వివాదాస్పద సినిమా ఓటీటీలోకి వచ్చింది

తమిళనాడ అత్యంత వివాదాస్పదమైన జ్యోతిక సినిమా పోన్ మగళ్ వంథాల్ ఓటీటీలోకి వచ్చింది. అమెజాన్ ప్రైమ్ లో ఈ సినిమాను స్ట్రీమింగ్ కు పెట్టారు. థియేట్రికల్ రిలీజ్ కంటే ముందే ఓటీటీకి ఈ సినిమాను ఎలా ఇస్తారంటూ డిస్ట్రిబ్యూటర్లు ఆందోళన చేపట్టారు. సూర్య సినిమాల్ని రిలీజ్ కాకుండా అడ్డుకుంటామని హెచ్చరించారు. అయినా సూర్య వెనక్కి తగ్గలేదు. భార్య జ్యోతిక లీడ్ రోల్ పోషించిన, తను నిర్మించిన ఈ సినిమాను నేరుగా ఓటీటీకి ఇచ్చేశాడు.

ఇలా వరల్డ్ ప్రీమియర్ గా ఈరోజు జ్యోతిక నటించిన పొన్ మగళ్ వంథాల్ అమెజాన్ ప్రైమ్ లో అందుబాటులోకి వచ్చింది. క్రైమ్-కోర్టు డ్రామాగా తెరకెక్కిన ఈ సినిమాపై నెటిజన్లు ఈరోజు ఉదయం నుంచి రివ్యూలు పెడుతూనే ఉన్నారు. కొంతమంది బాగుందని, బోర్ కొట్టిందని మరికొంతమంది తమ అభిప్రాయాలు చెబుతున్నారు. జ్యోతిక పెర్ఫార్మెన్స్ మాత్రం అదుర్స్ అంటూ ఓవరాల్ గా అంతా అంగీకరించారు.

"వరల్డ్ ప్రీమియర్ ఆన్ ఓటీటీ" ప్రభంజనం ఇక్కడితో ఆగడం లేదు. జూన్ 12న అమితాబ్ నటించిన గులాబోసితావో స్ట్రీమింగ్ కు వస్తోంది. ఆ వెంటనే వారం గ్యాప్ లో (19న) కీర్తిసురేష్ నటించిన పెంగ్విన్ సినిమా స్ట్రీమింగ్ కు రాబోతోంది.

ఇవన్నీ ఒకెత్తయితే అక్షయ్ కుమార్ హీరోగా నటించిన లక్ష్మిబాంబ్ సినిమా మరో ఎత్తు. రాఘవ లారెన్స్ డైరక్షన్ లో కాంచన సినిమాకు సీక్వెల్ గా తెరకెక్కిన ఈ మూవీని కూడా థియేటర్లలో కాకుండా నేరుగా ఓటీటీలో రిలీజ్ చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఈ మేరకు డిస్నీ హాట్ స్టార్ సంస్థ దాదాపు 120 కోట్ల రూపాయల డీల్ కుదుర్చుకున్నట్టు తెలుస్తోంది.

ఇక తెలుగులో ఇలా స్ట్రయిట్ ఓటీటీ రిలీజ్ ల హవా కాస్త తక్కువగానే ఉంది. అమృతారామమ్ అనే చిన్న సినిమా ఇలా నేరుగా ఓటీటీలోకి వచ్చింది. చాలా సినిమాల్ని ఇలా ఓటీటీకి ఇచ్చే ప్రయత్నంలో నిర్మాతలున్నారు. అయితే దీనిపై నిర్మాతల మండలి ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. మరో 3-4 రోజుల్లో తెలుగు సినిమాల ఓటీటీ లిస్ట్ కూడా బయటకొచ్చే అవకాశం ఉంది. కాకపోతే అన్నీ చిన్న సినిమాలే. పెద్ద సినిమాలేవీ ఉండకపోవచ్చు.

జ‌గ‌న్ ముందు మ‌రోసారి కేసీఆర్ కూడా చిన్న‌బోతున్నారు

Show comments