జగన్ నోట మరోసారి ప్రత్యేక హోదా మాట

పదవిలోకి రాగానే ప్రత్యేక హోదా అంశాన్ని మరిచిపోయారన్నారు. కేవలం ఎన్నికల ప్రచారం కోసమే హోదా అంశాన్ని భుజానికెత్తుకున్నారని ఆరోపించారు. కానీ జగన్ మాత్రం మాట తప్పలేదు. హోదా అంశాన్ని మరిచిపోలేదు. ఏడాది పాలన పూర్తిచేసుకున్న సందర్భంగా మరోసారి తనకుతానుగా ఏపీ స్పెషల్ స్టేటస్ అంశాన్ని ప్రస్తావించారు ముఖ్యమంత్రి.

"ఏపీకి ప్రత్యేక హోదా తీసుకొచ్చేందుకు మంచి ఆలోచనలతో వచ్చే వారు ఎవరితోనైనా కలిసి నడిచేందుకు సిద్ధం. దురదృష్టవశాత్తూ అది కూడా జరగలేదు. ఎందుకంటే బీజేపీకి పూర్తి మెజారిటీ ఉంది. మనతో వాళ్లకు అవసరం లేకుండా పోయింది. కాబట్టి ప్రత్యేక హోదా అనేది మనకు కాస్త దూరంగా కనిపించే పరిస్థితి. కానీ అడగడం మానేస్తే అది ఏరోజూ మనకు రాదనే విషయం నాకు తెలుసు. ఈరోజు కాకపోతే రేపైనా వస్తుంది. కేంద్ర ప్రభుత్వం మనపైన ఆధారపడే రోజు ఒకటి వస్తుంది. ఆ రోజున ప్రత్యేక హోదా ఇస్తేనే మద్దతిస్తామని అడుగుతాం. కాబట్టి ఎప్పటికైనా ప్రత్యేక హోదా రావాల్సిందే."

పారిశ్రామిక రంగంపై క్యాంప్ ఆఫీస్ లో ఏర్పాటుచేసిన సమీక్ష సమావేశంలో ఇలా మరోసారి స్పెషల్ స్టేటస్ పై రియాక్ట్ అయ్యారు సీఎం జగన్. ప్రత్యేక హోదా వచ్చి ఉంటే రాష్ట్రానికి అనేక పన్నుల్లో మినహాయింపులు వచ్చేవని, అవకాశం వచ్చిన ప్రతిసారి కేంద్రాన్ని హోదా గురించి అడుగుతూనే ఉన్నామన్నారు జగన్.

"మనం చెప్పే మాటల్లో నిజాయితీ, నిబద్ధత ఉండాలి. గత ప్రభుత్వం మాదిరిగా నేను అబద్ధాలు చెప్పను. గత ప్రభుత్వం 20 లక్షల కోట్లు, 40 లక్షల ఉద్యోగాలంటూ ఊదరగొట్టింది. విదేశీ సంస్థలు వచ్చాయని ప్రచారం చేసింది. ఇలా గ్రాఫిక్స్ తో కాలం గడిపేసింది. మనం అలా చేయం."

రాష్ట్రంలో విద్యుత్ కొరత లేదన్నారు సీఎం. ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ అంటూ గత ప్రభుత్వం అర్థంకాని మాటలు చెప్పిందని.. మన ప్రభుత్వంలో మాత్రం అనుమతులన్నీ పారదర్శకంగా ఉంటాయన్నారు. పరిశ్రమలకు భూమి, నీరు ఇచ్చేందుకు రాష్ట్రంలో బలమైన వ్యవస్థ ఉందన్నారు జగన్. 

తప్పుడు వార్తలు రాసిన మీడియాపై సమగ్ర విచారణ

Show comments