. ఎందుకంటే సినిమా అనేది సామాన్యుడికి అవసరం కాదు, వినోదం మాత్రమే. "ఇప్పుడు మనకీ సినిమా అవసరమా" అని తననుతాను ప్రశ్నించుకుంటే ఎవ్వడూ థియేటర్లకు పోడు. ఆల్రెడీ తెరిచిన జిమ్స్, రెస్టారెంట్ల పరిస్థితి కళ్లముందు కనిపిస్తూనే ఉంది. హార్డ్ కోర్ అభిమానులు థియేటర్లకు కచ్చితంగా వెళ్తారు. కానీ వాళ్లతో పెద్దగా ఉపయోగం ఉండదు. సామాన్యుడు కూడా కదిలొచ్చి టిక్కెట్ కొన్నప్పుడే థియేటర్ల మనుగడ సాధ్యం. 

లాక్ డౌన్ తర్వాత కూడా థియేటర్లు మనుగడ సాగించాలంటే టిక్కెట్ రేట్లు పెంచాలని, థియేటర్లలో స్నాక్స్ ధరలు పెంచాలని డిమాండ్ చేసే వాళ్లు కూడా ఉన్నారు. అయితే ఇది మరింత ప్రమాదకరం. పెరిగిన టిక్కెట్ ధరలతో ఇప్పటికే కుటుంబ ప్రేక్షకులు థియేటర్లకు రావడం తగ్గించేశారు. ఈ కరోనా టైమ్ లో, సగటు మనిషి వ్యక్తిగత ఆదాయం కూడా తగ్గిన నేపథ్యంలో.. టిక్కెట్ రేట్లు పెంచితే.. మొత్తం థియేటర్ల వ్యవస్థ పైనే అది పెనుప్రభావం చూపించే అవకాశం ఉంది.

సో.. ఎలా చూసుకున్నా ఈసారి సింగిల్ స్క్రీన్ థియేటర్లకు మనుగడ కష్టమే. రాబోయే రోజుల్లో తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా, దేశవ్యాప్తంగా మరిన్ని సింగిల్ స్క్రీన్ థియేటర్లు మూతపడేలా ఉన్నాయని అంటున్నారు. విశ్లేషకులు చెబుతున్న లాజిక్ ప్రకారం.. ఇప్పటికిప్పుడు థియేటర్లు తెరిచినప్పటికీ.. నిబంధనల్ని ఎత్తేయడానికి, పూర్తిస్థాయిలో ప్రేక్షకులు థియేటర్లకు రావడానికి కనీసం మరో 2-3 నెలల టైమ్ పడుతుంది. ఈలోగా చాలా సింగిల్ స్క్రీన్స్ కనుమరుగయ్యే ప్రమాదం ఉంది. 

వైఎస్‌ఆర్‌ జలకళ

'జ్యోతి' ఆర్కే అయోమయపు రాతలు

Show comments