అప్పుడే.. క‌రోనా ఫేర్ వెల్ పార్టీ చేసేసుకున్నారు!

క‌రోనా ఫియ‌ర్స్ నుంచి యూర‌ప్ దేశాలు బ‌య‌ట‌ప‌డుతున్నాయి! ఇప్ప‌టికే అక్క‌డ జ‌న‌జీవ‌నం సాధార‌ణ స్థితికి వ‌స్తూ ఉంది. పార్కులు, రోడ్లు సంద‌డిగా మారుతున్నాయి. రెండు నెల‌ల కింద‌ట క‌రోనాతో తీవ్ర ఇబ్బందుల పాలైన ఇట‌లీ, జ‌ర్మ‌నీ, ఫ్రాన్స్ వంటి దేశాలు కూడా ఇప్పుడు కేసుల సంఖ్య‌ను త‌గ్గించుకున్నాయి. ఇక ఇత‌ర యూర‌ప్ దేశాలు కూడా జ‌న‌జీవ‌నాన్ని సాధార‌ణ స్థితికి తెచ్చెందుకు ముంద‌డుగు వేస్తూ ఉన్నాయి. ఈ క్ర‌మంలో చెక్ రిప‌బ్లిక్  వాళ్లు మ‌రో అడుగు ముందుకేశారు! ఏకంగా అక్క‌డ కరోనా ఫేర్ వెల్ పార్టీ ఒక‌టి జ‌రిగింది.

భారీ సంఖ్య‌లో జ‌నం క‌లిసి ఆ పార్టీలో పాలుపంచుకున్నారు. అందుకు సంబంధించిన ఫొటోలు నెట్ లో వైర‌ల్ గా మారాయి. రెండు రోజుల క్రితం అక్క‌డ ఈ క‌రోనా ఫేర్ వెల్ పార్టీ జ‌రిగింద‌ట‌. ప్రేగ్ న‌గ‌రంలో జ‌రిగిన ఈ పార్టీలో కొన్ని వంద‌ల మంది పాల్గొన్న‌ట్టుగా తెలుస్తోంది. ఇటీవ‌లే జ‌నం గుమికూడ‌టంపై ఉన్న నిషేధాన్ని చెక్ ప్ర‌భుత్వం ఎత్తి వేసింది. దీంతో ఇలాంటి పార్టీకి అవ‌కాశం ఏర్ప‌డింది.

క‌రోనా మ‌హ‌మ్మారి నుంచి బ‌య‌ట‌ప‌డిన‌ట్టే అని ఈ పార్టీలో పాల్గొన్న వారు ఒక‌రితో మ‌రొక‌రు ఆనందాన్ని పంచుకున్నార‌ట‌. ఇన్నాళ్లూ పార్టీల‌కు దూరంగా ఉండి కోల్పోయిన ఆనందాన్ని ఇలా పంచుకున్నార‌ట వాళ్లంతా. అయితే లెక్క‌ల ప్రకారం చూస్తే ఆ దేశం ఇంకా క‌రోనా ఫ్రీ కాలేదు. దాదాపు 12 వేల కేసుల న‌మోద‌య్యాయి ఆ దేశంలో. ఎనిమిది వేల మంది వ‌ర‌కూ ఇప్ప‌టికే కోలుకున్నార‌ట‌. 349 మర‌ణించిన‌ట్టుగా గ‌ణాంకాలు చెబుతున్నాయి. గ‌త ప‌క్షం రోజుల్లో రోజువారీ కేసులు బాగా త‌గ్గుముఖం ప‌ట్టినా, గ‌త వారంలో మ‌ళ్లీ రోజువారీ కేసుల సంఖ్య రెండు మూడు వంద‌ల మార్కుకు చేరిందని తెలుస్తోంది. అయితే చెక్ ప్ర‌జ‌లు మాత్రం.. క‌రోనా నుంచి విముక్తి అయిన‌ట్టే అనే భావ‌న‌లోకి వ‌చ్చేసిన‌ట్టున్నారు.

ఇకనుంచి డాక్టరే ప్రతి ఇంటికీ వస్తాడు

కొత్త హీరోలని తొక్కేయ్యడం తప్పేమీకాదు

Show comments