నాగబాబో...మరీ ఇంత ఆవేశమా?

ట్విట్ అనేది చీమ మిరప కాయ లాంటిది. చిన్నగా వుంటుంది కానీ కారం అదిరిపోతుంది. గూబ గుయ్ మనిపిస్తుంది. సరైన పదజాలం వాడి ట్వీట్ లు వేయాలే కానీ ఎక్కడ తగలాలో అక్కడ తగులుతాయి. ఎవరికి గుచ్చుకోవాలో వాళ్లకు సూటిగా నాటుకుంటాయి. సీనియర్ యాక్టర్ కమ్ పార్ట్ టైమ్ పొలిటీషియన్ నాగబాబు ఈ రోజు సాయంత్రం వేసిన మూడు నాలుగు ట్వీట్లు ఇలాగే చాలా ఘాటుగా వున్నాయి.

ఎంత కాదన్నా, ఎంత వ్యక్తిగతం అన్నా కూడా ఆంధ్ర రాష్ట్ర రాజకీయాలను ప్రభావితం చేయగల సత్తా వున్న ట్వీట్ లు అవి. నాగబాబు ఆలోచించి వేసారో, ఆవేశంతో వేసారో కానీ, మొత్తం మీద ఆంధ్ర నాట రాజకీయాలను ప్రభావితం చేయడం అన్నది పక్కా. జగన్ ను ఢీ కొనడానికి తమ బలం సరిపోదని కమ్మ సామాజిక వర్గం ఎప్పుడో గ్రహించింది. అందుకే 2024 నాటికి వైకాపాను ఢీకొనడానికి అటు భాజపాకు, ఇటు కాపులకు, మధ్య తమకు వారథిలా పవన్ కళ్యాణ్ వుండేలా వ్యూహాలు రచించుకుంటూ వస్తున్నారు. 

ఇలాంటి టైమ్ లో బాలయ్య బాబు ఒక్క మాటతో మొత్తం చెడగొట్టేసారు. సరే, బాలయ్యకు కౌంటర్ గా నాగబాబు ఓ విడియో చేసారు. అయినా కూడా మన వాడే కదా ముందు నోరు పారేసుకున్నది అని తెలుగుదేశం జనాలు కాస్త మౌనంగానే వున్నారు. కానీ ఎక్కడో కులాభిమానం బాగా తలకెత్తిన కొందరు మాత్రం కాస్త గట్టిగా కౌంటర్ ఇచ్చారు. అక్కడితో ఈ విషయాన్ని వీలయినంత తగ్గించేయాలని, బాలయ్య-మెగాస్టార్ మధ్య ప్యాచప్ చేయాలనే ప్రయత్నం ప్రారంభించబోయారు కూడా.

కానీ ఇంతలోనే నాగబాబు మళ్లీ అగ్గిపుల్ల గీసారు. అగ్గిపుల్ల గీయడం కాదు ఏకంగా పెట్రోలు పోసేసారు. తెలుగుదేశం పార్టీని ఎంత టార్గెట్ చేయాలో అంతా చేసేసారు. ఆఖరికి 'అనుకుల' మీడియా అనే పదం కూడా వాడేసారు.  పైగా తెలుగుదేశం మరో సారి పవర్ లోకి  రాదు అనేసారు.  పవర్ లోకి రాదు అని అనడం వేరు. తెలుగుదేశం అయిదేళ్ల పాలనలో జరిగిన అన్యాయలు, అక్రమాలు, అవినీతి చెప్పడానికి పేజీల పేజీల గ్రంథం రాయవచ్చని అనడం విశేషం.

కిక్కరుమంటే ఒట్టు

నాగబాబు ఇంత ఘాటుగా ట్వీట్ లు వేసినా, తెలుగుదేశం పార్టీ నుంచి కౌంటర్ వుంటే ఒట్టు. నిజానికి పార్టీని అన్నిఅన్ని మాటలు అన్నందుకు, అవినీతిని ప్రస్తావించినందుకు ఈ పాటికి జనాలు మాటల తూటాలతో విరుచుకు పడిపోవాలి. కానీ అలా జరగలేదు. అంటే తెలుగుదేశం పార్టీ కాపుల విషయంలో ఎంత కిందా మీదా అయిపోతోందో అర్థం అవుతుంది.

ఇక  తెలుగుదేశం అనుకుల మీడియా ఆన్ లైన్ పోర్టల్లలో ఈ ట్వీట్ ల గురించి వార్తలు వుంటే ఒట్టు. తెలుగుదేశం అనుకుల వెబ్ సైట్లు కొన్ని బాలయ్య ను విమరిస్తూ, బాలయ్య కారణంగానే కాపులు పార్టీకి దూరం అవుతున్నారని రాయడం ఇంకా విశేషం.

దాచేస్తే దాగుతుందా?

తెలుగుదేశం పార్టీ కానీ, ఆ పార్టీ అనుకుల మీడియా కానీ ఈ ఇస్యూని డైవెర్ట్ చేయాలన్నా, అంత వీజీ కాదు, పార్టీ నాయకత్వం సంబంధం లేని, కులాభిమానం, పార్టీ అభిమానం వున్న జనాలు సోషల్ మీడియాలో ఎవరికి వారు చెలరేగపోవడం ప్రారంభమైపోయింది. అందువల్ల ఈ వ్యవహారం ఇప్పటితో ముగిసిపోతుందని అనడానికి లేదు. నాగబాబు ఇక్కడితో ఆగపోతారని అనుకోవడానికి లేదు. ఎందుకంటే ఎప్పుడయితే తెలుగుదేశం పార్టీ ఆత్మరక్షణలో పడిపోతోందో, నాగబాబు మరింత ఆనందంతో చెలరేగిపోయే అవకాశం వుంది.

మొత్తం మీద జగన్ వన్ ఇయర్ సందర్భంగా వైకాపాను తూర్పారపట్టే పని మొదలు పెట్టి,  తెదేపా అనుకుల మీడియా సంబరపడుతుంటే, బాలయ్య పుణ్యమా అని నాగబాబు మొత్తం ప్లాన్ ను మార్చేసారు. 

ఆర్వీ

నిమ్మగడ్డకు ఆ అధికారం లేదు

లంచాల మాట లేని ప్రభుత్వ పాలన: సీఎం జగన్‌

Show comments