కేంద్రం గేట్లు ఎత్తేసింది.. ఏపీ ఇప్పుడేం చేస్తుంది?

దేశవ్యాప్తంగా కరోనా కల్లోలం కొనసాగుతోంది. రోజురోజుకీ కొత్తగా నమోదయ్యే కేసుల సంఖ్య పెరుగుతుందే కానీ తగ్గడం లేదు. వెయ్యి, రెండువేలు, మూడు వేల నుంచి.. రోజుకి సగటున 7 వేలమందికి కరోనా సోకే స్థాయికి దేశం వచ్చేసింది. ఇక కరోనాని కట్టడి చేయడంలోనూ, రోజువారీ అత్యథికంగా కరోనా టెస్ట్ లు చేయడంలోనూ ముందున్న ఏపీ లాంటి రాష్ట్రాల్లో కూడా వ్యాప్తి లాక్ డౌన్ నిబంధనలు సడలించిన తర్వాత పెరుగుతోంది. ఇతర జిల్లాల నుంచి, ఇతర రాష్ట్రాల నుంచి వచ్చినవారితో మరింత ముప్పు ఎదుర్కుంటోంది ఏపీ.

నాలుగు రోజులుగా ఏపీలో నమోదవుతున్న కొత్త కేసుల్ని గమనిస్తే.. సగానికి సగం ఇతర రాష్ట్రాలు, దేశాల నుంచి వచ్చినవారివే ఉంటున్నాయి. వలస కూలీల ప్రవాహం మొదలైన తర్వాత ఏపీలో కేసుల సంఖ్య పెరుగుతోంది. అదృష్టం ఏంటంటే.. దేశంలో రికవరీ రేటు కంటే.. ఏపీ రికవరీ రేటు ఎక్కువగా ఉండటం.. ఏపీలో కేసులు 3వేలకు చేరువ కాగా.. చికిత్స పొందుతున్నవారు, మరణించిన వారి సంఖ్య కలిపినా కూడా వెయ్యిలోపే. అంటే ఏపీలో కోలుకుంటున్నవారి సంఖ్య దేశ సగటుతో పోల్చి చూస్తే నాలుగు రెట్లు ఎక్కువన్నమాట.

అయితే ఈమాత్రానికి సంబరపడితే సరిపోదు. ఏపీలో పరిస్థితి లాక్ డౌన్ తర్వాత కాస్త ఇబ్బందిగా మారడంపై ప్రభుత్వ యంత్రాంగం సీరియస్ గా దృష్టిపెట్టాలి. తాజాగా కేంద్రం లాక్ డౌన్ ని జూన్ 30వరకు పొడిగించినా... అది లాక్ డౌన్ కాదు, అన్-లాక్ అనే విషయం తెలుస్తూనే ఉంది. భారీ మినహాయింపులు ఇచ్చేసింది. జూన్ 8 నుంచి మతపరమైన కార్యక్రమాలకు పూర్తిస్థాయిలో అనుమతులిచ్చింది కేంద్రం, మాల్స్ తెరుచుకోవచ్చని చెప్పేసింది. ఒకరకంగా ఈ వెసులుబాటులన్నీ కరోనా వ్యాప్తికి పరోక్షంగా కారణమవుతాయి.

ఏపీలాంటి రాష్ట్రాలు లాక్ డౌన్ సడలింపులపై మరింత దృష్టిపెట్టాలి. కేంద్రం సడలించినా, రాష్ట్ర స్థాయిలో కొన్ని నియమ నిబంధనలు విధించుకోవడం అత్యవసరం. కేంద్రం చెప్పినట్టు జూన్ 8 తర్వాత తిరుమల ద్వారాలు తెరిస్తే.. ఇతర రాష్ట్రాల నుంచి భక్తులు పోటెత్తే ప్రమాదం ఉంది. మరీ ముఖ్యంగా కరోనా వ్యాప్తి ఎక్కువగా ఉన్న తమిళనాడు, మహారాష్ట్రల నుంచి ప్రతి రోజూ వేల సంఖ్యలో తిరుమలకు వస్తారు. కాబట్టి ఇలాంటి విషయాల్లో రాష్ట్ర ప్రభుత్వం ఆచితూచి నిర్ణయం తీసుకోవాలి.

ఇతర రాష్ట్రాలు, విదేశాల నుంచి వచ్చేవారిని పూర్తిగా హోమ్ క్వారంటైన్ కి లేదా, ప్రభుత్వం నిర్వహించే క్వారంటైన్ సెంటర్లకే పరిమితం చేయాలి. కొత్త కేసుల వ్యాప్తి నిరోధించగలిగినప్పుడే..  ఫలితం కంటికి కనిపిస్తుంది. లేకపోతే డిశ్చార్జిల కంటే కేసుల సంఖ్య పెరిగితే వ్యాక్సిన్ కనుగొనే వరకు మనం కరోనాతో పోరాడాల్సిందే. 

నిమ్మగడ్డకు ఆ అధికారం లేదు

Show comments