ఎమ్బీయస్‌ : నెరజాణల కథలు – 05

ఫ్లారెన్సునుంచి పారిస్‌ వెళ్లి స్థిరపడిన ఒక ధనికవర్తకుడికి లొడోవికో అనే కొడుకు వుండేవాడు. అతను ఫ్రెంచ్‌ రాజవంశీకుల పిల్లలతో కలిసి పెరగడం వలన కులీనసంప్రదాయాలన్నీ బాగా నేర్చాడు. ఒకసారి వారి స్నేహితుల మధ్య లోకంలో అందరి కంటె ఎవరు అందగత్తె అనే చర్చ వచ్చింది. బొలోనాలో వున్న ఎగానో అనే పెద్ద వ్యాపారి భార్య మడోనాను మించిన సౌందర్యవతి లేదని చాలామంది అన్నారు. ఆ మాట నిజమో కాదో తెలుసుకోవాలన్న కోరిక దహించివేయగా లొడొవికో తండ్రితో ఏదో సాకు చెప్పి బొలోనా వెళ్లాడు.

అదృష్టవశాత్తూ అతను వచ్చిన మూడో రోజునే ఒక విందు జరగడం, దానిలో ఆమెను చూడడం సంభవించింది. ఆమె ప్రేమను సంపాదించి తీరాలని, దానికై ఎంత కష్టానికైనా వెరవకూడదని నిశ్చయించుకున్నాడు. వాకబు చేయగా వాళ్ల యింట్లో పనివాడి అవసరం వుందని తెలిసింది. తను బస చేసిన పూటకూళ్లిల్లు యజమానితో ''నా పేరు ఎనోచినో. ఉద్యోగం కోసం యీ వూరు వచ్చాను. ఎగానో యింట్లో నౌకరు పని యిప్పించగలవా' అని అడిగాడు.

‘'మూడు రోజులుగా మీ ప్రవర్తన చూస్తున్నాను. ఎగానో వంటి కులీనుడి యింట్లో పనిచేయాలంటే నీలా మర్యాద, మప్పితం తెలిసున్నవాడే కావాలి, నేను సిఫార్సు చేస్తాను’' అన్నాడతను. అతని అందం, సంస్కారయుతమైన అలవాట్లు గమనించిన ఎగానో అతన్ని వెంటనే పనివాడిగా పెట్టుకున్నాడు.

ఒకే యింట్లో వుండడంతో అతనికి తరచుగా మడోనాను చూసే అవకాశం కలిగేది. ఆమె కూడా యితన్ని చూసి ముచ్చటపడేది. శ్రద్ధగా పనిచేసి యజమాని, యజమానురాలి అభిమానాన్ని చూరగొన్నాడు. ఏదో మంచి కుటుంబానికి చెందినవాడై వుండి, అనుకోకుండా ఆస్తి కరిగి పోవడం వలన యిలాటి పనికి వచ్చి వుంటాడని ఆమె అనుకుని అతన్ని ఆదరంగా చూస్తూ, కాస్త చనువుగా వుండేది.

ఇలా నెల్లాళ్లు గడిచాయి. ఒక రోజు ఎగానో వేరే వూరు వెళ్లినపుడు ఆమెకు ఏమీ తోచక అతన్ని చదరంగం ఆడడానికి పిలిచింది. ఆటలో నైపుణ్యం చూపడంతో బాటు చమత్కార సంభాషణతో అతనామెను ఆకట్టుకున్నాడు. ఆట చూస్తున్న పరిచారకులు ఒకరొకరు వెళ్లిపోయి, యిద్దరే మిగిలినపుడు అతను దీర్ఘంగా నిట్టూర్చాడు.

''ఏమైంది?'' అని ఆమె ఆదుర్దాగా అడిగింది. జవాబు చెప్పకుండా యిలా రెండు మూడుసార్లు చేశాక, ఆమె తన ప్రశ్నను రెట్టించింది. ''మీతో చెపితే యింకెవరికైనా చెప్తారని నా భయం'' అన్నాడితను.

ఎవరితోనూ చెప్పనని ఆమె ఒట్టు వేశాక తన కథ చెప్పి 'నా ప్రేమకు మీరు స్పందించకపోయినా ఫర్వాలేదు కానీ నన్ను పనిలోంచి తీసేయకండి, మిమ్మల్ని చూసే అవకాశం కూడా పోగొట్టుకుంటాను' అని వేడుకున్నాడు. ఇతని కథ విని ఆమె కూడా నిట్టూర్చింది.

''ఎనోచినో, నా అందం చూసి వెంట పడినవారు వందల సంఖ్యలో వున్నారు. కానుకలు పంపిస్తామని, నెత్తిన పెట్టుకుంటామని అనేక కబుర్లు పెట్టారు. కానీ నీలా ఎవరూ పనివాడిగా చేరలేదు. నీలాటి ఉత్తమవంశంలో పుట్టినవాడు కావాలనుకుంటే ఎవరైనా అందగత్తెను పెళ్లి చేసుకోవచ్చు. కానీ నా కోసం, నా చూపు కోసం, నీ కోరిక తీరుతుందో లేదో తెలియకుండా యింత కష్టానికి సిద్ధపడ్డావంటే, అందునా సేవకుడి అవతారం ఎత్తావంటే నీకు నాపై వున్న ప్రేమ అంతా యింతా కాదు. అంతటి ప్రేమ పొందగలగడం నా అదృష్టం.'' అందామె. ఆలోచించుకోవడానికి కాస్త సమయం యిమ్మనమంది.

ఇంకొక వారం పోయిన తర్వాత అతన్ని పక్కకు పిలిచి ''నేను చెప్పినట్లు చెయ్యి. ఆర్ధరాత్రి మా పడగ్గదికి వచ్చేయి. తలుపు తీసి వుంచుతాను. లోపలకి వచ్చి తలుపు గడియ వేసేసి, మంచం దగ్గరకి రా. మా ఆయన వైపుకి కాకుండా నా వైపుకి వచ్చి, నేను నిద్రపోతూ వుంటే మెల్లగా తట్టి లేపు. ఆ తర్వాత ఏం చేయాలో అప్పుడు చెప్తాను.'' అంది. ఎనోచినో ఆనందంతో తల వూపాడు.

ఆ రాత్రి ఎనోచినో తన వక్షంపై చేయి వేయగానే ఆమె అతని అరచేతి వేళ్లలో తన వేళ్లను చొనిపి గట్టిగా పట్టుకుంది. అటు తిరిగి భర్తను నిద్ర లేపింది. ఇతను ఉలిక్కిపడ్డాడు, భయపడి పారిపోదామంటే ఆమె పట్టు వదలటం లేదు. ఒక చేయి ఆమెకు అప్పగించి వొంగి మంచం కింద నక్కాడు.

ఎగానో నిద్ర లేచి ''ఏమిటి సంగతి?'' అని అడిగాడు. ''మన దగ్గర పనిచేసే ఎనోచినోపై మీ అభిప్రాయం ఏమిటి?'' అని అడిగింది మడోనా.

''ఇప్పుడెందుకు గుర్తుకు వచ్చాడు?'' అన్నాడతను చికాగ్గా. ''మంచివాడు, బుద్ధిమంతుడు. మన పనివాళ్లలో ఆణిముత్యం. అతని గురించి యిప్పుడీ చర్చ ఎందుకు?''

''నేనూ అలాగే అనుకున్నాను. కానీ నాకేదో తేడాగా అనిపిస్తోంది అతని వ్యవహారం. నిన్న మీరు సరుకులు కొనడానికి వూరెళ్లినపుడు నా దగ్గరకు వచ్చి నేనంటే పడి ఛస్తున్నానని, నా కోసం ప్రాణాలైనా యిస్తాననీ అన్నాడు.''

ఇది వింటూనే ఎనోచినో పై ప్రాణాలు పైకి పోయాయి.

భార్య చెప్పిన మాట విని ఎగానో నిద్ర తేలిపోయింది. లేచి కూర్చుని ''అవునా!? మరి దానికి నువ్వేమన్నావ్‌?'' అని అడిగాడు.

''అతని సంగతేమిటో పూర్తిగా తెలుసుకోవాలని నాకూ నువ్వంటే యిష్టమే అని చెప్పాను. అయితే రేపు రాత్రి తోటలో నీటిబుగ్గ దగ్గరకి రా, ప్రేమించుకుందాం' అన్నాడు.''

ఈ అబద్ధానికి ఎనోచినో కొయ్యబారిపోయాడు.

''ఎంత పొగరు? ఎంత మోసం?'' అని ఎగానో ఆవేశపడ్డాడు.

''అందుకే మీరేం చేస్తారంటే నా పరికిణీ కట్టుకుని, పైన మేలిముసుగు వేసుకుని అతను చెప్పిన చోటకి వెళ్లి చీకట్లో కూర్చోండి. ఎంత ఆలస్యమైనా అతను వచ్చి సరససల్లాపాలు చేయగానే చెయ్యి గట్టిగా పట్టుకుని యింట్లో పనివాళ్లందరినీ పిలిచి బాగా తన్నించండి. తక్కిన పనివాళ్లకు కూడా బుద్ధి వస్తుంది.'' అంది మడోనా.

''ఇప్పుడే వెళుతున్నా'' అన్నాడు ఎగానో. అతను వెళ్లగానే భయంతో బిక్చచచ్చి వున్న ఎనోచినోను మడోనా తనపైకి లాక్కుంది. గబగబా ముద్దులు పెట్టి అతని భయాన్ని పోగొట్టి ''వెళ్లి తలుపు గడియ వేసేసి రా, కనీసం యింకో అరగంట దాకా ఆయన రాడు.'' అంది. ఆ తర్వాత యిద్దరూ స్వర్గసుఖాలు రుచి చూశారు. ఆమె ఆంతర్యం తెలుసుకోలేక కాస్సేపు తిట్టుకున్న ఎనోచినో యిలాటి స్వేచ్ఛ దొరకడంతో రెట్టింపు ఉత్సాహంతో, ఉద్రేకంతో తన తమకం తీర్చుకున్నాడు. అరగంట గడిచాక ''మరి నేను వెళ్లిరానా?'' అని అడిగాడు.

''లేదు, మా ఆయన కథ ముగింపుకి తీసుకురావాలి కదా'' అంది మడోనా నవ్వుతూ. ఏం చెయ్యాలో చెప్పింది.

ఎనోచినో ఒక దుడ్డుకర్ర పట్టుకుని తోటలోకి వెళ్లాడు. మడోనా దుస్తులు వేసుకుని కూర్చున్న ఎగానోను వెనకనుంచి కర్ర తీసుకుని బాదడం మొదలుపెట్టాడు. ''ముదనష్టపుదానా, ఎగానో ఎంత మంచివాడు, ఎంత గొప్ప మనసున్నవాడు, నిన్నెంత బాగా చూసుకుంటాడు, అలాటి వాడికి ద్రోహం తలపెడతావా? నీ టక్కులమారితనం గమనించి, కావాలనే నీ వలలో పడినట్లు నటించాను. నీ అసలు రంగు బయటపడింది.'' అని తిడుతూ చితక్కొట్టేశాడు.

ఎగానో ఏదో చెప్పబోతున్నా వినిపించుకోలేదు. చివరకు ఎగానో ముసుగు తీసేసి, పరికిణీ విప్పేసి, అతని చేతిని గట్టిగా పట్టుకుని 'నేను మడోనాను కాను, ఎగానోని' అని మొత్తుకున్నాడు. అతన్ని చూస్తూనే 'మీరా!?' అంటూ కాళ్ల మీద పడిపోయాడు ఎనోచినో.

దెబ్బలు తిన్నా అతనికి తనపై గల స్వామిభక్తికి, తన భార్య పతిభక్తికి ఎగానో ఎంతో సంతోషించాడు. ఇద్దరూ దక్కడం తన అదృష్టమనుకున్నాడు.  ఇద్దరూ మరింత చనువుగా వుండేట్లు అవకాశాలు కల్పించాడు. ఎనోచినో, మడోనా వాటిని పరిపూర్ణంగా వినియోగించుకున్నారు.

- ఎమ్బీయస్‌ ప్రసాద్‌ (జులై 2020)
mbsprasad@gmail.com

 

Show comments