సినిమా, టీవీ జనాలూ..పారాహుషార్

టాలీవుడ్ పుట్టిన నాటి నుంచి ఇప్పటి వరకు అడపాదడపా అక్రమ సంబంధాలు, ఇలాంటి ఇతరత్రా వ్యవహారాలు బయటపడుతూనే వున్నాయి. టాలీవుడ వ్యవహారాలపై పాకుడురాళ్లు, సినీ జనారణ్యం లాంటి నవలలు చాలా దశాబ్దాల కిందటే వచ్చాయి. రెండువేల దశకం లోకి ఎంటర్ అయ్యాక ఇలాంటి వ్యవహారాలు ఎవ్వరూ పట్టించకుండా అయిపోయాయి. అడపాదడపా వెబ్ సైట్లలో గ్యాసిప్ ల కింద తప్ప, మరింక పెద్దగా సంచలనం కలిగించలేదు. ఇటీవల కాలంలో మీటూ ఉద్యమం, శ్రీరెడ్డి హడావుడి ఇలాంటివి కొంత సంచలనం కలిగించి, టాలీవుడ్ లో కొన్ని సంస్కరణలకు కొంత వరకు దారి తీసాయి. 

కానీ మొత్తం మీద టాలీవుడ్ లో అమ్మాయిలను ఎక్స్ ప్లాయిట్ చేయడం, వారి అవసరాలు, బలహీనతలతో ఆడుకోవడం, వారిని వాడుకోవడం జరుగుతూనే వుంది. ఇక్కడ టీవీ సీరియళ్లను టాలీవుడ్ ను వేరు వేరుగా చూడలేము. ఎందుకంటే టీవీ సీరియళ్లు నిర్మిస్తున్నది పలువురు టాలీవుడ్ నిర్మాతలే. నిర్మాణాలు జరుగుతున్నది టాలీవుడ్ స్టూడియోల్లోనే. అయితే సినిమా జనాలకు సీరియళ్ల జనాలకు చాలా తేడా వుంది.

సీరియళ్లలో నటించే చిన్న చితక నటులకు ఆదాయం అంతంత మాత్రంగానే వుంటుంది. అలాగే ఎక్కువ మంది చిన్న చిన్న దిగువ మధ్యతరగతి ఫ్యామిలీల నుంచి వచ్చిన వారు కూడా వుంటారు. వీరు కెరీర్ ప్రారంభంలో ఎవరిని నమ్మాలో, ఎవర్ని నమ్మకూడదో తెలియని పరిస్థితిని ఎదుర్కొంటారు. ఈ టీవీ, సినీ ప్రపంచం అంతా కొత్తగా వుంటుంది. ఏదో సాధించాలని వుంటుంది. ఆ అయోమయ క్షణాల్లో, అవసర క్షణాల్లో ఎవరో ఒకరి ఆసరాకు దగ్గరయిపోతారు. సినిమా జనాలకు ఇబ్బందులు వుంటాయి. కానీ ఆర్థికంగా బలంగా వుండడం, వర్క్ పరంగా బిజీగా వుండడంతో రాటు తేలుతారు. కానీ సీరియల్ జనాలు అలా కాదు. ఏమాత్రం తేడా వచ్చినా బరస్ట్ అయిపోతారు. అది ఆత్మహత్యల్లాంటి విషాద సంఘనటలకు దారితీస్తుంది.

అందువల్ల ఇండస్ట్రీలో జనాలు ఇలాంటి అమ్మాయిల సంబంధాల విషయంలో చాలా అంటే చాలా జాగ్రత్తగా వుండాల్సిన తరుణం వచ్చేసింది. ఇది డిజిటల్ యుగం. ఏదీ దాచేదీ కాదు, ఏదీ దాగేదీ కాదు. మాటలు, ఫోటోలు, సందేశాలు, ఏదీ దాగేది కాదు. చిన్న మెత్తు తేడా వస్తే బతుకు బస్టాండ్ అయిపోతుంది. ఆర్ఎక్స్ 100 నిర్మాత అశోక్ రెడ్డి ఇప్పటి వరకు తన పని తాను చేసుకుంటూ పోయే వ్యక్తిగానే సినిమా జనాలకు తెలుసు. ఆయన మాట తీరుకూడా అలాగే వుండేది.

కానీ ఇప్పుడేమయింది ఒక్క చిన్న సంబంధం ఆయనను పూర్తిగా చిక్కుల్లో పడేసింది. ఆయన పరువు బజార్నపడేసింది. దీని నుంచి ఎలా బయటపడతారు, అసలు ఏం జరిగి వుంటుంది అన్నవి ఇక్కడ ఇప్పుడు డిస్కస్ చేసేవి కాదు. కానీ అసలు ఓ చిన్న నటి జీవితంతో ఆయన సన్నిహిత సంబంధాలు నెరపడం అన్నదే ఇప్పుడు ఇన్ని చిక్కులకు దారి తీసిందన్నది వాస్తవం. 

శ్రీరెడ్డి విషయంలోనే చాలా మంది ఇరుకున పడే స్థితి వరకు వెళ్లి ఒడ్డుకు చేరారు. ఇప్పుడు ఈ సంఘటన. ఇవన్నీ గమనించిన తరువాత, పరిస్థితులు, సినిమా, టీవీ నటుల్లో పెరుగుతున్న భావోద్వేగాలు, సున్నితత్వం,  మారుతున్న సాంకేతికత ను దృష్టిలో పెట్టుకుని ఇకనైనా సినిమా జనాలు ఈ మహిళా సంబంధాలకు ఎంత దూరంగా వుంటే అంత మంచింది.  లేదూ అంటే ఆకాశం అంత ఎత్తున బతికే బతుకులు ఒక్కసారిగా నేలకూలిపోతాయి. తస్మాత్ జాగ్రత్త.

చంద్రబాబుకి నిద్ర లేకుండా చేస్తున్న అమరావతి

Show comments