ఆ ఇద్దరు ఎవరు.. ఊహకందని జగన్ ప్లాన్

రాష్ట్రంలో రెండు మంత్రి పదవులు ఖాళీ అయ్యాయి. మంత్రులిద్దరూ రాజ్యసభ ఎంపీలుగా ఎంపికై ఎమ్మెల్సీ పదవులకి రాజీనామా చేయడంతో జగన్ కేబినెట్ లో కొత్తగా ఇద్దరికి ప్రవేశం లభించింది. అయితే ఆ ఇద్దరు ఎవరనేది ఇప్పటి వరకు సస్పెన్స్ గానే మిగిలింది. ఆషాఢం పూర్తై శ్రావణం మొదలు కాగానే ఆ ఇద్దరికీ పదవీయోగం లభిస్తుందనే విషయంపై మాత్రం క్లారిటీ ఉంది. ఈనెల 22న కొత్త మంత్రుల ప్రమాణ స్వీకారం అని తెలుస్తోంది.

ఈమేరకు గవర్నర్ కార్యాలయానికి కూడా సమాచారం ఉంది. కుదరకపోతే ఆల్టర్నేట్ డేట్ 24 అని తేలింది కానీ.. ఆ ఇద్దరి పేర్లు మాత్రం బయటకు రాలేదు. పార్టీ కీలక నేతలకు కూడా స్పష్టంగా తెలియదంటే జగన్ ఈ విషయంలో ఎంత గుంభనంగా ఉన్నారో అర్థమవుతోంది. ఇప్పటివరకూ ఆళ్ల రామకృష్ణారెడ్డి, రోజా వంటి పేర్లు వినిపించినా.. సామాజిక వర్గ సమతుల్యం దెబ్బతినే అవకాశం ఉండటంతో.. ఆ రెండు పదవులు బీసీలనే వరించబోతున్నాయి.

అదే సమయంలో మిగతా మంత్రి వర్గంలో మార్పులు చేర్పులుంటాయని అనుకున్నా.. అది కూడా దాదాపు ఉండకపోవచ్చని అర్థమైపోయింది. ఉన్న పోర్టిఫోలియోలు మారవు, కొత్తగా తీసుకునే ఇద్దరికి.. పిల్లి సుభాష్ చంద్రబోస్ చూసిన రెవెన్యూ శాఖ, మోపిదేవి వెంకట రమణ చూసిన పశు సంవర్థక, మత్స్య శాఖలు మాత్రమే బదిలీ అవుతాయి. ప్రస్తుతానికైతే ఈ లిస్ట్ లో ముమ్మిడివరం ఎమ్మెల్యే పొన్నాడ సతీష్, పలాస ఎమ్మెల్యే సీదిరి అప్పలరాజు, రామచంద్రాపురం ఎమ్మెల్యే వేణుగోపాల కృష్ణ, పెడన ఎమ్మెల్యే జోగి రమేష్.. పేర్లు వినపడుతున్నాయి.

అయితే తాజాగా స్పీకర్ తమ్మినేని సీతారాం పేరు కూడా తెరపైకి వచ్చింది. అన్ లాక్ మొదలయ్యాక సీతారాం.. వరుసగా తీర్థయాత్రలు చేశారు. శ్రీకాళహస్తి సహా.. ఇతర దేవాలయాల్లో మొక్కులు చెల్లించుకున్నారు. పదవీయోగంపై ముందే సమాచారం ఉండటం వల్లే ఆయన దేవాలయాలకు వెళ్లొచ్చారని, అయితే విషయం మాత్రం సన్నిహితుల వద్ద కూడా బైటపెట్టలేదనే టాక్ వినిపిస్తోంది.

ఇక పిల్లి సుభాష్ చంద్రబోస్ కి ఉన్న ఉపముఖ్యమంత్రి పదవి మరో బీసీ మంత్రి అయిన ధర్మాన కృష్ణ దాస్ కి ఇస్తారని స్పష్టంగా తెలుస్తోంది. మొత్తమ్మీద మంత్రి వర్గ ప్రమాణ స్వీకార సమయంలో ఎంత సీరియస్ వాతావరణం ఉందో.. ఇప్పుడు కూడా వైసీపీలో అంతే గంభీరమైన వాతావరణం నెలకొంది. ఆశావహులు చాలామందే ఉన్నా.. ఆ అదృష్టం మాత్రం ఇద్దరికే వరించబోతోంది. 

హరీష్ శంకర్ తో సినిమా చేస్తాను

Show comments