వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీ.. తండ్రికి తీసిపోని జగన్

పేద ప్రజల ఆరోగ్య సమస్యలు, తద్వారా వచ్చే ఆర్థిక సమస్యలు అర్థం చేసుకున్నారు కాబట్టే.. డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి ఆరోగ్యశ్రీ పథకాన్ని ప్రవేశ పెట్టారు. ఆయన డాక్టర్ చదువు చదివారు కాబట్టి ఆ పరిస్థితుల్ని అర్థం చేసుకున్నారని అనుకుంటే.. డాక్టర్ పట్టా లేకపోయినా అంతకంటే ఎక్కువగా ప్రజల నాడి తెలుసుకున్నారు ఆయన తనయుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి. డాక్టర్ వైఎస్సార్ ఆరోగ్యశ్రీ పథకానికి జగన్ తనదైన శైలిలో మెరుగులద్దారు. పేదవారెవరూ వైద్యం కోసం ఇబ్బందులు పడకూడదనే పంతంతో ఆరోగ్యశ్రీ పరిధి విస్తృతం చేశారు.

మన పాలన - మీ సూచన కార్యక్రమంలో భాగంగా వైద్య-ఆరోగ్య శాఖ సమీక్షలో సీఎం ప్రసంగం రాబోయే రోజుల్లో వైద్యం పేదలకు ఎంతలా చేరువవుతుందో కళ్లకు కట్టింది. ఏడాదికి 5లక్షల రూపాయల ఆదాయం లోపు ఉన్నవారందరికీ ఆరోగ్యశ్రీ పరిధిలోకి తెచ్చామని తద్వారా 1కోటీ 42 లక్షల కుటుంబాలకు లబ్ధి చేకూరుతోందని చెప్పారు జగన్. అంతే కాదు వెయ్యి రూపాయల పైన వైద్యం కోసం ఖర్చుపెడితే.. ఆరోగ్యశ్రీ వర్తించేలా నిబంధనలు సరళతరం చేశారు.

కాన్సర్ వ్యాధి బాధితులకు కూడా ప్రభుత్వమే వైద్యం చేయిస్తుందని భరోసా ఇచ్చారు ముఖ్యమంత్రి. మానసిక, శారీరక వికలాంగులకు పింఛన్లివ్వడంతో పాటు.. వారి సమస్యలకు ప్రత్యేక వైద్యం అందిస్తున్నామని చెప్పారు. ఇక రాష్ట్ర విభజన తర్వాత హైదరాబాద్ ఆస్పత్రుల్లో వైద్యం కోసం కష్టపడుతున్న పేదలకు ఆరోగ్యశ్రీ కొనసాగిస్తున్నామని.... బెంగళూరు, చెన్నై లో కూడా సుమారు 132 సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రుల్లో ఆరోగ్యశ్రీ అందుబాటులో ఉందని చెప్పారు.

నిరుపేదలు రోగం నుంచి బైటపడినా, ఆ తర్వాత కూలీనాలీ చేసుకోవడం కష్టంగా మారుతుందనే ఉద్దేశంతో.. వైద్యుల సహాయం మేరకు నెలకు 5వేల రూపాయలు అందిస్తున్నామన్నారు జగన్. వైఎస్సార్ విలేజ్ క్లినిక్ ల పేరుతో మరో విప్లవాత్మక మార్పుకి శ్రీకారం చుడుతున్నట్టు ప్రకటించిన జగన్, 2021 మార్చి లోగా రాష్ట్రవ్యాప్తంగా 13వేల వైఎస్సార్ విలేజ్ క్లినిక్ లు ఏర్పాటు చేస్తున్నట్టు ప్రకటించారు. గ్రామ, వార్డు సచివాలయాలకు అనుబంధంగా ఏర్పాటు చేసే ఈ విలేజ్ క్లినిక్కుల్లో ఏఎన్ఎం ఎప్పుడూ అందుబాటులో ఉంటారని, వైద్యం విషయంలో ఎవరూ ఎక్కడా ఇబ్బంది పడకుండా చూస్తామని భరోసా ఇచ్చారు. 

మన పాలన-మీ సూచన, 5వ రోజు

Show comments