ఎమ్బీయస్: కరోనా వాక్సిన్ – కాదేదీ పబ్లిసిటీ కనర్హం!-2

ఐసిఎమ్మార్ డైరక్టర్ జనరల్‌గా వున్న బలరామ్ భార్గవ హెల్త్ మినిస్ట్రీలో సెక్రటరీగా కూడా పని చేస్తారు. ఆయన ప్రభుత్వయంత్రాంగంలో భాగమే. స్వయంగా డాక్టరై వుండి ఆయన అంత వింతగా ప్రవర్తించారంటే దాని వెనుక రాజకీయ కారణాలు లేవని అనుకోగలమా? వాక్సిన్ క్లినికల్ ట్రయల్స్ మూడు దశల (ఫేజ్)లో సాగుతుంది. మొదటిది 28 రోజులు సాగుతుంది. దాని ఫలితాలను పరిశీలించి రెండవ దశకు అనుమతిస్తారు. హైదరాబాదులోని భారత్ బయోటెక్ వారి కోవాక్సిన్, అహ్మదాబాద్‌కు చెందిన జైడస్ కాడిల్లా వారి జైకోవ్-డి వాక్సిన్‌ల మొదటి దశ ప్రయోగాలు జులై 15న ప్రారంభమయ్యాయి. అంటే వాలంటీర్లను రిక్రూట్ చేసుకుని, వారి ఆరోగ్యస్థితిగతులు చూశారన్నమాట. జులై 20న నిమ్స్‌లో కోవాక్సిన్‌ను యిద్దరికి యిచ్చారు. వారిని 28 రోజులు పరీక్షించాలి. ఆ ఫలితాలు పరిశీలించేటప్పటికే ఆగస్టు 30 దాటిపోతుంది. జైడస్ వాళ్లదీ అంతే. ఇక ఆగస్టు 15 కల్లా వాక్సిన్ రెడీ అవుతుందని ఎలా చెప్పగలరు?

భారత్ బయోటెక్ తెలుగువారి కంపెనీ కాబట్టి మన తెలుగు మీడియా హడావుడి సాధారణంగా లేదు. ‘నిమ్స్‌లో యిద్దరు వాలంటీర్లకు టీకా యిచ్చారు, ప్రయోగం విజయవంతమైంది’ అని కేరింతలు! ఇంకా 28 రోజులు గడవాలి, ఫలితాలు చూడాలి, పరీక్ష రాయగానే సరిపోదు కదా, పేపరు దిద్దాలి, దానికి టైము పడుతుంది. పైగా దేశంలో 12 సెంటర్లలో పరీక్షలు నిర్వహిస్తున్నారంటే ఊరికే చేయటం లేదు కదా, అక్కడ వేర్వేరు తేదీల్లో ప్రారంభిస్తున్నారు. ఇవాళే ఎయిమ్స్‌లో ప్రారంభించారు. ప్రారంభించిన తేదీ నుంచి 28 రోజులు ఆగాలి. ఈ ఫలితాలన్నీ సమీక్షించుకున్నాకనే మొదటిదశ విజయవంతమైంది అనాలి. 

ఇప్పుడే విజయవంతమైంది అని మీడియా ఆర్భాటం చేస్తే అంటే అర్థమేమిటి? టీకా యివ్వగానే వాళ్లు సొమ్మసిల్లి పడిపోలేదు సుమా అనా? వాక్సిన్ తయారీలో దశాబ్దాల అనుభవం ఉంది కాబట్టే, సరైన టీకా తయారీకి నెలలు, సంవత్సరాలు పడుతుందనే (వారి రోటా వైరస్ దశాబ్దం పట్టిందట) ఎఱిక వుంది కాబట్టే భారత్ బయోటెక్ సిఎండి డా. ఎల్లా కృష్ణ వాక్సిన్ ఫలానా తేదికి తయారవుతుందని కమిట్ కావటం లేదు. ‘మొదటి, రెండవ దశ ప్రయోగాలు విజయవంతమైతే మూడో దశ ప్రయోగాలకు మినహాయింపు యిచ్చి వాక్సిన్ సత్వర తయారీకి అనుమతులు యిచ్చే అవకాశం వుంది’ అని మాత్రం అంటున్నారు.

క్లినికల్ ట్రయల్స్ జులై 7 నుంచి 12 సెంటర్లలో ప్రారంభం కావాలని ఐసిఎమ్మార్ ఆదేశించింది. 20 నుంచి అయింది. అక్కడే రెండు వారాలు ఆలస్యమైంది. ఇకనైనా ఆగస్టు 15కి రాదు అని నిర్ద్వంద్వంగా ప్రకటించేయకుండా నానుస్తూండడం దేనికి? మొదటి దశ ప్రయోగాలు మధ్యలో వుండగానే టీకా సక్సెస్ అని ప్రకటించేయడానికా? ఈలోగా మన మీడియా వారు ‘ఆనాడు ఆగస్టు 15 అంటే బానిసత్వం నుంచి విముక్తి, ఈనాటి ఆగస్టు 15 అంటే కరోనా నుంచి ముక్తి’ అని కవిత్వం అల్లేస్తున్నారు. భారతదేశం నుంచి తొలి స్వదేశీ, అత్యాధునికమైన బయోటెక్ వాక్సిన్ శాన్‌వాక్-బి 1997 ఆగస్టు 18న మార్కెట్‌లోకి విడుదలై ప్రపంచ ప్రఖ్యాతి గాంచి, దేశంలో బయోటెక్ విప్లవానికి నాంది పలికింది. భారత స్వాత్వంత్ర్య స్వర్ణోత్సవ వేళ స్వదేశీ ఉద్యమం మళ్లీ ఊపందుకుంది అంటూ ఆనాడు కీర్తించారు.

ఇప్పుడు భారత్ బయోటెక్ వాక్సిన్ కూడా మళ్లీ అలాటి స్వదేశీ అద్భుతం సాధించబోతోందని కథనాలు వస్తున్నాయి. కానీ అది ఎంతవరకు స్వదేశీ అనేదానిపై సందేహాలు వస్తున్నాయి. మానవ పరీక్షలు జరపడానికి ముందు వాక్సిన్‌ను జంతువులపై పరీక్షించి ఫలితాలు ప్రకటిస్తారు. ప్రపంచ ప్రఖ్యాతి చెందిన జర్నల్స్‌లో ప్రకటిస్తారు. పొరపాట్లు వస్తే అక్కడ సవరిస్తారు. ఈనాడు విజయానికి అతి దగ్గర్లోకి వస్తున్న ఆక్స్‌ఫర్డ్ యూనివర్శిటీ వాక్సిన్‌ను కోతులపై ప్రయోగించినప్పుడు విపరీత పరిణామాలు వచ్చాయని గతంలో వార్తలు వచ్చాయి. వాటిని సవరించుకుని, మానవ పరీక్షలకు అనుమతులు తెచ్చుకున్నారు. ఇప్పుడు కోవాక్సిన్‌ను మానవులపై ప్రయోగించడానికి డిసిజిఐ అనుమతి యిచ్చిందంటే దాని అర్థం జంతువులపై చేసిన పరీక్షలు విజయవంతమయ్యాయని అనుకోవాలి. ఆ ఫలితాలను భారత్ బయోటెక్ ఏ జర్నల్‌లోనూ ప్రకటించలేదు, జనాలకు తెలియపరచలేదు.

కంపెనీ ఏమంటోంది? ‘పూనా లోని నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ వైరాలజీ (ఎన్‌ఐవి) నుంచి ఐసోలేట్ చేసిన వాక్సిన్ స్ట్రెయిన్‌ను ఐసిఎమ్మార్ యిప్పించింది. దానిని కాస్త డెవలప్ చేసి మేం మానవ పరీక్షలకు వెళుతున్నాం’ అంటోంది. ఇప్పించింది ఎప్పుడు? మే 9న. మరి మానవ పరీక్షలకు వెళుతున్నామని కంపెనీ ప్రకటించినది ఎప్పుడు జూన్ 29న. మధ్యలో 50 రోజులున్నాయి. ఈ లోపుగా జంతువులపై పరీక్షలు అయిపోయాయా? ఎలా అవుతాయి? జంతువులపై పరీక్షలకు కనీసం 3 నెలలు పడుతుందని డా. ఎల్లా కృష్ణ ఏప్రిల్ 7 నాటి యింటర్వ్యూలో చెప్పారు. పైగా యీ వైరస్ మామూలు ఎలుకలపై చేస్తే పనికి రాదు. వాటికి కరోనావైరస్ సోకదట. అందువలన ఎచ్‌ఏసిఇ2 ట్రాన్స్‌జెనిక్ ఎలకలపైనే చేసి ఫలితాలు చూడాలి. అవి అమెరికా, యూరోప్, చైనాల నుంచి దిగుమతి చేసుకోవాలని కృష్ణగారే చెప్పారు.

ఇంత వ్యవహారం ఉన్నపుడు 50 రోజుల్లో జంతువులపై పరీక్షలు చేసేయడం, వాటి ఫలితాలను డిసిజిఐకి పంపేయడం, వాటిని చూసి అది తృప్తి పడి మానవపరీక్షలకు అనుమతి యిచ్చేయడం ఎలా జరుగుతుంది? అంటే జంతువులమీద ప్రయోగాలు జరపకుండానే ఎకాయెకి మనుషుల మీద చేసేస్తున్నారా? కరోనా వాక్సిన్ అవసరం ఎంత వున్నా అంత దుస్సాహసం చేయరనుకుంటా. ముఖ్యంగా భారత్ బయోటెక్! వారి హెపటైటిస్-బి వాక్సిన్ వికటించిందంటూ కుమావత్ అనే ఐపిఎస్ అధికారి కేసు వేసిన చరిత్ర వుంది. రోటావైరస్ తయారైందంటూ మోదీ గారిచే 2015లో ఆవిష్కరింప చేసినా దాన్ని మార్కెట్లో ప్రవేశపెట్టడానికి దాదాపు రెండేళ్లు తీసుకున్నారు. అందువలన ఎన్‌ఐవి నుంచి భారత్‌కు ఏ దశలో వాక్సిన్ కాండిడేట్ వచ్చిందనే విషయంపై అనుమానం కలిగింది.

ఈ విషయంపై లోతుగా వెళ్లిన ‘ద వైర్ సైన్స్’ అనే వెబ్‌సైట్ ఒక ఊహ చేసింది. (https://science.thewire.in/health/how-indigenous-is-bharat-biotechs-new-covid-19-vaccine-covaxin/ )  

భారత్ బయోటెక్ గత కొన్ని నెలలుగా తాము కోవిడ్ నిరోధించడానికి రకరకాల వాక్సిన్‌లకై విస్కాన్‌సన్ యూనివర్శిటీతో, జెఫర్సన్ వాక్సిన్ సెంటర్ (జెవిసి)లతో సంప్రదిస్తున్నామని చెప్తోంది. రెండోదానితో కరోనా వైరస్‌కై ఇనాక్టివేటెడ్ రాబిస్ వాక్సిన్‌కై మే 20న ఒప్పందం చేసుకుంది. ఈ వాక్సిన్ బాగా పనిచేస్తోందని జెవిసి ఏప్రిల్ 7న ప్రకటించింది. దానికి కోరావాక్స్ అని పేరు పెట్టింది కూడా. ఈ కోరావాక్స్‌నే యిప్పుడు కోవాక్సిన్‌గా ప్రచారం చేస్తున్నారని ఆ వ్యాసకర్త సంశయం వెలిబుచ్చాడు. భారత్ బయోటెక్ నుంచి వివరణ కోరినా యింకా రాలేదు. కంపెనీ వారు జంతు పరీక్షల వివరాలు ప్రకటించకపోవడంతో వారి గోప్యత కారణంగా యీ సందేహం కలిగింది.

దీని అర్థమేమిటంటే భారత్ వారు జెవిసి సహాయంతో ఒక దశ వరకు తయారైన, అంటే ప్రి-క్లినికల్ టెస్టులు పూర్తి చేసుకున్న వాక్సిన్‌ కాండిడేట్‌ను తెచ్చుకుంటే ఐసిఎమ్మార్ దాన్ని తాము యిప్పించినట్లుగా, అంతా దేశంలోనే తమ ఆధ్వర్యంలో జరిగినట్లుగా ప్రచారం చేసుకుందా మనుకుంటోందన్నమాట. తమది కేవలం ఆఫీసే కాబట్టి అందరికీ తెలుసు కాబట్టి ల్యాబ్ ఉన్న ఎన్‌ఐవి పేరు కలిపింది. ఈ అభిప్రాయం నిజం కాకూడదని ఆశిద్దాం. నిజమైతే మాత్రం యిది పబ్లిసిటీ కోసం మసిపూసి మారేడుకాయ చేయడం లాటిదే. భారత్ బయోటెక్ వారు, ఎన్‌ఐవి వారు తేదీల వారీ పరీక్షల వివరాలు యిస్తే తప్ప యీ సందేహం మనసులో మెదలుతూనే వుంటుంది. 

ఎందుకంటే దీనితో బాటు భారత్‌లో తయారవుతున్న జైడస్ కాడిల్లా వారి జైకోవ్-డి వాక్సిన్ ‘తాము మార్చి నుంచి జంతుపరీక్షలు నిర్వహించి, అవి విజయవంతమైన తర్వాతనే మానవపరీక్షలకు దిగాం’ అని ప్రకటించుకుంది. జంతుపరీక్షలకు మూడు నెలలు అనే టైమ్‌లైన్ వారి విషయంలో అతుకుతోంది. ఇంకో సంగతేమిటంటే యీ రెండు వాక్సిన్‌ల స్వభావంలో తేడా వుంది. జైకోవ్ ప్లాస్మిడ్స్‌ ఎ టైప్ డిఎన్ఏ మాలిక్యూల్. భారత్ వారి కోవాక్సిన్ ఇనాక్టివేటెడ్ వాక్సిన్. వాక్సిన్‌లలో భేదాలేమిటి, ఏ తరహా దానిలో ఎటువంటి ప్రయోజనం వుంది, ఇప్పటివరకు వచ్చిన వాక్సిన్‌లలో ఏవి ఫలప్రదమయ్యాయి, ఏవి కాలేదు అనే విషయాలన్నీ ‘‘ఇండియా టుడే’’ జులై 20 సంచికలో వివరంగా యిచ్చారు. వీలైతే చదవండి.

దానిలో రాసిన ప్రకారం లైవ్ (సజీవమైన) ఎటెన్యుయేటెడ్ (బలహీనపరచబడిన) వాక్సిన్. అంటే మన మీజిల్స్ వాక్సిన్ లాటిదన్నమాట. బలహీనపరచిన జీవపదార్థాన్ని మన దేహంలో ప్రవేశపెడతారు. దీని నుంచి కాపాడుకోవడానికి మన శరీరంలో యాంటీబాడీస్ తయారవుతాయి. ఇది బలమైన, చాలాకాలం పనిచేసే టీకా. అయితే దీనిలో యిబ్బందేమిటంటే ఒక్కోప్పుడు మనకు రోగాన్ని అంటించే ప్రమాదం (విరులెన్స్) వుంది. పైగా టీకా రవాణా చేసినప్పుడు, డాక్టర్ దగ్గర ఎల్లప్పుడు ఫ్రిజ్‌లో వుంచాలి. (కోల్డ్ చైన్‌గా వ్యవహరిస్తారు), కోవాక్సిన్ కిల్డ్ లేదా ఇనాక్టివేటెడ్ వాక్సిన్. దీనిలో విరులెన్స్ ప్రమాదం లేదు. కోల్డ్ చైన్ అవసరం లేదు. తయారీ సులభం. అయితే లైవ్ దాని కంటె తక్కువ రక్షణ కల్పిస్తుంది.

ఇక రీకాంబినెంట్ ప్రొటీన్ వాక్సిన్. ఇది కరక్టుగా వైరస్ యొక్క ఆయువుపట్టుపై దాడి చేస్తుంది. కానీ యిబ్బందేమిటంటే దీని సామర్థ్యాన్ని పెంచడానికి దీనిలో ఎడ్‌జువాంట్ కలపవలసి వస్తుంది. కెమికల్ రియాక్షన్‌లో కేటలిస్టులా అది ప్రక్రియలో పాలు పంచుకోకుండానే చర్యను వేగవంతం, సమర్థవంతం చేస్తుంది. అయితే దీని వాడకం వలన కొందరిలో చిన్నపాటి సైడ్ ఎఫెక్టులు వుంటాయి. కానీ మొత్తం మీద చూస్తే యివే బాగా ఆదరణ పొందాయి. హెపటైటిస్ వాక్సిన్లు యీ పద్ధతిలోనే తయారవుతున్నాయి.

జైకోవ్ డిఎన్‌ఏ వాక్సిన్ తరహా టీకా. లాభాలేమిటంటే ఖర్చు తక్కువ, త్వరగా తయారుచేయవచ్చు, దీర్ఘకాలం రక్షణ యిస్తుంది, కోల్డ్ చైన్ అవసరం లేదు, త్వరగా తయారు చేయవచ్చు. అయితే దీనిలో యిబ్బందేమిటంటే, దీన్ని యిప్పటిదాకా జంతువులపైనే ప్రయోగించారు. మొట్టమొదటిసారి మనుష్యులపై ప్రయోగిస్తున్నారు. ఇది మానవ డిఎన్‌ఏతో కలిసిపోయి అతని జీవలక్షణాలను ప్రభావితం చేయవచ్చు, దానితో విరోధించవచ్చు. ఎమ్‌ఆర్‌ఎన్ఏ వాక్సిన్‌ అనే కొత్త తరహా వాక్సిన్‌పై కూడా ప్రయోగాలు జరుగుతున్నాయి.

బిబిసి వారి ప్రకారం ప్రపంచవ్యాప్తంగా 140 వాక్సిన్‌లు ప్రి-క్లినికల్ దశలో వున్నాయి. మానవపరీక్షలు మొదటి దశలో ఉన్నవి 10, రెండో దశలో వున్నవి 9, మూడో దశలో ఉన్నవి 4. ఈ వైరస్ ఉధృతి ఒక్కో దేశంలో ఒక్కోలా వుంటోందని అందరికీ తెలుస్తోంది. అందువలన మానవపరీక్షలు వివిధ దేశాల్లోని ప్రజలపై నిర్వహించి, ఫలితాలను సమన్వయం చేసుకుంటే తప్ప దాని పనితీరు గురించి ఒక అవగాహన ఏర్పడదు. చైనా నుంచి, రష్యా నుంచి వాక్సిన్‌లు వచ్చేస్తున్నాయంటున్నారు కానీ వాళ్ల మీద మనకు నమ్మకం తక్కువ కాబట్టి, ఎంతవరకు నిజమో తెలియదు. ఉన్నవాటిలో మోడెర్నా వాళ్లది, ఆక్స్‌ఫర్డ్‌ వాళ్లది కాస్త ఆశాజనకంగా వున్నాయి. 

ఆక్స్‌ఫర్డ్‌తో ఆస్ట్రాజెన్‌కా ద్వారా ఏర్పాటు కుదుర్చుకున్న పుణెలోని సీరమ్ యిన్‌స్టిట్యూట్‌లో భారీ వాక్సిన్ తయారీకి ఏర్పాట్లు వున్నాయి. సాధనసంపత్తి వుంది. కోవిషీల్డ్ పేర వాక్సిన్ తయారు చేస్తామని, బ్రిటన్‌లో మానవపరీక్షలు విజయవంతమయ్యాక యిక్కడా ఆగస్టు నెల చివరిలో పరీక్షలు ప్రారంభిస్తామంటున్నారు. అగ్రగామిగా వున్న ఆక్స్‌ఫర్డ్‌ వాక్సిన్ పరిస్థితే అలా వుంటే జులై 3 వారంలో మొదటి దశ పరీక్షలు ప్రారంభించిన మన భారత వాక్సిన్‌లు ఎప్పటికి తయారవుతాయో మనం ఊహించుకోవచ్చు. అలాటి పరిస్థితిలో ఆగస్టు 15 ప్రకటన ఎంత బోగస్సో అందరికీ అర్థమౌతోంది. 

ఇక్కడ తమాషా ఏమిటంటే ప్రపంచ ఆరోగ్య సంస్థలో వున్న భారతీయ నిపుణురాలు డా. సౌమ్యా స్వామినాథన్ 2021 మధ్యలో వస్తుందని చెప్తున్నారు. మన కేంద్ర ఆరోగ్యమంత్రి డా. హర్షవర్ధన్ నిజాయితీగా హీనపక్షం ఏడాది ఏడాది పడుతుందని ప్రకటించారు. అంటే అదీ 2021 జూన్ ప్రాంతమే అవుతుంది. కానీ అదే శాఖలో సెక్రటరీగా పనిచేస్తున్న ఐసిఎమ్మార్ చీఫ్ బలరాం భార్గవ ఆగస్టు 15 పాట పాడుతున్నారంటే ఆయన చేత ఎవరో పెద్ద తలకాయ అనిపిస్తున్నారని ఖచ్చితంగా అనుకోవచ్చు. అలాటి పబ్లిసిటీ అవసరం మోదీకే వుంది. ఇటీవల చైనాతో మనం సరిగ్గా వ్యవహరించలేదన్న అభిప్రాయాలు వెలువడగానే ఓ వాట్సాప్ షికార్లు కొట్టసాగింది. మోదీ ఓ రాత్రంతా మేల్కొని వుండి, నాలుగు దేశాల కుట్రను ఛేదించి పారేశారని. పాలకుల పలుకుబడికి విఘాతం కలిగినప్పుడు యిలాటి గారడీలు సహజం. కరోనా వాక్సిన్‌ను కూడా దీనికి వాడుకోవడం విషాదకరం. 

ఏమైనా అంటే నిరాశా నిస్పృహల్లో వున్న జనానికి హుషారు కలిగించడానికి ఏదో ఒక వాక్సిన్‌ను పట్టుకుని వచ్చి వాళ్లకు యిస్తున్నాం అనవచ్చు. పనిచేసినవాళ్లకు పనిచేయవచ్చు, లేకపోతే లేకపోవచ్చు. ‘‘రాజూపేదా’’ సినిమాలో రేలంగి జేబులో బొమ్మలా యిదో సైకలాజికల్ ట్రీట్‌మెంట్ అని బుకాయించవచ్చు. ఇదో రకమైన ప్లాసెబో అని శాస్త్రీయంగా పేరు అద్దవచ్చు. కానీ యిది విఫలం చెందితే ప్రజలకు పాలకులపైనే కాదు, శాస్త్రజ్ఞులపైన కూడా నమ్మకం పోతుంది. ఫార్మా కంపెనీలను కసాయివాళ్లగా చూస్తారు. ఏ మందూ వాడడం మానేసి మరిన్ని ప్రమాదాల పాలవుతారు. ఉచిత టీకాలు వేయించుకోండి అని జనాలను కన్విన్స్ చేయడానికి కూడా అమితాబ్ బచ్చన్‌ చేత చెప్పించాల్సి వచ్చింది. ఇప్పుడు పబ్లిసిటీ కోసం అరకొర సామర్థ్యం గల వాక్సిన్‌ను ఆదరాబాదరాగా వాడకంలోకి తెస్తే ప్రజలు మరే వాక్సిన్‌నూ వాడకపోవచ్చు. అది ప్రజారోగ్యానికే ముప్పు.

నిరూపితం కాని, యింకా మొదలే కాని వాక్సిన్‌కు విపరీత ప్రచారం కల్పించడం వలన, ప్రజల్లో ఆశలు బాగా పెంచేస్తోంది తెలుగు మీడియా. ఆశ ఎంత పెరిగితే ఆశాభంగం కూడా అదే స్థాయిలో వుండే ప్రమాదం వుందని గ్రహించాలి. భారత్ బయోటెక్ సిఎండి డా. ఎల్లా కృష్ణ తెలుగువారు కావడమే కాకుండా ఈనాడు గ్రూపు మేనేజింగ్ డైరక్టర్ కిరణ్‌కు వియ్యంకుడు కావడం చేతనే యింత హంగామా అని కొందరంటున్నారు కానీ నేను ఏకీభవించను. భారత్ బయోటెక్ గతంలో కూడా చాలా వాక్సిన్‌లు చేసింది. అప్పుడు యింత పబ్లిసిటీ లేదు. ఈనాడుపై రిలయన్స్ ద్వారా కేంద్రంలోని పెద్దల ఒత్తడి వుండి వుండవచ్చు. 

ఏది ఏమైనా యిది బెడిసి కొడితే దేశానికి చాలా చెడ్డపేరు వస్తుంది. ఐసిఎమ్మార్ ఆగస్టు 15 తర్వాత ప్రపంచ శాస్త్రజ్ఞులు ముక్కు మీద వేలేసుకున్నారు. కొందరు హేళన చేశారు. ఎందుకంటే వాక్సిన్ షెడ్యూల్ గురించి మన టీవీల్లో చర్చల ద్వారా సాధారణ గృహిణికి కూడా తెలుసు. మరి ఒక శాస్త్రీయ సంస్థ అలా ఎలా చెప్తుంది? అసలే మన దేశంలో జరిగే పరిశోధనలంటే ప్రపంచంలోని సైంటిఫిక్ కమ్యూనిటీకి కొంత సంశయం. దానికి తోడు యిది కూడానా! ఇలా అయితే మనం చైనాకు పోటీగా ఎప్పటికి ఎదగగలం?

ప్రపంచ ఆరోగ్య సంస్థ-ఎచ్‌సిక్యూ వివాదంలో భారతీయ సంతతికి చెందిన అమెరికన్ డాక్టర్లు చాలా అప్రతిష్ఠ తెచ్చిపెట్టారు. దాని గురించి తెలియనివారి కోసం క్లుప్తంగా - మలేరియా డ్రగ్ అయిన ఎచ్‌సిక్యూ (హైడ్రాక్సీక్లోరోక్విన్)ను కాస్త అటూయిటూ మార్పులు చేసి కోవిడ్‌కు వాడడంపై ప్రపంచవ్యాప్తంగా ప్రయోగాలు జరుగుతూండగానే మే 1న ‘ఎన్‌జిఐఎమ్‌’ (న్యూ ఇంగ్లండ్ జర్నల్ ఆఫ్ మెడిసిన్) హృద్రోగం వున్న కోవిడ్ రోగులు దీనివలన మృత్యువాత పడతారని ఒక వ్యాసాన్ని ప్రచురించింది. మే 22న ‘‘లాన్‌సెట్‌’’ అనే మరో ప్రపంచ ప్రసిద్ధ మెడికల్ జర్నల్ హెచ్‌సిక్యూ వాడకం వలన హార్ట్‌బీట్ రిథమ్‌లో మార్పులు వస్తున్నాయని ఒక వ్యాసాన్ని ప్రచురించింది. ఈ రెండిటిని రాసిన వైద్యబృందాలలో కొందరు సభ్యులు కామన్‌గా వున్నారు. 

ఇవి చూసి ప్రపంచ ఆరోగ్య సంస్థ ‘ఎందుకైనా మంచిదంటూ’ కోవిడ్ రోగులపై ఎచ్‌సిక్యూ పరీక్షలు నిలిపివేయమని సలహా యిచ్చింది. వెంటనే కొన్ని యూరోప్ దేశాలు దీన్ని అమలు చేశాయి. ప్రపంచ ఆరోగ్య సంస్థ సలహాకు అభ్యంతరం తెలుపుతూ 100 మంది సైంటిస్టులు ఈ వ్యాసరచయితలపై దండెత్తి, తమ వాదనలను నిరూపించుకోమని అడిగారు. వెంటనే యీ వ్యాసరచయితలు తమకు సమాచారం అందించిన సర్జిస్ఫియర్ అనే  సంస్థ సహకరించటం లేదంటూ చేతులెత్తేశారు. వ్యాసాలను ప్రచురించిన రెండు పత్రికలూ వాటిని ఉపసంహరించు కుంటున్నామంటూ జూన్ మొదటివారంలో ప్రకటించాయి. 

ఇంతకీ ఈ సర్జిస్ఫియర్ కథేమిటి? ఆరు ఖండాల్లోని 671 ఆసుపత్రులలోని 96 వేల మంది రోగుల వివరాలు సేకరించామని చెప్పుకుంటున్న యీ సంస్థలో గుప్పెడు మంది ఉద్యోగులున్నారుట. వాళ్లకు అనుభవమూ తక్కువట. కేవలం రెండు నెలల్లో అంతటి డేటా సేకరించడం, విశ్లేషించడం అసంభవం. వివాదం వచ్చాక మీ డేటాను ‘పియర్ రివ్యూ’ (నిపుణుల సమీక్ష) చేయిస్తామంటే ఆ సంస్థ ‘అది క్లయింట్‌ గోప్యతకు భంగం కలిగిస్తుంది’ అనే మిషపై నిరాకరించింది. మామూలుగా యీ పత్రికలు పియర్ రివ్యూ చేయించనిదే వ్యాసాలు ప్రచురించవు. కానీ యీ వ్యాసాల విషయంలో అది జరిపించకపోవడంతో యీ అనర్థం జరిగింది. 

విశ్వసనీయత లేని కంపెనీ యిచ్చిన డేటా ఆధారంగా వ్యాస రచయితలు వ్యాసాలు రాసేసి ప్రపంచప్రజలను భయభ్రాంతులను చేసి పరిశోధనలకు విఘాతం కలిగించడం ఎంత ఘోరం? ఈ రెండు వ్యాసాలు రాసిన బృందాలకు సారథ్యం వహించిన హృద్రోగ నిపుణుడు డా. మన్‌దీప్ మెహ్రా క్షమాపణ చెప్పారు. ఈ సర్జిస్ఫియర్ నడిపే మరో భారతీయుడు డా. సపన్ దేశాయ్ మాత్రం యిప్పటిదాకా క్షమాపణ చెప్పినట్లు లేదు. అతను దీనికి ముందే వివాదాల్లో యిరుక్కుని కేసులు ఎదుర్కుంటున్నాడు. తన బంధువైన డా. అమిత్ పటేల్ ద్వారా మెహ్రా పరిచయం పెంచుకుని ఆయనను తప్పుదోవ పట్టించాడని అంటున్నారు. తెలిసీ తెలియకుండా అబద్ధాలు ప్రచారం చేసి, చికిత్సాప్రయోగాలను ఆలస్యం చేసి, తమ ప్రాణాలతో చెలగాటమాడిన యీ మేధావులను కోవిడ్ చికిత్సకై, వాక్సిన్‌కై వేయి కళ్లతో ఎదురుచూస్తున్న సామాన్య మానవుడు ఎప్పటికైనా క్షమించగలదా?

ఒక నెల వ్యర్థమైనందుకే ఆ భారతీయ సంతతి ‌డాక్టర్లపై కోపం వస్తే, మరి పరీక్షలు సరిగ్గా నిర్వహించకుండా వాక్సిన్‌ను మార్కెట్లోకి విడుదల చేస్తే ప్రజలకు ఎంత ఆగ్రహం వస్తుంది? 1960లలో పోలియో వాక్సిన్‌ విషయంలో యిలా జరిగింది. రక్షణ కల్పించకపోగా వ్యాధి సంక్రమించింది. నేను మద్రాసులో పని చేసేటప్పుడు మా బ్యాంక్‌ సెక్యూరిటీ గార్డు కూతురికి ఆ బ్యాచ్‌లో వాక్సిన్ యిప్పిస్తే దాని కారణంగా పోలియో వచ్చింది. ఎంత ఘోరమో చూడండి. ఆ అమ్మాయి ఉత్తి పుణ్యానికి జీవితమంతా అవిటిదై పోయింది. ప్రభుత్వం నష్టపరిహారంగా ప్రతీ నెలా కొంత మొత్తం పంపిస్తూ వుండేది. కానీ అదేమైనా ఆమె బాధను తగ్గించగలదా? అది చూశాను కాబట్టి, నేనైతే సరిగ్గా పరీక్షలు జరిపారని ఖచ్చితంగా తేలిన వాక్సిన్‌నే వేయించుకుంటాను తప్ప ఆర్భాటం కోసం రిలీజ్ డేట్ ముందే విడుదల చేసే, అరకొర వాక్సిన్ కోసం పరుగులు పెట్టను. అప్పటిదాకా వేణ్నీళ్లు, ఆవిరి పట్టుకోవడాలు వంటి గృహవైద్యంతోనే యిమ్యూనిటీని కాపాడుకుంటాను.

– ఎమ్బీయస్ ప్రసాద్ (జులై 2020)

Show comments