క‌రోనా ఆప‌త్కాలంలో ఆయుధాలివే!

భూగోళం మీద అడపాదడపా కొత్త కొత్త వైరస్‌లు పుట్టుకొస్తూనే ఉంటాయి. ప్రతి శతాబ్దంలోనూ కొన్ని రకాల వైరస్‌లు మానవాళికి పెనుసవాళ్లు విసురుతూనే ఉంటాయి. మందులో, వాక్సిన్లో వచ్చే వరకో లేదా ఆ వైరస్‌లతో కలిసి జీవించ గలిగే శక్తిని మన శరీరాలు ఏర్పరుచుకునే వరకో.. కొన్ని దుష్పరిణామాలను నివారించలేము. ఈ 21వ శతాబ్దంలో ప్రపంచ దేశాలు ఎదుర్కొంటున్న 'కరోనా'అంతకన్నా భిన్నమైనదేమీ కాదు. 

చేదు వాస్తవం ఏమిటంటే చాలా రకాల వైరస్‌లకు నిర్దిష్టమైన మందులు, వ్యాక్లిన్లు కనుగొనలేక పోవడం. ఎన్నో వ్యయ ప్రయాసలకు ఓర్చి, ఏళ్లతరబడి పరిశోధనల్లో మునిగి తేలి.. కొన్నింటికి వాక్సిన్లు కనుగొన్నా, వాటిలో చాలా రకాల వైరస్‌లు రూపాంతరం (మ్యుటేషన్‌) చెంది కొత్త వైరస్‌లుగా ఏర్పడటం నిరాశ కలిగించే అంశం. అయినప్పటికీ తరతరాలుగా ఎన్ని రకాల వైరస్‌లు దాడి చేస్తున్నా, వాటిని సమర్థవంతంగా ఎదుర్కొంటూ మానవ జాతి తన మనుగడను కాపాడుకుంటూనే ఉంది. ఒకప్పుడు హెచ్ఐవి, హెపటైటిస్-సి, స్వైన్ ఫ్లూ లాంటి వైరస్ లు ప్రపంచాన్ని గడగడలాడించినా కాలగమనంలో మానవాళి ఆ వైరస్ లతో సహజీవనం చేస్తోంది . అందుకే  కరోనా సమస్య విషయంలో కూడా మన ఎదురుగా ఉన్న పరిష్కార మార్గాలను అన్వేషించాలే తప్ప భయాందోళ చెందడం వల్ల ప్రయోజనం శూన్యం. 

ఈ కరోనా వైరస్‌ దెబ్బకు యూరప్  మొత్తం విలవిల్లాడుతోంది. అమెరికా పరిస్థితి అత్యంత ఆందోళనకరంగా తయారైంది. మన పొరుగునే  ఉన్న చైనాలో పుట్టిన ఈ వైరస్‌ దెబ్బకు ఆ దేశం సైతం అతలాకుతలం అయింది. ఒకరకంగా మన దేశం మాత్రం బాగానే తట్టుకొని నిలబడిందని చెప్పాలి. ఇప్పుడు ప్రపంచ దేశాలన్నీ భారత్‌ వైపు దృష్టి సారించడానికి కారణం కూడా ఇదే. ఈ వైరస్‌ దాడిని ఎదుర్కోవడంలో భారతీయులకు ప్రత్యేకమైన ఆయుధాలు/రక్షణ కవచాలు (మందులు, వ్యాక్సిన్లు) ఉన్నాయా? భారతీయులు ఇతరుల కంటే శక్తిమంతులా? (రోగనిరోధక శక్తి ఎక్కువగా ఉందా?) . ఇదే నిజమైతే అది ఎలా సాధ్యపడుతోంది.....ఈ విషయాలన్నింటిపై అన్ని దేశాలు శోధిస్తున్నాయి.

సంప్రదాయాలే మనకు రక్షా?  

మన సనాతన భారతీయ సంస్కృతే మనకు రక్ష. మన ఆచార వ్యవహారాలే రక్షణ కవచాలు. మన సంప్రదాయ ఆహార అలవాట్లే మన ఆయుధాలు. అందుకే మన భారతీయ 'నమస్కారం' నేడు ప్రపంచ దేశాలకు.. ట్రంప్‌కైనా సరే శిరోధార్యమైంది. 

సనాతన సంప్రదాయ వైద్య పద్ధతులే మార్గం..

మన భౌగోళిక వాతావరణ పరిస్థితులు వైరస్‌ వ్యాప్తిని ఎదుర్కోవడానికి దోహదపడుతున్నాయా? అంటే అదొక్కటే కారణం కాదు. మనం నిత్యం పాటించే సనాతన సంప్రదాయక వైద్య పద్ధతులు కూడా ముఖ్య పాత్ర పోషిస్తున్నాయి. పూర్వకాలంలో ఏ మందూలూ లేనప్పుడు మన అమ్మమ్మలు, నానమ్మలు చెప్పిన చిట్కాలు కరోనా లాంటి వైరస్‌ను సైతం ఎదుర్కొనే శక్తిని సమకూర్చుతున్నాయనే విషయాన్ని శాస్త్రవేత్తలు సైతం తోసిపుచ్చలేని నిజం.  

ఆవిరే ఆయుధం..

అందుకే భారతీయ సనాతన వైద్యపద్ధతుల్లో ఒకటైన ఆవిరి పట్టడం విధానాన్ని ఇప్పుడు ప్రపంచ దేశాలు అనుకరిస్తున్నాయి. ఇటీవల అమెరికాలోని హోంల్యాండ్‌ సెక్యూరిటీస్‌కు చెందిన ఫ్రెడరిక్‌ ల్యాబ్‌ వాళ్లు ఆ దేశ అధ్యక్షుడు ట్రంప్‌ సమక్షంలో వారి పరిశోధనా వివరాలను వెల్లడించారు. అధిక ఉష్ణోగ్రత, గాలిలో తేమ అధికంగా ఉన్నపుడు (హ్యుమిడిటీ) కరోనా వైరస్‌ అరికట్టబడుతుందని వివరించారు. 

రోజులో రెండు నుంచి మూడుసార్లు ఆవిరి పడితే కరోనా ప్రభావాన్ని తగ్గించవచ్చని, తద్వారా కోలుకోవడం సులభమవుతుందన్న విషయాన్ని ప్రఖ్యాత శాస్త్రవేత్తలు సైతం ధృవీకరిస్తున్నారు. పైగా తప్పక ఆవిరి పట్టండని సూచిస్తున్నారు. మనిషి గొంతు, ముక్కు ద్వారా ఊపిరితిత్తుల్లోకి వ్యాపించే ఈ వైరస్‌కు అడ్డుకట్ట వేయడానికి మన సంప్రదాయక పద్ధతిలో ఆవిరి పట్టడంకన్నా మరో మార్గమేమైనా ఉందా? అలా ఆవిరి పట్టడం ద్వారా అధిక ఉష్ణోగ్రతతో పాటు , తేమ అధికంగా ఉన్న గాలి లోపలికి వెళ్లి వైరస్‌ను నిర్మూలిస్తుందనడంలో ఆశ్చర్యం ఏముంది?

మన సనాతన వైద్య చిట్కాలే అన్ని దేశాలకు ఆచరణీయం

– కషాయం : రోజూ అల్లం, పసుపు, మిరియాలతో చేసిన కషాయం తాగడం (ఈ కషాయంలో తులసి, తేనె/బెల్లం కూడా కొందరు వాడుతున్నారు.)

– వెల్లుల్లి, కొత్తిమీర, కరివేపాకు, అల్లం, ఉల్లి, ధనియాలు, పసుపు, దాల్చిన చెక్క లాంటివి వంటల్లో బాగా వాడటం పండ్లు, కూరగాయలు బాగా తినడం.

– వేడి నీటిలో ఉప్పు వేసి.. గార్గ్‌లింగ్‌ (గొంతు వరకు పోనిచ్చి పుక్కిలించడం) చేయడం

ఇవన్నీ మనకు తరతరాలుగా వస్తున్నవే. అనుభవ పూర్వకంగా కావొచ్చు. పరిశోధన ఫలితాలే కావొచ్చు. కానీ ప్రతి చిట్కా వెనుక శాస్త్రీయత ఉంది. అయితే, మనం వీటిని వదిలేసి పాశ్చాత్య ధోరణుల వైపు పరుగులు పెడుతున్నాం. ఈ రోజు పాశ్చాత్య దేశాలన్నీ ప్రాణాలు కాపాడుకోవడానికి మన సంస్కృతి, సంప్రదాయాలు అనుసరిస్తున్నాయి. అమెరికా, యూరప్‌ తదితర దేశాల్లో ప్రస్తుతం ఎంతో మంది రోజూ ఆవిరి పట్టుకుంటున్నారు. కరోనా పుట్టిన వూహాన్‌లో సైతం ప్రతి ఒక్కరూ రోజుకు నాలుగు సారు ఆవిరి పట్టడం, వేడి నీటితో గార్గిలింగ్‌ (గొంతు వరకు నీటిని పోనిచ్చి పుక్కిలించడం) చేయడం దినచర్యగా మార్చుకున్నారు. 

సమర్థ నాయకత్వం..

ఏది ఏమైనా కరోనాతో జన జీవనం స్తంభించిన ఈ విపత్కర పరిస్థితులలో సమర్థుడు, శాస్త్రీయంగా ఆలోచించే యువ ముఖ్యమంత్రి ఉండటం మన రాష్ట్రం అదృష్టం. ఓవైపు ప్రజలు భయభ్రాంతులకు గురికాకుండా వారిలో ధైర్యాన్ని నింపుతూ మరో వైపు వారి సంరక్షణకు అన్ని చర్యలు తీసుకోవడం సమర్థవంతమైన పాలనకు దర్పణం పడుతోంది. కరోనా విషయంలో ఎలా వ్యవహరించాలో తెలియక ఎందరో దేశాధినేతలు తికమకపడుతుండగా మన ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి గారు కరోనాపై పూర్తి అవగాహనతో, స్పష్టమైన వ్యూహంతో, పకడ్బందీ కార్యాచరణతో వ్యవహరిస్తుండటం సత్ఫలితాలిస్తోంది. 

కార్యదక్షతకు ఇంత కంటే నిదర్శనం ఏం కావాలి?

– నేడు దేశంలోనే అత్యధికంగా పరీక్షలు చేస్తున్న రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్‌ రికార్డు సృష్టించింది. 

– కరోనా కష్ట కాలంలో కూడా డ్వాక్రా మహిళలకు మాస్కుల తయారితో ఆదాయ మార్గాన్ని చూపుతూ.....దేశంలో ఏ రాష్ట్రమూ చేయని విధంగా 16 కోట్ల మాస్కులను ప్రజలందరికీ పంపిణీ చేయిస్తోంది.

– నెలలో మూడు సార్లు రేషన్‌ పంపిణీ చేసిన ఏకైక రాష్ట్రం ఆంధ్రప్రదేశ్‌.

– క్వారంటైన్‌లలో మంచి సదుపాయాలతో పాటు విటమిన్లతో కూడిన బలమైన ఆహారం ఇవ్వడం, ఇంటికి వెళ్లేటప్పుడు 2 వేల రూపాయలు సాయం చేస్తున్న ఏకైక రాష్ట్రమూ ఆంధ్రప్రదేశ్‌.

– దేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా 2.40 లక్షల వలంటీర్ల వ్యవస్థతో ఇంటింటి సర్వే నిర్వహించడం గొప్ప విషయం.

– 1902 కాల్‌ సెంటర్, రియల్‌ టైం డ్యాష్‌ బోర్డ్స్‌ ద్వారా రోజుకు దాదాపు 20 వేల ప్రజా సమస్యలను పరిష్కరించడం ఇదివరకెన్నడూ మనం కనీవినీ ఎరుగనిది.

– 14410 టెలీ మెడిసిన్‌ ద్వారా ఒక్క మిస్డ్‌ కాల్‌తో వైద్యం అందిస్తోంది. దీంతో పాటు ఇంటికే మందులు సరఫరా చేసే వ్యవస్థ బహుశా దేశంలోనే ప్రప్రథమం. 

– ఇంతటి సంక్షోభ సమయంలోనూ దేశంలో ఇదివరకెన్నడూ లేని విధంగా రాష్ట్రంలో ధాన్యం కోనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసింది. రైతుల గురించి అహర్నిశలు ఆలోచిస్తోంది.

- రాష్ట్రంలోని వలస కూలీలు, పక్క రాష్ట్రాల నుంచి ఆంధ్ర మీదుగా వెళుతున్న వలస కూలీల పై మన సీఎం చూపిన మంచి మనసు ఎంత చెప్పినా తక్కువే . వారికి భోజన ఏర్పాట్లు, షెల్టర్, రూ 500 చేతికి ఇవ్వడం , కాళ్లకు చెప్పులు ఇచ్చి బస్సులు ,రైళ్లలో రాష్ట్రం దాటిస్తూ సీఎం తన దాయార్ద్ర హృదయాన్ని చాటుకున్నారు . 

– కరోనా విషయంలో కాంట్రాక్ట్‌ ట్రేసింగ్‌ ద్వారా మన పోలీసు వ్యవస్థ దేశంలోని రాష్ట్రాలన్నింటినీ సమాయత్తం చేసింది. ఇది నిజంగా మనకు గర్వకారణం.

ఫలితం ముఖ్యం...

– ఏమీ చేయకున్నా, అన్నీ చేసినట్లు ఆర్భాటాలను ప్రదర్శించే రాజకీయ నాయకులు ఉన్న ఈ రోజుల్లో ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఎన్నో చేస్తున్నా, ప్రచార ఆర్భాటాలకు దూరంగా ఉండటం ఆశ్చర్యం కలిగిస్తోంది. ప్రచారం కాదు.. ఫలితం రావాలి.. ప్రజలకు మంచి జరగాలన్నది సీఎం అభిమతం కావచ్చు.  

– మందులు, వ్యాక్సిన్లు లేని ఈ తరుణంలో ప్రజలందరూ ఆరోగ్యకరమైన జీవన శైలిని అలవర్చుకోవడం, దురలవాట్లకు (స్మోకింగ్, ఆల్కాహాల్‌) దూరంగా ఉండటం, పరిశుభ్రత పాటిస్తూ మంచి ఆహారపు అలవాట్లతో రోగ నిరోధక శక్తిని పెంచుకోవడం మినహా మార్గం లేదని స్పష్టం చేయడం ఆయన ప్రాక్టికాలిటీ (ఆచరణీయత)ని సూచిస్తోంది. ఆవిరి పట్టడం మొదలు.. పసుపు, మిరియాల పాలు తాగడం, పండ్లు, కూరగాయలతో కూడిన ఆహారం తీసుకోవడం లాంటివి తను ఆచరిస్తూ ప్రజలకు సూచించడం మార్గదర్శకంగా నిలుస్తోంది. కరోనా విషయంలో జాగ్రత్తలు పాటిస్తూనే ప్రజలు త్వరితగతిన సాధారణ జీవితంలోకి రావాలన్నదే సీఎం లక్ష్యం. 

– ఓవైపు కరోనా కట్టడికి చర్యలు తీసుకుంటూనే మరో వైపు రాష్ట్ర ఆర్థిక చక్రాన్ని పరుగులెత్తించాలన్న ముఖ్యమంత్రి ద్విముఖ వ్యూహం ప్రశంసనీయం.ఈ విషమ కాలంలో విశాఖలో చోటుచేసుకున్న విష వాయువు లీకేజీ ప్రమాదం ముఖ్యమంత్రిని ఆపత్కాలంలో అసలైన నేతగా నిలబెట్టింది. విశాఖ బాధితులను ఆదుకోవడంలో ఆయన చూపిన తెగువ, ఉదారత, ప్రజల పట్ల ఆయనకున్న తపన.. కుటుంబ పెద్దను తలపిస్తోంది. 

– ప్రజలలో నెలకొన్న భయాందోళనలు, అపోహలు, మూఢనమ్మకాలు తొలగించకుండా సమస్యను పూర్తిగా అధిగమించలేమని దేశంలో తొలిసారిగా చెప్పిన ఏకైక నాయకుడు మన ముఖ్యమంత్రే కావడం గర్వకారణం.

కరోనా సోకడాన్ని అపరాధంగా, నేరంగా, పాపంగా భావించి వివక్ష చూపడం సాంఘిక దురాచారమని ఎలుగెత్తి.. ప్రధాని సహా ముఖ్యమంత్రులందరి ప్రశంసలు పొందిన సంస్కర్త మన ముఖ్యమంత్రి గారు. 'కరోనా జ్వర నివారణలో అత్యధికులకు పారాసెటమాలే అవసరం'.. అనడం మొదలుకుని 'కరోనాతో సహజీవనం చేయక తప్పదు' అనడం వరకు మన ముఖ్యమంత్రి చెప్పిన విషయాలన్నీ అక్షర సత్యాలని ప్రపంచమంతా అంగీకరిస్తోంది. ప్రముఖ శాస్త్రవేత్తలు, పలువురు నేతలు, డబ్ల్యూహెచ్‌ఓ ప్రముఖులు సైతం వీటినే పునరుద్ఘాటిస్తున్నారు. గేలి చేసి హేళన చేసిన విమర్శకులు మాత్రం విదూషకులుగా మిగిలిపోతున్నారు.  

-సి.చన్నారెడ్డి
డిస్టింగ్విష్డ్ ప్రొఫెసర్ ఎమిరెటస్,
డైరెక్టర్ ఎమిరెటస్ ,హక్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ లైఫ్‌ సైన్సెస్, 
పెన్‌ స్టేట్‌ యూనివర్సిటి, 
అమెరికా.
ఫోన్‌ : +91 9000638447 (ఇండియా)
       +1 814 777 1625 ( యూఎస్ఏ ) 

Show comments