విజయదశమికి విశాఖకు రాజధాని?

విశాఖ రాజధాని రాజసానికి మరో అయిదు నెలల సమయం పట్టేలా ఉంది. ఇదంతా ప్రక్రుతిపరమైన అవరోధాలతో పాటు, ముహూర్తాల మీద కూడా ఆధారపడి అలా వాయిదా పడుతూ వస్తోంది.

ఈ ఏడాది అక్టోబర్ 25న విజయదశమి శుభవేళ విశాఖకు పాలనారాజధాని తరలిరానుంది. ఇది బ్రహ్మాండమైన ముహూర్తంగా విశాఖ శారదాపీఠం అధిపతి స్వామి స్వరూపానందేంద్ర పేర్కొంటున్నారు.

అంతవరకూ మంచి ముహూర్తాలు లేవని, అందువల్ల ఆ ముహూర్తాన్ని సూచించినట్లుగా కూడా చెబుతున్నారు. దీని ప్రకారం చూస్తే అక్టోబర్ 25 నాటికి విశాఖకు రాజధాని తరలిరావడం తధ్యమనిపిస్తోంది.

ఇదిలా ఉండగా ఇప్పటికే మార్చి 25 ఉగాది ముహూర్తం, మే 28 ముహూర్తాలు కూడా స్వామి పెట్టారని సమాచారం. అయితే ఆ రెండు ముహూర్తాలను కరోనా మింగేసింది. ఇపుడు తాపీగా ఎటువంటి ఆటంకాలు లేని ముహూర్తంగా, విజయాలని తెచ్చే విజయదశమిని స్వామి నిర్ణయించారని అంటున్నారు.

ఈ ముహూర్తబలం వల్ల రాష్ట్రప్రభుత్వం ఎదుర్కొంటున్న కొన్ని రకాల ఇబ్బందులు, చికాకులు మొత్తం తొలగిపోతాయని కూడా స్వామి అంటున్నారు. ముఖ్యమంత్రి కార్యాలయం, నివాసం  ఇప్పటికే బీచ్ రోడ్డులోని గ్రేహౌండ్స్ లో ఉండేలా ఎంపిక చేశారు.

ఉద్యోగులు, మిగిలిన విభాగాలకు కూడా భవనాలు అందుబాటులోనే ఉన్నాయి. మొత్తం మీద చూసుకుంటే స్వామి పెట్టిన ఈ మూడవ ముహూర్తం గట్టి ముహూర్తమని అంటున్నారు, విశాఖ రాజధాని కాకుండా ఇక అడ్డుకోవడం ఎవరి తరం కాదని కూడా వైసీపీ నేతలు చెబుతున్నారు.

టీటీడీ భూములు బేరం పెట్టిందే మీరు

Show comments