పేరుకు పెద్ద మీడియా.. చెప్పేవన్నీ పచ్చి అబద్ధాలు

కరోనా విషయంలో ఛానెళ్లన్నీ తమ చావు తెలివితేటల్ని చూపిస్తున్నాయి. ఉద్యోగులతో పనిచేయించుకోవాలి, వారికి రోగమొస్తే మాత్రం గాలికొదిలేయాలి. ఇదీ వారి లెక్క. ఇలా ఉద్యోగుల్ని జీతం పరంగా, జీవితాల పరంగా నిలువునా ముంచేస్తున్న ఓ ఛానెల్ ఇప్పుడు మరో అబద్ధపు ప్రచారానికి తెరదీసింది.

ఓ న్యూస్ ఛానెల్ లో పెద్ద తలకాయకు అనుంగు అనుచరుడిగా ఉన్న భార్యకు కరోనా అని తేలడంతో.. డెస్క్ డెస్కంతా పరీక్షలు చేయించారు. పాజిటివ్ వచ్చినవారిని పక్కనపెట్టి మిగతావారిని మాత్రం పనిలోకి తీసుకున్నారు. అయితే మిగతా ఉద్యోగుల్లో చాలామంది భయపడి సామూహిక శెలవులు పెట్టడానికి సిద్ధమయ్యారు. మరికొంతమంది వచ్చే అరకొర జీతాల్ని వద్దనుకొని ఉద్యోగాలకు రాజీనామా చేయాలని నిర్ణయించుకున్నారు. ఈ కరోనా టైమ్ లో ఇలాంటివి జరిగితే ఛానెల్ నిండా మునగడం ఖాయం. సరిగ్గా ఇక్కడే సదరు ఛానెల్ మోసపూరిత ప్రచారానికి తెరతీసింది.

డెస్క్ లో కంప్యూటర్లన్నిటినీ షిప్ట్ చేసి డిజిన్ఫెక్షన్ చేయించిన యాజమాన్యం... డెస్క్ సభ్యులకు చెప్పిన మాట ఏంటంటే.. ఆఫీస్ లో డిజిన్ఫెక్షన్ చేసిన ద్రావణానికి 180 రోజుల పాటు కరోనాని అరికట్టే సామర్థ్యం ఉందట. దాన్ని కేవలం తమ ఛానెల్ కోసమే భారత్ బయోటెక్ సంస్థ తయారుచేసి ఇచ్చిందట.

ఆ ఛానెల్ యాజమాన్యానికి, భారత్ బయోటెక్ యజమానులకు బంధుత్వాలు ఉన్నాయి. దీన్ని సాకుగా చూపి కేవలం తమ ఛానెల్ కోసమే ప్రత్యేకమైన పిచికారీ తయారుచేయించామని, దాదాపు 6 నెలల పాటు వైరస్ దరికి చేరదని ఉద్యోగుల్ని బుకాయించే ప్రయత్నం చేస్తోంది ఆ సంస్థ.

ఎంత తప్పుడు సమాచారం ఇచ్చారో చూడండి. నిజంగా 180 రోజుల కరోనా వైరస్ ను దరిచేరనీయని మందు ఉంటే దానిపై ఇప్పటికే కథనాలు వచ్చి ఉండేవి. సదరు ఛానెల్ సంగతి పక్కనపెడితే.. ప్రభుత్వమే పెద్ద ఎత్తున అలాంటి రసాయనాన్ని కొనుగోలు చేసి హాస్పిటల్స్ లో ఉపయోగించేది. అంతెందుకు.. నిజంగా అలాంటి పవర్ ఫుల్ క్రిమిసంహారిణి ఉంటే భారత్ బయోటెక్ సంస్థే ఈపాటికి దాన్ని అద్భుతంగా మార్కెటింగ్ చేసుకునేది. ఆ దెబ్బకు మిగతా శానిటైజర్లు అన్నీ మూసుకునేవి.

అన్నీ తెలిసి కూడా తన ఉద్యోగుల్ని పూర్తిగా భ్రమలోకి నెట్టి పనిచేయించుకుంటోంది సదరు ఛానెల్ యాజమాన్యం. ఇది "పెద్దాయన" ఐడియానా లేక పెద్ద స్థాయి ఉద్యోగుల అత్యుత్సాహమో తెలియదు కానీ.. కింది స్థాయి ఉద్యోగుల్ని మాత్రం పూర్తిస్థాయిలో బకరాల్ని చేశారు. కొంతమంది ఉద్యోగులు ధైర్యం చేసి శానిటైజర్ పేరు అడిగితే, సీక్రెట్ అంటూ సమాధానం ఇవ్వడం మరీ విడ్డూరం.

హరీష్ శంకర్ తో సినిమా చేస్తాను

Show comments