బాలూ మీకిది న్యాయ‌మా ... మాట త‌ప్పారే!

గాన గంధ‌ర్వా బాల‌సుబ్ర‌మ‌ణ్య‌మా ....మీకిది న్యాయ‌మా? మీరు చెప్పిందేంటి? చేసిందేంటి? ఇలా ఇచ్చిన మాట నిల‌బెట్టుకోక పోవ‌డం ఎప్పుడు నేర్చుకున్నారు? ఎలా నేర్చుకున్నార‌య్యా?  మాట త‌ప్పేంత గొప్ప ప‌నులు మీకేమున్నాయ్ సార్‌?  భువి నుంచి దివికేగ‌డానికి ఎందుకంత హ‌డావుడి? ఆగ‌స్టులో క‌రోనా బారిన ప‌డిన సంద‌ర్భంలో మీరిచ్చిన మాట మ‌రిచిపోయారా?  రెండు మూడు రోజుల్లో ఆస్ప‌త్రి నుంచి తిరిగి వ‌స్తాన‌ని చెప్పి ... తిరిగి రాని లోకాల‌కు వెళ్లి పోయారేంటి సార్‌? ఆ మాట‌లే చివ‌రి చ‌ర‌ణాలు అవుతాయ‌ని ఏ ఒక్క‌రూ ఊహించ‌లేదే!

సంగీత ప్ర‌పంచం ముద్దుగా బాలు అని పిలుచుకునే ఆయ‌న పూర్తి పేరు శ్రీ‌ప‌తి పండితారాధ్యుల బాల‌సుబ్ర‌మ‌ణ్యం. తెలుగు స‌మాజం గ‌ర్వించ‌ద‌గ్గ గొప్ప గాయ‌కుడు. 40 వేల‌కు పైగా పాట‌లు పాడిన అసామాన్యుడు.  అసాధ్యాన్ని సుసాధ్యం చేసిన గొప్ప గాయ‌కుడు బాలు.

గ‌త నెల మొద‌టి వారంలో ఆయ‌న క‌రోనా బారిన ప‌డ్డారు. ఈ సంద‌ర్భంగా ఆయ‌న సోష‌ల్ మీడియాలో ఓ వీడియో విడుద‌ల చేశారు. రెండు మూడు రోజులుగా ఒంట్లో న‌ల‌త‌గా ఉంద‌ని, జ‌లుబు, జ్వ‌రం వ‌ల్ల ఇబ్బందిగా ఉండ‌డంతో ఆస్ప‌త్రికి వెళ్లిన‌ట్టు తెలిపారు. వైద్య ప‌రీక్ష‌ల్లో క‌రోనా పాజిటివ్ అని నిర్ధార‌ణ అయిన‌ట్టు త‌నే స్వ‌యంగా ప్ర‌క‌టించారు.

అయితే స్వ‌ల్ప క‌రోనా ల‌క్ష‌ణాలు ఉండ‌డంతో హోమ్‌ ఐసోలేష‌న్‌లో ఉంటూ మందులు వాడుతూ జాగ్ర‌త్త‌గా ఉండాల‌ని వైద్యులు స‌ల‌హా ఇచ్చార‌న్నారు. అయితే కుటుంబ స‌భ్యుల ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకుని ఆస్ప‌త్రిలో చేరిన‌ట్టు బాలు తెలిపిన విష‌యం తెలిసిందే.

జ్వ‌రం త‌గ్గింద‌ని, మ‌రో రెండు రోజుల్లో ఆస్ప‌త్రి నుంచి డిశ్చార్జి అవుతాన‌ని, ఎవ‌రూ ఆందోళ‌న చెందాల్సిన అవ‌స‌రం లేద‌ని ఆయ‌న ధైర్యం చెప్పారు. అయితే చెన్నైలోని ఎంజీఎం ఆస్ప‌త్రిలో 50 రోజుల పాటు అత్యాధునిక వైద్యం అందించినా ... చివ‌రికి మృత్యువే జ‌యించింది. ఈ వేళ మ‌ధ్యాహ్నం ఆయ‌న సంగీత ప్ర‌పంచాన్ని శోక‌సంధ్రంలో ముంచి ... వీడ్కోలు రాగం ఆల‌పించారు. రెండు మూడు రోజుల్లో తిరిగి వ‌స్తాన‌ని, ఎవ‌రూ ఆందోళ‌న చెందొద్ద‌ని చెప్పిన బాలు ... తానిచ్చిన మాట నిల‌బెట్టుకోకుండానే తిరిగి రాని లోకాల‌కు వెళ్లిపోయారు.

Show comments