టీడీపీ దైన్యాన్ని, చంద్ర‌బాబు చేత‌గాని త‌నాన్ని చాటిన నియామ‌కాలు!

50 శాతం ప‌ద‌వులు బీసీ, ఎస్సీ,ఎస్టీల‌కు కేటాయించడం అనే విధానాన్ని జ‌గ‌న్ అవ‌లంభించారు. క‌ట్ చేస్తే చంద్ర‌బాబు దాన్ని కాపీ కొట్టారు. అయితే  ఈ యాభై శాతం కోటాలోనే కాపుల‌ను కూడా క‌లిపేశారు! మిగ‌తావి క‌మ్మ వాళ్ల‌కు కాబోలు!

పార్ల‌మెంట‌రీ నియోజ‌క‌వ‌ర్గాల వారీగా ఇన్ చార్జిల‌ను, స‌మ‌న్వ‌య‌క‌ర్త‌ల‌ను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గ‌త ప‌ర్యాయంలోనే ఏర్పాటు చేసుకుంది. జిల్లాల వారీగా కాకుండా.. పార్ల‌మెంట‌రీ నియోజ‌క‌వ‌ర్గాల వారీగా నేత‌ల‌కు ఇన్ చార్జి బాధ్య‌త‌లు, స‌మ‌న్వ‌య బాధ్య‌త‌ల‌ను అప్ప‌గించారు జ‌గ‌న్. ఆ ఫార్ములాను చంద్ర‌బాబు నాయుడు కాపీ కొట్టారు!

చంద్ర‌బాబుకు కొత్త‌గా ఆలోచించ‌డం రాదు, ఆయ‌న‌కు, ఆయ‌న కోట‌రికీ ఎవ‌రో చేసిన వాటిని త‌మ‌విగా చెప్పుకోవ‌డం, కాపీ కొట్ట‌డం త‌ప్ప‌.. మ‌రో నైపుణ్యం లేదు అనే విష‌యం ఇది వ‌ర‌కూ అనేక ర‌కాలుగా నిరూపితం అయ్యింది. ఇప్పుడు మ‌రోసారి అదే జ‌రిగింది.

వైఎస్ ప‌థ‌కాల‌కు పేర్లు మార్చుకున్నారు, ఐదేళ్ల‌లో చంద్ర‌బాబు నాయుడి ఏకైక స్కీమ్ పండ‌గల‌కు ఇచ్చిన ప‌ప్పుబెల్లాలే. అమ‌రావ‌తి అనే మ‌రో అట్ట‌ర్ ఫ్లాప్ సినిమా చంద్ర‌బాబు ఘ‌న‌త‌.

అవ‌త‌ల వాళ్ల‌ను అనుక‌రించ‌డం, కాపీ కొట్ట‌డం అనే దివాళాకోరుత‌నాన్ని చాటుకున్న చంద్ర‌బాబు నాయుడు ఎంపిక చేసిన నేత‌లు కూడా ఆషామాషీగా లేరు! ఒక్క మాట‌లో చెప్పాలంటే గ‌త ఎన్నిక‌ల్లో ఎమ్మెల్యేలుగా సొంత నియోజ‌క‌వ‌ర్గాల్లో చిత్తైన వాళ్లంతా రేప‌టి నుంచి పార్ల‌మెంటరీ నియోజ‌క‌వ‌ర్గాల ఇన్ చార్జిలుగా త‌మ స‌త్తా చూపనున్నారు!

అనంత‌పురం ఇన్ చార్జి కాలువ శ్రీనివాసులు.. ఈయ‌న మొన్న‌టి ఎన్నిక‌ల్లో సిట్టింగ్ ఎమ్మెల్యేగా పోటీ చేసి చిత్త‌య్యారు. ఈయ‌న చ‌రిత్ర‌లో గెలిచిందే జాక్ పాట్ గా మాత్ర‌మే. ఈయ‌న పిలిస్తే టీడీపీలోని క‌మ్మ వాళ్లే ప‌ట్టించుకోరు!

పెనుకొండ లో పోటీ చేసి ఓడిన పార్థ‌సార‌ధిని హిందూపురం పార్ల‌మెంట‌రీ ఇన్ చార్జిగా చేశారు! తెలుగుదేశంలో బీసీలంటే.. ఎంత‌సేపూ పార్థ‌సార‌ధి, కాలువ శ్రీనివాసులు మాత్ర‌మేనా? 1999 నుంచి వీళ్లే జిల్లాలో బీసీలు అన్న‌ట్టుగా కొన‌సాగుతోంది ప‌రిస్థితి!

క‌డ‌ప జిల్లాలోనూ కొత్త సీసాలో పాత సారానే, మ‌ల్లెల లింగారెడ్డి, ఆర్.శ్రీనివాస్ రెడ్డి. వీళ్ల తోక‌లు ప‌ట్టుకుని చంద్ర‌బాబు నాయుడు ఇంకెన్నేళ్లు క‌డ‌ప‌లో ఈదుతారో!

జ‌గ‌న్ ద‌గ్గ‌ర ఇప్పుడు ద‌ర్జాగా ఉండాల్సిన గౌరు వెంక‌ట‌రెడ్డి నంద్యాల పార్ల‌మెంట‌రీ టీడీపీ ఇన్ చార్జిగా నియమితం అయ్యి, అయ్యోపాపం అనిపించుకుంటున్నారు!

నారా వారి ప‌ల్లెలో త‌ప్ప మ‌రెక్క‌డా మెజారిటీ ర‌ప్పించ‌లేని పుల‌వర్తి నానిని చిత్తూరు ఇన్ చార్జిగా చేశారంటున్నారు ప‌రిశీల‌కులు.

నెల్లూరు కార్పొరేట‌ర్ అజీజ్ ఏకంగా ఆ పార్ల‌మెంట‌రీ సీటు ఇన్ చార్జి అయిపోయారు!

గుంటూరు శ్ర‌వ‌ణ్ కుమార్, న‌ర‌సాపురం తోట సీతారామ‌ల‌క్ష్మి, రాజ‌మండ్రి జ‌వ‌హ‌ర్, ప్ర‌జ‌ల మ‌ధ్య‌న క‌న్నా ప‌రారీలోనే ఎక్కువ‌గా ఉంటున్న కూన ర‌వికుమార్ శ్రీకాకుళం ఇన్ చార్జ్.. ఇవీ తెలుగుదేశం పార్టీ తాజా నియామ‌కాల్లోని మెరుపులు!

ఇంత‌కీ వీళ్ల‌ను ఎందుకు ఎంపిక చేశారు? ఈ నియామ‌కాల్లో ఏదైనా ద‌శా,దిశ కనిపిస్తోందా?  తెలుగుదేశం పార్టీకి ఇంత‌కు మించిన దిక్కు లేదా? అని ఆ పార్టీ అభిమానులే నివ్వెర‌పోయేలా ఉంది ఈ జాబితా! అయినా ఎమ్మెల్యేగా గెల‌వ‌లేక‌పోయిన నారా లోకేషే ఆ పార్టీకి పెద్ద దిక్కుగా కొన‌సాగుతున్న‌ప్పుడు, వీళ్ల‌ను అని ఏం ప్ర‌యోజ‌నం.. అనే అభిప్రాయాలూ వినిపిస్తున్నాయి. ఏతావాతా.. తెలుగుదేశం పార్టీ దైన్యాన్ని ఈ నియామ‌కాల‌తో ఆ పార్టీ జాతీయాధ్య‌క్షుడే చాటారు! 

Show comments