అయిన‌నూ... జేసీలో ఏ మాత్రం మార్పు రాలేదు

స‌హ‌జంగా జైలు జీవితం మ‌నిషిలో మార్పు తీసుకొస్తుందంటారు. చంద్ర‌బాబు పాల‌న‌లో తానొక స్టేట్ రౌడీనంటూ విర్ర‌వీగిన మాజీ ఎమ్మెల్యే చింత‌మ‌నేని ప్ర‌భాక‌ర్‌లో జైలు జీవితం తీసుకొచ్చిన మార్పు గురించి అప్పుడ‌ప్పుడూ వింటూ ఉన్నాం. జ‌గ‌న్ అధికారంలోకి వ‌చ్చిన కొన్నాళ్ల‌కే చింత‌మ‌నేనికి బ‌డిత పూజ చేశారు. జైలు నుంచి విడుద‌ల‌య్యాక వీలేక‌రుల స‌మావేశంలో స్వ‌యంగా చింత‌మ‌నేనే త‌న‌ను పోలీసులు చిత‌క్కొట్టార‌ని చెప్పుకొచ్చారు. ఆ త‌ర్వాత కిమ్మ‌న‌కుండా క‌ద‌ల‌క మెద‌ల‌క‌...అస‌లు చ‌ప్పుడు లేకుండా చింత‌మ‌నేని వ్య‌వ‌సాయ పనుల్లో నిమ‌గ్న‌మ‌య్యారు.

కానీ 54 రోజుల పాటు క‌డ‌ప కేంద్ర కారాగారంలో ఉన్న‌ప్ప‌టికీ తాడిప‌త్రి మాజీ ఎమ్మెల్యే జేసీ ప్ర‌భాక‌ర్‌రెడ్డిలో ఏ మాత్రం మార్పు రాలేదు. గ‌తంలో ఏ విధంగానైతే అంద‌రిపై నోరు పారేసుకునే వారో...ఇప్పుడు కూడా అదే ధోర‌ణి. వాహ‌నాల‌కు న‌కిలీ ఇన్సూరెన్స్‌తో పాటు ప‌లు కేసుల్లో నిందితులైన జేసీ ప్ర‌భాక‌ర్‌రెడ్డి, ఆయ‌న త‌న‌యుడు అస్మిత్‌రెడ్డిల‌ను పోలీసులు జూన్ రెండో వారంలో అరెస్ట్ చేసి క‌డ‌ప కేంద్ర కారాగారానికి త‌ర‌లించారు.

అప్ప‌టి నుంచి రిమాండ్‌లో తండ్రీకొడుకులు ఉన్నారు. దాదాపు 54 రోజుల పాటు జైలు జీవితాన్ని గ‌డిపారు. అనంత‌పురం కోర్టు బెయిల్ మంజూరు చేయ‌డంతో గురువారం విడుద‌ల‌య్యారు. మందీమార్బ‌లంతో వంద‌లాది వాహ‌న శ్రేణి న‌డుమ ఊరేగింపుగా తాడిప‌త్రికి బ‌య‌లుదేరారు. త‌న అడ్డాలో ప్ర‌వేశించిన జేసీ ప్ర‌భాక‌ర్‌రెడ్డి వాహ‌నాన్ని ట్రాఫిక్ నిబంధ‌న‌ల్లో భాగంగా తాడిప‌త్రి రూర‌ల్ సీఐ దేవేంద్ర నిలిపారు.

దీంతో జేసీ ప్ర‌భాక‌ర్‌రెడ్డిలో ఆగ్ర‌హం క‌ట్ట‌లు తెంచుకొంది. వాహ‌నం దిగి నేరుగా సీఐ వ‌ద్ద‌కు దూసుకెళ్లారు. చేతులు తిప్పుతూ, గ‌ట్టిగ‌ట్టిగా అరుస్తూ సీఐపై రుబాబు చేశారు.

"ఏం చేస్తావు, అరెస్ట్ చేస్తావా...నీయ‌బ్బా" అంటూ తిట్ల వ‌ర్షానికి దిగారు. ఒక ద‌శ‌లో సీఐ మీద‌కి జేసీ దూసుకుపోతున్న తీరు చూస్తే....దాడికి పాల్ప‌డుతారేమోన‌నే అనుమానం చూప‌రుల‌కు క‌లిగింది. సీఐ స‌ర్ది చెప్పేందుకు ప్ర‌య‌త్నించినా జేసీ ఏ మాత్రం త‌గ్గ‌లేదు. చివ‌రికి న‌డుచుకుంటూ, హంగామా చేసుకుంటూ వెళ్లారు. సీఐతో జేసీ ప్ర‌భాక‌ర్‌రెడ్డి వ్య‌వ‌హ‌రించిన తీరుపై తీసిన వీడియో సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అవుతోంది. జైలు జీవితం జేసీ ప్ర‌భాక‌ర్‌రెడ్డిలో ఏ మాత్రం మార్పు తీసుకురాలేద‌ని, ఆయ‌న ఎప్ప‌టికీ మారేలా లేర‌నే కామెంట్స్ నెటిజ‌న్స్ నుంచి వ‌స్తున్నాయి. 

శ్రీ రెడ్డి వల్ల కొత్తవాళ్ళకి న్యాయం జరిగిందా?

Show comments