ఎమ్బీయస్‌ : నెరజాణల కథలు 03

ఇసబెల్లా అనే ఆమె ఒక జమీందారు భార్య. వసంతకాలంలో ఆమె నగరం నుంచి తమకు భూములున్న పల్లెటూరికి విహారానికి వచ్చింది. అక్కడ లియోనెట్టో అనే యువకుడు ఆమెకు తగిలాడు. జీవితంలో వైవిధ్యం కోరుకునే ఇసబెల్లా అతనికి తన ప్రేమ పంచి యిచ్చింది. జమీందారు అప్పుడప్పుడు పల్లెటూరికి వస్తూండేవాడు. అతని రాక ముందుగానే తెలిసేది. అందువలన వీళ్ల వ్యవహారం గుట్టుగానే సాగింది.

ఆ వూళ్లో మోతుబరి లాంబెర్‌ట్యుసియో కన్ను కూడా ఇసబెల్లాపై పడింది. ఆమె వద్దకు వచ్చి తనను కరుణించమని ప్రాధేయపడడంతో బాటు, కరుణించకపోతే యిబ్బందులపాలు చేస్తానన్న బెదిరించి కూడా వెళ్లాడు. అతని సత్తా తెలిసిన మనిషి కాబట్టి ఇసబెల్లా అతనికి మాయమాటలు చెప్పి పంపించి వేస్తోంది. కటువుగా మాట్లాడితే లియోనెట్టోతో వ్యవహారం కనిపెట్టి బయటకు లాగి అల్లరి పెడతాడన్న భయం వుంది.

ఒక రోజు జమీందారు ఉదయమే లేచి నేను ఊరెళ్లాలి, నాలుగైదు రోజుల వరకు రాను అని భార్యతో చెప్పి బయలుదేరాడు. వెంటనే ఆమె మధ్యాహ్నం ఎవరూ లేనివేళ లియోనెట్టోను పిలిపించుకుని అతనితో కులకసాగింది. జమీందారు పొరుగూరు వెళ్లిన సంగతి విన్న వూళ్లో మోతుబరి కూడా గుఱ్ఱం వేసుకుని ఆ యింటికి వచ్చాడు. తన గుఱ్ఱాన్ని యింటి ముందు ఆవరణలో గుంజకు కట్టేసి తను వచ్చానని యింటావిడకు చెప్పమన్నాడు.

దాసి వచ్చి చెప్పగానే పడకగదిలో వున్న ఇసబెల్లా ఉలిక్కిపడింది ''ఇప్పుడెలా?'' అని. ఆమె కంటె లియోనెట్టో యింకా భయపడ్డాడు - ''తనకు దక్కనందుకు కోపం కంటె నాకు యీ అదృష్టం పట్టినందుకు నాపై కోపం పెట్టుకుని సర్వనాశనం చేస్తాడు. ఇప్పుడు యింట్లోంచి బయటపడడమూ కష్టమే, గుమ్మంలోనే కూర్చున్నాడు.'' అని దిగాలు పడ్డాడు.

''అతనంటె నాకే మాత్రమూ యిష్టం లేకపోయినా నీ కోసమేనా అతనితో కాస్సేపు సరసాలాడక తప్పదు. నువ్వు వెంటనే బట్టలేసుకుని యీ గదిలోనే మంచం కింద నక్కి కూర్చో. మా కబుర్లు విని ఓర్చుకోవాల్సి వస్తుంది మరి, సమ్మతమేనా?'' అని అడిగింది. ''నీ మనసు నాకు తెలియనిది కాదు. నాకోసం వాడిని భరిస్తున్నందుకు నీ కాళ్లమీద పడాలి.'' అంటూ లియోనెట్టో మంచం కిందకు జారుకున్నాడు.

ఆమె మోతుబరిని పైకి గదిలోకి రప్పించుకుంది. అతను వస్తూనే ఆమెను ముద్దులు పెట్టుకున్నాడు. ''నీ భర్త వూళ్లో లేడు కదా, నా కోర్కె తీర్చడానికి యిప్పుడు నీకే సంకోచమూ వుండకూడదు'' అంటూ ఆమె మంచం ఎక్కాడు. కౌగిలింతలతో, ముద్దులతో ఆమె సరిపెడదామని చూసినా కుదరలేదు. అమిత తమకంతో ఆమెను పూర్తిగా ఆక్రమించడానికి ముందుకు వంగబోతూ వుండగా పడకగది తలుపు చప్పుడైంది.

''అయ్యగారు తిరిగి వచ్చేశారమ్మా, వాకిట్లో గుఱ్ఱం కట్టేసి వుండడం చూసి, ఎవరిదా అని ఆశ్చర్యపడుతూ దాని దగ్గరకు వెళ్లి చూస్తున్నారు. ఏ క్షణంలోనైనా మెట్లెక్కి పైకి రావచ్చు'' అంది దాసి తలుపు అవతలి నుంచి.

ఇసబెల్లా కంగారుపడింది. ఒకరు కాదు, యిద్దర్ని దాచడం ఎలా? ఇతన్ని మంచం కిందకు పంపితే అక్కడ లియోనెట్టోను చూసి పగ పెంచుకుని అతని దుంప తెంపుతాడు. అసూయతో తన పేరు బజారు కీడుస్తాడు. అయినా గుఱ్ఱం చూసిన భర్త అనుమానంతో పడకగది సోదా చేస్తే ఒకరికి యిద్దరు దొరికితే కొంప కొల్లేరయినట్లే. తన ప్రాణం తీయవచ్చు కూడా.

ఆమె బుద్ధి పాదరసంలా పనిచేసింది. వంటింట్లోంచి ఒక కత్తి తీసి మోతుబరి చేతికి యిచ్చి ‘‘దీన్ని చేత్తో పట్టుకుని ఝళిపిస్తూ 'నిన్ను వదలనురా, ఇవాళ ప్రాణం తీసేదాకా నిద్రపోను' అని ఆగకుండా అరుస్తూ యింట్లోంచి పారిపో. వాకిట్లో గుఱ్ఱం ఎక్కి ఎవర్నో తరుముతున్నట్లు వెళ్లిపో. వెనకా ముందూ ఎవరూ కనబడని ప్రదేశానికి వచ్చాక అరుపులు ఆపి, మీ యింటికి వెళ్లిపో. మళ్లీ యిటువైపు ఎప్పుడూ రావద్దు. ఇవాళ మా ఆయన చూస్తాడు కాబట్టి మళ్లీసారి కనబడితే గుర్తుపడతాడు'' అని చెప్పింది.

కత్తీ, అరుపుల సంగతి అతనికేమీ అర్థం కాలేదు కానీ ఆమె చెప్పినట్లే చేశాడు. దారిలో ఆమె భర్త అడ్డుపడి ‘నువ్వెవరు? ఎందుకిలా వచ్చావ్‌?’ అని అడుగుతున్నా సమాధానం చెప్పకుండా పిచ్చి పట్టినవాడిలా తన ధోరణిలో తను కేకలు వేసుకుంటూ గుఱ్ఱం ఎక్కి పారిపోయాడు. భర్త అతన్ని వెంటాడబోయి, ఉద్దేశం మార్చుకుని యింటికి తిరిగి వచ్చి భార్య దగ్గరకు వెళ్లి 'ఏమిటిదంతా?' అని అడిగాడు.

''ఏం చెప్పమంటారు? అంతా నా ఖర్మ! మీరు అలా వెళ్లిన కాస్సేపటికే ముందు ఓ కుర్రాడెవరో పరిగెట్టుకుంటూ వచ్చి లోకంలో యింకెక్కడా చోటు దొరకనట్లు మన యింట్లోకి వచ్చిపడ్డాడు - ''రక్షించండి'' అంటూ. ఎవరయ్యా నువ్వు అని అడుగుతూండగానే యిదిగో యీ ఉన్మాది కత్తి పట్టుకుని వచ్చి 'ఏడీ ఆ కుర్రాడు, మీ యింట్లోకి దూరాడని వీధిలో చెప్పారు' అంటూ గదులు వెతకడం మొదలెట్టాడు. ఈ గలభాలో ఆ కుర్రాడు పడగ్గదిలో మంచం కింద దూరినట్లున్నాడు. అసలు వీళ్లెవరో, వాళ్ల మధ్య గొడవేమిటో, ఆ గుఱ్ఱంవాడు యితగాడి ప్రాణం తీస్తానని ఎందుకంటున్నాడో నాకేమీ తెలియటం లేదు.'' అంది ఇసబెల్లా నంగనాచిలా.

ఇదంతా పడగ్గది గుమ్మం ముందు నిలబడి చెప్పింది కాబట్టి మంచం కింద వున్న లియోనెట్టోకు అన్నీ వినబడ్డాయి. తనేం చెప్పాలో అర్థమైంది కూడా. నెమ్మదిగా బయటకు వచ్చి దణ్ణాలు పెడుతూ, ''ఆయనెవరో నాకూ తెలియదండి. ఎవర్ని చూసి ఎవరనుకుంటున్నాడో ఏమో. నా పోలికలతో వున్నవాడెవడో ఆయన దగ్గర అప్పు పుచ్చుకుని ఎగ్గొట్టినట్టున్నాడు. నేను బజార్లో కనబడగానే 'ఎన్నాళ్లు తప్పించుకుని తిరుగుతావురా' అంటూ కత్తి పట్టుకుని పొడవబోయాడు. నేను భయంతో పరుగులు పెడుతూ వస్తూంటే మీ యిల్లు కనబడింది. నాకు ప్రాణభిక్ష పెట్టిన మీ దంపతులకు ఎల్లకాలం ఋణపడి వుంటాను. సెలవిస్తే వెళతాను.'' అన్నాడు.

''అప్పుడే బయటకు వెళ్లకు. అతను బయట నక్కి వున్నాడేమో. నేను పొరుగూరికై బయలుదేరి ముఖ్యమైన కాగితం మరచానని గుర్తువచ్చి వెనక్కి వచ్చాను. వెంటనే వెళ్లాలి. నా భార్య నీ ఆతిథ్యం సంగతి చూస్తుంది. నువ్వు కాస్త కుదుటపడి, భోజనాదులు ముగించుకుని, కాస్సేపు విశ్రమించి, బాగా చీకటి పడ్డాకనే యిక్కణ్నుంచి వెళ్లు.'' అని చెప్పాడు జమీందారు.

సరేనని తల వూపినా లియోనెట్టో చీకటి పడ్డాక కూడా యిల్లు విడిచి వెళ్లలేదని వేరే చెప్పనక్కరలేదు.

- ఎమ్బీయస్‌ ప్రసాద్‌ (జూన్ 2020)
mbsprasad@gmail.com

Show comments