ఎమ్బీయస్: వైయస్ గురించి ఉండవల్లి

రోజు వైయస్ జయంతి. ‘‘వైయస్సార్‌తో..’’ పేర ఉండవల్లి అరుణ్‌కుమార్ రాసిన పుస్తకం నాకు నచ్చిందని గతంలోనే రాశాను. ‘వైయస్ చాలా మంచివాడు, ఏ చెడూ లేనివాడని నేను చెప్పలేను గానీ, నా విషయంలో మాత్రం వైయస్ కేవలం మంచివాడే! కాబట్టి అలాటి సంఘటనలే రాశాను’ అని ఉండవల్లి మొదటిమాటలోనే చెప్పేశారు కాబట్టి, దీనిలో సెన్సేషనల్ విషయాలేవీ ఎదురు చూడలేం. కానీ ఉండవల్లి చెప్పిన తీరు వలన వైయస్ వ్యక్తిత్వంలో ఒక కోణం మనకు పరిచయమౌతుంది. ఆ పుస్తకంలో ప్రస్తావించిన కొన్ని విషయాలు గురించి మీతో పంచుకుంటున్నాను. నచ్చితే పుస్తకం కొని చదవండి.

ముందుగా పివి-సోనియాల గురించి -  2005లో పివి వర్ధంతి సభకి సోనియాను ఆహ్వానించాలని ఆయన కుమారుడు, మనుమడు కలిసి దిల్లీకి వెళితే ఆవిడ ఎపాయింట్‌మెంట్ దొరకలేదు. పార్లమెంటు సమావేశాలు జరుగుతున్నాయి కాబట్టి పార్లమెంటు హాల్లో కలవవచ్చనుకుని అక్కడకు వెళ్లారు. అక్కడ ఉండవల్లి పలకరించి విషయం కనుక్కుని, సోనియాతో చెప్తానన్నారు. ఒక ఎంపీకి అది తెలిసి ‘నువ్వేం కలగచేసుకోవద్దు. పివి అంటే సోనియాకు పడదని అందరికీ తెలుసు. అందుకే మేమందరం గప్‌చుప్‌గా వున్నాం’ అని హెచ్చరించారు.

అయినా సోనియా సెంట్రల్ హాల్ నుండి లోకసభకు వడివడిగా వెళ్లే సమయంలో ఉండవల్లి వెంటపడి చెప్పేశారు. ఆవిడ ఉలిక్కిపడి ఆగిపోయి, ‘అపాయింట్‌మెంట్ అడిగారా, అడిగితే యివ్వలేదా’ అని సూటిగా అడిగారు. ‘అదే చెప్తున్నారు’ అన్నారు ఉండవల్లి. సోనియా ఏమీ మాట్లాడకుండా లోపలకి వెళ్లిపోయారు. ఇదంతా చూసిన ఎంపీ ‘చెప్పానా? ఆవిడకు కోపం తెప్పించావ్. వెంటనే వైయస్‌కు చెప్పు, లేకపోతే నీ ఎఫెక్ట్ ఆయన మీద కూడా పడుతుంది.’ అన్నాడు.

విషయం విని వైయస్ ‘నువ్వు చేసినది కరక్టే. లోకసభలోంచి వెళ్లిపోయేటప్పుడు ఆవిణ్ని మళ్లీ అడుగు. ఎవరో ఏదో అన్నారని యిదవ్వకు. అసలు నువ్వావిడకి చెప్పకపోతేనే తప్పు.’ అన్నారు. క్వశ్చన్ అవర్ కాగానే సోనియా బయటకు వెళుతూ ఉండవల్లిని పిలిచి ‘‘నేనిప్పుడు ఆఫీసుకి రావటం లేదు. పివి గారబ్బాయిని తీసుకుని రేపు 10 గంటలకి ఆఫీసుకొచ్చేయ్’ అన్నారు. మర్నాడు కలిసి వాళ్లతో బాగా మాట్లాడారు కూడా.

మార్గదర్శి వివాదం – వైయస్ తను అధికారంలో ఉన్నంతకాలం ‘ఆ రెండు పత్రికలు’ అంటూ జపిస్తూనే వుండేవారు. అందుకే ఉండవల్లి మార్గదర్శి వివాదాన్ని చేపట్టగానే యిదంతా వైయస్ వెనక్కాల నుంచి చేయించిందే అనుకున్నారు. జరిగినదేమిటో ఉండవల్లి యీ పుస్తకంలో వివరించారు. వాళ్ల అమ్మగారు, సోదరుడు మార్గదర్శిలో ఫిక్సెడ్ డిపాజిట్లు వేసుకున్నారు. రెన్యూ చేసే సమయంలో ‘కనీసం లక్ష రూ.ల మొత్తం లేకపోతే రెన్యూ చేయం’ అని ఉత్తరం రావడంతో ఆ డిపాజిట్ రిసీట్‌లను తిరిగి యిచ్చేసి, డబ్బు వెనక్కి యిచ్చేయమన్నారు. అవి అందినట్లు యిచ్చిన రసీదుపై సంతకాలు సరిగ్గా లేకపోవడంతో వాళ్ల అమ్మగారికి అనుమానమొచ్చి యీయనను చూడమన్నారు.

మార్దదర్శి గురించి తల్లికి ధైర్యం చెపుతూనే ఈయన ఆ ఫిక్సెడ్ డిపాజిట్ రిసీట్ల జిరాక్సులు చూశారు. ఏదో తేడాగా అనిపించి, తనకు తెలిసిన లాయర్లకు పంపారు. వాళ్లు యీ రకమైన డిపాజిట్ల సేకరణ చట్టవిరుద్ధమని చెపుతూనే, అయినా రామోజీరావుగారు అవన్నీ చూసుకోకుండా వుంటారా? అన్నారు. వైయస్ సలహాదారుల్లో ఒకరు, ఫైనాన్షియల్ ఎక్స్‌పర్ట్ అయిన సోమయాజులుగారికి పంపితే యిది క్రిమినల్ నేరమేనని కరాఖండీగా చెప్పారు. అంతేకాదు, యీ విషయమై పత్రికలకు ఆకాశరామన్న ఉత్తరాలు పంపారు. ఎవరూ సీరియస్‌గా తీసుకోలేదు, ప్రచురించలేదు.  అప్పుడు ఉండవల్లితో కలిసి ఫిర్యాదు రూపంలో కేంద్ర ఆర్థికమంత్రికి పంపాలనుకున్నారు. దానికి ముందు వైయస్‌తో చెపితే మంచిదని చెప్పారు.

సుమారు రూ. 5 వేల కోట్ల జరిమానా, రెండేళ్ల జైలుశిక్ష అనుభవించాల్సినంత కేసులో రామోజీ యిన్‌వాల్వ్‌ అయ్యారంటే వైయస్ నమ్మలేదు. అంత పెద్ద కేసులో ముద్దాయిగా దొరుకుతారన్న ఉత్సాహం కనపరచలేదు. ‘‘నువ్వు మేడమ్ దృష్టిలో మంచి పొజిషన్‌లో వున్నావు. దుస్సాహసం చేసి, చెడగొట్టుకోవద్దు’’ అన్నారు. ‘‘అంటే వేరెవరిచేతనైనా ఫిర్యాదు చేయించమంటారా?’’ అని ఉండవల్లి అడిగితే ‘‘మీ అమ్మ, తమ్ముడి డిపాజిట్‌ల విషయంలో వేరే వారెవరు ఎలా చేస్తారు? చేస్తే నువ్వే చేయి, లేకపోతే మానెయ్. ఇది యింకెవరితో డిస్కస్ చేయకు.’’ అన్నారు పక్కనున్న కెవిపి.

మర్నాడే ఉండవల్లి దిల్లీ వెళ్లి ఫైనాన్స్ మినిస్టర్‌కి ఫిర్యాదు యిచ్చి ప్రెస్‌కు రిలీజ్ చేయడం జరిగాయి. దీనికి రామోజీ చాలా అతిగా స్పందించారు. ఆ రాత్రే ఈటీవీలో స్వయంగా కనబడి ఇదంతా వైయస్ కుట్ర అని ఆరోపించారు. ఆయన కోడలైతే ‘ఆఫ్టరాల్ ఓ ఎంపీ మమ్మల్ని అంటాడా?’ అని రెచ్చిపోయారు. ప్రతిపక్షాలు యిదంతా వైయస్ పత్రికాస్వేచ్ఛపై చేస్తున్న దాడి అంటూ దండెత్తారు. చివరకు ఏమైందో అందరికీ తెలుసు. మార్దదర్శి ఎన్ని స్టేలు తెచ్చుకుందో, డిపాజిటర్ల పేర్లను ఎంత గోప్యంగా వుంచిందో, చివరకు డిపాజిట్లను వెనక్కి యిచ్చేసి, ఆ వ్యాపారం ఎలా మూసేసిందో పాఠకులకు గుర్తుండే వుంటుంది. ఆ కేసు యింకా నడుస్తూనే వుంది.

ఆత్మీయుల పట్ల వైయస్‌ వైఖరి గురించి – 1998 పార్లమెంటు ఎన్నికలలో వైయస్ రాజమండ్రి ఎంపీ సీటుకి ఉండవల్లిని ప్రతిపాదించారు. దిల్లీలో లాబీయింగ్ మొదలుపెట్టారు. అది సిఎంగా ఉన్న విజయభాస్కర రెడ్డికి నచ్చలేదు. ఉండవల్లిని పిలిచి ‘‘తెలివైనవాడివి. వైయస్ తప్పులు చేస్తూ వుంటే ఆపాలి కానీ సై అంటావా? నువ్వు అతనికి ఓ పెద్ద వీక్‌నెస్ అయిపోయావు. ఎంపీ కాండిడేట్ అవ్వాలంటే ఎంత డబ్బు కావాలి, ఎంత బలం వుండాలి. అధికారంలోకి వచ్చాక ఏదైనా నామినేటెడ్ పదవి చూడవచ్చు కానీ యిలా ఎన్నికల క్షేత్రంలో నెగ్గుకు రాగలవా? నీలాటివాణ్ని వెనకేసుకుని వచ్చి అతనెంత చెడ్డపేరు తెచ్చుకుంటున్నాడో అర్థం చేసుకోలేవా?’’ అంటూ చివాట్లు పెట్టారు.

మర్నాడు వైయస్ దిల్లీకి రాగానే ఉండవల్లి ఆయనకు యిదంతా చెప్పి ‘వదిలేయండి, నా వలన మీకు చెడ్డపేరు వస్తోంది’ అని మొత్తుకున్నారు. వైయస్ అంతా విని కూడా పి.జనార్దన రెడ్డి ద్వారా కాంగ్రెసు అధ్యక్షుడు సీతారాం కేసరి దగ్గరకు ఉండవల్లిని పంపారు. దాంతో ఆయన పేరు కాంగ్రెసు వర్కింగ్ కమిటీ పరిశీలన వరకు చేరింది. చివరకు టిక్కెట్టు మాత్రం విజయభాస్కర రెడ్డి సిఫార్స్ చేసిన వ్యక్తికే దక్కింది. ఆ రోజు టిక్కెట్ల లాబీయింగ్ కోసం దిల్లీ వచ్చి దక్కని వారు ఓ పాతిక ముప్ఫయి మంది నాయకులు వైయస్ బస చేసిన చోటకి వచ్చారు.

వచ్చి ‘‘లీడరంటే మీరే సార్. మిమ్మల్ని నమ్ముకున్న అరుణ్ ఏ పైరవీ చేయకపోయినా అతన్ని వర్కింగ్ కమిటీ పరిశీలన వరకు తీసుకెళ్లారు. మేం నమ్ముకున్న నాయకులెవరూ అలా చేయలేదు. మా పేర్లు కనీసం పేపర్లలో కూడా రాలేదు.’’ అని వాపోయారు. ఉండవల్లి మిత్రుడు ఒకాయన వచ్చి పదిమందిలో కూర్చున్న వైయస్‌తో ‘‘మా అరుణ్ గాడిని ఏదో ఒకటి చేసేదాకా నువ్వు ఊరుకోవు. ఇంతకాలం వాడెనకా, వీడెనకా తిరిగాను. ఇవేళ నుంచి నువ్వే నా లీడర్. (ఉండవల్లి కేసి తిరిగి) ఒరే అరుణా, ఎపి భవన్ వద్ద వైయస్ పేరు మార్మ్రోగిపోతోందిరా. నమ్మినవాణ్ని పైకి తేవాలంటే వైయస్ ఒక్కడే, మిగిలిన వాళ్లంతా ఎవరిగోల వాళ్లదే.’’ అని ఆవేశంగా మాట్లాడారు.

మర్నాడు వైయస్ ఉండవల్లికి ఉపదేశం చేశారు – ‘‘నీ వల్ల చెడ్డపేరు వస్తుందన్నావ్. నీకు టిక్కెట్ వచ్చిందా లేదా అన్నది యిస్యూ కాదు. నాతో కలిసుండే మనుషుల్ని నేనెంతవరకూ పైకి తీసుకెళ్లగలననేదే యిస్యూ. ఫస్ట్ రాంక్ నాయకులు అవసరాన్ని బట్టి అటూయిటూ మారుతూంటారు. నిన్న వచ్చినవాళ్లంతా సెకండ్, థర్డ్ రాంక్ నాయకులు, ఒపీనియన్ మేకర్స్. ఎవరికైనా మంచిపేరు వచ్చినా, చెడ్డపేరు వచ్చినా వీళ్ల వల్లే వస్తుంది. నీ కారణంగా నాకు మంచిపేరే వచ్చింది. వర్రీ అవకు.’’

వైయస్ వెనక్కాల ద్వితీయశ్రేణి నాయకులు ఎందుకు అంటిపెట్టుకుని తిరిగారో యీ సంఘటనతో మనకు బాగా అర్థమౌతుంది.

ఎమ్బీయస్ ప్రసాద్ (జులై 2020)
mbsprasad@gmail.com

Show comments