రాజ‌ధాని రైతుల‌పై ఈనాడు పిడుగు

ఏదో చెప్పాల‌నుకుని, మ‌రెవ‌రినో బ‌ద్నాం చేయాల‌నుకుంటే....అవి త‌మ‌కే ఎదురు తంతాయ‌నే స్పృహ‌, గ్ర‌హింపు లేక‌పోవ‌డం వ‌ల్లే త‌ర‌చూ ఎల్లో ప‌త్రిక‌లు బోల్తా ప‌డుతున్నాయి. ఇందుకు తాజా నిద‌ర్శ‌నం శుక్ర‌వారం ఈనాడులో "మ‌ధ్య త‌ర‌గ‌తి ఆశ‌ల‌పై పిడుగు" శీర్షిక‌తో ప్ర‌చురిత‌మైన క‌థ‌న‌మే. రాజ‌ధాని త‌ర‌లింపు నిర్ణ‌యంతో అమ‌రావ‌తిలో స్థ‌లాలు కొన్న వారిలో తీవ్ర ఆవేద‌న నెల‌కొంద‌ని, ప్ర‌భుత్వ‌, ప్రైవేటు ఉద్యోగులు, చిరు వ్యాపారులు నిండా మునిగార‌ని రాసుకొచ్చారు.

మొట్ట‌మొద‌ట‌గా ఈ క‌థ‌నం గురించి ఒక విష‌యం చెప్పాలి. ఒంగోలు, మార్టూరు, మ‌రెక్క‌డెక్క‌డి నుంచో వ‌చ్చి రాజ‌ధాని ప్రాంతంలో భూములు కొన్నార‌ని, ఇప్పుడు ధ‌ర‌లు అమాంతం ప‌డిపోవ‌డంతో తీవ్ర మ‌నోవేద‌న‌కు గురి అయ్యార‌ని క‌థ‌నంలో పేర్కొన్నారు. అంటే వీళ్లంతా రాజ‌ధానిలో మొద‌టి నుంచీ ఉన్న‌వాళ్లు కాదు....మ‌ధ్య‌లో వ‌చ్చిన వాళ్ల‌న్న మాట‌. ఈనాడు క‌థ‌నం ప్ర‌కారం మ‌ధ్య‌త‌ర‌గతి ఆశ‌ల‌పై కాదు...మ‌ధ్య‌లో వ‌చ్చిన ఆశ‌ల‌పై జ‌గ‌న్ స‌ర్కార్ పాల‌నా విధానాలు పిడుగుపాటులా మారాయ‌ని అర్థం చేసుకోవాలి.

అయితే ఒక క‌థ‌నం రాసేట‌ప్పుడు నాణేనికి రెండు వైపులా చూడాలి. కానీ నాణేనికి ఒక‌వైపు మాత్ర‌మే చూపడం వ‌ల్ల మంచికంటే చెడే ఎక్కువ క‌లిగే ప్ర‌మాదం ఉంది. ఈనాడు క‌థ‌నంలో కేవ‌లం అమ‌రావ‌తి రైతుల కోణంలోనే రాయ‌డం వ‌ల్ల స‌మ‌గ్ర‌త లోపించింది. అంతేకాదు, ఇంత‌కాలం అధికార ప‌క్షం ఏ ఆరోప‌ణ‌లైతే చేస్తోందే, దాన్ని బ‌ల‌ప‌రిచేలా క‌థ‌నంలోని అంశాలు ప్ర‌తిబింబించాయి. మ‌రోవైపు అమ‌రావ‌తి రాజ‌ధాని రైతుల పోరాటానికి మిగిలిన ప్రాంతాల నుంచి ఎందుకు మ‌ద్ద‌తు రాలేదో, రాదో ఈ క‌థ‌నాన్ని చ‌దివితే తెలుస్తుంది.

రాజ‌ధాని ఉద్య‌మంలో రైతులుండేది త‌క్కువ‌, రియ‌ల్ట‌ర్లే ఎక్కువ అని అధికార పార్టీ ఆరోపిస్తుంది. ఆ ఆరోప‌ణ‌ల‌కు బ‌లం చేకూ ర్చేలా ఈ క‌థ‌నంలో కొన్ని వివ‌రాలున్నాయి.

" రాజధాని నిర్మాణ భూసమీకరణలో రైతులు 34 వేల ఎకరాలకుపైగా ఇచ్చారు. రైతుల నుంచి ఇతరులు కొని భూసమీకరణలో ఇచ్చిన భూమి సుమారు 7 వేల ఎకరాలని అంచనా. రాజధాని నిర్మాణానికి భూములిచ్చిన రైతులకు సీఆర్‌డీఏ తిరిగి సుమారు 64 వేల స్థలాలు కేటాయించింది. సీఆర్‌డీఏ రైతులకు ఇచ్చిన స్థలాల్లో సుమారు 7,250 ఫ్లాట్ల విక్రయాలు జరిగినట్లు అంచనా" ...అని రాసుకొచ్చారు.

ఈ క‌థ‌నంలో మ‌రికొన్ని ముఖ్యాంశాల‌ను ప‌రిశీలిద్దాం.

*రూ.20 లక్షల స్థలాన్ని రూ.10 లక్షలకైనా అమ్మేసి అప్పు తీర్చేద్దామంటే కొనేవాళ్లే లేరు. రూ.15 లక్షల స్థలం విలువ ఇప్పుడు రూ.2 లక్షలూ చేయదు.

* ప్రకాశం జిల్లా మార్టూరుకు చెందిన నలుగురు ఉపాధ్యాయులు చదరపు గజం రూ.23 వేల చొప్పున శాఖమూరు గ్రామం పరిధిలో 1,100 గజాలు కొన్నారు. ఇప్పుడు గజం రూ.5-6 వేలకూ కొనేవారూ లేరు.

* ఒక దశలో కొన్ని ప్రాంతాల్లో వాణిజ్య స్థలం విలువ గరిష్ఠంగా చదరపు గజం రూ.45 వేలు, నివాస స్థలం విలువ గరిష్ఠంగా రూ.35 వేలు  పలికింది. ఇప్పుడు వాటిని ఎంత హీనమైన ధరకు అమ్ముదామన్నా కొనేవారు లేరు.

* ప్రతిఒక్కరూ కనీసం రూ.10 లక్షలైనా పెట్టుబడి పెట్టారు. ఇబ్రహీంపట్నంలో 40 మంది ఉద్యోగులు రూ.4 కోట్లు పెట్టి ఎకరం తీసుకున్నారు. దాన్ని డెవలప్‌మెంట్‌కు ఇవ్వాలనుకున్నారు. ఇప్పుడు దిక్కుతోచని స్థితిలో పడ్డారు. విదేశాల్లో స్థిరపడిన కొందరు దాచుకున్న డబ్బును  తల్లిదండ్రులకు పంపి స్థలాలు కొనిపించారు.

రాజ‌ధానిపై ఎలా వ్యాపారం చేశారో ఈ వాక్యాలే నిద‌ర్శ‌నం. అమ‌రావ‌తి నుంచి విశాఖ‌కు ఎగ్జిక్యూటివ్ రాజ‌ధాని త‌ర‌లిపోతుంద‌ని తెలిసిన‌ప్ప‌టి నుంచి స్థ‌లాలు, భూములు, ప్లాట్ల ధ‌ర‌లు అమాంతం ప‌డిపోయాయ‌నే ఆవేద‌న‌, ఆక్రోశం త‌ప్ప‌...మ‌రేమైనా క‌నిపిస్తోందా? అస‌లు రాజ‌ధాని అన్నా, భూమి అన్నా రాష్ట్ర ప్ర‌జ‌లంద‌రికీ  మాన‌సిక అనుబంధం ఉండాలి. కానీ ఇక్క‌డ చంద్ర‌బాబు త‌లపెట్టిన రాజ‌ధాని నిర్మాణంతో ఆర్థిక అనుబంధం పెనువేసుకున్న ఏ కొద్ది మంది సంప‌న్న‌వంతులు, రియ‌ల్ ఎస్టేట్ వ్యాపారుల వ్య‌వ‌హారంగా త‌యారైంది.

ఎప్ప‌టికైనా ఆర్థిక అంశాల‌తో ముడిప‌డి ఉన్న బంధాలు ఎక్కువ కాలం నిల‌బ‌డ‌వు. లాభ‌న‌ష్టాల ప్రాతిప‌దిక‌న బంధాలు, అనుబంధాలు ఏర్ప‌డిదే, అవి ఉన్నంత వ‌ర‌కే ఆ బంధాలు కొన‌సాగుతాయి. అలా కాకుండా మ‌న‌సుతో ముడిప‌డిన బంధాలు మాత్ర‌మే క‌ల‌కాలం నిల‌బ‌డుతాయి. ఇక్క‌డ అమ‌రావ‌తి ఏపీ శాశ్వ‌త రాజ‌ధానిగా కొన‌సాగ‌క‌పోవ‌డానికి ప్ర‌ధాన కార‌ణం అదొక డ‌బ్బును సృష్టించే యంత్రంలా భావించ‌డ‌మే.

ఎంత‌సేపూ రాజ‌ధాని అమ‌రావ‌తి అంటే అపార్ట్‌మెంట్లు, ఇంటి స్థ‌లాలు, కొనుగోళ్లు, అమ్మ‌కాలు, ల‌క్ష‌లు, కోట్లు, లాభం, న‌ష్టం...ఈ ప‌దాలు త‌ప్ప ఈనాడు క‌థ‌నంలో మ‌రేదైనికైనా చోటుందా. ఈనాడు క‌థ‌నంలో చోటు లేదంటే...అమ‌రావ‌తికి, మాన‌సిక బంధానికి ఎలాంటి సంబంధ బాంధ‌వ్యాలు లేవ‌ని అర్థం చేసుకోవ‌చ్చు.

"రాజ‌ధానికి ఆనుకుని ఉన్న‌ పెదపరిమి, మద్దూరు, వడ్డమాను, హరిశ్చంద్రపురం వంటి గ్రామాల్లోనూ, ప్రతిపాదిత ఇన్నర్‌ రింగ్ రోడ్డును ఆనుకుని ఉన్న చోట్లా భూములు కొన్నవారున్నారు.  ప్రభుత్వం మూడు రాజధానుల ప్రకటన చేసినప్పటి నుంచీ వారంతా నిద్రలేని రాత్రులు గడుపుతున్నారు"...అని ఈ క‌థ‌నంలో రాసుకొచ్చారు. అంటే అక్క‌డ భూములు కొన్న వాళ్లు త‌ప్ప మిగిలిన ప్రాంతాల్లోని ప్ర‌జానీకం నిశ్చింతంగా నిద్ర‌పోతున్నార‌నే క‌దా అర్థం. అక్క‌డ భూములు కొన్న వాళ్ల కోసం ఇత‌ర ప్రాంతాల అభివృద్ధిని గాలికి వ‌దిలేయాల‌ని ఈనాడు, అక్క‌డ స్థ‌లాలున్న వారు చెబుతున్నారా? ఏమిటీ విప‌రీత ధోర‌ణులు. ఇలాంటి విప‌రీత పోక‌డ‌లే త‌మ వినాశ‌నానికి దారి తీస్తున్నాయ‌ని గ్ర‌హించ‌క‌పోతే న‌ష్ట‌పోయేదెవ‌రు?

మూడు రాజ‌ధానుల నిర్ణ‌యంతో ఉత్త‌రాంధ్ర‌, రాయ‌ల‌సీమ ప్ర‌జ‌ల మ‌నోగ‌తాన్ని ఆవిష్క‌రించే ప్ర‌య‌త్నాన్ని ఎప్పుడైనా ఈనాడు ప‌త్రిక చేసిందా? ఎందుకు చేయ‌డం లేదంటే అది తాను జాకీలు పెట్టి లేపేందుకు య‌త్నించిన రాజ‌కీయ నాయ‌కుడి అభిప్రాయా నికి వ్య‌తిరేకంగా వ‌స్తుంద‌నే భ‌యం.

ఈనాడు రాసిన‌ట్టు మ‌ధ్య‌త‌ర‌గ‌తి జీవుల ఆశ‌ల పిడుగు అనేది వాస్త‌వం కాదు. రాజ‌ధానిపై వ్యాపారం చేసి సొమ్ము చేసుకోవాల‌నే అత్యాశ‌తో మ‌ధ్య‌లో వ‌చ్చిన వారి ఆశ‌ల‌పై మాత్ర‌మే మూడు రాజ‌ధానుల నిర్ణ‌యం పిడుగుపాటు అని చెప్ప‌క త‌ప్ప‌దు. సాటి మ‌నిషి నష్ట‌పోతుంటే స్పందించ‌నంత అమాన‌వీయ‌త ఆంధ్ర‌ప్ర‌దేశ్ స‌మాజానికి లేదు. కానీ రియ‌ల్ ఎస్టేట్ వ్యాపారులు, సంప‌దంతా త‌మ‌కే కావాల‌ని అత్యాశ ప‌డే వారిప‌ట్ల మాత్ర‌మే ఆంధ్ర‌ప్ర‌దేశ్ స‌మాజం నిరాద‌ర‌ణ చూపుతుంది. ఇప్పుడు రాజ‌ధాని రైతుల విష‌యంలోనూ అదే క‌నిపిస్తోంది.

శ్రీ రెడ్డి వల్ల కొత్తవాళ్ళకి న్యాయం జరిగిందా?

విజయవాడ వీధుల్లో తొడ కొట్టాను

Show comments