అంతర్యామి..అలసితి..సొలసితి

శ్రీపతి పండితారాధ్యుల బాల సుబ్రహ్మణ్యం. ఎన్ని పాటలు..ఎన్ని విజయాలు.. ఎన్ని మంచి పాటలు..ఎన్ని చక్కని మాటలు..అంతేనా ఒకటి రెండయినా మంచి సినిమాలు....చేసినవి కొన్నయినా మంచి పాత్రలు...ఇక స్టేజ్ షో లు..కాంపిటీషన్ షోలు..స్వరమాధుర్యాలు..ఎడతెరగని స్వరరాగ గంగా ప్రవాహం మాదిరిగా ఎంతటి ప్రొఫైల్.

ఎస్పీబీ పాటల గురించి రాయాలంటే ఎక్కడ మొదలు పెట్టాలి..ఎక్కడ ముగించాలి. ఏపాటను ప్రస్తావించాలి. ఏ పాటను వదిలేయాలి.ఇదంతా సులువైన సంగతా? రెగ్యులర్ కమర్షియల్ డ్యూయట్లను అలా తీసి ఇలా పక్కన పెడితే మిగిలిన ప్రతి పాట మన గండెలను పట్టుకుని నిలదీయదా? తనను మరిచిపోతావా? అని అడిగేయదా?

'ఇది తొలిపాట..ఒక చెలి పాట' అంటూ ఆలపించినా...'పల్లవించవా నా గొంతులో..పల్లవి కావా' నా పాటలో..అని అడిగినా..'ఏ దివిలో విరిసిన పారిజాతమో' అంటూ ప్రశంసించినా...'అది ఆయనకే చెల్లింది.

'శంకరా నాద శరీరా పరా..వేద విహారా హరా..జీవేశ్వరా' అంటూ పిలిచినా...'నాద వినోదం..నాట్యవిలాసం..' అంటూ వివరించినా...అంత్యర్యామి..అలసితి..సొలసితి..' భగవంతుడి చరణ శరణు చొచ్చినా..అది కూడా ఎస్పీబీకే చెల్లింది.

ఎన్ని వేనేవల పాటలు. ఈ మధ్యన కూడా యువ గాయకులతో పోటీ పడుతూ శతమానం భవతి, డిస్కోరాజా లాంటి సినిమాల్లో మధురమైన పాటలు అద్భుతంగా పాడిన ఎస్పీబీ మరణంతో పోరాడుతూ అలిసిపోయారు.

పాటలు పాడడం అలా వుంచితే ఓ గాయకుడిగా ఎందరో మ్యూజిక్ డైరక్టర్లు పెంపుడు కొడుకు అన్నంతగా కలిసిపోయారు. మహదేవన్, విశ్వనాథన్, రమేష్ నాయుడు, చక్రవర్తి, నుంచి ఇళయరాజా,  కీరవాణి, థమన్, రెహమాన్, వరకు ఎస్పీబీ అంటే వారి ఇంటి మనిషి.

సంగీత దర్శకుడిగా దాసరి కోరిక మేరకు కన్యాకుమారి, బాపు కోసం 'తూర్పు వెళ్లే రైలు' లాంటి మంచి సినిమాలకు పని చేసారు. ఇవన్నీ ఒక ఎత్తు, రామోజీ ఆలోచనతో ఈటీవీ కోసం పాడుతా తీయగా కార్యక్రమం మరో ఎత్తు. ఈ ఒక్క కార్యక్రమంతో ఎస్పీబీ తెలుగు నాట ప్రతి ఇంటి మనిషి అయిపోయారు. తెలుగునాట ప్రతి ఇంటి బామ్మ, అమ్మమ్మ, అమ్మ, నాన్న, అన్న అందరూ బాలుతో ఓ తెలియని అనుబంధం పెనవేసుకున్నారు. ఆ కార్యక్రమంలో ఆయన చేసిన ప్రయోగాలెన్నో, బయటకు తీసిన ఆణిముత్యాలెన్నో.

ఇది చాలక అనితరసాధ్యమైన స్వరాభిషేకం మరొక ఎత్తు. రామోజీ-బాలు కాకపోయి వుంటే ఆ కార్యక్రమం సాధ్యమయ్యేది కాదు. అంతమంది మహా మహులు ఒక స్టేజ్ మీదకు రావడం అంటే అది అందరికీ సాధ్యమయ్యేది కాదు కదా.

ఒక్కమాటలో చెప్పాలంటే బాలు గురించి రాసుకుంటూ వెళ్తుంటే అక్షరాలు అనంతగా ప్రవహిస్తూ వుండాల్సిందే. పాటల వెంట వశీకరణమై వెళ్తూ వుండాల్సిందే.. అంతకన్నా గత నలభై రోజులుగా మృత్యువుతో పోరాడుతున్న 'మన బాలు' విజేయుడై వెనక్కు వస్తారనే అనుకున్నారు అభిమానులంతా. కానీ ఆ ఆశలు అడియాసలైపోయాయి.  అనంతలోకాలకు బాలు పయనమైవెళ్లిపోయారు. తుంబర నారదగానామృతం అంటూ వారి సరసన పీట వేసుకుని, తన గానసౌరభాలు ఊర్ధ్వ లోకాల్లో వెదజల్లడంలో మమేకమైపోయారు మన బాలు.

Show comments