కరోనా కష్టకాలం.. అయినా ఆగని 'చేయూత'

సంక్షేమమే లక్ష్యంగా దూసుకుపోతున్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్, మరో ప్రతిష్టాత్మక పథకానికి శ్రీకారం చుట్టారు. ఈరోజు నుంచి "వైఎస్ఆర్ చేయూత" పథకం అమల్లోకి వచ్చింది. సీఎం క్యాంప్ కార్యాలయం నుంచి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఈ పథకాన్ని ప్రారంభించిన ముఖ్యమంత్రి, తొలివిడతగా అర్హులైన మహిళల ఖాతాల్లోకి 18,750 రూపాయలు జమచేశారు. ఇలా నాలుగేళ్ల పాటు ప్రతి మహిళకు 75వేల రూపాయల ఆర్థిక సాయాన్ని అందించబోతున్నారు.

మహిళల సాధికారిత-స్వావలంబనే లక్ష్యంగా ప్రవేశపెట్టిన పథకం వైఎస్ఆర్ చేయూత. 45-60 ఏళ్ల మధ్య ఉండే ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ మహిళలందరికీ ఈ పథకం వర్తిస్తుంది. ఈ ఆర్థిక సాయంతో వాళ్లు కిరాణా షాపు, పాడి పరిశ్రమ, చిన్న చిన్న ఆహార పదార్థాల తయారీ లాంటి స్వయంఉపాధి కార్యక్రమాలు స్థాపించుకోవచ్చు. అలా తమ కుటుంబాల్ని నిలబెట్టుకోవచ్చు.

ఈ మేరకు వ్యాపార దిగ్గజాలైన అమూల్, ఐటీసీ, హిందూస్థాన్ యూనీలీవర్, ప్రొక్టర్ అండ్ గ్యాంబల్ కంపెనీలతో ఒప్పందాలు కుదుర్చుకుంది ప్రభుత్వం. స్వయంసహాయక బృందాలు తయారుచేసిన ఉత్పత్తుల్ని కొనుగోలు చేయడం, మార్కెటింగ్ చేయడం, వాళ్లకు తగిన శిక్షణ ఇవ్వడం లాంటి కార్యక్రమాల్లో ఈ కార్పొరేట్ సంస్థలు సహాయపడతాయి.

ప్రతి ఏడాది ఆగస్ట్ 12న ఈ పథకానికి సంబంధించిన అర్హత ప్రమాణాల్ని సమీక్షిస్తారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ మహిళలు ఎవరైనా 45 ఏళ్లకు చేరువైతే.. వాళ్లు చిన్న దరఖాస్తుతో ఈ స్కీమ్ లోకి ఈజీగా చేరవచ్చు. అలా రాష్ట్రవ్యాప్తంగా 25 లక్షల మంది మహిళలకు లబ్ది చేకూర్చేలా ఈ పథకాన్ని రూపొందించారు.

ఎన్నికల ప్రచారంలో భాగంగా ఇచ్చిన హామీలన్నింటినీ ఒక్కొక్కటిగా నెరవేరుస్తూ వస్తున్నారు ముఖ్యమంత్రి వైఎస్ జగన్. ఓవైపు కరోనా వల్ల ఏర్పడిన ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కొంటూనే, మరోవైపు ఇచ్చిన మాటను నిలబెట్టుకుంటూ సంక్షేమ పథకాల్ని అమలుచేస్తున్నారు. ప్రజల మనిషి అనిపించుకుంటున్నారు. 

Show comments