కీలక నిర్ణయం.. ఏపీలో ఇకపై కరోనా జైళ్లు

దీనర్థం.. కరోనా వస్తే జైలులో పెడతారని కాదు. జైళ్లో ఇప్పటికే ఉన్న ఖైదీలకు కరోనా సోకకుండా ఉండేందుకు ఏర్పాటుచేయబోయే ప్రత్యేక కారాగారాలు ఇవి. ఈ మేరకు కరోనా జైళ్లు ఏర్పాటుచేయాలని జగన్ సర్కార్ నిర్ణయించింది.

అండర్ ట్రయల్ నిందితులు, కొత్తగా శిక్షపడి జైలుకొచ్చే ఖైదీల వల్ల ఆల్రెడీ శిక్ష అనుభవిస్తున్న ఖైదీలకు వైరస్ సోకుతోంది. అందుకే ఇలా కొత్తగా జైళ్లలోకి వచ్చే ఖైదీల కోసం ప్రత్యేకంగా కొన్ని జైళ్లు ఏర్పాటుచేయాలని ప్రభుత్వం నిర్ణయించింది.

కొత్తగా వచ్చిన నిందితులు/ఖైదీల్ని ప్రత్యేకంగా ఏర్పాటుచేసిన కరోనా జైళ్లలోకి ప్రవేశపెడతారు. ఈ జైళ్లలో కరోనా ల్యాబ్, పీపీఈ కిట్లు, శానిటైజేషన్ కార్యక్రమాలు ఉంటాయి. అందుబాటులో ఓ మెడికల్ ఆఫీసర్, పారా మెడికల్ అధికారి కూడా ఉంటారు. ఇక్కడ టెస్టులు పూర్తిచేసి, అవసరమైతే 2 వారాల పాటు జైలులోనే క్వారంటైన్ గా ఉంచి.. నెగెటివ్ వచ్చిన తర్వాతే అసలైన జైలుకు పంపిస్తారన్నమాట.

ఈ మేరకు శ్రీకాకుళం, విజయనగరం, అనకాపల్లి, కాకినాడ, భీమవరం, మచిలీపట్నం, ప్రొద్దుటూరు, డోన్, గుత్తి, కావలి, మార్కాపురం లోని జైళ్లను కరోనా జైళ్లుగా మార్చాలని నిర్ణయించింది ప్రభుత్వం. తాజా నిర్ణయం వల్ల జైళ్లలో కరోనా వ్యాప్తిని పూర్తిగా అరికట్టవచ్చని ప్రభుత్వం భావిస్తోంది. మరోవైపు జైళ్లలో పనిచేసే సిబ్బంది, పోలీసులకు ప్రతిరోజూ టెంపరేచర్ చెక్ చేసిన తర్వాతే లోపలకు పంపిస్తోంది ప్రభుత్వం.

వైఎస్సార్ జయంతి వేడుకలు

చచ్చిపోతానేమో అని చాలా భయమేసింది

Show comments