కరోనాలో 9వ స్థానానికి ఎగబాకిన భారత్

గడిచిన 24 గంటల్లో భారత్ లో ఏకంగా 7466 కరోనా కేసులు నమోదయ్యాయి. ఒకే రోజు ఇలా 7వేలకు పైగా పాజిటివ్ కేసులు నమోదవ్వడం ఇదే తొలిసారి. ఇలా ఏరోజుకారోజు ఇండియాలో రికార్డు స్థాయిలో కరోనా కేసులు నమోదవుతున్నాయి. దీంతో దేశంలో మొత్తం కరోనా బాధితుల సంఖ్య 165,799కు చేరుకుంది.

ఊహించినట్టుగానే 24 గంటల వ్యవథిలో టాప్-10 కరోనా దేశాల జాబితాలో 9వ స్థానానికి ఎగబాకింది ఇండియా. మొన్ననే ఈ జాబితాలోకి చేరిన దేశం.. కేవలం ఒక రోజు వ్యవథిలో టర్కీని వెనక్కునెట్టి అత్యథిక కేసులతో 9వ స్థానానికి చేరుకుంది. అంతేకాదు.. మరో 3 రోజుల్లో ఇది జర్మనీని అధిగమించి, 8వ స్థానానికి కూడా చేరే అవకాశం కూడా ఉంది.

ఇక గడిచిన 24 గంటల్లో దేశవ్యాప్తంగా 175 మంది కరోనా కారణంగా మరణించారు. దీంతో మొత్తం మృతుల సంఖ్య 4,706కు చేరుకుంది. అటు కరోనా నుంచి కోలుకున్న వారు 71వేల మందికి పైగా ఉండగా.. ప్రస్తుతం 89వేల మందికి చికిత్స కొనసాగుతోంది.

దేశంలో 70శాతం కరోనా కేసులు 13 నగరాల్లోనే విస్తరించి ఉందని కేంద్రం ప్రకటించింది. ఢిల్లీ, కోల్ కతా, జైపూర్, జోధ్ పూర్, ఇండోర్, అహ్మదాబాద్, పూణె, ముంబయి, థానె, హైదరాబాద్, చెన్నై, తిరువళ్లూర్, చెంగళ్ పట్టు నగరాల్లో 70శాతం కరోనా కేసులు విస్తరించినట్టు తెలిపింది.

ఇక రాష్ట్రాలవారీగా చూసుకుంటే... ఎప్పట్లానే మహారాష్ట్రలో వేల సంఖ్యలో కొత్త కేసులు వెలుగుచూస్తున్నాయి. నిన్న ఒక్కరోజే 2598 పాజిటివ్ కేసులు నమోదైనట్టు అధికారులు ప్రకటించారు. దీంతో ఆ రాష్ట్రంలో మొత్తం కేసుల సంఖ్య 60వేలకు చేరువైంది. అటు మరణాల సంఖ్య కూడా 2వేలకు చేరువైంది.

ఇక గడిచిన 24 గంటల్లో మహారాష్ట్ర తర్వాత అత్యథికంగా ఢిల్లీలో (1024) కరోనా కేసులు నమోదవ్వగా.. తర్వాత స్థానంలో తమిళనాడు (827), గుజరాత్ (367) నిలిచాయి. గుజరాత్ లో మృతుల సంఖ్య వెయ్యికి చేరువైంది.

జ‌గ‌న్ ముందు మ‌రోసారి కేసీఆర్ కూడా చిన్న‌బోతున్నారు

Show comments