పల్లెటూళ్లకు కరోనా కష్టాలు

లాక్ డౌన్ విధించిన తొలినాళ్లలో.. ఎక్కడికక్కడ ఏ ఊరికావూరు ముళ్ల కంచెలు వేసుకుని, బ్యారికేడ్లు పెట్టుకుని కట్టడి చేసుకున్నారు స్థానికులు. ఇలాంటి స్వచ్ఛంద నిర్బంధాల వల్లే చాలా ఊళ్లలోకి కరోనా అడుగుపెట్టలేకపోయింది. ఇప్పుడు నిబంధనలు సడలించి రాకపోకలు పెరిగాక కొత్త మండలాలు, గ్రామాలు కూడా కరోనా బారిన పడుతున్నాయి. ముఖ్యంగా, ఇతర రాష్ట్రాలు, ఇతర జిల్లాల నుంచి వచ్చినవారితోనే ఈ సమస్య అంతా. దీంతో గ్రామాల్లో గొడవలు పెరిగిపోతున్నాయి.

సొంత బంధువులు, పరిచయస్తులు కూడా కరోనా కష్టకాలంలో శత్రువులుగా మారిపోతున్నారు. కర్నూలు జిల్లాలోని కొన్ని పల్లెల్లో కరోనా విషయంలో కొట్లాటలు జరిగాయి. ఇతర రాష్ట్రాల నుంచి వచ్చినవారిని గుట్టుచప్పుడు కాకుండా ఇంట్లోనే ఉంచడంతో నెల్లూరు జిల్లాలో కొన్ని కుటుంబాలకు కుటుంబాలే కరోనా బారిన పడ్డాయి. ఇప్పుడు ఆ కుటుంబాలను ఊరిలో వారు దాదాపు వెలేసినంత పనిచేశారు.

ఇతర రాష్ట్రాల నుంచి వచ్చినవారు క్వారంటైన్ పూర్తి చేసుకుని గ్రామాల్లోకి అడుగుపెడుతున్నా అనుమానపు చూపులు వారిని బాధిస్తున్నాయి. చుట్టుపక్కలవారు ఎవరూ పలకరించడానికి సాహసం చేయడం లేదు. మరోవైపు ఉపాధి హామీ పనుల విషయంలో కూడా వలస కూలీలు వివక్ష ఎదుర్కొంటున్నారు. నిబంధనలు సడలించిన తర్వాత ఇతర ప్రాంతాల నుంచి సొంత ఊళ్లకు వచ్చినవారు ఉపాధి పనులకు రానీయకుండా కొందరు అడ్డుకుంటున్నారు.

లాక్ డౌన్ తర్వాత పరిస్థితి సాధారణ స్థితికి వచ్చిందని అనుకుంటున్న సమయంలో.. గ్రామాల్లో కొత్త గొడవలు రావడం మరింత ఆందోళన కలిగిస్తోంది. పట్టణాల్లో దాదాపు అన్నిరకాల షాపులు తెరవడంతో సందడి మొదలైంది, ఇటు గ్రామాల్లో మాత్రం గొడవలు మొదలవుతున్నాయి. 

జ‌గ‌న్ ముందు మ‌రోసారి కేసీఆర్ కూడా చిన్న‌బోతున్నారు

Show comments