క‌రోనాకు ఇండియ‌న్ వ్యాక్సిన్ అతి త్వ‌ర‌లో..?

ఇటీవ‌లే క‌రోనా నివార‌ణ‌కు వ్యాక్సిన్ త‌యారీలో భార‌త బ‌యోటెక్ సంస్థ ఒక‌టి ముంద‌డుగు వేసిన‌ట్టుగా వార్త‌లు వ‌చ్చాయి. హైద‌రాబాద్ కేంద్రంగా న‌డిచే బ‌యోటెక్ సంస్థ ఒక‌టి ఆ ప్ర‌క‌ట‌న చేసింది. అయితే ఆ వ్యాక్సిన్ కు ఇంకా హ్యూమ‌న్ ట్ర‌య‌ల్స్ జ‌ర‌గాల్సి ఉంద‌ని కూడా అప్పుడే ప్ర‌క‌టించారు. అయితే ఆ వెంట‌నే ప్ర‌ధాన‌మంత్రి న‌రేంద్ర‌మోడీ ఆధ్వ‌ర్యంలో జ‌రిగిన ఒక స‌మావేశంలో క‌రోనా వ్యాక్సిన్ ను ఏ ప్రాంతాల‌కు ముందుగా చేర్చాల‌నే అంశం గురించి చ‌ర్చించిన‌ట్టుగా వార్త‌లు వ‌చ్చాయి. క‌రోనాతో దేశంలోని కొన్ని రాష్ట్రాలు చాలా ఇబ్బందులు ప‌డుతున్న సంగ‌తి తెలిసిందే. మోడీ స‌మావేశంలో ఆ అంశం గురించి చ‌ర్చించార‌ట‌. ప్ర‌త్యేకించి వ్యాక్సిన్ ను అందించ‌డం గురించినే చ‌ర్చించ‌డం గ‌మ‌నార్హం.

ఇంకా వ్యాక్సిన్ హ్యూమ‌న్ ట్ర‌య‌ల్సే కీల‌కం అనుకుంటుంటే.. మోడీ ఆధ్వ‌ర్యంలో వ్యాక్సిన్ గురించి చ‌ర్చ జ‌ర‌గ‌డం గ‌మ‌నార్హం. తాజాగా ఐసీఎంఆర్ నుంచి మ‌రో ప్ర‌క‌ట‌న వ‌చ్చింద‌ట‌. దాని ప్ర‌కారం ఆగ‌స్టు 15 స‌మ‌యానికి భార‌త్ లో క‌రోనా నివార‌ణ వ్యాక్సిన్ అందుబాటులోకి వ‌స్తుంద‌ట‌! మ‌రో నెలన్న‌ర రోజుల్లోనే దేశంలో క‌రోనా వ్యాక్సిన్ అందుబాటులోకి వ‌స్తుంద‌ని ఐసీఎంఆర్ చెబుతోండ‌టం గ‌మ‌నార్హం!

ఒక‌వైపు కోవిడ్ 19పై తీవ్ర‌మైన పరిశోధ‌న సాగించిన వివిధ సంస్థ‌లు కూడా వ్యాక్సిన్ విష‌యంలో పూర్తి భ‌రోసా ఇవ్వ‌డం లేదు. హ్యూమ‌న్ ట్ర‌య‌ల్స్ లో ఇప్ప‌టికే అవి త‌న‌మున‌క‌లై ఉన్నాయి. వాటి ప్ర‌క‌ట‌న ప్ర‌కారం.. ఈ ఏడాది అక్టోబ‌ర్ క‌ల్లా క‌రోనా నివార‌ణ‌కు వ్యాక్సిన్ అందుబాటులోకి వ‌స్తుంది. భారీ ఎత్తున ఉత్ప‌త్తితో వ్యాక్సిన్ ను అందుబాటులోకి ఉంచ‌బోతున్న‌ట్టుగా ఆ సంస్థ‌లు ప్ర‌క‌టిస్తున్నాయి. అయితే ఐసీఎంఆర్ మాత్రం మ‌రో నెల‌న్న‌ర లోనే క‌రోనా వ్యాక్సిన్ రెడీ అని ఇప్పుడు చెబుతూ ఉండ‌టం విశేష‌మే.

అయితే డ‌బ్ల్యూహెచ్వో మాత్రం బ‌యోటెక్ సంస్థ‌ల ప్ర‌క‌ట‌న‌ల‌ను ప‌ట్టించుకోవ‌డం లేదు. క‌రోనాకు వ్యాక్సిన్ ఇప్పుడ‌ప్పుడే సాధ్యం కాదు, రెండేళ్లు ప‌డుతుంద‌ని తాజాగా డ‌బ్ల్యూహెచ్వోకే చెందిన ఒక శాస్త్ర‌వేత్త కుండ‌బ‌ద్ధ‌లు కొట్టార‌ట‌. క‌రోనాకు ఇప్పుడ‌ప్పుడే వ్యాక్సిన్ రాద‌ని, వ‌స్తే ఆనందించే వాళ్ల‌లో త‌ను కూడా ముందుంటానంటూ ఆయ‌న ప్ర‌క‌టించారు. అయితే క‌రోనా వైర‌స్ విష‌యంలో ఇప్ప‌టి వ‌ర‌కూ డ‌బ్ల్యూహెచ్వో పొడిచింది ఏమీ  లేదు. అంత తీవ్ర‌మైన వైర‌స్ వ్యాపిస్తుంటే... ప్ర‌పంచానికి ఉప‌యోగ‌ప‌డే ప‌ని ఏదీ చేయ‌లేక‌పోయింది. తీరా వైర‌స్ వ్యాపించాకా.. ప్ర‌పంచాన్ని భ‌య‌పెట్టే ప్ర‌క‌ట‌న‌లు చేస్తోంది త‌ప్ప‌, ఉప‌యోగ‌ప‌డే ప‌నులేవీ చేయ‌లేదు. కాబ‌ట్టి డ‌బ్ల్యూహెచ్వో మాట‌ల‌ను జ‌నాలు కూడా సీరియ‌స్ గా తీసుకునే ప‌రిస్థితి లేదు. వ్యాపార‌మే చేస్తాయో, మాన‌వాళికి భ‌రోసా ఇచ్చే వ్యాక్సినే అందిస్తాయో కానీ, ఫార్మా కంపెనీలే ప్ర‌స్తుతానికి ఆశాభావంగా స్పందిస్తున్నాయి.

ఇక నుంచి నో లంచం నో దళారీ

కోహ్లీ.. గాలిలో చప్పట్లతో

Show comments