బాలయ్య బద్దలు కొట్టారు

గత కొన్నాళ్లుగా టాలీవుడ్ లో లోలోపల విపరీతంగా ఒకటే గుసగుసలు. మెగాస్టార్ చిరంజీవి ఒంటరిపోకడలు పోతున్నారని, ఆయనకు నచ్చిన వారిని చేరదీస్తున్నారు. ఆయనకు అవసరం వున్నవారిని పిలుస్తున్నారు. అందరినీ కలుపుకుని వెళ్లడం లేదు అంటూ. కానీ ఎవ్వరూ బాహాటంగా నోరు విప్పే ప్రయత్నం మాత్రం చేయలేదు. అలాగే సిఎమ్ కేసిఆర్ దగ్గరకు వెళ్లినపుడు అందరినీ కలుపుకుని పోలేదు అని కూడా కామెంట్లు లోలోపలే చేసారు. ఈ విషయాన్నే గ్రేట్ ఆంధ్ర కొన్ని రోజుల క్రితం 'తెలంగాణ ఛాంబర్ ను సైడ్ లైన్ చేసారా' అంటూ వెల్లడించింది.

అదే సమయంలో ఆంధ్ర సిఎమ్ జగన్ ను కలవాలనుకోకపోవడం పై కూడా ఇండస్ట్రీలోని వైకాపా అనుకూల వర్గాలు పైకి మాట్లాడకున్నా, ఇక్కడి విషయాలు అన్నీ పార్టీ వర్గాల ద్వారా ఆంధ్ర సిఎమ్ జగన్ కు చేరవేసాయి. ఇవన్నీ తెలిసి త్వరలో ఆంధ్ర సిఎమ్ ను కూడా కలుస్తామని మెగాస్టార్ ట్వీటువేసారు. జూన్ మొదటి వారంలో అపాయింట్ మెంట్ దొరకుతుందని, సినిమా జనాలు మెగాస్టార్ సారథ్యంలో అక్కడికి వెళ్తారని తెలుస్తోంది.

ఘాటు కామెంట్

ఇలాంటి టైమ్ లో హీరో బాలకృష్ణ ఘాటు కామెంట్ చేయడం అందరి దృష్టిని ఆకర్షించింది. చిరంజీవి తనను ఏ సమావేశానికి పిలవలేదని ఆయన కుండ బద్దలు కొట్టారు. అంతటితో ఆగకుండా, మరి కొన్ని తీవ్ర విమర్శలు కూడా చేసారు.

దీనికి బదులుగా నిర్మాత సి కళ్యాణ్ వివరణ ఇస్తూ, బాలయ్యను ఎవ్వరూ అవమానించలేదని ప్రస్తుతం ఆయన సినిమా ఏదీ నిర్మాణంలో లేనందువల్లే పిలవలేదని అన్నారంటూ వార్తలు వచ్చాయి. కానీ ఇదీ కరెక్ట్ కాదనుకోవాలేమో? ఎందుకంటే చిరంజీవి ఇంటికి ఆహ్వానితులైన వారిలో చాలా మందికి ప్రస్తుతం సినిమాలు లేవు. త్రివిక్రమ్ సినిమా ఇఫ్పట్లో లేదు. ఆయనకు బ్యానర్ లేదు. మెహర్ రమేష్ సినిమా తీసి చాలా కాలం అయింది. వివి వినాయక్ కు సినిమా లేదు. శ్యామ్ ప్రసాద్ రెడ్డి సినిమా నిర్మాణం చాలాకాలం అయింది పక్కన పెట్టి. అలాగే అక్కడకు హాజరైన చాలా మంది సంగతి ఇలాగే వుంది.

మంచు విష్ణు స్వంత సినిమా నిర్మాణంలో వుంది. బాలయ్యకు బ్యానర్ వుంది. ఆయన చేస్తున్న బోయపాటి సినిమా ఓ షెడ్యూలు జరిగి ఆగింది. ఆసియన్ సునీల్ సినిమా నిర్మాణంలో వుంది. ఇంకా చాలా మంది నిర్మాతల సినిమాలు, హీరోల సినిమాలు వున్నాయి. వీరేవరికీ పిలుపు అందలేదు. అలాగే మా సంస్థ బాధ్యులు నరేష్ లేదా జీవిత రాజశేఖర్ కు పిలుపు లేదు.

చిత్రంగా మెగాస్టార్ తన సమావేశానికి నాగ్ ను, నాని ని మినహా మరే హీరోను పిలవలేదు. వాళ్లకు బ్యానర్లు వున్నాయనే కారణం చూపిస్తున్నారు. మరి బాలయ్యకు బ్యానర్ వుంది. మహేష్ కు బ్యానర్ వుంది. కళ్యాణ్ రామ్ కు బ్యానర్ వుంది. మంచు ఫ్యామిలీకి బ్యానర్ వుంది. కానీ వీళ్లెవ్వరిని పిలవలేదని తెలుస్తోంది.

ఇలాంటి టైమ్ లో బాలయ్య గొంత విప్పడం అన్నది టాలీవుడ్ లో వున్న వర్గాలు బయటకు వచ్చినట్లు కనిపిస్తోంది.

మన పాలన-మీ సూచన, 4వ రోజు

Show comments