ఎమ్బీయస్‌ : నెరజాణల కథలు 10

శాన్‌ పాంక్రజియో అనే వూళ్లో పషియో అనే ధనిక వ్యాపారి వుండేవాడు. అతనికి మధ్యవయసులో వుండగానే దైవచింతన పెరిగి పోయింది.  అది హద్దులు మీరి అతను ఫ్రయర్‌ అయ్యేవరకూ వెళ్లింది. అతని భార్య ఇసబెల్లాకు వయసు ఇరవై ఎనిమిది నుండి ముప్ఫయి మధ్యలో వుంటుంది. వాంఛలు వుడిగే వయసు కాదు. కానీ యితను వ్యాపారపు పనులు ముగించుకుని వచ్చాక ప్రార్థనల్లో, ధ్యానంలో మునిగేవాడు. విపరీతంగా ఉపవాసాలు చేసేవాడు. రాత్రి పక్క మీద కోరికతో భార్య దరిచేరితే ఆమెను ఆధ్యాత్మికప్రసంగాలతో విసిగించేవాడు. ఆమె నిరాశానిస్పృహలతో కాలం గడిపేది.

ఇలా వుండగా డామ్‌ ఫెలిస్‌ అనే సన్యాసి ఆ వూరి చర్చికి వచ్చాడు. అతని జ్ఞానం, తెలివితేటలు చూసి ముచ్చటపడిన పషియో ప్రవచనాల కోసం అతన్ని యింటికి భోజనానికి పిలిచాడు. ఇసబెల్లాకు యిలాటి సన్యాసులంటే ఒళ్లు మంట అయినా భర్త మొహం చూసి అతనికి అతిథి మర్యాదలు బాగానే చేసింది. యువకుడు, అందగాడు, టక్కరి అయిన ఫెలిస్‌ ఆ యింట్లో పరిస్థితిని యిట్టే గమనించాడు. ఇసబెల్లా దేహం దేనికోసం అల్లాడుతోందో అర్థం చేసుకున్నాడు. అతను వృత్తిరీత్యా సన్యాసే కానీ వాంఛలు చావని సన్యాసి. అందువలన ఆమెకేసి దొంగచూపులు చూడసాగాడు.

అప్పటిదాకా అతన్ని ఆ దృష్టితో చూడని ఇసబెల్లా ఆశ్చర్యపడినా, ఆనందించింది. తనూ కళ్లతోనే సందేశాలు పంపింది. ఒకరోజు పషియో లేకుండా చూసి ఫెలిస్‌ తన మనసులో మాట ఆమెకు చెప్పేశాడు. ''నాకూ యిష్టమే, కానీ యిది సాధ్యపడేదెలా? మా ఆయన పగలు దుకాణంలో వున్నా రాత్రంతా యింట్లోనే వుంటాడు. మీరు పగలు వస్తే అందరి కంటా పడతారు, రాత్రి వస్తే ఆయన కంట పడతారు. ఇల్లు కాక వేరే చోటంటే నేనొప్పుకోను. ఎవరి కంటైనా పడితే పరువు పోతుందని భయం.'' అందామె.

ఫెలిస్‌ దాని గురించి ఒక ఉపాయం ఆలోచించాడు. ఒకరోజు పషియోను చర్చికి పిలిచి ఆంతరంగికంగా మాట్లాడాడు - ''నువ్వు చాలా ధార్మికబుద్ధి వున్నవాడివని, వైరాగ్యమార్గం ద్వారా స్వర్గప్రాప్తికై తహతహలాడుతున్నావనీ గమనించాను. దానికై నువ్వు ఏయే రకాలుగా సాధన చేస్తున్నావో చెప్పు.'' అన్నాడు.

దానికి సమాధానంగా పషియో చెప్పినదంతా ఓపిగ్గా విని ''ఇది చాలా చుట్టుదారి. చాలా ఏళ్లు పడుతుంది. ఒక్కోప్పుడు ఫలితం సిద్ధించకపోవచ్చేమో కూడా. కానీ వేరే అడ్డదారి కూడా వుంది. అది పోప్‌కు, ఆయనకు అతి సన్నిహితంగా వుండేవారికి మాత్రమే తెలుసు. కఠోరదీక్షతో నలభై రోజులపాటు నిష్ఠగా తపస్సు చేస్తే తప్పక ఫలిస్తుంది. కానీ మామూలు మనుషులకు అసాధ్యం. పోప్‌కు స్నేహితుడైన ఒక వ్యక్తి ద్వారా నాకా ఉపాయం తెలుసు. నేను అవలంబించి సాధించాను. నువ్వు బుద్ధిమంతుడివి కాబట్టి అది నీకు చెప్దామనుకుంటున్నాను. చేసే ఓపిక నీకుందా?'' అని అడిగాడు ఫెలిస్‌.

''నేనూ చాలా రోజులుగా వీటిలో తిరుగుతున్నాను. కానీ మీరు చెప్పేది ఎక్కడా వినలేదు. నలభై రోజులు కష్టపడితే చాలు, స్వర్గం లభిస్తుందంటే మరి ఆ మార్గం గురించి ఎవరికీ తెలియకుండా వుంటుందా?'' అని సందేహించాడు పషియో.

ఫెలిస్‌ నవ్వాడు. ''అమాయకుడా, నువ్వు గమనించవలసినదేమిటంటే చర్చి, పూజారులు అందరూ బతికేది దేనిమీద? భక్తులు యిచ్చే విరాళాల మీద! ఈ అడ్డదారి గురించి తెలిసిపోతే అందరూ అదే దారి పడతారు. నలభై రోజులపాటు ఎలాగోలా అవస్థపడ్డారంటే స్వర్గం దొరుకుతుంది కదా, యిక విరాళాలు యిచ్చేదెందుకు అనుకుంటారు. మరి పూజారులకు గడిచేదెలా? అందువలన భక్తులకు డొంకతిరుగుడు దారే చూపిస్తారు తప్ప అడ్డదారి చూపించరు.'' అని వివరించాడు.

పషియో నమ్మాడు. విధివిధానాలు చెప్పమని బతిమాలాడాడు. అప్పుడు ఫెలిస్‌ చెప్పుకొచ్చాడు - ''ముందుగానే చెప్తున్నాను. ఈ తపస్సు వలన యిప్పటిదాకా చేసిన పాపాలే పోతాయి. ఆపైన పాపాలు చేయకుండా జాగ్రత్తగా వుండాలి. వెంటనే మీ యింట్లో పడకగదికి పక్కనున్న గదిలో గోడకు శిలువ ఆకారంలో చెక్క ముక్కలు కొట్టించాలి. మనిషిని మోయగలిగనంత కొయ్యలు వాటికి అమర్చాలి. ఇంటి కప్పులో కొంతమేర గాజుపలక పెట్టించాలి.

‘‘ఇక యీ తపస్సు చేసే నలభై రోజులు ఒంటిపూట మాత్రమే భోజనం చేయాలి. పగలు నీ వ్యాపారం చూసుకుని వచ్చాక రాత్రి నువ్వు ఆ శిలువపై ఏసుక్రీస్తులా చేతులు అటూ యిటూ వేలాడేసి, కాళ్లు కిందకు వేలాడేసి కప్పులోంచి ఆకాశం వైపు చూస్తూ నేను చెప్పబోయే మంత్రాన్ని పఠిస్తూ రాత్రంతా గడపాలి. చుట్టూ ఏ శబ్దాలు వచ్చిన నీ ధ్యానం చెదరకూడదు, నువ్వు కదలకూడదు. తెల్లవారు ఝామున ఉదయపు ప్రార్థనకై చర్చి ఘంటారావం వినబడేదాకా శిలువ దిగకూడదు.

‘‘తర్వాత దిగి, నీ స్నానపానాదులు ముగించుకుని, వ్యాపారం చూసుకోవడానికి వెళ్లు. మధ్యలో సమయం చిక్కినప్పుడల్లా చర్చికి వెళ్లి కూర్చుని ప్రసంగాలు వింటూ వుండు. ఈ నలభై రోజుల్లో నువ్వు యితర స్త్రీలతోనే కాదు, సొంత భార్యతో కూడా సంపర్కం పెట్టుకోరాదు. దీని సంగతి పరులకు తెలియరాదు. నువ్వు ఎవరికీ చెప్పరాదు.'' అని ఒట్లేయించాడు.

పషియోకు యీ దారి ద్వారా స్వర్గాన్ని చేజిక్కించుకోవాలన్న ఆశ పుట్టింది. వెళ్లి భార్యతో చెప్పాడు. గదిలో ఒంటరిగా రాత్రంతా వేళ్లాడుతూ వుండాలని ఫెలిస్‌ చెప్పాడని వినగానే ఆమె సంగతి గ్రహించింది. వినయం నటిస్తూ ''మీకు స్వర్గం లభిస్తుందంటే నాకు మాత్రం ఆనందం కాదా? మీకోసం ఆ నలభై రోజులు ఉపవాసం చేస్తాను.'' అంది. వద్దువద్దన్నా వినలేదు.

ఆ పై ఆదివారమే పషియో తపస్సు ప్రారంభమైంది, దానితో బాటే అతని భార్య శారీరకతాపం కూడా ఉపశమించ సాగింది. రాత్రి పషియో తన గదిలోకి వెళ్లి తలుపులు మూసుకుని శిలువ ఎక్కగానే ఫెలిస్‌ చర్చి నుంచి తినుబండారాలు, మద్యం పట్టుకుని చాటుగా అతని యింటికి వచ్చేవాడు. ఇసబెల్లాతో కలిసి విందు, పొందు అనుభవించేవాడు. తెల్లవారుఝామునే చర్చికి తిరిగి వెళ్లిపోయేవాడు.

చాలాకాలంగా కామంతో తహతహలాడుతున్న ఇసబెల్లా ఫెలిస్‌ పరిష్వంగంలో కరిగిపోయి కులకసాగింది. పోనుపోను ఉద్రేకం పట్టలేక మరింత గాఢరతిని కోరుకునేది. ఒకసారి మదనక్రీడలో ఆమె శయ్య విపరీతంగా వూగిపోయి, చెక్కగోడలు కూడా కదలసాగాయి. ఆ గోడకు అవతలవైపు అమర్చిన శిలువపై వేళ్లాడుతున్న పషియో కింద పడబోయి తమాయించుకుని, చదువుతున్న మంత్రాలను మధ్యలో ఆపి ''ఏమవుతోంది, ఇసబెల్లా?'' అని అరిచాడు.

''నేను పక్కమీద పొర్లాడుతున్నానండీ'' అంది ఇసబెల్లా.

''పొర్లాడడం దేనికి?'' అన్నాడు పషియో అయోమయంగా.

''మీరేగా చెప్తూంటారు - పగలు ఉపవాసం వున్నవారు రాత్రి పక్కలో పొర్లాడుతారని..'' అంది ఆ జాణ.

''ఔనౌను, నేను వద్దని వారించినా వినకుండా ఉపవాసాలు చేస్తున్నావు. పాపం రాత్రి నిద్రపట్టక దొర్లుతున్నావు. కానీ కాస్త నెమ్మదిగా చేయి. ఇవతల నేను కిందపడేట్టున్నాను.'' అని మొత్తుకున్నాడు పషియో.

''మన ధాటికి వాడు కింద పడితే అసలుకు మోసం వస్తుంది. రేపట్నుంచి మనం వేరే గదిలో వెళ్లి తంటాలు పడదాం. అక్కడ మంచం లేకపోయినా ఫర్వాలేదు.'' అన్నాడు ఫెలిస్‌.

''నువ్వు ఎక్కడికి రమ్మనమన్నా వస్తాను. ఇన్నాళ్లూ ఎంత ఆకలిమీద వున్నానో తెలియచెప్పావు. ఈ సౌఖ్యం కోసం ఎంతకైనా తెగిస్తాను. పొలం గట్టయినా సరే, మా యింటి అటకైనా సరే..'' అంది ఇసబెల్లా తమకంతో.

''నలభై రోజుల్లో యిరవై రోజులు గడిచాయి. ఇంకో యిరవై గడిచిన తర్వాతే కదా మనం వేరే చోటు వెతుక్కోవలసినది. ఈలోగా చర్చిలోనే రహస్యంగా ఏదైనా ఏర్పాటు చేయలేకపోను.'' అని ధీమా వ్యక్తం చేశాడు ఫెలిస్‌.

అతని ముక్కు పట్టుకుని వూపుతూ ఇసబెల్లా - ''పోయాక స్వర్గం లభించాలని మా ఆయన తపస్సు మొదలెట్టాడు. మనకు బతికుండగా యిక్కడే స్వర్గసుఖాలు చేకూర్చాడు. ఎంతైనా నీ మంత్రాలకు మహత్యం లేకపోలేదు.'' అంటూ ఒక చెణుకు వేసి మరింత గాఢంగా హత్తుకుంది.

- ఎమ్బీయస్‌ ప్రసాద్‌ (జులై 2020)
mbsprasad@gmail.com

Show comments