దిన‌క‌ర్ పిటిష‌న్ వెనుక బీజేపీ ముఖ్య‌నేత స్కెచ్‌

పాల‌నా వికేంద్రీక‌ర‌ణ‌, సీఆర్‌డీఏ చ‌ట్టం ర‌ద్దుకు సంబంధించి ప్ర‌భుత్వం జారీ చేసిన గెజిట్ నోటిఫికేష‌న్లు రాజ్యాంగ విరుద్ధ‌మ‌ని, వాటిని కొట్టి వేయాల‌ని తాజాగా హైకోర్టులో మ‌రో ముగ్గురు వేర్వేరుగా పిటిష‌న్లు దాఖ‌లు చేశారు. వీరిలో లంకా దిన‌క‌ర్ అనే బీజేపీ నేత ఉన్నాడు. ఇటీవ‌ల పార్టీ నియమావ‌ళికి విరుద్ధంగా వ్య‌వ‌హ‌రిస్తున్నార‌నే కార‌ణంతో ఆయ‌న‌కు బీజేపీ అధిష్టానం షోకాజ్ నోటీస్ జారీ చేసింది. అయిన‌ప్ప‌టికీ అత‌ను బీజేపీ అధిష్టానాన్ని లెక్క చేయ‌కుండా బీజేపీ నిషేధించిన చాన‌ళ్ల డిబేట్ల‌లో పాల్గొంటున్నాడు.

ఇదిలా ఉండ‌గా అమ‌రావ‌తిలోనే రాజ‌ధాని కొన‌సాగించాల‌నేది పార్టీ రాష్ట్ర శాఖ అభిప్రాయ‌మ‌ని, కానీ కేంద్రం చేతిలో రాజ‌ధాని విష‌యం లేద‌ని బీజేపీ అధిష్టానం ఇప్ప‌టికే అనేక మార్లు తేల్చి చెప్పింది. అమ‌రావ‌తి, నిమ్మ‌గ‌డ్డ ర‌మేశ్‌కుమార్ వ్య‌వ‌హారాల‌పై టీడీపీ అనుకూల చాన‌ళ్ల‌లో నిర్వ‌హించే డిబేట్ల‌లో పాల్గొన వ‌ద్ద‌ని కూడా బీజేపీ అధిష్టానం త‌న పార్టీ ప్ర‌తినిధుల‌కు స్ప‌ష్ట‌మైన ఆదేశాలు జారీ చేసింది.

మ‌రోవైపు రాజ‌ధానిని అమ‌రావ‌తి నుంచి అంగుళం కూడా క‌దిలించ‌లేర‌ని బీజేపీ రాజ్య‌స‌భ సభ్యుడు హైద‌రాబాద్‌లో నిర్వ‌హించిన మీడియా స‌మావేశంలో కుండ‌బ‌ద్ద‌లు కొట్టిన‌ట్టు చెప్పారు. దీన్ని బీజేపీ రాష్ట్ర శాఖ ట్విట‌ర్ వేదిక‌గా ఖండించింది. బీజేపీ నూత‌న అధ్య‌క్షుడు సోము వీర్రాజు చెప్పిందే పార్టీ అభిప్రాయ‌మ‌ని, మిగిలిన అభిప్రాయాలు వారి వారి వ్య‌క్తిగ‌త‌మ‌ని స్ప‌ష్టం చేశారు. అంతేకాదు, సుజ‌నాచౌద‌రి అభిప్రాయం పార్టీ వైఖ‌రికి భిన్నంగా ఉంద‌ని కూడా ట్విట‌ర్‌లో స్ప‌ష్టం చేశారు.

ఈ నేప‌థ్యంలో బీజేపీ నేత దిన‌క‌ర్ అమ‌రావ‌తిపై పిటిష‌న్ దాఖ‌లు చేయ‌డంతో ...ఆ పార్టీ వైఖ‌రిపై మ‌ళ్లీ చ‌ర్చ మొద‌లైంది. ఇదే విష‌య‌మై ఒక చాన‌ల్ డిబేట్‌లో సోము వీర్రాజును నేరుగా ప్ర‌శ్నించ‌గా ఇలాంటి వాళ్లు ఎక్క‌డి నుంచి వ‌చ్చారు? ఎందుకున్నారో అంద‌రికీ తెలుస‌న్నారు. ఇలాంటి నేత‌ల‌ను ఎలా టాకిల్ చేయాలో కూడా త‌న బాగా తెలుస‌ని న‌ర్మ‌గ‌ర్భ వ్యాఖ్య‌లు చేశారు. ఈ క‌ర్‌లు, ఆ క‌ర్‌లు...ఎక్క‌డి నుంచో వ‌చ్చిన ఊత‌క‌ర్రల‌తో పార్టీని న‌డ‌పాల్సిన అవ‌స‌రం లేద‌ని వ‌ల‌స నాయ‌కుల‌పై సోము వీర్రాజు ఘాటు వ్యాఖ్య‌లు చేశారు.

సోము వ్యాఖ్య‌ల‌ను బ‌ట్టి వారంతా ఒక పార్టీకి అనుకూలంగా వ్య‌వ‌హ‌రిస్తున్నార‌నే భావం వ్య‌క్త‌మైంది. అలాంటి వాళ్ల గురించి అస‌లు త‌న‌ను అడ‌గ‌నే వ‌ద్ద‌ని కూడా ఒక సంద‌ర్భంలో సోము వీర్రాజు అస‌హ‌నం, ఆగ్ర‌హం వ్య‌క్తం చేయ‌డం గమ‌నార్హం. బీజేపీలో చేరిన ఓ ప్ర‌ముఖ టీడీపీ నాయకుడికి దిన‌క‌ర్ న‌మ్మిన బంటు అని ఎప్ప‌టి నుంచో వినిపిస్తున్న మాట‌. ఆ నాయ‌కుడి అండ‌దండ‌ల‌తోనే తాను కూడా బీజేపీలో చేరాడ‌ని టాక్‌.

ఇప్పుడు కూడా ఆ నాయ‌కుడి ప్రోద్బ‌లంతోనే హైకోర్టులో పిటిష‌న్ వేశాడ‌ని బీజేపీ నాయ‌కులు భావిస్తున్న‌ట్టు స‌మాచారం. పార్టీ నియ‌మావ‌ళికి విరుద్ధంగా హైకోర్టులో పిటిష‌న్ వేసిన దిన‌క‌ర్‌తో పాటు వేయించిన ఆ ప్ర‌ముఖ నాయ‌కుడిపై బీజేపీ అధిష్టానం ఎలా స్పందిస్తుందో అనేది ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది. 

హాస్పిటల్ లో చేరిన నటుడు పృధ్వీరాజ్

Show comments