చిరంజీవికి మెగాస్టార్ అనే బిరుదు ఎలా వచ్చింది?

ఓ సాధారణ నటుడు.. ఆ తర్వాత సుప్రీమ్ హీరో అయ్యాడు.. అక్కడ్నుంచి మెగాస్టార్ గా మారడానికి ఎక్కువ టైమ్ పట్టలేదు. ఇలా కెరీర్ లో డౌన్ ఫాల్ అనేదే లేకుండా దూసుకుపోయారు చిరంజీవి. అయితే ఈ క్రమంలో ఆయనకు మెగాస్టార్ అనే టైటిల్ ఎలా వచ్చిందనేది ఆసక్తికరం. ఇప్పుడా బిరుదు వెనక కథను బయటపెట్టారు నిర్మాత కేఎస్ రామారావు. చిరంజీవికి మెగాస్టార్ అనే బిరుదు ఇచ్చింది తానేనని ప్రకటించారు.

"మరణమృదంగం టైమ్ కు చిరంజీవి చేస్తున్న సినిమాల స్థాయి, వస్తున్న వసూళ్లు అద్భుతం. నాకు బాగా ఇష్టమైన హీరో. నా సొంత ఫ్యామిలీలా ఫీల్ అవుతాను. ఆయనకు అప్పటికే రకరకాల బిరుదులున్నాయి. సుప్రీమ్ హీరో అనే పేరు ఉంది. కానీ నా హీరోకు ఓ కొత్త తరహా పేరు ఉండాలని అనుకున్నాను. బాగా ఆలోచించాను. ఆ ఆలోచన నుంచి పెట్టిన పేరు మెగాస్టార్. చిరంజీవితో నేను తీసిన మరణ మృదంగం సినిమాతో మెగాస్టార్ అనే టైటిల్ పెట్టాను. అక్కడ్నుంచి అదే ఫిక్స్ అయిపోయింది."

ఇలా చిరంజీవికి మెగాస్టార్ అనే బిరుదు ఎలా వచ్చిందనే విషయాన్ని బయటపెట్టారు కేఎస్ రామారావు. చిరంజీవితో అభిలాష, మరణమృదంగం, స్టూవర్ట్ పురం పోలీస్ స్టేషన్, ఛాలెంజ్, రాక్షసుడు లాంటి సినిమాలు చేసిన ఈ నిర్మాత.. ఆ తర్వాత కాలంలో మళ్లీ చిరంజీవితో సినిమా చేయలేకపోయారు.

"బాబాయ్ హోటల్, చంటి, మాతృదేవోభవ.. ఇలా డిఫరెంట్ సినిమాలు చేయొచ్చనే నమ్మకం కుదిరిన తర్వాత ఇక ఆ రూట్లో వెళ్లాను. అదే టైమ్ లో చిరంజీవి వరుస సినిమాలతో మరింత ఎత్తుకు ఎదిగిపోయారు. దీంతో చిరంజీవితో భారీ బడ్జెట్ తో, పెద్ద సబ్జెక్ట్ తో సినిమా చేసే సందర్భం రాలేదు. నిజం చెప్పాలంటే నా వైపు నుంచే లోపం ఉంది. నేను అలాంటి సబ్జెక్ట్ పట్టుకోలేకపోయాను. నేను మంచి సబ్జెక్ట్ తీసుకెళ్తే చిరంజీవి తప్పకుండా చేసేవారు."

క్రియేటివ్ కమర్షియల్స్ బ్యానర్ పై వరుసగా సినిమాలు నిర్మిస్తున్న కేఎస్ రామారావు.. తాజాగా విజయ్ దేవరకొండ హీరోగా వరల్డ్ ఫేమస్ లవర్ అనే సినిమా నిర్మించారు. 

మెగాస్టార్ గురించి మీకు తెలీదు

ఈ గడ్డంతో నిద్ర పట్టట్లేదు

Show comments