జగన్ మంచోడా ? చెడ్డోడా ?

ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మంచోడా ? చెడ్డోడా ? ఈ ప్రశ్న టీడీపీ వాళ్ళను అడిగామనుకోండి ...జగన్ దుర్మార్గుడు, నీచుడు అని తిడతారు. వైసీపీ వాళ్ళను అడిగామనుకోండి దేవుడు, ధర్మరాజు, ఆపద్బాంధవుడు ... ఇలా పొగుడుతారు. అంటే ఏదో ఒక అభిప్రాయం కరాఖండీగా చెబుతారు. కొంత మేరకు మంచోడని, కొన్ని విషయాల్లో చెడ్డోడని చెప్పరు. కానీ ఇలా రెండు రకాలుగా చెప్పే నాయకుడు ఒకరున్నారు.

ఆయనే టీడీపీ మాజీ ఎంపీ, అనంతపురం జిల్లా నాయకుడు జేసీ దివాకర రెడ్డి. ఈయన ప్రత్యేకత ఏమిటంటే ఎవ్వరి గురించైనా సరే అర్ధం కాకుండా మాట్లాడతాడు. టీడీపీలో ఉంటూ కూడా అధినేత చంద్రబాబు గురించి అనేకసార్లు నెగెటివ్ గా మాట్లాడాడు. ఇదేంటి ఇలా మాట్లాడుతున్నాడు అని టీడీపీ నాయకులు ఆశ్చర్య పోతుండగానే ఆకాశానికి ఎత్తి పారేస్తాడు. జేసీ మాట్లాడిన తీరుకు చంద్రబాబుకు కొన్నిసార్లు కోపం వచ్చింది కూడా.

జేసీ ఏం మాట్లాడినా స్వచ్ఛమైన అనంతపురం యాసలో బహిరంగంగానే మాట్లాడుతాడు. ఏపీ సీఎం జగన్ గురించి చాలాసార్లు మాట్లాడాడు. తాజాగా మళ్ళీ మాట్లాడాడు. జగన్ ఏడాది పాలన పూర్తైన సందర్భంగా మాట్లాడిన జేసీ జగన్ వంటి ముఖ్యమంత్రి మళ్ళీ దొరకడని అన్నాడు. ఆయన ఏడాది పాలనకు వందకు నూటపది మార్కులు వేస్తానన్నాడు. వెంటనే మనం ఆశ్చర్యపోతాం.

ఏందబ్బా ఇది ? టీడీపీలో ఈయన తేడాగా ఉన్నాడే అనుకుంటాం. గత ఎన్నికలకు ముందు తాను అనంతపురం జిల్లాలో పర్యటించినప్పుడు టీడీపీకే ఓట్లు వేస్తామని జనం చెప్పారని, కానీ ఫలితాలు మరో రకంగా వచ్చాయని చెప్పాడు. చంద్రబాబు మార్కు సంక్షేమ పథకాలు ఎన్నికల్లో వర్క్ అవుట్ కాలేదన్నాడు. జగన్ పాలనకు వందకు నూటపది మార్కులు వేస్తానని చెప్పిన జేసీ జగన్ కు పట్టుదల ఉంది గాని అది పరాకాష్టకు చేరి నియంతృత్వంగా మారిందని అన్నాడు.

జగన్ ముఖ్యమంత్రి అయినప్పటి నుంచి తాను గమనిస్తున్నానని, తాను అనుకున్నది జరిగి తీరాల్సిందే అనే నియంతృత్వ ధోరణితో వ్యవహరిస్తున్నాడని  అన్నాడు జేసీ. నిమ్మగడ్డ రమేష్ కుమార్ కేసులో హైకోర్టు తీర్పు న్యాయంగా ఉందన్నాడు. రాజ్యాంగం జోలికి వెళితే ఇలాంటి తీర్పులే వస్తాయన్నాడు. జగన్ రాముడో, రావణుడో ప్రజలే తేల్చుకోవాలని ముక్తాయించాడు ఈ పసుపు పార్టీ నాయకుడు. ఇంతకూ తన దృష్టిలో జగన్ ఎవరు ?

అసలు విషయం మర్చిపోయిన చంద్రబాబు

Show comments