ఎమ్బీయస్: యువనాయకత్వాన్ని విస్మరిస్తే...

రాజకీయ పార్టీలు ప్రవహించే నదుల్లాటివి. పాతనీరు పుష్కలంగా వుండగానే ఏటేటా కొత్తనీరు వచ్చి చేరుతూనే వుంటుంది. దాని వలననే నది నిత్యనూతనంగా వుంటుంది. ప్రవహించే ప్రాంతమంతా సస్యశ్యామలం చేస్తుంది. కొత్తనీరు కలవకుండా కట్టడి చేసినా, దాన్ని పక్కకు నెట్టేసినా నది కళ తప్పుతుంది. చిక్కిపోతుంది.

ఈ సంగతి అందరికీ తెలుసు. యువత రాజకీయాల్లోకి ప్రవేశించి, చురుకైన పాత్ర పోషించాలని, దేశ పునర్నిర్మాణంలో తమ వంతు బాధ్యత నిర్వహించాలని, పార్టీ అధినేతలందరూ వేదికలపై ఉపన్యాసాలిస్తారు. కానీ తాము పదవులు వదలరు. తమను దశాబ్దాలుగా అంటిపెట్టుకున్నవారికే పార్టీ టిక్కెట్లు యిస్తూనే వుంటారు. వాళ్ల దృష్టిలో యువనాయకులు పార్టీకై డబ్బు ఖర్చు పెట్టాలి. టీవీ చర్చల్లో పాల్గొని పార్టీ చేసే అవకతవక పనులను సమర్థిస్తూ వుండాలి. సోషల్ మీడియాలో ఏక్టివ్‌గా వుంటూ ప్రత్యర్థి పార్టీలను ఏకేస్తూ వుండాలి. ఎన్నికల సమయంలో చచ్చేట్లు తిరగాలి. అంతే తప్ప టిక్కెట్లు అడగకూడదు.

పార్టీ అధినాయకుడు తనను తాను ఎప్పడూ యంగ్‌గానే లెక్కవేసుకుంటూంటాడు. చుట్టూ వున్న వంది మాగధులు ‘ఆలోచనల్లో, ఆరోగ్యంలో, చురుకుదనంలో మీతో పాతికేళ్ల కుర్రాడు కూడా పోటీ పడలేడండి’ అంటూ వుంటే తల వూపుతాడు. తనే కాదు, తనతో పాటే రాజకీయాల్లోకి వచ్చిన సహచరులు కూడా ఆయన దృష్టిలో యంగే. వాళ్లు వృద్ధాప్యం చేతనో, అనారోగ్యం చేతనో పోటీ చేయలేని పరిస్థితి వస్తే అప్పుడు వాళ్ల కొడుకుకో, కూతురుకో టిక్కెట్టు యిస్తారు తప్ప ఆ నియోజకవర్గంలో మరే యువకుడు లేదా యువతి కంటికి ఆనరు.

ప్రాంతీయ పార్టీల నుంచి జాతీయ పార్టీల దాకా యిదే విధానం నడుస్తోంది. దీనివలన ఎదురుదెబ్బలు తగులుతున్నా, వాళ్లు మారటం లేదు. కాంగ్రెసు పార్టీకి మధ్యప్రదేశ్‌లో చచ్చే దెబ్బ తగిలింది. కష్టపడి గెలుచుకున్న అధికారం బిజెపి పాలైంది. దానికి కారణం యువనాయకుడైన సింధియాను పక్కన పెట్టి వృద్ధ నాయకుడైన కమలనాథ్‌ను ముఖ్యమంత్రి చేయడం! రాహుల్ గాంధీ, సింధియా పేరు సూచించినా సోనియా వినలేదు. అల్పమైన మెజారిటీ ఉన్న ప్రభుత్వాన్ని కాపాడుకోవాలంటే అనుభవజ్ఞుడైన కమలే వుండాలి అంటూ తోసిరాజంది.

50 ఏళ్లు వచ్చినా రాహుల్, 73 ఏళ్ల సోనియా దృష్టిలో కుర్రకుంకే. అధిష్టానం ముసలిది కాబట్టే తన వయస్సున్న కమల్ నాథ్‌ను సోనియా ఎంపిక చేసింది. కమల్ నాథ్ వయసు, అనుభవం, రాజకీయ చాతుర్యం ఏమైనా పనికి వచ్చాయా? బిజెపి సింధియాను ఎగరేసుకుని పోయింది. రాజస్థాన్‌లో కూడా అదే కథ జరిగింది. యువకుడైన సచిన్ పైలట్‌ను పక్కన పెట్టి, 69 ఏళ్ల గెహ్లోత్‌ను ముఖ్యమంత్రి చేశారు. సచిన్‌ యిప్పుడు తిరుగుబాటు బావుటా ఎగరేశాడు.

ఈ వృద్ధనాయకులు తమకు అధికారం దక్కింది కదా, తమతో పోటీ పడిన యువనాయకులకు, వాళ్ల అనుయాయులకు ఏవో కొన్ని పదవులు యిద్దాం, వాళ్లనీ ఎదగనిద్దాం, సంతృప్తి పరుద్దాం అనుకోవడం లేదు. అధిష్టానం యిచ్చిన దన్నుతో వాళ్లను తొక్కిపడేద్దాం, యిప్పుడే కాదు, భవిష్యత్తులో కూడా ముఖ్యమంత్రి పదవి వైపు కన్నెత్తి చూడకుండా చేద్దాం అనుకుంటున్నారు. అప్పటిదాకా విరోధం సాగించిన ఇతర వృద్ధనాయకులతో చేతులు కలిపి, యువనాయకులకు పట్టున్న ప్రాంతాలలో కూడా వారిని ఓటమిపాలు చేస్తున్నారు.

వాళ్లు రాహుల్‌కు ఫిర్యాదు చేసినా ఏమీ లాభం లేదు. అతనికే దిక్కు లేదు. అతనేమైనా చేద్దామన్నా తల్లి ఒప్పుకోదు, గద్దె దిగిపోయి నా మానాన ఎక్కడికో పోతానన్నా ఊరుకోదు. ‘నువ్వు దెబ్బలబ్బాయిలా (వ్హిపింగ్ బాయ్)లా కొనసాగుతూ, పార్టీ వైఫల్యాలకు నింద మోస్తూ, పార్టీ అధినేతగా పడివుండాలి’ అని తల్లి శాసిస్తోంది. రాహుల్ పార్టీ అధ్యక్షుడిగా కొనసాగాలి, తను అనుకున్న యువరక్తం తేకూడదు. పంజాబ్ ముఖ్యమంత్రి అమరీందర్ సింగ్ 78 ఏళ్లు. అక్కడా యువనాయకులు తోక ఝాడిస్తున్నారు. ఎప్పుడో ఒకప్పుడు తిరుగుబాటు రావచ్చు.  

బిజెపి (జనసంఘ్) నాయకులు ఒకప్పుడు 60 ఏళ్లు దాటినవారు రాజకీయాల్లోంచి వైదొలగాలి అనేవారు. కానీ తర్వాత దాన్ని మర్చిపోయారు. వాజపేయి ప్రధాని అయ్యేనాటికి 74 ఏళ్లు, ఆయన ఉపప్రధాని అడ్వాణీకి 72. ఇప్పటికి అనేకమంది వృద్ధులు ముఖ్యపదవుల్లో వున్నారు. ఇష్టం లేనివాళ్లను 75 ఏళ్ల వయోపరిమితి పేర తప్పించారు. ఇష్టమైనవారికి మినహాయింపు యిచ్చారు. ముఖ్యమంత్రులుగా ఎంచుకున్న ముఖ్యమైన నాయకుల వయసులు చూడండి. యెడ్యూరప్ప (77), వసుంధరా రాజే (69), రమణ్‌సింగ్ (67), ఖట్టర్ (66).

ఇక కమ్యూనిస్టు పార్టీల సంగతి చెప్పనే అక్కరలేదు. సిపిఐ జనరల్ సెక్రటరీ డి రాజా (71), సిపిఎం జనరల్ సెక్రటరీ సీతారాం ఏచూరి (67), వృద్ధులకు సిపిఎం పెట్టింది పేరు. జ్యోతి బసు బెంగాల్‌ను 86 ఏళ్ల వయసు వచ్చేదాకా పాలించారు. అచ్యుతానందన్ కేరళను 89 ఏళ్ల దాకా పాలించారు. జనరల్ సెక్రటరీగా ఎచ్ ఎస్ సుర్జీత్ 86 ఏళ్ల వయసుదాకా ఆ పదవిలో ఉన్నారు. ప్రస్తుత కేరళ ముఖ్యమంత్రి పినరాయి విజయన్ వయసు 76. వీళ్లెవరికీ యువకులను ప్రోత్సహించాలని తోచదా? అనేదే ప్రశ్న.

దేశంలోని పార్టీలలో కాంగ్రెసు పార్టీ పురాతనమైనది. అప్పట్లో గోఖలే వంటివారి వృద్ధనాయకులు, మితవాదులు. ఆయన శిష్యుడిగా గాంధీ యువనాయకుడు. కొంతకాలానికి అతివాద ధోరణులతో జవహర్‌లాల్ నెహ్రూ నాయకత్వం ముందుకు వచ్చి యువకులను పార్టీ వైపు ఆకర్షించింది. కాలం గడిచేసరికి నెహ్రూ తరం వాళ్లు వృద్ధులై పోయి, పార్టీలో పాతుకుపోయారు. నెహ్రూ మరణానంతరం అతని వారసుడిగా ఎవరుండాలి అనే ప్రశ్న వచ్చినపుడు కామరాజ్, నిజలింగప్ప, ఎస్‌కె పాటిల్, సంజీవ రెడ్డి, అతుల్య ఘోష్ వంటి వారు ‘సిండికేట్’గా ఏర్పడి పావులు కదిపారు. తమలో ఒకడైన మొరార్జీ దేశాయ్‌ను ఎంపిక చేస్తే అతను కొరకరాని కొయ్య అవుతాడని భయపడి లాల్ బహదూర్ శాస్త్రిని ప్రధానిగా చేశారు.

శాస్త్రి కొద్దికాలానికే అనుకోకుండా మరణించడంతో మళ్లీ ఎంపిక చేయాల్సి వచ్చింది. మొరార్జీ మళ్లీ ముందుకు వస్తే అతన్ని కాదని, తాము చెప్పిన మాట వింటుంది కదాని ఇందిరా గాంధీని ప్రధానిగా నిలబెట్టారు. ఆమె త్వరలోనే గ్రహించింది – తనకంటూ విధేయులు ఏర్పడాలంటే యీ సీనియర్ల ప్రాబల్యాన్ని తగ్గించి, యువకులను ప్రోత్సహించాలని. ఎంపీలలో చంద్రశేఖర్, కృష్ణకాంత్, మోహన్ ధారియా వంటి యువకులు ‘యంగ్ టర్క్స్’ పేర ఒక జింజర్ గ్రూపుగా ఏర్పడి కాంగ్రెసును సోషలిజం వైపు మరల్చాలని ప్రయత్నించడం గమనించి, వారిని చేరదీసి వారి చేత మార్పులకు అడ్డుపడే యీ సిండికేట్ నాయకులను ‘వృద్ధ జంబూకాలు’ అనిపించింది.  

సిండికేటు నాయకులందరూ తమతమ స్వరాష్ట్రాలలో బలంగా వుండడం చూసి, వారికి ప్రత్యామ్నాయాలను తయారు చేసి దువ్వింది. ఆంధ్రప్రదేశ్‌లో సంజీవ రెడ్డిని ఎదుర్కోవడానికి ఆయన శిష్యుడైన బ్రహ్మానంద రెడ్డిని చేరదీసింది.  ఇలా అనేక రాష్ట్రాలలో జరిగింది. కాంగ్రెసులో చీలిక వచ్చిన వేళ వీరంతా ఇందిరకు దన్నుగా నిలబడ్డారు. స్వాతంత్ర్యం వచ్చిన రెండు దశాబ్దాల పాటు దేశమంతా పాలించిన కాంగ్రెసులో బోల్డు చెత్త వచ్చి చేరింది. దాన్నంతా ‘సిండికేట్’ వారి పాత కాంగ్రెసు ఖాతాలో వేసి, తన వర్గాన్ని కొత్త కాంగ్రెసుగా ఆవిష్కరించి, ప్రతిపక్షాలకు ఎడ్వాంటేజి లేకుండా చేసి, యువతను ఆకర్షించింది ఇందిర. అందుకే రాజకీయంగా ఆమె ఆయుర్దాయం చాలాకాలం వుంది.

ఇందిర ఓడిపోయి, జనతా పార్టీ అధికారంలోకి వచ్చినపుడు ప్రధానిగా వున్న మొరార్జీకి 81, ఉపప్రధాని చరణ్ సింగ్‌కు 75, మరో ఉపప్రధాని జగ్‌జీవన్ రామ్‌కు 69. ఒకరితో మరొకరికి పడేది కాదు. ఓ పట్టాన కలిసేవారే కాదు. చాదస్తపు ముసలివాళ్లు కొట్టుకుని ఛస్తున్నారు అనుకునేవారు. వాజపేయి (53), ఆడ్వాణీ (50), జార్జి ఫెర్నాండెజ్ (47) వంటి యువనాయకులు యువతను ఆకట్టుకునేవారు. అంతఃకలహాలతో జనతా పార్టీ కుప్పకూలడంతో ఇందిర 1980లో మళ్లీ అధికారంలోకి వచ్చింది. 

తర్వాత వచ్చిన రాజీవ్ గాంధీ కూడా యువకులకు అవకాశమిచ్చాడు. చాలామంది యువనాయకులు ముఖ్యమంత్రులయ్యారు. వారిలో కొందరు సంజయ్ గాంధీ అనుయాయులు కూడా ఉన్నారు. గ్లోబలైజేషన్ తొలి రోజులు, ఎటు చూసినా ఫారిన్ సరుకులు. యువతకు కొత్త ఉపాధి అవకాశాలు. అంతా జోష్‌జోష్‌గా వుండింది. అలాటిది రాజీవ్ బోఫోర్స్ కుంభకోణంలో యిరుక్కోవడంతో మొత్తమంతా మారిపోయింది. మళ్లీ వృద్ధ నాయకత్వం ముందుకు వచ్చింది. విపి సింగ్, దేవీలాల్, చంద్రశేఖర్... యిలా. వారి ప్రభుత్వాలు త్వరత్వరగా పడిపోవడంతో రాజీవ్ మళ్లీ ముందుకు వచ్చాడు. కానీ ఎన్నికల ప్రచార సమయంలోనే హత్యకు గురి కావడంతో పివి నరసింహారావు ప్రధాని అయ్యారు.

ఆయనకప్పుడు 71 ఏళ్లు. అనారోగ్యంతో బాధపడుతూ రాజకీయాల్లోంచి రిటైర్ అవుదామనుకున్న సమయంలో యీ అవకాశం వచ్చింది. ఇక ఆయన కాబినెట్ సహచరులు, పార్టీలో ప్రత్యర్థులు కూడా వయసు మీరినవారే. ఆయన తర్వాత వచ్చిన ప్రధానులు దేవెగౌడ, గుజ్రాల్, వాజపేయి, మన్‌మోహన్ సింగ్ కూడా పెద్ద వయసువారే. మోదీ తన 63 వ ఏట ప్రధాని అయ్యారు. అమిత్ ఆయన కంటె 14 ఏళ్లు చిన్నవాడు. అందువలన ప్రస్తుత బిజెపి నాయకద్వయం సరైన ఏజ్‌గ్రూప్‌లో వుందనాలి. వాళ్లు 44 ఏళ్ల వయసున్న దేవేంద్ర ఫడణవీస్‌ను మహారాష్ట్ర వంటి ప్రధాన రాష్ట్రానికి ముఖ్యమంత్రిని చేశారు.

ఎప్పటికప్పుడు కొత్తరక్తాన్ని ఎక్కించడానికి గతంలో పార్టీలకు ఒక వ్యవస్థ వుండేది. వాళ్ల పార్టీకి అనుబంధంగా విద్యార్థి సంఘాలుండేవి. కాలేజీ చదువుల సమయంలోనే కాబోయే నేతలు వక్తృత్వంలో, సభానిర్వహణలో, నిరసన ప్రదర్శనలలో తర్ఫీదు పొందేవారు. ఆ తర్వాత కొందరు వేర్వేరు వృత్తుల్లోకి వెళ్లినా రాజకీయాలను సీరియస్‌గా తీసుకునే వారు పార్టీ యూత్ వింగ్‌లో చేరేవారు. వారి కంటూ కొన్ని ప్రత్యేక కార్యక్రమాలను పార్టీ కేటాయించేది. ముఖ్యంగా జనంతో కలిసిమెలసి తిరిగే సామాజిక సేవా కార్యక్రమాలు, ఎవరైనా పెద్ద నాయకుడు వచ్చినపుడు హంగామా చేసే కార్యక్రమాలు.. యిలాటివి.

వీటి ద్వారా ప్రజల కళ్లలో పడిన తర్వాత వారిలో కొందర్ని ఎంపిక చేసి, మెయిన్ పార్టీలో అవకాశమిచ్చేవారు, టిక్కెట్లు యిచ్చేవారు. చంద్రబాబు నాయుడు కూడా సంజయ్ గాంధీ నేతృత్వంలోని యూత్ కాంగ్రెసులో చేరి దాని ద్వారానే పార్టీలో ఎదిగారు. వెంకయ్య నాయుడు ఎబివిపి ద్వారా ఎదిగారు, ఏచూరి సీతారాం ఎస్‌ఎఫ్‌ఐ ద్వారా ఎదిగి, పార్టీలో యూత్ గ్రూపులో చురుగ్గా వుంటూ, చివరకు పార్టీ జనరల్ సెక్రటరీ అయ్యారు. వీళ్లు గ్రాస్‌రూట్స్ నుంచి వచ్చిన కారణంగా ప్రజల నాడిని సులభంగా తెలుసుకోగలరు. ఓపిగ్గా తిరగగలరు. ముఖ్యమైన వారందరినీ గుర్తు పెట్టుకోగలరు.

పోనుపోను పార్టీలు యీ వ్యవస్థను పట్టించుకోవడం మానేశాయి. ఉన్న స్టూడెంటు యూనియన్స్‌లో బిజెపికి చెందిన ఎబివిపి ఒక్కటే చురుగ్గా వుంది. యూత్ కాంగ్రెసు లీడరు ఎవరు, యూత్ టిడిపి లీడరు ఎవరు, యూత్ తెరాస లీడరు ఎవరు, యూత్ వైసిపి లీడరు ఎవరు? – యిలాటి ప్రశ్నలకు సమాధానాలు చప్పున తట్టవు. పేరుకి ఎవరైనా వున్నా, వారికి ఆ విధమైన గుర్తింపు యివ్వటం లేదు. అధినేత కుమారుడు యువనేత, మనుమడు బాలనేత ఆటోమెటిక్‌గా అయిపోతున్నారు. వాళ్లకు ఏ తర్ఫీదూ లేదు, కాలేజీ ఎన్నికలలో పాల్గొన్న అనుభవమూ ఉండదు. ఏ కష్టమూ పడరు. తండ్రి చాటున నీడలో పెరిగిన కిచెన్ గార్డన్ మొక్కలు. అందుకే ఆటుపోటులు వచ్చినపుడు తట్టుకోలేక పోతున్నారు.

ఏదైనా పార్టీ కింద నుంచి పైకి ఎదుగుతుంది. దానిలోంచి లీడరు పుట్టుకుని వస్తాడు. కానీ 1982లో తెలుగునాట ఒక అద్భుతం జరిగింది. వెండితెర మీద నుంచి ప్రజాక్షేత్రంలోకి ఎన్టీయార్ పై నుంచి దిగి వచ్చినట్లు వచ్చారు. 30 ఏళ్ల దాకా అధికారంలో పాతుకుపోయిన కాంగ్రెసు నాయకులకు యీయన గెలుస్తాడన్న నమ్మకం కలగలేదు. ఇతర పార్టీల నాయకులకూ కుదరలేదు కాబట్టి, పొత్తులు పెట్టుకోవడానికి ఎవరూ ముందుకు రాలేదు (ఉప్పూపత్రీ లేని సంజయ్ విచార్ మంచ్‌ తప్ప) తెలుగుదేశం పార్టీకి అభ్యర్థుల అవసరం పడింది. ఆ అవసరమే తెలుగునాట ఒక చారిత్రక సందర్భాన్ని సృష్టించింది.

ఎన్టీయార్ తన పార్టీలోకి విద్యావంతులను, యువతీయువకులను, అప్పటిదాకా రాజకీయాలలోకి రానివారిని – అందర్నీ తీసుకుని టిక్కెట్లు యిచ్చారు. వారికి ఆర్థికంగా దన్ను వుందా లేదా, పరిపాలనానుభవం ఉందా లేదా, రాజకీయాల్లో చేయి తిరిగిందా లేదా, పలుకుబడి వున్న కులానికి చెందినవాడా లేదా - ఏదీ చూడలేదు. అభ్యర్థి గుణగణాలు ఓటరూ చూడలేదు. అందరూ ఎన్టీయార్ మొహం చూసే ఓటేశారు. అంతే తెలుగు రాజకీయాల్లోకి కొత్త తరంగం వచ్చి పడింది. అలాటి ఉత్తుంగ తరంగాన్ని చిరంజీవి తీసుకురాలేదు, జగన్ తీసుకురాలేదు, పవనూ తీసుకురాలేదు. అందరూ యితర పార్టీల్లో వున్న ‘అనుభవజ్ఞుల’ను తీసుకుని అడ్డదారిలో వద్దామని చూశారు. డైరక్టుగా కొత్తవారిని తీసుకుని వచ్చిన చోట్ల ప్రజలు ఆమోదించలేదు.

1983 అద్భుతం జరిగి యిప్పటికి 37 సం.లు అయింది. అప్పటి నాయకులు యిప్పటికి పాతబడిపోయారు. అయినా వాళ్లే వివిధ పార్టీల్లో సర్దుకుని రాజకీయాలు సాగిస్తున్నారు. మృతి చెందిన, లేదా అనారోగ్యానికి గురైన సందర్భాల్లో వారి కుటుంబీకులే వారసులుగా అవతరించారు తప్ప, ఏ రాజకీయ నేపథ్యమూ లేని యువత రాజకీయాల్లోకి రావటం లేదు. ఎవరైనా వచ్చినా వారు వ్యాపారస్తులై వుంటున్నారు. పార్టీకి నిధులిచ్చి టిక్కెట్లు కొనుక్కుంటున్నారు తప్ప ప్రజాక్షేత్రం నుంచి రావటం లేదు. ఎన్నికయ్యాక ప్రజలకు అందుబాటులో వుండటం లేదు.

టిడిపికి వున్న ప్రధాన సమస్య అదే. పార్టీ పెట్టేనాటికి ఎన్టీయార్ వయసు 60 ఏళ్లయినా, తన వయసు వాళ్లను కాకుండా యువతీయువకులను ప్రోత్సహించారు. అందుకే యువ ఓటర్లు ఆకర్షించబడ్డారు. చంద్రబాబు వయసు యిప్పుడు 70. ఆయన చుట్టూ వున్న ప్రధాన నాయకుల వయసూ దాదాపుగా అంతే. టిడిపిలో ఉన్న యువనాయకుడు అనగానే లోకేశ్ ఒక్కరినే చూపిస్తారు. ఇటీవల రామ్మోహన్ నాయుడు వెలుగులోకి వచ్చారు. కొందరు మధ్యవయస్కులున్నారు. వీళ్లు సరిపోతారా? యూత్‌ఫుల్ యిమేజి వుంటేనే పార్టీకి గ్లామర్.

వృద్ధ నాయకులు వెనక్కాల నుంచి పొలిటికల్ మానిప్యులేషన్ చేస్తూ, స్ట్రాటజీ వర్కవుట్ చేస్తూ, యువతీయువకులను ముందుకు చూపుతూ వుంటేనే పార్టీపై ప్రజలకు ఆశ పుడుతుంది. యువతీయువకులంటే భూమా అఖిలప్రియ, పరిటాల శ్రీరామ్, జెసి పవన్ కుమార్ రెడ్డి వంటి రాజకీయ వారసులు కాదు, స్వయంకృషితో, వాక్చాతుర్యంతో పైకి వచ్చినవారు. లోకేశ్‌కు వారసత్వంగానే పదవి, హోదా వచ్చి వుండవచ్చు. కానీ అతను తన చుట్టూ యువతీయువకులను పెట్టుకోకుండా, తండ్రి అనుచరులనే పెట్టుకుంటున్నారు. ఈ పార్టీలో లోకేశ్‌కు తప్ప తమ వంటి యువతకు భవిష్యత్తు లేదని ప్రతిభావంతులైనవారు అనుకుంటే టిడిపికి భవిష్యత్తు ఉండదు. క్రమేపీ కునారిల్లుతుంది. మధ్యప్రదేశ్, రాజస్థాన్‌లలో కాంగ్రెసు అనుభవాల నుంచి టిడిపి నేర్చుకోవాలి.

వృద్దులంటే ఆశకు, యువకులంటే ఆశయాలకు ప్రతీకలుగా భావిస్తాం. టిడిపిలో యనమల, గోరంట్ల – తెరాసలో నాయిని, పోచారం, గుత్తా, నామా, కడియం, కేశవరావు – తెలంగాణ కాంగ్రెసులో విఎచ్, పొన్నం, ఉత్తమ్.. వీళ్లందరినీ చూసినప్పుడు ఉస్సురనిపిస్తుంది. సినిమాల్లో 50 ఏళ్ల వయసున్న హీరోలు కూడా వివాహితులుగా కనబడడానికి యిష్టపడరు, పాతికేళ్ల కాలేజీ కుర్రాడి ననుకోమంటారు. నిజమైన పాతికేళ్ల కుర్రాడికి అవకాశాలు రాకుండా చూస్తూంటారు. రాజకీయాల్లో వీళ్లూ అంతే.

జగన్ విషయానికి వస్తే – తనూ రాజకీయ వారసత్వంతో వచ్చినవాడే. కానీ వారసుడిగా అధికారం దక్కలేదు. తండ్రి పార్టీలోంచి లాక్కుని వచ్చిన వృద్ధ, అనుభవజ్ఞులైన నాయకులు చాలామంది మిగలలేదు. ఫిరాయింపుదార్లతో కాంగ్రెసు పార్టీ ప్రభుత్వాన్ని పడగొట్టడం కష్టమని తెలిసి, స్వయంకృషితో పోరాటాలు చేస్తూ ఎదిగాడు. ఆ క్రమంలో చాలామంది తండ్రి స్నేహితులు దూరమయ్యారు. తన యీడు వారైన నాయకులు దగ్గరకు చేరారు.

ప్రజల్లో జగన్ పలుకుబడి పెరుగుతోంది అని గమనించగానే తండ్రి అనుయాయుల్లో కొందరు మళ్లీ వచ్చి చేరారు. రాష్ట్రంలో కాంగ్రెసు ఓటు బ్యాంకును కైవసం చేసుకోవడానికై వాళ్లందరినీ జగన్ తీసుకున్నాడు. వాళ్లే కాదు, టిడిపిని బలహీన పరచడానికై కాంగ్రెసు నుంచి టిడిపిలోకి వెళ్లినవారిని, మొదటినుంచీ టిడిపిలో వున్నవారినీ అందరినీ చేర్చుకున్నాడు. దాంతో పార్టీలో పాత కాపులు, కొత్త కాపులు అందరూ చేరారు. విపరీతమైన మెజారిటీతో అధికారంలోకి వచ్చాక జగన్‌కు ధైర్యం పెరిగింది. పాతవారి ప్రాధాన్యాన్ని క్రమేపీ తగ్గిస్తూ, తనకు మాత్రమే విధేయులైన యువనాయకత్వాన్ని ప్రోత్సహిస్తున్నాడు. ఇది పాత నాయకులకు కంటగింపుగా వుంది. అప్పుడప్పుడు తమ ఆక్రోశాన్ని వ్యక్తం చేస్తున్నారు.

వాళ్లని చూసి ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ వంటి వారు వాపోతున్నారు. జగన్ ప్రజలతో డైరక్టు కాంటాక్ట్ పెట్టుకుందామని మధ్యలో వున్న నాయకులను బలహీనంగా వుండేట్లు చూస్తున్నారని విమర్శించారు. గతంలో ఇందిర కానీ, ఎన్టీయార్ కానీ చేసినదదే! లేకపోతే యీ జిల్లా నాయకులు టిక్కెట్ల వేళ, కాంట్రాక్టుల వేళ పార్టీ అధిష్టానికే హెచ్చరికలు జారీ చేస్తారు. తాము పార్టీ ఫిరాయిస్తే జిల్లాలో పార్టీకి ఒక్క సీటూ దక్కదని బెదిరిస్తారు. వాళ్ల పట్టు సడలించడానికే కాబోలు జగన్ యువనాయకులను ప్రోత్సహిస్తున్నాడు.

ఉదాహరణకి నెల్లూరు జిల్లాలో ఆనం రామనారాయణ రెడ్డి పార్టీలో చేరినా, అక్కణ్నుంచి అనిల్ యాదవ్‌కు ముఖ్యమైన మంత్రి పదవి యిచ్చి, అతనికి ప్రాధాన్యత కలిగేట్లు చేస్తున్నాడు.  రాధాకృష్ణ గారికి యిది నచ్చలేదు. నెల్లూరులో రెడ్ల ప్రాబల్యం, ముఖ్యంగా ఆనం కుటుంబానికి ఎంతో ప్రాముఖ్యం వుండగా వారిని పక్కన పెట్టి అనిల్ వంటి బిసికి ప్రాధాన్యం కట్టబెట్టడమేమిటని ఆయన అభ్యంతరం. విజయనగరం జిల్లాలో అశోక గజపతి రాజు మాత్రమే చిరకాలం లైమ్‌లైట్‌లో వుండాలని టిడిపి వారు అనుకోవచ్చు. కానీ జగన్ అక్కడ ఆయన అన్న కూతుర్ని వెలుగులోకి తీసుకుని వచ్చి వృద్ధ నాయకత్వానికి సవాలు విసిరాడు. అది వీళ్లకు నచ్చటం లేదు. ఇలా చెప్పుకుపోతే ఎన్నో ఉన్నాయి.

రాజకీయ కారణాల చేతనే కావచ్చు, విధేయత కారణంగానే కావచ్చు, ఏదో ఒక రూపాన యువత రాజకీయాల్లోకి వస్తే కాస్త హాయిగా వుంటుంది. ఓ 20-25 ఏళ్లు ఉన్నాక వారు తప్పుకుని మరొకరికి ఛాన్సివ్వాలి. ఇది పార్టీ అధినేతల దగ్గర్నుంచి సామాన్య నాయకుల వరకూ అందరికీ వర్తిస్తుంది. 20 ఏళ్ల తర్వాత వచ్చే నాయకత్వానికై యిప్పటినుంచి తర్ఫీదు మొదలుపెట్టాలి. విద్యార్థి దశలోనే చురుకైన వారిని గుర్తించడం, పార్టీల యూత్ వింగ్‌లకు పనులు అప్పగించడం వంటివి చేయాలి. ఎల్లకాలం తామే యూత్ అనుకోకూడదు. 

ఎమ్బీయస్ ప్రసాద్ (జులై 2020)

Show comments