అనివార్యంగా ఏపీతో పోటీ.. కేసీఆర్ కి తలనొప్పి

లాక్ డౌన్ పెట్టాలా? వద్దా? ఒకవేళ పెడితే.. పాత పద్ధతిని అనుసరించాలా లేక కొత్త రూల్స్ పాటించాలా? కేంద్రం అంతర్రాష్ట్ర ప్రయాణాలపై ఆంక్షలు వద్దంటున్న నేపథ్యంలో ఎలాంటి నిర్ణయం తీసుకోవాలి, ప్రజల్ని ఇబ్బంది పెట్టాలా, ఆర్థిక రంగాన్ని పట్టించుకోవాలా? ఇలాంటి సవాలక్ష ప్రశ్నలతో తెలంగాణ సీఎం కేసీఆర్ సతమతమవుతున్నారు. దీంతో గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో కరోనా విజృంభిస్తున్న వేళ, 2 రోజులుగా అధికారులు, మంత్రులతో జరిపిన చర్చలు కొలిక్కి రాలేదు.

మెజార్టీ అభిప్రాయం లాక్ డౌన్ పెట్టాలనే ఉన్నా కూడా ఆర్థిక రంగంపై ఆ ప్రభావం పడుతుందని, ఇప్పటికే జీతాలివ్వలేక ఉద్యోగుల్లో చెడ్డపేరు వచ్చిందని మరికొందరు వెనక్కు లాగుతున్నారు. అటు ఏపీలో కరోనా నియంత్రణ పరిస్థితి కూడా ముఖ్యంగా చర్చకు వచ్చింది. తెలంగాణలో కొవిడ్ పరీక్షలు తగ్గించిన సమయంలో ఏపీ కంటే ఆ రాష్ట్ర పరిస్థితే మెరుగ్గా ఉండేది. తెలంగాణ సేఫ్ అనుకున్నారంతా.

కానీ ఎప్పుడైతే జంటనగరాల్లో కరోనా పుట్ట పగిలిందో.. అప్పటిగ్గానీ నిర్లక్ష్యం బైటపడలేదు. అధికారులు, ప్రజాప్రతినిధులు, మంత్రులు, వారి కుటుంబ సభ్యులు.. అందర్నీ కరోనా ఓ రౌండ్ వేయడంతో మరింత అలజడి రేగింది. ఆ దశలోనే మహానగరంలో మరో లాక్ డౌన్ ప్రతిపాదన తెరపైకి వచ్చింది. దీనిపై సీఎం కేసీఆర్ సహా అధికారులు, మంత్రులు మల్లగుల్లాలు పడుతున్నారు.

అటు ఏపీలో పరిస్థితులు క్రమక్రమంగా చక్కబడటం, కొత్తగా వచ్చే కేసుల సంఖ్య స్థిరంగా ఉండటం, ప్రాణ నష్టం కూడా అదుపులో ఉండటంతో ఏపీ స్ట్రాటజీ ఏంటో కనుక్కోవాలని, దాని ద్వారా తదుపరి చర్యలు తీసుకుంటామని అన్నారట కేసీఆర్. ప్రధానంగా సచివాలయ, వాలంటీర్ల వ్యవస్థ వల్ల ఏపీలో కరోనా పరీక్షల నిర్వహణ సులభతరం అవుతోందని కేసీఆర్ కి  చెప్పారట అధకారులు. హైదరాబాద్ లో పేరుగొప్ప ఆస్పత్రులు ఉన్నా కూడా వైద్య సేవలపై ప్రజల్లో అసంతృప్తి నెలకొన్న అంశమూ చర్చకు వచ్చినట్టు తెలుస్తోంది.

మొత్తమ్మీద 2 రోజుల మేథోమథనం తర్వాత కూడా తెలంగాణ సర్కారు ఏ నిర్ణయానికీ రాలేకపోతోంది. ఈరోజు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఇచ్చే నివేదికతో గ్రేటర్ లో లాక్ డౌన్ ఉంటుందా లేదా అనే విషయం తేలిపోతుంది.

ఇకనుంచి డాక్టరే ప్రతి ఇంటికీ వస్తాడు

కొత్త హీరోలని తొక్కేయ్యడం తప్పేమీకాదు

Show comments