అమరావతి కోసం ప్రపంచ ఎన్నారైల సంఘీభావం

ప్రపంచ చరిత్రలో వివాద రహితంగా భూసేకరణ జరిగిన ఏకైక ప్రాజెక్టు అమరావతి. రాష్ట్ర ప్రజల కోసం మంచి రాజధాని కట్టుకుందాం, ఇతరులు అసూయపడేలా అంతర్జాతీయ ప్రమాణాలతో గొప్ప నగరాన్ని నిర్మించుకుందాం అని అమరావతి ప్రాంతాన్ని ప్రభుత్వం ఎంపిక చేసింది. మీరు నష్టపోకుండా చూసే బాధ్యత ప్రభుత్వానిది. రాజధాని కట్టాక తొలి ప్రయోజనాలు మీకే ఇస్తాం అని ప్రభుత్వం అధికారికంగా భరోసా ఇవ్వడంతో వివాదరహితంగా వేల మంది రైతులు ముందుకు వచ్చి తమ భూములను ఒక్కపైసా తీసుకోకుండా రాష్ట్రానికి ఇచ్చేశారు.

ప్రభుత్వం మారిన వెంటనే వారి త్యాగం నిష్ఫలంగా మారింది. అప్పటివరకు వేగంగా సాగుతున్న అమరావతి ఆగిపోయింది. తమతో పాటు అందరూ బాగుండాలని చేసిన రైతుల త్యాగం వారికి శాపంగా పరిణమించిన పరిస్థితి. మూడు రాజధానుల ప్రకటనతో అమరావతి రైతులు నిరసనకు దిగారు. అలుపెరగకుండా పోరాడుతున్నారు. అయిన ప్రభుత్వం వారిపట్ల కఠినంగా వ్యవహరిస్తోంది. ఇపుడు వారి పోరాటం 200 రోజులకు చేరుకుంది.

ఈ సందర్భంగా ప్రముఖ ఎన్నారై జయరాం కోమటి అమరావతి రైతుల పోరాటానికి మద్దతుగా నిలుద్దాం అని అమెరికాలోని ఎన్నారైలందరికీ పిలుపునిచ్చారు. ప్రపంచ వ్యాప్తంగా కోవిడ్ నిబంధనలు పాటిస్తూనేే ఈ కార్యక్రమాన్ని రూపొందించారు. వివిధ నగరాల్లోని ఎన్నారైలు స్థానిక నిబంధనలు అనుసరిస్తూ ఒక్కోచోట 15-20 మందికి మించకుండా ఈ నిరసనలో పాల్గొనాలని జయరాం కోమటి పిలుపునిచ్చారు.

అయితే, ఆయన ఊహించని స్పందన వచ్చింది. అమెరికా నుంచే కాకుండా ఆఫ్రికా, యూరప్, ఆస్ట్రేలియా ఖండాల నుంచి కూడా పలు నగరాల్లో స్థిరపడిన ఎన్నారైలు అమరావతి నిరసనకు మేము కూడా జైకొడతాం అని ముందుకువస్తున్నారు.

200 రోజులు పూర్తయిన సందర్భంగా అమెరికాలోని 200 నగరాల నుంచి జూమ్ కాల్ ద్వారా జులై 3 రాత్రి 9 గంటలకు క్యాండిల్ లైట్ నిరసన (వెలుగు పూల సంఘీభావం) తెలుపుదాం అని ఇచ్చిన పిలుపు 300 నగరాలకు చేరింది.

అమరావతియే ఏపీ రాజధానిగా  ప్రజలు ఎంత బలంగా కోరుకుంటున్నారో అన్నదానికి ఇదే సంకేతం. వీరిది ఒకే కులం కాదు, ఒకే ప్రాంతం కాదు, ఒకే జిల్లా కాదు... సకల జిల్లాల నుంచి ఆయాదేశాల్లో స్థిరపడిన వారంతా అమరావతికి తోడై నిలుస్తున్నారు.

ఈ కార్యక్రమంలో అమెరికాయేతర నగరాలను సతీష్ వేమన కోఆర్డినేట్ చేస్తుండగా... NATS తరఫున ఎన్నారై నేతలు డాక్టర్ మధు కొర్రపాటి, మోహన కృష్ణ మన్నవ, శ్రీధర్ అప్పసాని,  APTA తరఫున బాబు పత్తిపాటి, విజయ్ గుడిసేవ కీలకంగా పాలుపంచుకుంటున్నారు. రత్నప్రసాద్, ఠాగూర్, సాయి, చందు సోషల్ మీడియాలో ఈ బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు.

అమెరికా మరియు ఇతర దేశాలలో 100 మంది ఆయా నగరాల కో ఆర్డినేటర్లుగా వీరితో టచ్ లో ఉంటూ ఏర్పాట్లు చేస్తున్నారు. మహిళలు, చిన్నారుల నుంచి వృద్ధుల వరకు ఉత్సాహంగా తమ మద్దతు తెలుపుతూ తమ పేర్లను నామినేట్ చేస్తున్నారు. కార్యక్రమ విజయవంతానికి అన్నిరకాల ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఈస్థాయిలో ఎన్నారైలందరూ ఏకమై నినదించడం గతంలో ఎన్నడూ లేదు. ఒకే రాష్ట్రం - ఒకే రాజధాని అన్నదే వీరందరి నినాదం.

రెండు ముఖ్యమైన విషయాలు -* ఈ కార్యక్రమానికి హాజరయ్యే వారంతా కచ్చితంగా నల్లటి మాస్క్ ధరించాలని నిర్వహకులు కోరారు* కోవిడ్ వల్ల ఇతరులతో కలవడానికి ఇబ్బంది పడే వారు కూడా నల్లటి మాస్క్ తో తమ ఇంట్లో నిరసన తెలిపి ఆ ఫొటోను సోషల్ మీడియాలో పోస్టు చేయాలని నిర్వహకులు కోరుతున్నారు.

#NRIsForAmaravati #SaveAmaravati ఈ హ్యాష్ టాగులను ప్రతి ఒక్కరు వాడాలని నిర్వహకులు కోరుతున్నారు.

Show comments