ఇది ప్రజలు విధించుకున్న స్వీయ లాక్ డౌన్

హైదరాబాద్ లో మరోసారి లాక్ డౌన్ విధిస్తారంటూ జరుగుతున్న ప్రచారానికి దాదాపు బ్రేక్ పడింది. తెలంగాణ ప్రభుత్వం ఈ దిశగా సానుకూలంగా స్పందించలేదు. రోజురోజుకు వేల సంఖ్యలో కేసులు పెరుగుతున్న వేళ.. వైరస్ సామాజిక వ్యాప్తి దశకు చేరకుండా ఉండాలంటే మరోసారి లాక్ డౌన్ అత్యవసరం అంటూ వైద్యారోగ్య శాఖ అధికారులు చెప్పినప్పటికీ.. ఆర్థిక వ్యవస్థ మళ్లీ గాడితప్పుతుందనే భయంతో ప్రభుత్వం వెనక్కి తగ్గినట్టు తెలుస్తోంది.

లాక్ డౌన్ పై స్వయంగా ముఖ్యమంత్రి ప్రకటన చేసినప్పటికీ.. కేసీఆర్ వెనక్కి తగ్గడానికి ఇదే కారణంగా కనిపిస్తోంది. అందుకే 2-3 రోజుల కిందట జరగాల్సిన కేబినెట్ భేటీ కూడా జరగలేదు. కేంద్రం సూచించిన విధంగానే అన్ లాక్ కు తెలంగాణ ప్రభుత్వం మొగ్గుచూపిస్తోంది. దశలవారీగా మరిన్ని తెరుచుకుంటాయే తప్ప, క్లోజ్ అయ్యే అవకాశాల్లేవు.

తెలంగాణలో మరీ ముఖ్యంగా హైదరాబాద్ లో మరోసారి లాక్ డౌన్ ఉండదని తేలిపోవడంతో.. ప్రజలే స్వీయ లాక్ డౌన్ విధించుకుంటున్నారు. ఎవరికి వారు ఇళ్లకే పరిమితమయ్యారు.అత్యవసరం అయితే తప్ప బయటకు రావట్లేదు. శనివారం హైదరాబాద్ రోడ్లపై ట్రాఫిక్ సాధారణం కంటే తక్కువగా నమోదైంది. రెగ్యులర్ గా తిరిగే వాహనాల్లో నాలుగో వంతు మాత్రమే నిన్న రోడ్లపైకి వచ్చాయి. ఈరోజు మరింత తక్కువగా జనసంచారం ఉండొచ్చని అధికారులు భావిస్తున్నారు.

అటు వ్యాపారులు, షాప్ యజమానులు కూడా ఎవరికి వారు సొంతంగా నిర్ణయాలు తీసుకొని షాపులు మూసేస్తున్నారు. ఇప్పటికే హైదరాబాద్ లోని కీలకమైన బేగంబజార్ మూతపడింది. అమీర్ పేట్, కోఠి, కూకట్ పల్లి, దిల్ సుఖ్ నగర్ లోని ప్రధాన కూడళ్లలో పెద్ద షాపులు తెరవడం లేదు. నగరంలో దాదాపు 70శాతం రెస్టారెంట్లు స్వచ్ఛంధంగా మూతపడ్డాయి.

మొన్నటివరకు లాక్ డౌన్ పడుతుందేమో అనే భయంతో పొరుగు రాష్ట్ర ప్రజలంతా నగరాన్ని వీడి వెళ్లారు. ఇప్పుడు లాక్ డౌన్ ఉండదనే విషయం తెలిసినప్పటికీ సరిహద్దులు దాటే వారి సంఖ్య తగ్గడం లేదు. కరోనా కేసుల సంఖ్య భారీగా పెరుగుతుండడంతో లాక్ డౌన్ అంశంతో సంబంధం లేకుండా ప్రజలు నగరాన్ని వీడుతున్నారు. నిన్న భారీ ఎత్తున ప్రజలు తెలంగాణ నుంచి కృష్ణా, పశ్చిమగోదావరి జిల్లాల సరిహద్దుల ద్వారా ఏపీలోకి ప్రజలు ప్రవేశించారు. అటు హైదరాబాద్ లో ఉంటున్న తెలంగాణ వాసులు కూడా నగరాన్ని ఖాళీ చేసి తెలంగాణలోని ఇతర జిల్లాలకు వెళ్లిపోతున్నారు. దీంతో సిటీ సగానికి సగం ఖాళీ అయింది. ఎక్కడ చూసిన  ఇళ్లకు తాళాలు, టు-లెట్ బోర్డులే కనిపిస్తున్నాయి.

మరోసారి లాక్ డౌన్ విధిస్తే ఆర్థిక రంగం కుంటుపడుతుందని, చిరు వ్యాపారులు నష్టపోతారంటూ చెబుతున్నాయి ప్రభుత్వ వర్గాలు. కానీ ప్రజలే స్వచ్ఛంధంగా లాక్ డౌన్ కు దిగడంతో ప్రభుత్వ ఆలోచనలు, ప్రణాళికలన్నీ తారుమారయ్యే పరిస్థితి కనిపిస్తోంది. 

ఇడ్లీపాత్ర లాగా ఉప్మాగిన్ని లాగా డిజైన్లు చేశారు

Show comments