పాత సీరియల్స్ తో తలపట్టుకున్న ఈటీవీ

లాక్ డౌన్ నియమాలు సడలించి.. సీరియల్, సినిమాల షూటింగ్ లకు ప్రభుత్వం పచ్చ జెండా ఊపిన 2 రోజులకే స్టార్ట్ కెమెరా యాక్షన్ అని మొదలెట్టింది ఈటీవీ. పీపీఈ కిట్లు ధరించిన మేకప్ మెన్లు, కెమెరా సిబ్బందితో హడావిడి చేసింది. మాస్క్ లు, శానిటైజర్లు వాడుతున్న నటీనటుల ఫొటోలు చూపి.. అత్యంత భద్రతా ప్రమాణాలతో సీరియళ్లు తెరకెక్కిస్తున్నామంటూ ఊదరగొట్టింది. 

కట్ చేస్తే వారం రోజులు తిరిగేలోగా ఈటీవీలో టాప్ రేటింగ్ ఉన్న ఓ సీరియల్ హీరోయిన్ కరోనా బారిన పడింది. మరో 10 మంది నటీనటులు కరోనా భయంతో క్వారంటైన్ కి వెళ్లిపోయారు. వారితో కలసిమెలసి తిరిగినవారు కూడా ఇళ్లకే పరిమితమయ్యారు. ఈ దశలో సీరియల్స్ షూటింగ్ అత్యంత ప్రమాదకరమనే విషయం అర్థమైపోయింది.

హడావిడిగా మొదలు పెట్టి టెలికాస్ట్ చేస్తున్న సీరియల్స్ ని అనివార్యంగా ఆపాల్సిన పరిస్థితి వచ్చింది. అందుకే లాక్ డౌన్ టైమ్ లో సీరియళ్లకు బ్రేక్ ఇచ్చిన ఈటీవీ తన పాత సీరియళ్లను తెరపైకి తెస్తోంది. రామోజీరావు తనయుడు సుమన్ జమానాలో తయారైన ఈటీవీ సీరియళ్లను ఇప్పుడు సరికొత్తగా కొత్త తరం ప్రేక్షకుల ముందుకు తెస్తోంది. వాటిలో కొన్నిటిని ఏరుకుని ఇప్పటి పరిస్థితులకు సరిపోయే వాటిని సిద్ధం చేసింది.

ఈ పాత సీరియల్స్ టెలికాస్ట్ ప్రోమోలు ఒక్కొక్కటే బైటకొస్తున్నాయి. అయితే అడ్వర్టైజ్ మెంట్లదే అసలు సమస్య అవుతోంది. కొత్త సీరియల్స్ కి ప్రమోటర్స్ గా వ్యవహరిస్తున్నవారెవరూ పాతవాటి జోలికి వెళ్లడంలేదు. అదే సమయంలో కొత్త సీరియళ్లు ఆగిపోతే తమకు నష్టపరిహారం చెల్లించాలని, లేనిపక్షంలో తక్కువ రేటుకే మరిన్ని స్లాట్ లు కావాలని డిమాండ్ చేస్తున్నారట. దీంతో పాత సీరియళ్ల ప్రోమోలు వేస్తున్నా.. వాటి టెలికాస్టింగ్ విషయంలో తలపట్టుకుంది ఈటీవీ యాజమాన్యం.

నిజానికి ఇది ఈటీవీకి మాత్రమే పరిమితమైన సమస్య కాదు. దాదాపు అన్ని ఛానెళ్లలో ఇదే పరిస్థితి ఉంది. కాకపోతే ఉన్నంతలో అవి తాజాగా అనిపించే పాత సీరియల్స్ ను తెరపైకి తీసుకొస్తుంటే.. ఈటీవీ మాత్రం పుష్కరం కిందటి పాత చింతకాయపచ్చడి సీరియల్స్ ను ప్రసారం చేయడానికి రెడీ అవుతోంది. అక్కడే వ్యవహారం తేడా కొడుతోంది.

చచ్చిపోతానేమో అని చాలా భయమేసింది

Show comments