ఎమ్బీయస్: తెప్పలు తగలేసుకున్న బాబుకి దక్కిందేమిటి?

ఏరు దాటాక తెప్ప తగలేశాడనే సామెత మనకుంది. ఏరు దాటావు బాగానే వుంది, తెప్ప తగలేయడం దేనికి? అక్కడే పొదల్లో పడేసి వుంచవచ్చు కదా. అవసరమైతే దాన్ని బయటకు లాగి, మరమ్మత్తులు చేసుకుని వాడుకోవచ్చు కదా! కానీ తగలేశాడు అంటే దాని అర్థం మళ్లీ తను అవతలిగట్టుకి వెళ్లవలసిన అవసరం పడదు అనే ధీమా అన్నమాట. ఈ గట్టునే సెటిలై పోతాం, ఏటికి అవతల వున్నవాళ్ల మొహం కూడా చూడనక్కరలేదు అనే ధైర్యమన్నమాట. కానీ చంద్రబాబుకి అలాటి ధైర్యం కలిగే అవకాశం ప్రస్తుత పరిస్థితుల్లో లేదు. అయినా అయినా దాటి వచ్చిన తెప్పలన్నీ తగలేస్తూండడం ఆశ్చర్యంగా వుంది.

ఏ లోహమూ తక్కిన అన్ని లోహాలతో సంయోగం చెందలేదు. కొన్నిటితోనే అతుక్కుంటుంది. కానీ నారా బాబియమ్ అనే లోహం మాత్రం దేశంలోని అన్ని పార్టీలతో సంయోగవియోగాలు చెందగల సామర్థ్యం కలది. ‘ఎంతమందితో కలిసినా కాంగ్రెసుతో మాత్రం కలవదు. ఎందుకంటే కాంగ్రెసు వ్యతిరేకత అనే మౌలిక సిద్ధాంతంతోనే కదా తెదేపా పుట్టింది’ అనుకుంటూ వచ్చాం. 2018 తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలలో ఆ కొరతా తీరిపోయింది. కాంగ్రెసుతో జట్టుకట్టి, రాహుల్‌ని ఆకాశానికి ఎత్తేశారు బాబు. కొత్తగా జట్టు కట్టాలంటే మీరో, నేనో ఏదైనా కొత్త పార్టీ పెట్టాలి.

వరుస పెళ్లిళ్లకు పేరుబడిన ఓ హాలీవుడ్ నటీమణిని ఓ స్నేహితురాలు కోప్పడిందిట –‘పెళ్లికి పిలవలేదేం?’ అని. ‘పోన్లేవే, వచ్చే పెళ్లికి పిలుస్తానుగా’ అని సంజాయిషీ యిచ్చింది నటీమణి.
అలా బాబు యీసారి మన పార్టీతో పొత్తు పెట్టుకోకపోతే వచ్చేసారి పెట్టుకునే అవకాశం వుంటుంది మనకు. పార్టీ అంటూ వుండాలి కానీ, ఎప్పటికో అప్పటికి ఆయన పార్టీతో పెళ్లి, విడాకులు తప్పవు. ఆకర్షణ, వికర్షణ అన్నీ ఆయనలోనే వుంటాయి. మనం పిలిచినప్పుడు వెళ్లిపోవడం, పొమ్మన్నపుడు వచ్చేయడం, అంతే మనం చేసేది!

ఒక కంకి నుంచి మరో కంకికి మిడత వాలినంత లాఘవంగా బాబు ఒక కూటమి నుంచి మరో కూటమికి గెంతేయగలరు. హైదరాబాదు నుంచి దిల్లీ విమానం ఎక్కినపుడు యునైటెడ్ ఫ్రంట్ కన్వీనరు, తిరుగు ప్రయాణంలో ఎన్‌డిఏ కన్వీనరు అయిన రికార్డు ఆయన కుంది. అదే పోస్టు, కూటమి మారిందంతే. చర్చలు, వాగ్వివాదాలూ ఏమీ లేవు. చడీచప్పుడు లేకుండా, అతి స్మూత్‌గా, పట్టుదారంపై ముత్యపు పూస జారినంత సున్నితంగా, లాఘవంగా జారిపోయి, అక్కడ తేలారు.

ఎవరితో కలిసినా, దాన్ని సమర్థించుకునే సామర్థ్యం ఆయనకుంది. ఆయన అనుచరగణం అభ్యంతర పెట్టదు, సిద్ధాంతవిరుద్ధం అంటూ చర్చ పెట్టదు. లెఫ్ట్, రైట్, సెంటర్ ఎక్కడైనా ఆయన యిమడగలరు. పేకాటలో తురుఫు ముక్క చూడండి, ఏ సెట్టులోనైనా ఒదిగిపోతుంది. ఈయనా అలాటివారే. ఇక ఆయన అభిమానగణమంటారా? ఆయన ఏం చేసినా వారికి దానిలో దీర్ఘదృష్టి, భావితరాల పట్ల శ్రద్ధ, అభ్యుదయ చింతనాశీలత.. యిలా అనేకం కనబడతాయి. వీళ్లంతా సరే, అరచేతిలో ఉసిరికాయలా ఆడించవచ్చు. మరి అవతలివాళ్ల మాటేమిటి?

‘ఏరు దాటేదాకా ఓడమల్లయ్య, దాటాక బోడిమల్లయ్య’ అనే సామెత మనకుంది. అవసరం పడ్డప్పుడు అంతటివారు, యింతటివారు అనడం, అది తీరాక తిట్టిపోయడం, వీలు లేకపోతే పట్టించుకోకపోవడం. బాబు యీ విద్యలో సిద్ధహస్తులని దేశంలో ప్రతి రాజకీయ నాయకుడికీ తెలుసు. అయినా వాళ్లు యీయనతో జట్టు కట్టడానికి సిద్ధపడతారు. గతంలో మనకు జెల్లకాయ కొట్టాడు కదా, వాళ్లతో కూడి నష్టపోయానని లేకపోతే బ్రహ్మాండమైన మెజారిటీ వచ్చేదనీ వాపోయాడు కదా. అధికారంలో వచ్చేదాకా మనతో చేతులు కలిపి, అధికారంలోకి వచ్చాక ‘వీళ్లు ప్రతి అభ్యుదయ చర్యకు అడ్డుపడుతున్నార’ని తెగనాడాడు కదా, ఈయనతో కలవడమెందుకు? అనుకోరు. దానికి కారణం – అలా కలవడం మహోన్నత లక్ష్యాలతోనే అని తెలుగు ఓటర్లను నమ్మించగల మీడియా ఆయన చేతిలో వుంది.

ఈయన ఎవరినైనా నంది అని తీర్మానించారనుకోండి, ఆయన తాలూకు మీడియా నందీశ్వర స్తోత్రం మొదలెడతారు. రేపు యీయన పొత్తు తెంపుకుని, అబ్బే వాడు పంది అన్నారనుకోండి. ఇక ఆ మీడియా పందులు దేశానికి ఎంత హానికరమో వ్యాసాలు గుప్పిస్తుంది. ఈ పందిని గతంలో నంది అన్నామని, గుర్తు చేసుకని సిగ్గు పడదు, మనని గుర్తు చేసుకోనివ్వదు. ఆ మీడియా ప్రభావితులైన తెలుగు ఓటర్లు ‘తప్పేముంది?’ అనుకుంటారు. ఈయనలో ఏదో గొప్పతనం లేకపోతే వాళ్లు మాత్రం ఎందుకు వెంపర్లాడతారు? అనుకుంటారు. ఎందుకంటే తెలుగు నేల వరకు యీయనది మెజారిటీ పార్టీ, వాళ్లది మైనారిటీ పార్టీ. అందువలన యిక్కడి కూటమిది యీయనే సారథి. ఖర్చూ గట్రా ఆయనే చూసుకుంటారు కాబోలు.

లేకపోతే కమ్యూనిస్టులు ఆయనతో పొత్తు పెట్టుకోవడంలో అర్థం కనబడదు. తక్కినవేళల్లో వీళ్లు బాబును ప్రపంచబ్యాంకు తొత్తు అంటారు. పెట్టబడిదారుల ఏజంటు, కార్మికద్రోహి అంటారు, ఎన్నికలు రాగానే మళ్లీ  ఆయనతో పొత్తుకు సిద్ధపడతారు. ప్రతిపక్షంలో వుండగా ఆయన దేనిపై ఉద్యమం చేస్తే దానిపైనే వీళ్లూ చేస్తారు తప్ప తక్కినవి పట్టించుకోరు. కమ్యూనిస్టులతో జట్టు కడితే ఓట్లు కాదు కదా, బూడిద కూడా రాలదని తెలుసు. అయినా వాళ్లు చేరితే ప్రజాకూటమి అనో, మహా కూటమి అనో (రెండు పార్టీలు కదా) మరోటనో పేరు పెట్టుకోవడానికి అనువుగా వుంటుంది. మీటింగులకు, ర్యాలీలకు వాళ్లు జనాల్ని పోగేస్తారు. సెక్యులర్, ప్రోగ్రెసివ్ వగైరా ముద్రలు మనకు మనమే కొట్టేసుకోవచ్చు.

తెలుగు నాట కమ్యూనిస్టు పార్టీ ప్రధాన నాయకులు బాబు కులానికి చెందినవారే కాబట్టి టిడిపితో పొత్తు ఒప్పుకుంటున్నారని కొందరనుకుంటారు. కానీ గుర్తుంచుకోవలసిన విషయమేమిటంటే అవి జాతీయ పార్టీలు. పాలిట్‌బ్యూరోలు ఒప్పుకోందే కథ ముందుకు సాగదు. టిడిపితో పొత్తు పెట్టుకుంటే నిధులు వస్తాయనో, ఎన్నికలలో పాల్గొంటున్నామంటే క్యాడర్ కాస్త హుషారుగా వుంటారనో... యిలాటి లెక్కలేవో వుంటాయి. అందుకే మాటిమాటికీ ముందుకు వస్తూంటారు, ఛీత్కరించినప్పుడు పక్కకు వెళుతూంటారు.

బిజెపికి కూడా యిలాటి సంకట స్థితి వుంది. బాబు ఎప్పుడు చంకెక్కించుకుంటారో, ఎప్పుడు దింపేస్తారో తెలియదు. దానితో పొత్తు పెట్టుకుంటే మైనారిటీ ఓట్లు పోతాయేమోనన్న భయం బాబు మనసులో వున్నా, అది తెలుగు రాష్ట్రాలలో మరీ అంత పెద్ద ఫ్యాక్టర్ కాదు. ఎందుకంటే మైనారిటీ ఓటు సాధారణంగా కాంగ్రెసుకు పోతూ వచ్చింది. టిడిపి బలపడ్డాక అది ఆ ఓటును చీల్చుకుంటూ వస్తోంది. అందువలన బిజెపితో పొత్తుకు లేదా దూరానికి అదొక్కటే డిసైడింగ్ ఫ్యాక్టర్ కాలేదు. టిడిపికే కాదు, తెలుగు నాట ఏ పార్టీకైనా యిది వర్తిస్తుంది. ఆంధ్రలో కాంగ్రెసు అంతమయ్యాక వైసిపికి ఆ ఓటు బ్యాంకంతా – మైనారిటీలతో సహా – దఖలు పడింది. అయినా వైసిపి బిజెపితో సఖ్యంగా వుండటానికి బెదరటం లేదు.

మరి బిజెపితో టిడిపి అప్పుడప్పుడు దగ్గరకు రావడం దేనికి? అప్పుడప్పుడు దూరం జరగడం దేనికి? జాతీయ స్థాయిలో దాని ప్రజాదరణ ఎలా వుందో చూసుకుని దాని ప్రకారం యీయన పావులు కదుపుతారు. ఈయన ఏం చేసినా అది అమలయ్యేట్లు చూడడానికి మొన్నటిదాకా వెంకయ్యనాయుడు వుండేవారు. ‘మనం టిడిపికి రిమూవబుల్ తోకలా వున్నాం. కావాలంటే ఆయన పెట్టుకుంటున్నాడు, లేకపోతే తీసి పారేస్తున్నాడు. ఇలా అయితే ఎప్పటికి ఎదగగలం?’ అని ఆంధ్రలో బిజెపి నాయకులు మొత్తుకునేవారు. తెలంగాణలో ఆరెస్సెస్ బలంగా వుండటం చేత కొందరు బిజెపి నాయకులు ఎదిగారు. ఆంధ్రలో అలాటి ప్రమాదం లేకుండా బాబు, వెంకయ్య జాగ్రత్త పడ్డారు.

ఇదంతా చూసిచూసి విసుగెత్తి మోదీ, అమిత్ షా వెంకయ్యగారిని ఉపరాష్ట్రపతిని చేసి కట్టడి చేశారు. బాబుకి అవరోధాలు కల్పించారు, పలురకాలుగా అవమానించారు. ఇక బాబు ఎన్‌డిఏ లోంచి తప్పుకోక తప్పని పరిస్థితి కల్పించారు. 2019 ఎన్నికలు వచ్చేసరికి ఆంధ్రలో టిడిపి, వైసిపి, బిజెపి, కాంగ్రెసు వేటికవే విడివిడిగా పోటీ చేశాయి. ఒంటరిగా పోటీ చేయడం బాబుకి కొత్త అనుభవం. ఎందుకైనా మంచిదని జాతీయ స్థాయిలో మోదీ వ్యతిరేక కూటమి కట్టారు. కాంగ్రెసు, బిజెపిలకు చెందని ప్రాంతీయ నాయకులతో చెలిమి చేశారు.

బిజెపి గెలవదని, గెలిచినా తగినంత మెజారిటీ రాదని, ఆ పరిస్థితుల్లో మోదీ కాకుండా బిజెపిలో తమకు నచ్చిన నాయకుణ్ని నాయకుడిగా పెట్టమని అడిగే అవకాశం వస్తుందని యీ కూటమి నాయకులందరూ అంచనా వేశారు. ఒకవేళ కాంగ్రెసుకు తగినన్ని సీట్లు వస్తే దానితో కలిపి ప్రభుత్వం ఏర్పాటు చేయవచ్చని అనుకున్నారు. ముందు మోదీని ప్రజల దృష్టిలో దింపేయడానికి కంకణం కట్టుకుని అతి తీవ్రంగా విమర్శించారు. వారిలో బాబు ముందు వరుసలో వున్నారు. మోదీపై వ్యక్తిగత విమర్శలు కూడా చేశారు. ఇక యీ కూటమి నాయకులందరూ బాబును చక్రధారిగా చూశారు.

టిడిపి గెలుపుకై మమతా బెనర్జీ, అరవింద్ కేజ్రీవాల్ వైజాగ్ వచ్చి మీటింగులో పాల్గొన్నారు. 86 ఏళ్ల దేవెగౌడ అమరావతి వచ్చి, బాబుకి ప్రధాని అయ్యే అర్హతలున్నాయని పొగిడి వెళ్లారు. స్టాలిన్ కూడా యథాశక్తి పొగిడాడు. ఇక 81 ఏళ్ల ఫరూఖ్ అబ్దుల్లా కశ్మీర్ నుంచి వచ్చి జగన్ వైయస్‌ వారసుడిగా సిఎం కావడానికి తన ద్వారా కాంగ్రెసు అధిష్టానానికి లంచం ఆఫర్ చేశాడని ఆరోపించి వెళ్లాడు. వాళ్లంతా వచ్చి తలో చేయి వేసినా ఆంధ్రప్రజలు బాబుకి 22 సీట్ల యిచ్చి కూర్చోబెట్టారు. ఓడిపోవడం తప్పేమీ కాదు. మహామహా వాళ్లే ఓడతారు. అయితే ఎన్నికల సమయంలో వచ్చి తనకు అంత సాయం చేసిన వివిధ పార్టీల నాయకులతో బాబు చెలిమి చెడగొట్టుకోవడం దేనికి?

బిజెపి బెంగాల్‌లో మమతకు చుక్కలు చూపిస్తోంది. గవర్నరుకు మమతకు నిత్యం ఘర్షణే. బాబు మమత పక్షాన ఒక్క మాట అనటం లేదు. కనీసం యిరుపక్షాలు కాస్త తగ్గాలని, ప్రజాస్వామ్యయుతంగా ప్రవర్తించాలని వంటి ప్రవచనాలు కూడా పలకటం లేదు. ఇక అరవింద్ కేజ్రీవాల్ 2020 జనవరి దిల్లీ అసెంబ్లీ ఎన్నికలలో బిజెపిని ఎదిరించడానికి నానా తంటాలూ పడుతూంటే వెళ్లి సాయం చేయలేదు. దిల్లీలో తెలుగు ఓటర్లున్నా వెళ్లి ప్రచారం చేయలేదు, ప్రకటన విడుదల చేయలేదు. కర్ణాటకలో అలా చేసి, యిలా చేసి ఫిరాయింపులతో బిజెపి ప్రభుత్వంలోకి వచ్చింది. ఆ చర్యను ఖండిస్తూ, దేవెగౌడకు అనుకూలంగా ఏ ప్రకటనా చేయలేదు.

ఇవన్నీ చూసిచూసి కాబోలు ఒమర్ అబ్దుల్లా మొన్న బాబును తిట్టిపోశాడు. ‘టిడిపి ఓడిపోతోందని తెలిసినా, మైనారిటీ ఓట్ల కోసమే తనను పిలుస్తున్నాడని తెలిసినా, తన పార్లమెంటు స్థానంలో ప్రచారాన్ని ఆపుకుని, బాబు కోసం మా నాన్న వెళ్లారు. ఇప్పుడు నన్ను, ఆయన్ని అందర్నీ ఏడాదిపాటు గృహనిర్బంధంలో పెడితే కిమ్మనడం లేదు యీ పెద్దమనిషి. ఆయనో అవకాశవాది. మా కోసం శ్రీనగర్ ఎయిర్‌పోర్టుకైనా రాలేదు. మా అరెస్టు ఖండిస్తూ ప్రకటన చేయలేదు.’ అని. ఇలాటివి సాధారణంగా ఎవరూ బయటకు చెప్పరు. కానీ చెప్పాడంటే విశ్వాసఘాతుకత్వంపై ఎంత కడుపుమంట రగిలిందో మరి.

మధ్యప్రదేశ్‌లో కాంగ్రెసు ప్రభుత్వాన్ని బిజెపి ఫిరాయింపులతో కూల్చేసింది. రాజస్థాన్‌లో ఆ ప్రయత్నాలు ముమ్మరంగా సాగుతున్నాయి. కాంగ్రెసు యిది అన్యాయం అంటూ గగ్గోలు పెడుతోంది. తెలంగాణ అసెంబ్లీ సమయంలో దానితో పొత్తు పెట్టుకున్న టిడిపికి చీమ కుట్టినట్లు లేదు. బిజెపి చర్యలను ఖండిస్తూ ఏ ప్రకటనా లేదు. ఇలా అయితే ఎలా? రేపు ఏదైనా కూటమి ఏర్పడితే బాబును పిలుస్తారా? కష్టకాలంలో మాటసాయం కూడా చేయలేదని అనరా? వాళ్లతో తట్ట తగలేసుకోవడం ఎందుకు?

గతంలోనూ యూ టర్న్‌లు తీసుకుంటూ వచ్చాను, అవసరం బట్టి మనుషులను, పార్టీలను వాడుకుని వదిలేశాను, ఏ ముప్పూ రాలేదు. ఇప్పుడేం వస్తుంది? అని అనుకోవచ్చు బాబు. కానీ అప్పటి డిమాండు వేరు, యిప్పటి డిమాండు వేరు. గతంలో అయితే టిడిపికి ప్రత్యామ్నాయం కాంగ్రెసు. కాంగ్రెసంటే పడని వాళ్లందరూ టిడిపిని ఆశ్రయించారు, ఎన్నిసార్లు అటూయిటూ గెంతినా ఆ పోకడలు సహించారు. ఇప్పుడా పరిస్థితి లేదు. నాన్-ఎన్‌డిఏ వాళ్లు కూటమి కట్టాలంటే వాళ్లకు ఆంధ్రలో వైసిపి ఆప్షన్ కూడా వుంది. సోనియా సారథ్యం నుంచి తప్పుకుందంటే కాంగ్రెసు కూటమిలోనూ వైసిపికి ఛాన్సుంది.

తమిళనాడులో చూడండి, డిఎంకె, ఎడిఎంకెలు జాతీయ స్థాయిలో ఏ కూటమిలోనైనా చేరగలవు, విడిపోగలవు. ఒకళ్లు ఒకదానిలో వుంటే యింకోళ్లు మరో దానిలో వుంటారు. ఇక్కడా అలాటి పరిస్థితే వస్తుంది. ఇతర ప్రాంతీయ పార్టీలు, లేదా జాతీయ పార్టీలు తమ కూటమిలో చేర్చుకోవడానికి వైసిపిని పక్కన పెట్టి టిడిపిని మాత్రమే ఎంచుకోవాలంటే బాబు వాళ్లతో సత్సంబంధాలు మేన్‌టేన్ చేయాలి. అధికారంలో వున్నపుడైతే ఫర్వాలేదు, నిధుల సాయం, వాళ్లకు అనుకూలంగా వున్న పారిశ్రామిక వేత్తలకు రాయితీలు వగైరా యివ్వగలుగుతారు. ఇప్పుడు అధికారంలో లేరు కాబట్టి కనీసం మాటసాయమైనా చేయాలి. వారికి సమర్థనగా వెళ్లి కాస్త హంగామా చేయాలి. కిమ్మనకుండా కూర్చుంటే వారికి మండదూ? దూరంగా తొలగిపోరూ?

బాబుకి యివన్నీ తెలియవనుకోవడానికి లేదు. కానీ మాటసాయమైనా చేయటం లేదంటే బాబు భావి వ్యూహమంతా బిజెపి చుట్టూనే తిరుగుతోందనుకోవాలి. ఎన్నికల సమయంలో మోదీతో కలబడి, తర్వాత చతికిలపడిన తర్వాత బాబు పంథా పూర్తిగా మార్చేశారు. బిజెపిని అస్సలు వ్యతిరేకించటం లేదు. ఆర్టికల్ 370 రద్దుని సమర్థించారు. హిందీ భాష మాత్రమే యావత్తు దేశాన్ని కలుపుతుందని అమిత్ షా అంటే, దక్షిణాది నాయకులు అడ్డు చెప్పారు కానీ, తెలుగు భాష, సంస్కృతి మూలస్తంభంగా ఏర్పడిన తెలుగుదేశం పార్టీ ప్రస్తుత అధినేత కిమ్మనలేదు.

అంతేకాదు, మోదీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వాన్ని కరోనా కట్టడి విషయంలో అడుగడుగునా ఆకాశానికి ఎత్తేస్తున్నారు. వలస కార్మికులపై విధానం దగ్గర్నుంచి, ఏ విషయంలోనూ ఆయనకు దోషాలు కనబడటం లేదు. పైగా వారం వారం కేంద్రానికి రిపోర్టులు పంపుతున్నా, వాళ్లకు సూచనలు చేస్తున్నా అంటూ కేంద్ర సలహాదారు పాత్ర తనే తీసుకుని, ధరిస్తున్నారు. తన పార్టీ నుంచి ముగ్గురు ఎంపీలు బిజెపిలోకి ఫిరాయిస్తే మౌనంగా వున్నారు. ఈయనే కావాలని పంపించాడని అనుకుందామనుకున్నా, బిజెపి దేశమంతా చేస్తున్న ఫిరాయింపుల రాజకీయం తన పార్టీకి కూడా ఎసరు పెడుతుందేమో అనే భయాన్ని కూడా పక్కన పెట్టి వాళ్లనేమీ అనటం లేదు.

ఎందుకిలా బిజెపి బుట్టలోనే అన్ని గుడ్లూ పెడుతున్నారు? అదంత తెలివైన పని కాదని ఇంగ్లీషు వాడు ఎప్పుడో చెప్పాడు.  నాలుగేళ్ల తర్వాత మోదీ పాప్యులారిటీ ఏమవుతుందో ఎవరు చూడవచ్చారు? మహామహా వాళ్లకే ఉత్థానపతనాలు తప్పలేదు. అలాటప్పుడు ఒక్క పార్టీ ప్రాపకం కోసమే పాకులాడితే ఎలా? ఒకవేళ మోదీయే కంటిన్యూ అయినా, బాబు పట్ల సఖ్యంగా వుంటారన్న గ్యారంటీ ఏది? మోదీ సులభంగా ఏదీ మర్చిపోయే మనిషి కాదు. పైగా బాబు దగ్గరయ్యేట్లే అయ్యి, మళ్లీ దూరం జరిగిపోయారు. మళ్లీ చేరదీయడానికి మోదీ కేమవసరం? బాబుని ప్రోత్సహిస్తే ఆంధ్ర బిజెపి నెత్తి మీద మేకు కొట్టి, ఎదగకుండా చేసినట్లే కదా! ఇన్ని తెలిసి బాబు బిజెపి చుట్టూ ఎందుకు పరిభ్రమిస్తున్నారు?

ఒక థియరీ ఏమిటంటే – మోదీకి వ్యతిరేకంగా వెళ్లి బాబు ఎన్నికలలో ఘోరపరాజయం పొందడం ఆయనకు అండగా వున్న ఆయన కులస్తులకు, సన్నిహితులకు, వ్యాపారబంధాలు ఉన్నవారికి జీర్ణం కాలేదు. ఎందుకంటే వారిలో డబ్బున్నవారందరూ అమరావతి చుట్టూ భారీ పెట్టుబడులు పెట్టారు. జగన్ వస్తే రాజధానిలో చాలా భాగం రాయలసీమకో, ఒంగోలుకో తరలిస్తాడన్న అంచనా అందరికీ వుంది. ఒకవేళ రాజధానిని అమరావతిలో కంటిన్యూ చేసినా, యితర హంగులు లేకుండా సాదాసీదాగా చేస్తాడని అందరూ అనుకున్నారు. కానీ ఇంకో పది, పదిహేను ఏళ్ల దాకా జగన్ అధికారంలోకి వచ్చే ప్రశ్నే లేదన్న ధీమాతో వాళ్లంతా పెట్టుబడులు పెట్టారు.

తీరా చూస్తే బాబు రాజకీయంగా తప్పటడుగులు వేశారు. బిజెపితో పేచీ పెట్టుకుని ఎన్నికల సమయంలో అనేక రకాలుగా యిబ్బంది పడ్డారు. బిజెపితో పొత్తు పెట్టుకుని వుంటే గెలవకపోయినా, కనీసం జగన్‌కు యింత మెజారిటీ వచ్చేది కాదని, జగన్ యింతటి దుస్సాహసాలకు దిగేవాడు కాదనీ వాళ్లనుకుంటున్నారు. జగన్ అధికారంలోకి వచ్చి వాళ్లు భయపడిన దాని కంటె ఎక్కువగా దెబ్బ కొట్టాడు. అమరావతిని ఒట్టి లెజిస్లేటివ్ రాజధానిగా మిగిలుస్తున్నాడు. సింగపూరు వాళ్లకు ఉద్వాసన చెప్పాడు. అక్కడ పేదలకు యిళ్లస్థలాలు కేటాయించి, అమరావతిని అమరలోకం స్థాయి నుంచి నరలోకం స్థాయికి దించేస్తున్నాడు. దీనికి రాష్ట్రంలో మిగతా ప్రాంతాల నుంచి ప్రతికూల స్పందన లేదు. అమరావతి రైతులకు ఏదైనా చేయాలి పాపం అంటున్నారు తప్ప, మాకేమీ వద్దు అమరావతికే అన్నీ యివ్వండి అనటం లేదు. అందువలన జగన్ హాయిగా ముందుకు వెళ్లిపోతున్నారు.

రాజధానిని ముక్కలు చేయడంతో పెట్టుబడిదారులందరూ ఆర్థికంగా తీవ్రంగా నష్టపోయారు. ఎలాగైనా యీ ‘ఘోరకలి’ని ఆపాలని బాబుని కోరారు. బాబు చేయగలిగినంతా చేశారు. ఉత్తరాంధ్రలో, రాయలసీమలో టిడిపి స్థానిక నాయకులకు యిబ్బంది వస్తుందని తెలిసినా, అమరావతి నుంచి ఏదీ కదలడానికి వీల్లేదని భీష్మించారు. అమరావతిలో మూడు గ్రామాల ప్రజలచేత ఏకధాటీగా నిరాహార దీక్షలు చేయించారు. ఎన్నడూ లేనిది నందమూరి కుటుంబం కూడా రంగంలోకి దిగింది. బాబు భార్య ప్లాటినమ్ గాజులు విరాళమిచ్చారు. అది తప్ప రాష్ట్రంలో మరే సమస్యా లేనట్లు మీడియాలో ఎంతో హడావుడి చేశారు. కోర్టులో కేసులు వేశారు, మండలిలో అడ్డుకోబోయారు, ఏం చేసినా జగన్ వెనక్కి తగ్గటం లేదు.

ఇక మిగిలిన మార్గం కేంద్రం ద్వారా అడ్డుకోవడం మాత్రమే. బిజెపి రెండు స్వరాల్లో మాట్లాడిస్తోంది. అంతా రాష్ట్రప్రభుత్వ పరిధిలోనే వుంది అని కొందరు నాయకుల చేత, గతంలో మేం యిచ్చిన రాయలసీమ డిక్లరేషన్, మానిఫెస్టో జాన్తానై అమరావతి నుంచి హైకోర్టు కూడా కదలడానికి వీల్లేదు అని కొందరి చేత చెప్పిస్తోంది. ఈ పరిస్థితుల్లో కేంద్ర నాయకత్వం గట్టిగా ఓ నిర్ణయం తీసుకుంటే యిక ఎవరూ ఏమీ మాట్లాడడానికి వీల్లేదు. అందువలన బాబు బిజెపి అధిష్టానాన్ని మంచి చేసుకుందామని అవసరానికి మించి కష్టపడుతున్నారని నా ఊహ.

ఇంత చేసి బాబు బావుకున్నదేమిటి? ఆయనకు అనుకూలంగా అమరావతి పాట పాడుతున్న కన్నా లక్ష్మీనారాయణను బిజెపి అధిష్టానం పదవీకాలానికి ఏడాదికి ముందే తప్పించివేసింది. బాబంటే ముందు నుంచీ ఒంటికాలిపై లేచే సోము వీర్రాజుకు అధ్యక్ష పదవి కట్టబెట్టింది. గవర్నరు చేత మూడు రాజధానుల బిల్లుకు ఆమోదముద్ర వేయించింది. వైసిపి ప్రజాదరణ ఎల్లకాలం యిదే స్థాయిలో వుండదు. పోనుపోను తగ్గుతుంది కాబట్టి ప్రతిపక్షంగా టిడిపి స్పేస్‌ను ఆక్రమించడానికి బిజెపి సొంత పథకాలు వేసుకుంటోంది.

దేశంలో నాన్-బిజెపి పార్టీలన్నిటితో సత్సంబంధాలు చెడగొట్టుకుని బిజెపితో అంటకాగడానికి చూసినా బాబు అమరావతిని కాపాడుకోలేక పోయారు. తన బంధుమిత్రులందరికీ అంతులేని నిరాశను, అమితమైన ఆర్థిక నష్టాన్ని కలిగించారు. ఇప్పటికైనా బాబు బిజెపిని పట్టుకుని వేళ్లాడడం తగ్గించుకుని, యితర పార్టీలతో కనీసం మర్యాదగానైనా వుంటారనుకోవాలి. చూదాం, ఆయన వ్యూహం మరేదైనా వుందేమో!

– ఎమ్బీయస్ ప్రసాద్ (ఆగస్టు 2020)
mbsprasad@gmail.com

Show comments