చంద్రబాబు.. ఇదేనా నలభై ఏళ్ల అనుభవం!

అనగనగా ఓ పెద్ద రాజుగారు. నలభై ఏళ్లుగా పాలిస్తున్నారు. భారీ దర్బారు సెట్, రోజూ కొలువుతీరడం, సమావేశాలు తప్ప, చేసింది ఏమీ లేదని జనం గ్రహించారు. రాజు దాయాది అయిన మరో యువరాజుకు పట్టం కట్టారు. ఇప్పుడు ముసలి రాజుగారు ఏం చేయాలి? మళ్లీ అధికారంలోకి రావాలి. సింహాసనంలో కూర్చోవాలి అంటే...యుద్దం చేయాలి. దాయాది రాజును ఓడించాలి. అలా చేయాలంటే తన బలగాలను సన్నద్ధం చేయాలి. జనాలకు మళ్లీ నచ్చ చెప్పి, పోరాటానికి దిగాలి. కానీ అలా చేయకుండా దాయాది రాజు కాళ్లు పట్టుకుని ఎవరైనా లాగేస్తే బాగుండును. దాయాది యువరాజును ఎవరైనా ఓడిస్తే బాగుండును. దాయాది రాజు లేకపోతే మిగిలేది తానేగా..అధికారం తనదేగా..ఇదీ ఆలోచన.

వర్తమాన ఆంధ్ర రాష్ట్ర రాజకీయాల్లోకి వస్తే. ఫార్టీ ఇయర్స్ ఇండస్ట్రీ అని చెప్పుకునే చంద్రబాబు వైఖరి కూడా ఇలాగే వుంది. మంచికో చెడ్డకో జనం చంద్రబాబును అధికారం నుంచి కిందకు దింపారు. జగన్‌ను అధికార పీఠంపై కూర్చో పెట్టారు. ప్రజాస్వామ్యంలో ఇది సర్వ సాధారణం. ఓడిన వాళ్లు మళ్లీ జనంలోకి వెళ్లి, వారికి నచ్చ చెప్పుకుని అధికారంలోకి రావాలి. 2014 నుంచి 2019 మధ్యలో జగన్ చేసింది ఇదే. అయిదేళ్ల పాటు జనంలోనే వున్నారు. జనానికి తానేంటో నచ్చ చెప్పగలిగారు. తానేం చేస్తానో చెప్పారు. జనం నమ్మారు. అధికారం ఇచ్చారు. ఇదంతా జరిగి ఏడాదయింది. ఇప్పుడు తెలుగుదేశం పరిస్థితి, దాని అధినేత చంద్రబాబు నాయుడు ఆలోచనా విధానం ఎలా వుండాలి? ఎలా వుంది?

భాజపా..ఓ భాజపా
ఓడిపోయిన దగ్గర నుంచి చంద్రబాబు ఆలోచన ఒకలాగే వుంది. భాజపాకు దూరం కావడం వల్ల ఓడిపోయాం అనుకుంటున్నారు. మళ్లీ అధికారంలోకి రావాలనుకుంటే భాజపా అండ వుండాలి. అది కావాలి అంటే భాజపాతో తనకు సయోధ్య కుదిర్చేందుకు తన మనుషులు వుండాలి అనుకున్నారు. ఇదంతా చంద్రబాబుకు అలవాటైన విద్య. అది ఏ వ్యవస్థ అయినా, ఏ పార్టీ అయినా అందులోకి తన మనుషుల్ని చొప్పించడం అన్నది ఆయన కు అన్ని విధాలా కలిసి వచ్చిన ఫార్ములా. అదే ఫార్ములా ప్రకారం తన మనుషుల్ని భాజపాలోకి పంపించడం ప్రారంభించారు.

ఓడిపోగానే తెలుగుదేశంలో సంభవించిన పరిణామం ఇదే. తమ తమ వ్యాపారాలు కాపాడుకోవడం కోసమో, పార్టీ భవిష్యత్ అవసరాలు దష్టిలో పెట్టుకునో భాజపాలోకి జంపింగ్ జపాంగ్ లు ప్రారంభమయ్యాయి. ఇవి అలా అలా కొనసాగుతున్నాయి. ఇదీ మళ్లీ అధికారంలోకి రావడానికి చంద్రబాబు వేసిన తొలి అడుగు. ఆ తరవాత చేసిన పని భాజపాను కానీ, ఆ పార్టీ అధికారంలో వున్న కేంద్రాన్ని పల్లెత్తు మాట అనకపోవడం. మూడో అడుగు వీలయినపుడల్లా ప్రధానిని, కేంద్రాన్ని మెచ్చుకోవడం. ఆపైన తనకు మోడీతో అస్సలు పేచీ లేదని నిస్సిగ్గుగా ప్రకటించడం.

ఎందుకు మోడీని, భాజపాను ఇంతలా బతిమాలి, బామాల్సిన పరిస్థితి అంటే వైఎస్ జగన్ అనే నాయకుడిని మనమేం చేయలేము, ఏమైనా చేయగలిగితే అది కేవలం ప్రధాని మోడీ, ఆయన పార్టీ భాజపా మాత్రమే అని చంద్రబాబు, ఆయన అనుచరులు మనసా వాచా కర్మణా నమ్మడమే. రాబోయే ఎన్నికల నాటికి మోడీ కావాలి. ఆ ఎన్నికలలోగా బతికి బట్టకట్టాలంటే మోడీ కావాలి అనే రెండు రకాల ఆలోచనే దీని వెనుక వున్నది.

పత్రికలు-కోర్టులు
అధికార సాధనకు చంద్రబాబు అండ్ కో ఎంచుకున్న మరో రెండు మార్గాల పత్రికలు, కోర్టులు. తనకు అనుకూలంగా వుండే మీడియాను వాడుకుని వైకాపా ప్రభుత్వంపై వీలయినంత బురద జల్లడం. ఇది నిత్య కార్యక్రమం. మరోపక్క జగన్ ప్రభుత్వం తీసుకునే నిర్ణయాల్లోని లూప్ ెల్స్ పట్టుకుని కోర్టులకు వెళ్లి అడ్డం పడడం. సరే, కోర్టుల సంగతి అలా వుంచితే, నిత్యం పత్రికలు పట్టుకుని వేలాడడమే. సరే రాజకీయాల్లో లైవ్ లో వుండాలంటే పత్రికల్లో కనిపించాల్సిందే.

కానీ కేవలం పత్రికల్లో కనిపిస్తే రాజకీయాల్లో లైవ్ లో వుండగలం అనుకుంటే భ్రమే. పత్రికల రీచ్ ఎంత? బాబు అనుకూల పత్రికలు కావచ్చు, వ్యతిరేక పత్రికలు కావచ్చు. కొంత వరకు రీచ్ వుంటుంది. ఒక వెయ్యి గడప వున్న పల్లెటూరిని తీసుకుంటే మహా అయితే అన్ని పత్రికలు కలిపి పాతిక, ముఫై కాపీలకు మించి వెళ్లవు. అందులో సగం అనుకూలం. సగం వ్యతిరేకం. ఇంకేం ప్రభావితం చేస్తాయి? పైగా పరిస్థితులు కాస్తయినా అనుకూలంగా వుంటే అప్పుడు పత్రికలు మరింత ఆజ్యం పోసి, జనాలను ప్రభావితం చేయగలగుతాయి. కానీ ఇప్పుడు పరిస్థితులు ఏవీ మరీ అంతగా వైకాపాకు వ్యతిరేకంగా లేవు కదా?

ప్రాథమిక డ్యూటీ మరిచారు
నిజానికి ప్రతిపక్షం ప్రాథమిక డ్యూటీ, జనాల్లోకి వెళ్లి పోరాడడం. జనాన్ని పోరుబాటలో నడిపించడం. అలాంటి పని గడచిన అయిదేళ్లలో తెలుగుదేశం పార్టీ పూర్తిగా విస్మరించింది. కేవలం అమరావతి రాజధాని కోసం తప్ప, మరే ఒక్క విషయం మీదా జనాలను సమీకరించడం కానీ, ఓ ధర్నా కానీ, ఓ నిరసన కానీ చేసిన పాపాన పోలేదు. అమరావతి కోసం మాత్రం కిందా మీదా అయిపోయింది.అయిపోతోంది. ఇక్కడే తేలిపోయింది. తెలుగుదేశం పార్టీ ప్రాధామ్యాలు ఏమిటన్నది. శ్రీకాకుళం నుంచి కడప వరకు పార్టీ నేతలు కేవలం పత్రికలేక పరిమితం అయ్యారు తప్ప, జనంలోకి వెళ్లిన దాఖలా లేదు.

ఎలా వెళ్తారు?
జనంలోకి ఎందుకు వెళ్లడం లేదు? అని ప్రశ్నించుకుంటే దేనికి వెళ్తారు? ఇళ్లపట్టాల భూముల కొనుగోలులో తేడాలు జరిగాయి, పోరాడుదాం రండీ అంటే జనం వస్తారా? ఆ కొన్న భూములు వారికేగా ఇస్తున్నది? పంచాయతీలకు పార్టీ రంగులు వేసారు పోరాడుదాం రండి అంటే, దాంతో మాకేం పని, వాలంటీర్లు వచ్చి మాకు గడప దగ్గరే అన్నీ ఇస్తున్నారుగా అంటారు. అంబులెన్స్ లకు రంగులు మార్చారు పోరాడుదామా అంటే, రంగుతో పనేంటీ? మాకు అందుబాటులో అంబులెన్స్ వుండాలి కానీ అంటారు.

ఇలా ఇప్పుడు తెలుగుదేశం పార్టీ యాగీ చేస్తున్న అంశాలేవీ జనాలను ఇబ్బంది పెట్టేవి, జనానికి పట్టేవి కాదు. ఆఖరికి సామాజిక సమతూకాల మీద పోరాడడానికి కూడా తెలుగుదేశం పార్టీకి జనం దొరకరు. ఎందుకంటే కమ్మ సామాజిక వర్గానికి అన్యాయం జరిగితే జరిగి వుండొచ్చేమో కానీ, మిగిలిన సామాజిక వర్గాలకు కాదు. వాళ్లకు దక్కాల్సిన వాటా వాళ్లకు దక్కుతోంది. అందువల్ల పోరాడానికి ఎవరు వస్తారు?

నాయకులు ఎక్కడ?
రాజకీయ నాయకులు అంటే వ్యాపారాలు లేనివారు వుండరు. వ్యాపారం అన్నాక అడ్డదారులు వుండకుండా వుండవు. గత అయిదేళ్లలో అడ్డంగా, నిలువుగా సంపాదించుకున్న రాజకీయనాయకులు ఇప్పుడు సైలంట్ అయిపోయారు. కొందరు జై భాజపా అన్నారు. కొందరు వైకాపాతో సర్దుకున్నారు. మరి కొందరు అప్పడప్పుడు గాండ్రిస్తున్నారు. ఇలాంటి టైమ్ లో నిరసనలు, ధర్నాలు అంటే సాధ్యమయ్యే పనేనా? అస్సలు కాదు. పోనీ అలా అని వైకాపాను అలా వదిలేద్దామా అంటే, వదిలే సమస్య లేదు. కానీ అలా అని ఏమీ చేయలేరు. మరి కింకర్తవ్యం?

మనం ఏమీ చేయలేని వాడిని మనం ఏం చేస్తాం? వాడిని ఎవరైనా ఏమైనా చేస్తే బాగుండును, లేదా వాడి ఖర్మ కాలి వాడంతట వాడు రాలిపోతే బాగుండును అని చూడడం జనం మెంటాలిటి. ముఖ్యంగా ఏమీ చేయడం చాతకాని వారి మెంటాలిటీ. ఇప్పుడు చంద్రబాబు తన నలభై ఏళ్ల అనుభవం అంతా పక్కన పెట్టి ఇదే దారిలోకి వచ్చేసారు.

ఇక్కడా వెన్నుపోటే
బాబుగారికి వెన్నుపోటు అనేది అచ్చివచ్చిన కార్యక్రమం అని అందరికీ తెలుసు. అందుకే జగన్ కు కూడా వెన్నుపోటు పొడవడం సాధ్యమా అని చూస్తున్నట్లు వుంది. పార్క్ హయాత్ ెటల్ లో సుజన చౌదరిని బోలెడు మంది వైకాపా జనాలు కలిసారు అంటూ గ్యాసిప్‌లు తమ సామాజిక బంధాల మీడియాలో రాయించడం, ఎక్కడిక్కడ వైకాపాలో అసమ్మతి అలుముకుంటోందని వార్తలు పుట్టించడం, ఇప్పుడు ఇదే కార్యక్రమం. అంటే ఏమిటి? వైకాపాలో అసమ్మతి వచ్చేయాలి. అందరూ కలిసి జగన్‌ను దించేయాలి.

భాజపాకు జగన్ మీద కోపం రావాలి.. వైకాపాతో భాజపా బంధాలు తెగిపోవాలి. జగన్ ఆ విధంగా దిగిపోవాలి. ఈ మేరకు ఏం వార్తలు రాయిద్దాం. పుట్టిద్దాం. ఇదే కార్యక్రమం. అంటే పోరుబాటకు బాబుగారు స్వస్తి చెప్పేసారు.

జగన్ పార్టీలో ముసలం ఎలా పుట్టించాలి? జగన్‌ను భాజపాను ఎలా విడగొట్టాలి? భాజపాకు జగన్ మీద ఎలా కోపం తెప్పించాలి?

ఆ విధంగా జగన్‌ను ఎలా అర్జెంట్‌గా అయిదేళ్ల వరకు పాలించకుండా గద్దె దింపాలి. ఇదే కార్యక్రమం. అంతే కానీ జనంలోకి వెళ్లాలి. కార్యకర్తలను సమీకరించాలి. పార్టీని బలోపేతం చేయాలి లాంటి ఆలోచనలు లేవు. పోనీ ఇప్పుడు అంటే కరోనా ఈ సమస్య దాటాక అయినా ఆ దిశగా వెళ్దాం. అంతవరకు వేచి చూద్దాం అని లేదు. ఎలా అడ్డదారిలో జగన్‌ను దింపేయాలా? అన్నదే ఆలోచన.

ఇదంతా ఎందుకు?
అయిదేళ్ల వరకు చంద్రబాబు ఎందుకు వేచి వుండలేకపోతున్నారు. ఇప్పటికిప్పుడు ఏదో ఒకటి చేసి జగన్‌ను ఎందుకు గద్దె దింపేయాలని తాపత్రయపడుతున్నారు. దీనికి రెండే కారణాలు రాజకీయ వర్గాల్లో వినిపిస్తున్నాయి. ఒకటి అమరావతి అంకం ముగిసిపోయేలా వుంది. ఇప్పటికే ఈ ఉద్యమం నీరసించిపోయింది. ఇలా వదిలేస్తే, అమరావతి కథ ముగిసిపోతుంది. అర్జెంట్‌గా జగన్‌ను దింపి, అమరావతిని మళ్లీ పునరుద్దరించాలి.

ఇక రెండో కారణం, సామాజిక వర్గం నీరసించిపోతోంది. మూలిగే నక్క మీద తాటిపండు అన్నట్లుగా జగన్ వచ్చాక వ్యాపారాలు నీరసించిపోయాయి అని దేశం అనుకూల సామాజిక వర్గం కిందా మీదా అయిపోతుంటే,కరోనా వచ్చి పడిపోయింది. రియల్ ఎస్టేట్, ెటల్, సినిమా, మీడియా రంగాల్లో పాతుకపోయిన ఈ సామాజిక వర్గం తొలిసారిగా నష్టాలు చవిచూస్తోంది. నిజానికి ఇప్పుడు కనుక బాబుగారు అధికారంలో వుండి వుంటే, తన అనుకూల సామాజిక మీడియాకు ప్రతి నెలా తలో పది కోట్ల ప్రకటనలు ఇచ్చి, అడ్డ దారిలో ఆదుకుని వుండేవారు. ఇప్పుడు. ఆ అవకాశం లేకపోయింది. అదీ కూడా ఓ పెద్ద సమస్యగా మారింది. తమ అనుకూల మీడియా ఇప్పుడే నీరసించిపోతే, నాలుగేళ్ల తరువాత పరిస్థితి ఏమిటి?

అందువల్ల అర్జెంట్‌గా జగన్ దిగిపోవాలి. అధికారం బాబుగారికి కాకపోయినా, మరెవరికైనా అందాలి. అప్పుడు వాళ్లని మేనేజ్ చేసుకుని మళ్లీ దేశం అనుకూల సామాజికవర్గ వికాసం జరగాలి. అందుకే నలభై ఏళ్ల అనుభవాన్ని పక్కన పెట్టేసారు. పోరుబాటను వదిలేసారు. వెన్నుపోటు రాజకీయాలనే నమ్ముకున్నారు. వైకాపాలో అసమ్మతి రాజుకుంటోందన్న కలరింగ్ ఇచ్చే ప్రయత్నం ముమ్మరం చేసారు. ఎప్పుడు అయితే ఇవి నమ్ముతారో అప్పుడు ఎక్కడన్నా ఒకరిద్దరు అసమ్మతి జనాలు వుంటే బయటకు వస్తారు. ఎప్పుడైతే వైకాపా వీక్ అవుతోంది అని గమనిస్తే, భాజపా కూడా బంధాలు తెంపుకోవచ్చు. అదీ బాబుగారు అండ్ కో దూరాలోచన గ్యాసిప్ లు రాజకీయ వర్గాల్లో వినిపిస్తున్నాయి.

ఎంతయినా ఫార్టీ ఇయర్స్ ఇండస్ట్రీ కదా.

చాణక్య
writerchanakya@gmail.com

Show comments