అమాయ‌కులపై పోలీసుల ప్ర‌తాపం, రోజుకు ఐదుగురు బ‌లి!

భార‌తదేశంలో స‌గ‌టున ప్ర‌తి రోజూ ఐదు మంది పోలిస్ క‌స్ట‌డీలో మ‌ర‌ణిస్తూ ఉంటారని ఒక నివేదిక చెబుతూ ఉందంటే ఆశ్చ‌ర్యం క‌ల‌గ‌క‌మాన‌దు. ఇండియాలో పోలిస్ ను చూస్తే భ‌ద్ర‌తగా ఫీల్ కావ‌డం ఎలా ఉన్నా భ‌యం అనేది అవ‌హిస్తుంది. ఇందుకు నిద‌ర్శ‌నంగా ఉంది పై నివేదిక‌. త‌మిళ‌నాట తూత్తుకొడి జిల్లాలో తండ్రీకొడుకులిద్ద‌రు ఇటీవ‌లే పోలీస్ క‌స్ట‌డీలో మ‌ర‌ణించిన సంఘ‌ట‌న దేశ వ్యాప్తంగా పెను సంచ‌ల‌నంగా మారిన సంగ‌తి తెలిసిందే. లాక్ డౌన్ నిబంధ‌న‌ల మేర‌కు వారి షాప్ ను మూసి వేయాలేద‌ని పోలీసులు వారిని అదుపులోకి తీసుకున్నారు. అదేమీ తీవ్ర‌మైన నేరం కాక‌పోవ‌చ్చు. అయితే ఆ త‌ర్వాతి ప‌రిణామాలు తీవ్రంగా మారాయి.

ఇప్ప‌టికే వారిని అదుపులోకి తీసుకున్న రోజున ఆ షాప్ వ‌ద్ద ఏం జ‌రిగింద‌నే అంశానికి సంబంధించిన సీసీ టీవీ పుటేజ్ లు కూడా బ‌య‌ట‌కు వ‌చ్చాయి. షాపును మూసేయ‌మ‌న్న త‌మ‌తో ఆ తండ్రీకొడుకులు వాగ్వాదానికి దిగార‌ని పోలీసులు చేస్తున్న వాద‌న‌. అయితే ఆ సీసీ టీవీ పుటేజ్ లో అలాంటి దృశ్యాలు ఏమీ క‌న‌ప‌డ‌వు. అందునా ఆ తండ్రీకొడుకులిద్ద‌రినీ ఒకేసారి కూడా పోలీసులు అదుపులోకి తీసుకోలేదు. పోలీసులు ఆ షాప్ వ‌ద్ద‌కు రావ‌డం, తండ్రి వెళ్లి వాళ్ల‌తో మాట్లాడ‌టం, కొంత‌సేప‌టికే అత‌డిని పోలీసులు తీసుకెళ్లిపోవ‌డం ఆపై కొడుకు షాప్ వ‌ద్ద‌కు వ‌చ్చి, జ‌రిగినది తెలుసుకుని స్టేష‌న్ కు బ‌య‌ల్దేర‌డం ఆ సీసీ టీవీ కెమెరా పుటేజీల్లో రికార్డు అయ్యింది. పోలీసులు తెలివిగా త‌మ స్టేష‌న్ వ‌ద్ద సీసీ కెమెరాల దృశ్యాల‌ను డిలీట్ చేశార‌ట‌. అయితే షాపు వ‌ద్ద కెమెరాలు పోలీసుల త‌ప్పిదాన్ని ప‌ట్టిస్తున్నాయి.

ఒక‌వేళ ఆ తండ్రీకొడుకులు చేసింది నిబంధ‌న‌ల‌కు వ్య‌తిరేకం అయితే వారిపై కేసులు పెట్ట‌వ‌చ్చు. ఆ మేర‌కు కేసులు కూడా పెట్టారు. ఆ త‌ర్వాత అనూహ్యంగా వారిద్ద‌రూ ఒక‌రి త‌ర్వాత మ‌రొక‌రు మ‌ర‌ణించారు. వారిని పోలీసులే ఆసుప‌త్రికి త‌ర‌లించ‌గా, అక్క‌డ వారు మ‌ర‌ణించారు. వారు కింద‌ప‌డ్డార‌ని  అందుకే చ‌నిపోయార‌నేది పోలీసుల త‌ర‌ఫు నుంచి వినిపిస్తున్న వాద‌న‌. అయితే కింద ప‌డినంత మాత్రాన తండ్రీకొడుకులిద్ద‌రూ మ‌ర‌ణిస్తారా? అనేది ప్ర‌శ్న‌.

వారిని తీవ్రంగా హింసించార‌ని, థ‌ర్డ్ డిగ్రీ ప్ర‌యోగించార‌ని.. పోలీసులు అత్యంత క‌ర్క‌శంగా వ్య‌వ‌హ‌రించ‌డంతోనే వారు మ‌ర‌ణించార‌నేది బ‌లంగా వినిపిస్తున్న వాద‌న‌. దేశంలో పోలిస్ స్టేష‌న్ల ప‌రిస్థితులు తెలిసిన వారు ఆ వాద‌న‌ను స‌మ‌ర్థిస్తూ ఉన్నారు. పోలీస్ క‌స్ట‌డీ అనేది సామాన్యుల‌కు న‌ర‌క‌ప్రాయ‌మైన అంశంగా మారింద‌నే అంశాన్ని కోర్టులు ప్ర‌స్తావించిన అంశాన్ని కూడా గుర్తు చేస్తూ ఉన్నారు. పోలీసులు త‌మ స్టేష‌న్ కు రాజుల్లా ఫీల‌వుతార‌ని, అక్క‌డ ఏం చేసిన త‌మ‌ను ఎవ్వ‌రూ ఏం చేయ‌లేరు అనే భావ‌న వారిలో ప్ర‌బ‌లంగా ఉంద‌నే అభిప్రాయాలున్నాయి సామాన్యుల్లో కూడా.

ఒక‌వేళ వాళ్లు స్టేష‌న్లో అక్ర‌మాలు చేసినా అవి నిరూపితం కావు, వారిని ఏం చేసే ప‌రిస్థితి లేద‌ని ఇది వ‌ర‌కూ అనేక కేసుల్లో రుజువైంద‌ని ప‌రిశీల‌కులు అంటున్నారు. మ‌హా అయితే బ‌దిలీ ఉంటుంద‌ని, అంత‌కు మించి చ‌ర్య‌లు త‌క్కువ‌ని అంటున్నారు. తూత్తుకొడి పోలీసుల తీరుపై ఇప్ప‌టికే సీబీ-సీఐడీ విచార‌ణ జ‌రుగుతూ ఉంది. ఏ హ‌త్య‌కేసులో నిందితుల మీద‌నో తీవ్రంగా వ్య‌వ‌హ‌రించారన్నా, అది కూడా చ‌ట్ట‌బ‌ద్ధం కాదు. అలాంటిది షాపును కాసేపు ఎక్కువ స‌మ‌యం తెరిచినదే నేరం అని, తండ్రీకొడుకుల‌ను పొట్ట‌న పెట్టుకున్న  పోలీసుల తీరును ఎంత త‌ప్పుప‌ట్టినా త‌క్కువే. ఈ ఘ‌ట‌న‌లో ఇప్ప‌టి వ‌ర‌కూ ఐదు గురు పోలీసుల‌ను అరెస్టు చేశారు. హ‌త్యానేరాల కింద కేసుల‌ను న‌మోదు చేశార‌ట‌. అయితే అంతిమంగా వారు ఘాతుకానికి పాల్ప‌డి ఉంటే. ఏ శిక్ష ప‌డుతుంది అనేది అతి చేసే మిగ‌తా పోలీసుల‌కూ ఒక పాఠం కాగ‌ల‌దు.

Show comments