వీళ్ళ జేబులో డబ్బులు ఖర్చు పెడుతున్నారా?

మన ప్రజాస్వామ్యంలో రాచరిక లక్షణాలు చాలా ఉన్నాయి. ఇది పేరుకే ప్రజాస్వామ్యం. కానీ జరిగేదంతా రాచరిక తరహా పాలనే. రాష్ట్రాల్లో ముఖ్యమంత్రులను, కేంద్రంలో ప్రధానిని దేవుళ్లతో సమానంగా చూస్తుంటారు. రాజును మించిన రాజభక్తి ప్రకటించడం ఈ దేశంలో సాధారణమైపోయింది. ఇతర రాష్ట్రాల సంగతి పక్కనపెడదాం.

తెలుగు రాష్ట్రాల్లో మాత్రం కొన్ని పథకాలకు ముఖ్యమంత్రులు తమ పేర్లు పెట్టుకుంటారు. కొన్ని పథకాలకు, వాహనాల మీద ముఖ్యమంత్రులు తమ బొమ్మలు ముద్రించుకుంటారు. ఈ ప్రచార కండూతి ఉమ్మడి రాష్ట్రంలోనే కాదు విభజన తరువాత రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ కొనసాగుతూనే ఉంది.

కాకపొతే తెలంగాణలో కేసీఆర్ పేరు ఒక్క పథకానికి ఉంది.  ఈ సంప్రదాయం ఆంధ్రాలో మితిమీరి పోయింది. ఏపీలో చాలా పథకాలకు జగన్ తన పేరు పెట్టుకున్నారు. మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తక్కువోడేమీ కాదు. ఆయన అధికారంలో ఉండగా వివిధ పథకాలకు ఆయన పేరు పెట్టుకున్నారు. ఆయన చంద్రన్న అని పెట్టుకుంటే ఈయన జగనన్న అని పెట్టుకున్నారు. ఇద్దరూ అన్నలే అన్నమాట.

పథకాలకు ముఖ్యమంత్రులు తమ పేర్లు పెట్టుకోవడానికి వారికి అధికారం ఉందా? అలా పెట్టుకునే హక్కు ఉందా ? ఇది నైతికంగా తప్పు. ఏ పథకాలు అమలు చేయాలన్న అందుకు ఉపయోగించేది ప్రజల సొమ్మే. వివిధవర్గాల ప్రజలు పన్నుల ద్వారా కట్టే డబ్బుతోనే ప్రభుత్వాలు పథకాలు అమలు చేస్తాయి. ముఖ్యమంత్రులు నయా పైసా తమ జేబు నుంచి ఖర్చు పెట్టరు. అలాంటప్పుడు పథకాలకు ముఖ్యమంత్రి పేరు పెట్టడం ఏమిటి?

ప్రభుత్వ పథకాలకు, ప్రభుత్వం నిర్మించే భవనాలకు, ప్రాజెక్టులకు, యూనివర్సిటీలకు.. ఇలాంటివే మరి కొన్నిటికి దివంగతులైన మహా నాయకుల పేర్లో, జాతీయ నాయకుల పేర్లో, కళాకారుల పేర్లో, వివిధ రంగాల్లో దిగ్గజాల పేర్లో పెడితే సముచితంగా ఉంటుంది. వారిని గౌరవించినట్లుగా ఉంటుంది. వాళ్ళ పేర్లూ పెడుతున్నారు. కాదనం. ముఖ్యమంత్రులు తమ పేర్లు పెట్టుకోవడం ఏమిటి? చంద్రబాబు హయాంలో చంద్రన్న బీమా, చంద్రన్న పెళ్లి కానుక... ఇలా చంద్రన్న పేరుతో అనేక పథకాలు ఉన్నాయి.

అధికారం కోసం మామ ఎన్టీఆర్ కు వెన్నుపోటు పొడిచిన బాబు ఆ పాపం పోగొట్టుకోవడానికి కొన్ని పథకాలకు ఎన్టీఆర్ పేరు పెట్టారు. మెడికల్ యూనివర్సిటీకి ఆయన పేరే పెట్టారు.  అప్పట్లో చంద్రబాబును జగన్  విమర్శించారు. ప్రభుత్వ సొమ్ముతో పథకాలు అమలు చేస్తూ నీ పేరు పెట్టుకోవడమేమిటని జగన్ ప్రశ్నించారు. హెరిటేజ్ డబ్బు ఖర్చు చేస్తున్నారా అని నిలదీశారు.

జగన్ అధికారంలోకి వచ్చాక ఈయన అందుకు భిన్నంగా ఉన్నాడా? లేడు కదా. జగనన్న గోరుముద్ద, జగనన్న చేదోడు. జగనన్న విద్యా దీవెన, జగనన్న అమ్మ ఒడి ... ఇలా చెప్పుకుంటూ పొతే చాలా ఉన్నాయి. ప్రభుత్వం  ఇచ్చే సరుకుల లేదా కానుకల కిట్ల మీద సీఎంల బొమ్మలు ఉంటాయి. ప్రస్తుతం కొన్ని పథకాలకు వైఎస్సార్ పేరు పెడుతున్నారు. వైఎస్సార్ సీఎంగా ఉన్నప్పుడు పథకాలకు తన పేరు పెట్టుకోలేదు.

ఆయన పెట్టినవి ముగ్గురి పేర్లే. ఇందిర, నెహ్రు, రాజీవ్. వీరి పేర్లు ఎన్ని పథకాలకు పెట్టారో లెక్క లేదు. కుమారుడు ఇందుకు భిన్నంగా ఉన్నాడు. ఈ సంస్కృతీ తమిళనాడు నుంచి సరఫరా అయినట్టుగా ఉంది. జయలలిత సీఎంగా ఉన్నప్పుడు ఈ కల్చర్ తార స్థాయికి చేరింది. సరే ... ఇంతకూ అసలు విషయమేటంటే ..జగన్ ఈ మధ్య ఏపీలో ఒకేసారి 1088 అత్యాధునిక 108 , 104 అంబులెన్సులు ప్రారంభించారు కదా.

ఇన్ని అత్యాధునిక అంబులెన్సులు ఇలా ఒకేసారి ప్రారంభించడం దేశంలోనే ఇదే మొదటిసారి. దీనిపై బీజేపీ వివాదం లేవదీసింది. అంబులెన్సులు కోసం ఖర్చుపెట్టిన 200 కోట్లలో 70 శాతం నిధులు కేంద్రప్రభుత్వం ఇచ్చింది కాబట్టి అంబులెన్స్ వాహనాల మీద ప్రధాని నరేంద్ర మోడీ బొమ్మ వేయాలని బీజేపీ నాయకులు డిమాండ్ చేస్తున్నారు. ఈ డిమాండ్ ఎందుకంటే వాహనాల మీద జగన్, వైఎస్సార్ బొమ్మలు ఉన్నాయి. 

నిజానికి అంబులెన్సుల కోసం ఖర్చు చేసిన డబ్బు జగన్ సొంతం కాదు. మోడీ జేబులోవీ కాదు. జనం డబ్భు. కానీ జగన్ తన బొమ్మ వేసుకున్నారు. కేంద్రం వాటా ఎక్కువ ఉంది కాబట్టి మోడీ బొమ్మ వేయాలని కాషాయ నాయకులు డిమాండ్ చేస్తున్నారు.

టీడీపీ అధికారంలో ఉన్నప్పుడు కూడా బీజేపీ నాయకులు ఇలాంటి డిమాండ్ చేశారు. కేంద్రం నిధులతో ప్రవేశపెట్టిన పథకాలకు చంద్రబాబు తన పేరు పెట్టుకున్నారని అప్పట్లో మండిపడ్డారు. ఆవు కథ మాదిరిగా మళ్ళీ అదే కథ రిపీట్ అయ్యింది. 

ఇడ్లీపాత్ర లాగా ఉప్మాగిన్ని లాగా డిజైన్లు చేశారు

Show comments