సోషల్ మీడియాలో చిరంజీవికి తొలి పరీక్ష

ఇన్నాళ్లూ ప్రశాంతంగా సాగిపోయింది. తన మనసుకు నచ్చినట్టు, తన అంతరంగాన్ని ఆవిష్కరిస్తూ ఎన్నో ట్వీట్లు చేశారు చిరు. ఇప్పుడు చిరంజీవికి అసలైన పరీక్ష ఎదురైంది. బాలయ్య చేసిన వ్యాఖ్యల నేపథ్యంలో చిరంజీవి సోషల్ మీడియాలో గట్టిగా స్పందించాలని కోరుకుంటున్నారు  అతడి అభిమానులు. సోషల్ మీడియాలోకి వచ్చిన తర్వాత చిరుకు ఎదురైన తొలి పరీక్ష ఇది. 

ఒకప్పుడు చిరంజీవి సోషల్ మీడియాకు దూరం. ఏదైనా క్లారిటీ ఇవ్వాల్సి వస్తే ప్రెస్ నోట్ తరహాలో తన నుంచి ఓ చిన్న సందేశం విడుదల చేసే వారు. లేదంటే   మౌనంగా  ఉండేవారు.  కొన్నిసార్లు చిరు పేరిట నకిలీ ప్రెస్ నోట్లు రిలీజ్ అయిన సందర్భాలు కూడా ఉన్నాయి. అప్పట్లో ఓ రేంజ్ లో గందరగోళం నడిచింది కూడా. కానీ ఇప్పుడు చిరంజీవి సోషల్ మీడియాలోకి వచ్చారు. ఆయన ఒక్క ట్వీట్ చేస్తే చాలు పూర్తి స్పష్టత వచ్చేసినట్టే. మరి చిరంజీవి రియాక్ట్ అవుతారా?

తన దగ్గరకొచ్చిన ప్రతి విషయంపై స్పందించడం చిరంజీవికి అలవాటు. అలాంటిది ఇప్పుడు ఏకంగా తనపైనే బాలకృష్ణ అభాండాలు వేశారు. భూములు పంచుకుంటున్నారనే సంచలన ఆరోపణ చేయడంతో పాటు బీప్ వర్డ్ కూడా ఉపయోగించారు. దీనిపై భారీ ఎత్తున వివాదం నడుస్తోంది. ఇప్పుడీ కాంట్రవర్సీకి ఫుల్ స్టాప్ పెట్టాలంటే అది కేవలం చిరంజీవి చేతిల్లో ఉంది. మరి ఆయన ట్వీట్ పెడతారా.. సైలెంట్ గా ఊరుకుంటారా?

చిరంజీవి సోషల్ మీడియాలోకి వస్తున్నారనగానే ఎంతమంది సాదరంగా ఆహ్వానించారో, అంతేమంది వద్దని వారించారు కూడా. ట్రోలింగ్స్ ను అడ్డుకోవడం, వాటికి సమాధానాలు చెప్పుకోవడం తలకుమించిన భారంగా మారుతుందని, లేనిపోని తలనొప్పులు వద్దంటూ చిరంజీవికి సూచించిన వారు కూడా ఉన్నారు. కానీ చిరంజీవి అవేవీ పట్టించుకోలేదు. సోషల్ మీడియాలోకి ఎంటరయ్యారు. వచ్చిన మొదటి రోజు నుంచి తనదైన శైలిలో వివాదాలకు దూరంగా ట్వీట్లు పెడుతూ అందరివాడు అనిపించుకున్న చిరంజీవికి తొలిసారి బాలయ్య రూపంలో ఓ భారీ వివాదం ఎదురైంది.

బాలయ్య సృష్టించిన ప్రకంపనలపై నాగబాబు, తమ్మారెడ్డి, సి.కల్యాణ్ లాంటి వాళ్లు రియాక్ట్ అయ్యారు కానీ చిరంజీవి మాత్రం ఇప్పటివరకు స్పందించలేదు. 3 రోజుల కిందట ఎన్టీఆర్ జయంతి సందర్భంగా చిరు ఓ ట్వీట్ పెట్టారు. అంతే, ఆ తర్వాత మళ్లీ ట్విట్టర్ లో కనిపించలేదు. దీనికి కారణం ఏంటో ఈ పాటికే అందరికీ అర్థమైంది.

ఈరోజు కృష్ణ పుట్టినరోజు. ట్విట్టర్ వేదికగా ప్రతి ఒక్కరికి శుభాకాంక్షలు చెబుతున్న చిరంజీవి.. తన మౌనం వీడాల్సిన సమయం వచ్చింది. కృష్ణకు ఆయన శుభాకాంక్షలు చెప్పేశారు. అక్కడితో సరిపుచ్చారు. బాలయ్య వివాదంపై మాత్రం రియాక్ట్ అవ్వలేదు. సోషల్ మీడియాలోకి వచ్చిన తర్వాత కూడా చిరంజీవికి మౌనమే సమాధానమైంది.

నిమ్మగడ్డకు ఆ అధికారం లేదు

Show comments